అడ్వర్టైజింగ్ అంటే... అరేంజ్డ్ మ్యారేజే!!
ఈ దేశంలో ప్రత్యేకంగా విద్యాసంస్థలు లేని ఒకే ఒక రంగం అడ్వర్టైజింగ్... ఎందుకో తెలుసా... ప్రతి మనిషికీ బాగా తెలిసినది అదే. నామకరణంతోనే అడ్వర్టైజింగ్ మొదలవుతుంది. ఒక మనిషికి పేరు పెట్టడం అంటే... అది ఒక బ్రాండింగ్. ఆ లెక్కన చెప్పుకుంటే చేపకు ఈతలా... మనిషికి స్వతహాగా అబ్బే ఒక కళకు ఫినిషింగ్ స్కూల్ వంటిది ముద్రా ఇన్‌స్టిట్యూట్. ప్రకటనలకు సంబంధించి ఆసియాలో పుట్టిన మొట్టమొదటి అడ్వర్టైజింగ్ స్కూల్ అది. దాన్ని స్థాపించింది ఒక తెలుగు వాడు... సామాన్యమైన జీవితంతో మొదలుపెట్టి ప్రకటనల రంగంలో అత్యున్నత శిఖరాలను అందుకున్న ఏజీ కృష్ణమూర్తి. సింపుల్‌గా ఏజీకే. ఆయన అనుభవాలు వింటుంటే... టైమ్ మెషీన్‌లో మనం ముందుకు, వెనక్కు పోయినట్టు ఉంటుంది.
ఆయన అడ్వర్టైజింగ్ రంగంలో తొందరపడి కూసిన కోయిల కాదు... ఎర్లీ బర్డ్! ప్రకటనల రంగంలో ఉన్న గొప్పతనం ఏంటంటే... అన్ని రంగాలతో దానికి సంబంధం ఉంటుంది. అందుకే ఆయన అనుభవాల్లో అనేక కొత్తకొత్త విషయాలుంటాయి.
ఆయన ఉద్దేశంలో- అడ్వర్టైజింగ్ ఈజ్ నథింగ్ బట్ అరేంజ్డ్ మ్యారేజ్! పెళ్లి చేసేటపుడు ఇరు కుటుంబాలు తమ పిల్లల గురించి చెప్పుకుంటారు. అది అడ్వర్టైజింగ్ తప్ప మరేమీ కాదు. అబ్బాయి తరపు వారు పిల్లాడి లక్షణాలు, చదువు, ఆదాయ వ్యయాలు వంటివి చెప్పుకోవడం, అమ్మాయి తరపు వారు ఆమె గుణగణాలు, చదువు సంస్కారాల గురించి చెప్పుకోవడం అడ్వర్టైజింగే కదా. ఎప్పటికప్పుడు మనం సాధించిన అభివృద్ధిని చాటుకోవాలి. లేకపోతే చీకట్లో కన్నుకొట్టినట్టు ఉంటుంది. అది నీకు తప్ప ఎవరికీ తెలియదు. అయితే, ఈ చెప్పుకోవడంలోనూ పద్ధతులు, పరిమితులు, ప్రమాణాలు ఉండాలి. తరాలు మారిన కొద్దీ ఆలోచనలు, ఆసక్తులు మారుతున్నపుడు చెప్పే విధానం కూడా మారాలి. అపుడే వినియోగదారుడికి కనెక్ట్ అవుతుంది.
దేశంలో ఇపుడు అడ్వర్టైజింగ్ మార్కెట్ దాదాపు పాతికవేల కోట్ల వరకు ఉంది. ఇందులో ప్రకటనల రూపకల్పనలో వైఫల్యం వల్లనో, రాంగ్‌టైమింగ్ వల్లో, రిలవెన్స్ లేకపోవడం వల్లో.. ఇలా కారణాలు ఏవైనా ప్రకటనలు లక్ష్యంగా పెట్టుకున్న వినియోగదారులను చేరుకోకపోవడం వల్ల ఈ ఇండస్ట్రీలో అయ్యే ఖర్చులో 70-80 శాతం వ్యయం వల్ల ఆశించనంత ప్రయోజనం కలగట్లేదు. ప్రకటనలు సక్సెస్ అయితే బ్రాండ్ వాల్యూ వస్తుంది. లేకపోతే సవాలక్ష ఉత్పత్తుల్లో ఒకటిగా నిలిచిపోతుంది. అందుకే అడ్వర్టైజింగ్ ఎంత అవసరమో అది అద్భుతంగా, కాలానుగుణంగా ఉండటమూ అంతే అవసరం అన్నది ఏజీకే మాట. దీని గురించి ఆయనను కదిపితే ఎన్నో విషయాలు... వాటిలో కొన్ని.
మీ దృష్టిలో అడ్వర్టైజింగ్ అంటే ఓ వస్తువు ఉనికిని చాటడమేనా?
