మీ ఆదరణే ఊపిరిగా...
మీ అందరి ఆదరాభిమానాలతో ‘సాక్షి’ దినపత్రిక ప్రారంభమై ఎనిమిదేళ్లు పూర్తయింది. ఒక సుదీర్ఘ ప్రయాణంలో ఎనిమిదేళ్ల వ్యవధి చాలా స్వల్ప సమయమే కావొచ్చు. కానీ ఇంత తక్కువ వ్యవధిలోనే ‘సాక్షి’ మీ అందరికీ చేరువయింది. మీలో, మీ కుటుంబసభ్యుల్లో ఒకటైంది. ‘సత్యమేవ జయతే’ మకుటాన్ని శిరోధార్యంగా స్వీకరించింది మొదలు ఆ అమృత వాక్కును ‘సాక్షి’ మనసా వాచా కర్మణా ఆచరిస్తోంది. ఒక వార్త వెనకా, ఒక కథనం వెనకా ఉండే అన్ని కోణాలనూ నిత్యం మీ ముందు పరుస్తోంది. సరైన సమాచారం అందిస్తే సముచితమైన నిర్ణయం తీసుకోగల మీ విచక్షణా శక్తినీ, వివేకాన్నీ గౌరవిస్తోంది. నాణేనికి మరోవైపు చూపించే ప్రయత్నం నిరంతరం చేస్తూ తెలుగువారి మనస్సాక్షిగా నిలిచింది.
అంతర్జాతీయ డిజైన్‌తో, 23 ఎడిషన్లతో, అన్ని పేజీలూ రంగుల్లో సర్వాంగసుందరంగా ముస్తాబై మీ ముందుకొచ్చి పత్రికారంగ చరిత్రలో రికార్డు సృష్టించింది. బుడిబుడి నడకలప్పుడే సాక్షి పెనుసవాళ్లను ఎదుర్కొంది. రకరకాల ఇబ్బందుల్ని చవిచూసింది. ఒక దశలో పత్రిక గొంతు నొక్కేందుకు కూడా ప్రయత్నాలు జరిగాయి. అయినా తన సంకల్పం నుంచి ‘సాక్షి’ అంగుళమైనా పక్కకు జరగలేదు. ధైర్యసాహసాలను ఇసుమంతైనా సడలనివ్వలేదు. వీటన్నిటినీ నిబ్బరంగా ఎదుర్కొనడంలో ‘సాక్షి’ పట్ల మీరు ప్రదర్శిస్తున్న ఆదరాభిమానాలు, అచం చల విశ్వాసం మాకు కొండంత అండగా నిలిచాయి.
‘సాక్షి’ ఆవిర్భావ సమయానికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న తెలుగు గడ్డ ఇప్పుడు రెండు రాష్ట్రాలైంది. అటు ఆంధ్రప్రదేశ్‌లోనైనా, ఇటు తెలంగాణలోనైనా ఉన్నదున్నట్టు నిజాయితీగా, నిర్భీతిగా, నిర్మొహమాటంగా నిజాలను నిగ్గుతేల్చుతున్నదీ, ప్రజావ్యతిరేక చర్యలను ఎండగడుతున్నదీ ‘సాక్షి’ మాత్రమే. అదే సమయంలో అభివృద్ధికి అవసరమైన సూచనలనూ, క్షేత్రస్థాయిలో లోటుపాట్లనూ పాలకుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజాప్రయోజనాల పరిరక్షణకు అహరహం పాటుపడుతోంది సాక్షి.
ఆంధ్రప్రదేశ్‌లో నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ఎంపికైన గ్రామాల్లో పాలక పార్టీ పెద్దలు బినామీల మాటున వేల ఎకరాలను కబ్జా చేసిన వైనంపై సాక్ష్యాధారాలతో సహా మూడు రోజులపాటు ధారావాహిక కథనాలను ‘సాక్షి’ వెలువరించింది. రాజధాని నిర్మించే ప్రాంతంపై వదంతులు సృష్టించి, స్థానిక రైతులను తప్పుదోవ పట్టించి చవగ్గా భూములు కొట్టేసిన తీరునూ... అసైన్డ్ భూములున్న నిరుపేద రైతులను భయాందోళనలకు గురిచేసి ఆ భూముల్ని అమ్ముకునేలా చేసిన వంచననూ వెలుగులోకి తెచ్చింది. అలా నాలుగైదు లక్షల రూపాయలకు భూములు కొన్నవారు కొన్ని నెలల్లోనే కోట్లకు పడగెత్తిన వైనాన్ని పక్కా ఆధారాలతో వెల్లడించింది. సంజాయిషీ ఇచ్చుకునేందుకు కూడా తోవ దొరకని భూ రాబందులు ‘డబ్బులున్నాయి... మేం కొనుక్కున్నాం, ఇందులో తప్పేముంది’ అంటూ చట్టసభల్లోనూ, వెలుపలా దబాయింపులకు దిగాయి.
