కవితా షెనాయ్
‘కష్టపడగానే సరిపోదు... ఆ కష్టానికి తగిన ఫలితం ఉండాలి. ప్రతిభ ఉండగానే సరిపోదు... దానికి తగిన ప్రతిఫలం ఉండాలి’ అంటుంది కవితా షెనాయ్. అడ్వర్‌టైజింగ్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేసిన కవితకు వినియోగదారుల నాడి తెలుసు. తగిన ప్రతిభ, సామర్థ్యాలు ఉండి కూడా నష్టాలతో చతికిల పడుతున్న కంపెనీలను చూసిన తరువాత ‘వోయిరో’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టింది. ఈ సాస్(సాఫ్ట్‌వేర్ యాజ్ ఏ సర్వీస్) స్టార్టప్ దక్షిణ ఆఫ్రికాలోని ‘డీఎస్‌టీవీ’ చానల్‌తో సహా మనదేశంలోని పెద్ద వోటీటీ ప్లాట్‌ఫామ్‌లు, డిజిటల్ పబ్లిషర్‌లతో కలిసి పనిచేస్తోంది....
మేకప్ ఆర్టిస్ట్, వీడియో ఎడిటర్‌గా మంచి పేరు తెచ్చుకున్న కవిత షినాయ్ ఆ తరువాత ఎడ్వర్‌టైజింగ్ ప్రపంచంలోకి అడుగు పెట్టింది. ఆనంద్ గోపాల్, అనీల్ కారట్, జితిన్ జార్జ్‌లతో కలిసి బెంగళూరు కేంద్రంగా ‘వోయిరో’ సాస్ స్టార్టప్ మొదలుపెట్టింది. దీనికిముందు కంటెంట్ క్రియేటర్‌లు, డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లు ఎదుర్కొనే సమస్యలను అర్థం చేసుకోవడానికి తన బృందంతో కలిసి స్వయంగా కంటెంట్ క్రియేట్ చేసేది.
ముంబై యూనివర్శిటీలో ఎకనామిక్స్ చదువుకున్న కవిత మార్కెటింగ్ కమ్యూనికేషన్ కంపెనీ ‘లోవ్ లింటస్’ తో కలిసి పనిచేసింది. ఆ తరువాత యూ ట్యూబ్ టీమ్‌తో పనిచేసింది. చదివిన చదువు, పెద్ద సంస్థలతో కలిసి పనిచేసిన అనుభవం ‘వోయిరో’ ప్రయాణంలో తనకు ఉపకరించాయి.
ఒక స్టార్టప్‌కు తొలి విజయ సంకేతం... నిధుల సమీకరణ. నిధుల సమీకరణకు సంబంధించి ‘వోయిరో’కు ఎలాంటి సమస్యలు ఎదురు కాలేదు. ఇక రెండో సవాలు ఇతరులు తమ మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడం. ఎంతోమందితో మాట్లాడి, ఎన్నో సలహాలు తీసుకోవడం ద్వారా రెండో సవాలును కూడా అధిగమించింది. డిజిటల్ పబ్లిషర్స్, వోటీటీ ప్లాట్‌ఫామ్‌ల ఆదాయ వృద్ధికి కంటెంట్‌ను మానిటైజేషన్ చేయడం అనేది కీలకం. మార్కెట్, సాంకేతికత, డేటా అనే మూడురకాల అంశాలలో పట్టు ఉండాలి. అది కవితా షెనాయ్ పనితీరులో కనిపిస్తుంది.
డిజిటల్ పబ్లిషర్‌లు, వోటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో ‘వోయిరో’కు సంబంధించి సేల్స్ టీమ్, యాడ్ ఆపరేషన్ టీమ్, ఫైనాన్స్ టీమ్, స్ట్రాటజీ టీమ్ అనే నాలుగు బృందాలు కలిసి పనిచేస్తాయి.
మీడియా కంపెనీలకు రెవెన్యూ అనలటిక్స్‌ను అందుబాటులో తీసుకురావడం నుంచి బలమైన ఏపీఐ (అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్‌ఫేస్) స్ట్రాటజీని అనుసరించడం వరకు తనదైన దారిలో ప్రయాణిస్తోంది వోయిరో.
కోవిడ్ కల్లోల సమయంలో అన్ని కంపెనీల లాగే ‘వోయిరో’కు సమస్యలు ఎదురైనప్పటికి వోటీటీ పరిశ్రమ, కంటెంట్ స్పేస్ పుంజుకోవడంతో పెద్దగా ప్రభావం చూపలేదు.
‘మీడియాతో అంటే నాకు ఉన్న ఇష్టం, అభిమానం వోయిరో ఆవిర్భావానికి కారణం అయింది. డిజిటల్ పబ్లిషర్‌లు, కంటెంట్ క్రియేటర్‌లకు వివిధ విషయాలకు సంబంధించి సాంకేతిక పరిజ్ఞానం అవసరం అనే ఉద్దేశంతో ఈ వెంచర్ ప్రారంభించాం. లాభాల కంటే కూడా ఇతరులకు సహాయం చేయాలి, వారి విధానాలలో మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో వోయిరో ప్రారంభించాం. అయితే అది అంత సులువైన విషయం కాదని అర్థమైంది. మా ప్రయాణంలో ఎన్నో విషయాలు నేర్చుకొని ముందుకు వెళుతున్నాం. మీడియా, డిజిటల్ పబ్లిషర్‌లు నష్టపోకుండా మార్గనిర్దేశం చేయడం మా లక్ష్యం’ అంటుంది కవిత షెనాయ్.
ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది
వ్యాపార ప్రస్థానంలో ‘ఇక ముందుకు వెళ్లలేము’ అని నిరాశపడే పరిస్థితి రావచ్చు. దీనికి లొంగిపోకుండా పట్టుదలతో ముందుకు వెళితే విజయం మనల్ని వెదుక్కుంటూ వస్తుంది. ఎంత పెద్ద సమస్యకైనా ఒక పరిష్కారం ఉంటుంది. ఆ పరిష్కార మార్గాలను అన్వేషించడంలో మన ఓపిక, కష్టపడేతత్వం గెలుపును నిర్ణయిస్తాయి.
‘వోయిరో’ ప్రారంభానికి ముందు ఇండస్ట్రీ పెద్దల నుంచి కుటుంబసభ్యులు, స్నేహితుల వరకు ఎంతోమంది నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నాం. అవగాహన చేసుకుంటూ, అధ్యయనం చేస్తూ లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. ఓటీటీకి సంబంధించి మార్కెట్ తీరుతెన్నులను విశ్లేషిస్తూ మా పనితీరును మెరుగు పరుచుకుంటూ, పరిధిని విస్తరిస్తూ వెళ్లాం.
– కవితా షెనాయ్, వోయిరో–ఫౌండర్, సీయివో
Comments
Please login to add a commentAdd a comment