‘మీరు చెప్పింది ఎవరూ వినకపోయినా, మిమ్మల్ని ఎవరూ గుర్తించకపోయినా ఇక అదంతా వృథా’ అని ఓ ప్రముఖుడు చెప్పాడు. అంటే మీరు చెప్పడం ప్రధానం కాదు... ఎదుటి వాడు దానిని వినడం ప్రధానం. ఓ వస్తువు ఉనికిని ప్రభావవంతంగా చాటాలి. ఒక ఉత్పత్తి జనంలోకి కాదు, జనం ఆలోచనల్లోకి వెళ్లాలి.
ప్రొడక్ట్ అవసరాన్ని తీరుస్తుంది, బ్రాండ్ అవసరాన్ని తీరుస్తూ మానసికోల్లాసాన్ని కూడా కలిగిస్తుంది? దీనిని ఎలా అర్థం చేసుకోవాలి.
చాలా సింపుల్... అవసరానికి-కోరికకు (need-want) తేడాయే బ్రాండ్. కారు అవసరం అనుకుంటే... ఓ పేరున్న కారులో తిరగాలనుకోవడం కోరిక. ఇక బ్రాండింగ్ విషయానికొస్తే ఒళ్లు కప్పుకోవడానికి ఏదైనా గుడ్డ చాలు. అందులో మనకు ఆనందాన్నిచ్చేలా, మన అందాన్ని పెంచేలా, మనకు నచ్చేలా ఉందని వినియోగదారుడు ఫీలయ్యేలా చేసేదే బ్రాండ్. అందుకే సాల్ట్‌కు కూడా బ్రాండ్ అవసరమైంది. బ్రాండ్ ఒక ఫీల్, అది ఒక నమ్మకం.
ప్రతి బ్రాండ్ తన బౌండరీ ఏంటో తెలుసుకుని ఆ పరిధుల్లో ఉంటే మంచి జరుగుతుందన్నారు. ఎలా?
ఈ ప్రపంచంలో అందరికీ అన్నీ నచ్చవు. ఒక సబ్బుందనుకోండి. ఒకటే సబ్బును సంపన్నుడికి, పేదోడికి అమ్మాలనుకుంటే అది కుదురుతుందా? అవసరాలు, ప్రయారిటీలను బట్టి ఉత్పత్తి రావాలి. ఉత్తరాది వాడికి దక్షిణాది వాడికి, పట్టణం వాడికి-పల్లెటూరి వాడికి వినియోగదారీ తత్వంలో తేడా ఉంటుంది. దాన్ని గుర్తించాలి. బ్రాండ్ తన పరిధి ఏంటో తెలుసుకోకుంటే విజయం స్థానంలో అపజయం నిలుస్తుంది.
మీరు కొత్తగా రాసిన ‘అడ్వర్టైజింగ్ కథలు’ పుస్తకంలో ఒక బ్రాండ్ వ్యక్తిత్వం, పర్సనాలిటీ చాలాకాలం ఒకేలా ఉండాలి అన్నారు. పేరు, లోగోలు మారిన బ్రాండ్లు కూడా ఉన్నాయి కదా..? ఇంకో విషయం... నేటితరం ఎక్కువగా మార్పును ఆశిస్తుంది... మరి ఈ వైరుధ్యాన్ని ఎలా విశ్లేషిస్తారు. ?
యూటీఐ- యాక్సిస్ బ్యాంకుగా మారడం, ఎయిర్‌టెల్ లోగో మారడం... ఇలాంటివి కొన్ని ఉన్నాయి. నా ఉద్దేశం మార్పు అసలు వద్దని కాదు. తరచూ మారకూడదు. మీ పేరును ఒకసారి మార్చుకుంటే బాగుంటుంది. కానీ పదేపదే మార్చుకుంటే ఎవరికైనా గుర్తుంటుందా చెప్పండి? కొన్ని ప్రత్యేక అవసరాల్లో మార్పు వస్తుంది. అయితే, ఆ మార్పు తర్వాత మళ్లీ మళ్లీ మార్పు రాకూడదు. కాన్‌స్టంట్‌గా ఉంటేనే అది జనం నోళ్లలో నానుతుంది. జనానికి గుర్తుండనిది బ్రాండే కాదు. కాలేదు కూడా!
ఈ పుస్తకంలో మరో విచిత్రమైన పోలిక కనిపించింది. పిల్లలు, చెట్లు, బ్రాండ్లు... ఈ మూడింటిని ఒకే దృక్పథంతో చూడాలన్నారు. దీని అర్థమేంటి?
పిల్లలయినా, చెట్లయినా చక్కగా ఆరోగ్యంగా ఎదుగుతూ ఉండాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం కదా. ఒక బ్రాండు ఏర్పడాలన్నా, అది ఎప్పటికీ నిలవాలన్నా, మరింత వృద్ధి నమోదు చేయాలన్నా దాన్ని పిల్లలను చూసుకున్నంత శ్రద్ధగా, చెట్టును పెంచినంత జాగ్రత్తగా డీల్ చేయాలి. లేకపోతే.. శ్రమ వృథా అవడం మినహా మరేమీ ఉండదు!