‘సాక్షి’ పాత్రికేయ బృందాన్ని బెదిరించి, భయపెట్టి మరిన్ని కథనాలు రాకుండా చూసే కుట్రలకూ తెరతీశాయి. ఎన్నడూ లేనివిధంగా పాత్రికేయులను పోలీస్‌స్టేషన్లకు పిలిచి ప్రశ్నించే అప్రజాస్వామ్య సంస్కృతికీ దిగజారాయి. కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీతో కుమ్మక్కయి ‘సాక్షి’ నోరు నొక్కాలనుకున్న టీడీపీ... ఇప్పుడు తమ చేతుల్లోనే అధికారం ఉన్నదన్న అహంకారంతో అవే ఎత్తుగడలను మరింత ఉధృతంగా ప్రయోగిస్తోంది. ఇటువంటి కుట్రలూ, కుహకాలకు ‘సాక్షి’ బెదిరిపోయే ప్రసక్తి లేదు. ఎంచుకున్న తోవ నుంచి కొంచెమైనా తప్పుకునే ప్రశ్న లేదు. గడిచిన 22 మాసాల్లో ఏపీ ప్రభుత్వం వివిధ జీవోల ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేస్తున్న తీరును ఎండగడుతూ వరస కథనాలు రావడానికి కారణం ఈ సంకల్పబలమే. అయితే, మాతో విభేదించినవారి అభిప్రాయాలకు కూడా పత్రికలో చోటివ్వకుండా పోలేదు. వాస్తవాలను వక్రీకరించిందన్న ఆరోపణలకు తావుండరాదన్న దృఢ నిశ్చయంతో సకల స్వరాలనూ వినిపిస్తున్నాం. ఏ కథనం ప్రచురించినప్పుడైనా సంబంధిత వర్గాల వివరణను సైతం తీసుకుంటున్నాం.
తెలంగాణ రాష్ట్రంలో సైతం జనం ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను ‘సాక్షి’ వెలుగులోకి తెస్తున్నది. ఉన్న ఊళ్లో పనులు కరువై వలసపోతున్న అభాగ్యుల గురించీ, అడ్డా కూలీలుగా మారిన రైతన్నల దైన్య స్థితి గురించీ వివరించడమే కాదు... హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో చెరువుల్ని చెరబట్టిన జల మాఫియాల ఆగడాలనూ పతాక శీర్షికలకెక్కించాం. ప్రభుత్వాలు అమలు చేస్తున్న కార్యక్రమాలను సవివరంగా ఇస్తూనే, అమలు చేయని కార్యక్రమాల గురించి ప్రశ్నిస్తున్నాం. క్షేత్రస్థాయిలో జరుగుతున్న అవకతవకలను ఎత్తిచూపుతున్నాం. జనజీవన ప్రమాణాలను పెంపొందించేందుకు శక్తివంచన లేకుండా పాటుపడుతున్నాం. సమాజంలోని అన్ని వర్గాలవారికీ ఉపయుక్తమైన సమాచారాన్ని అందించడానికి ఎప్పటికప్పుడు అదనపు శీర్షికలు ప్రారంభించి కొత్త పుంతలు తొక్కుతున్నాం. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగార్థులు, యువతకూ అవసరమైన సమాచారం అందించే ప్రయత్నం విశేషంగా చేస్తున్నాం.
సమాజ శ్రేయస్సే పరమావధిగా సాగుతున్న ఈ ప్రయాణంలో అడుగడుగునా మమ్మల్ని ఆదరించి, ఆశీర్వదించి, అక్కున చేర్చుకున్న తెలుగు పాఠక మహాశయులకూ, ప్రకటనకర్తలకూ, ఏజెంట్లకూ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ప్రారంభంనాడే చెప్పినట్టు సమాజహితమే మా లక్ష్యం. సత్యసంధతే మా మార్గం.
మీ అందరి ఆదరాభిమానాలూ ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ....
అభినందనలతో
-కె. రామచంద్రమూర్తి
ఎడిటోరియల్ డైరెక్టర్