
కీలకమైన తీర్పు
త్రికాలమ్
ప్రజల జీవితాలను శాసించే అంశాలలో కొన్ని సామాజికమైనవి. మరికొన్ని రాజకీయమైనవి. ఇంకా కొన్ని ఆర్థికమైనవి. మిగిలినవి న్యాయపరమైనవి. ఈ నాలుగు రంగాలనూ సంవిధానం (రాజ్యాంగం) శాసిస్తుంది. మొదటి రెండు రంగాలపై సమాజంలో చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ప్రజలు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆర్థిక, న్యాయపరమైన అంశాలపైన ఇటీవలి వరకూ అవ గాహన అంతగా లేదు. సమాలోచన లేనేలేదు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ధర్మమా అని ఇప్పుడు ఆర్థికాంశాలను అనివార్యంగా తెలుసుకోవలసి వస్తున్నది. గృహిణులూ, రైతులూ, కార్మికులూ అందరూ డిజిటల్ లావాదేవీల గురించి మాట్లాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ప్రకటించి డెబిట్ కార్డులూ, ఆన్‌లైన్ బదలాయింపులూ వగైరా ఆధునిక ప్రక్రియలలో ప్రజలందరికీ తర్ఫీదు ఇవ్వడానికి నడుం బిగించడంతో ఆర్థికాంశాలను తెలుసుకోవడం తప్పనిసరి.
అంతే ముఖ్యమైన న్యాయవ్యవస్థ పైన ప్రజల పరిజ్ఞానం దాదాపు శూన్యం. ఎవరైనా తప్పని పరిస్థితులలోనే కోర్టు గడప తొక్కుతారు. న్యాయవాది చెప్పినట్టే నడుచుకుంటారు. తరాలు గడిచినా వ్యాజ్యాలు పరిష్కారం కావు. చట్టాలు తెలుసుకొని నిర్ణయాలు తీసుకునే పరి స్థితి లేదు. లోక్ అదాలత్ వంటి సంస్థలు సరిపోవు. అందుకే న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను ప్రశ్నించకుండా ఆమోదించడం పౌరులకు అలవాటుగా మారింది. న్యాయస్థానాలను ప్రశ్నించకూడదనీ, తీర్పులను శిరసావహించ డమే కానీ విమర్శించడం నేరమనే అభిప్రాయం సామాన్య ప్రజలలో ఉంది. న్యాయమూర్తికి దురుద్దేశాలు ఆపాదించకుండా తీర్పులోని మంచిచెడులను పరిశీలించవచ్చు. ప్రజలు తమ వాదనలనూ, తీర్పులనూ తరచి పరీక్షిస్తారనే స్పృహ ఉన్నప్పుడు న్యాయవాదులూ, న్యాయమూర్తులూ, న్యాయాధికా రులూ మరింత జాగ్రత్తగా ఉంటారు. వారూ మానవమాత్రులే. దైవాంశ సంభూతులు కారు.
సంవిధానమే సర్వోన్నతం
రాజ్యాంగాన్ని అందరూ గౌరవించాలనీ, సంవిధానం అన్నిటి కంటే ఉన్నత మైనదనీ, చట్టం ఎదుట అందరూ సమానమేననే అభిప్రాయంతో ప్రజలు న్యాయస్థానాలను విశ్వసిస్తారు. తాము కళ్ళతో చూసిన విషయం, చెవులతో విన్న అంశం కోర్టులలో నిగ్గుతేలకుండా తేలిపోతుంటే పౌరులు గందరగోళంలో పడతారు. ఇటువంటి అనుభవం తరచుగా ఎదురైతే న్యాయవ్యవస్థపైనే అవి శ్వాసం కలుగుతుంది. కేసు వాదించే న్యాయవాది లోపమో లేక చట్టాన్ని అన్వ యించడంలో న్యాయమూర్తి వైఫల్యమో తెలియదు. సాక్ష్యాధారాలు సేకరించ డంలో పోలీసు యంత్రాంగం లోపం కావచ్చు. వాటిని సవ్యంగా సమర్పించ డంలో ప్రాసిక్యూషన్ అసమర్థత కావచ్చు. అందుకే హత్య కేసులనూ, దొమ్మీ కేసులనూ సాక్ష్యాధారాలు లేవనే కారణంగా నేరస్థులను నిర్ణయించకుండానే, శిక్ష విధించకుండానే న్యాయస్థానాలు కొట్టివేస్తుంటాయి. ‘ఓటుకు నోటు కేసు’ విష యంలో ఇటువంటి పరిణామాలు చాలా సంభవిస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర సమితికి చెందిన నామినేటెడ్ ఎంఎల్‌ఏ ఎల్విస్ స్టీఫెన్ సన్‌కు తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డి నోట్ల కట్టలు ఇవ్వజూపడాన్ని టీవీలలో ప్రేక్షకులు ఒకటికి పదిసార్లు తిలకించారు. రేవంత రెడ్డిని వలవేసి తెలంగాణ ఏసీబీ 2015 మే 31న పట్టుకుంది. ఆ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి స్వరాన్ని పోలిన స్వరం ‘మావాళ్ళు బ్రీఫ్డ్ మీ...’అంటూ మాట్లాడటం టీవీ చానళ్ళే వినిపించాయి. అనంతరం ’చంద్రబాబూ... నిన్ను ఆ బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు’ అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) బహిరంగసభలో హుంకరిస్తూ తర్జని ఊపుతూ హెచ్చరించడం ప్రజలు టీవీలలోనే చూశారు. ‘యూ హావ్ పొలీస్... వియ్ హావ్ పోలీస్. యూ హావ్ ఏసీబీ...వియ్ హావ్ ఏసీబీ... ’అంటూ చంద్రబాబునాయుడు తీవ్రస్వరంతో కేసీఆర్‌ను సవాలు చేయడం విన్నారు. ఇంత జరిగిన తర్వాత ఆరోపణలపై సత్వరం విచారణ జరుగుతుందనీ, నిజం నిగ్గు తేలుతుందనీ, ఎన్నికలలో అవినీతికి పాల్పడు తున్నవారిని న్యాయవ్యవస్థ అభిశంసిస్తుందనీ, కనీసం ఆక్షేపిస్తుందనీ ఆశించిన వారికి ఆశాభంగం మిగిలింది. శుక్రవారంనాడు హైకోర్టు న్యాయమూర్తి తాళ్ళూరి సునీల్ చౌదరి ఇచ్చిన తీర్పుతో ‘ఓటుకు నోటు కేసు’ మరింత బలహీనపడింది.
శాసనమండలి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటు వేయవలసిందిగా కోరుతూ తనకు ముడుపులు ఇవ్వజూపారంటూ స్టీఫెన్‌సన్ ఫిర్యాదు చేశారు. ఆయన వాగ్మూలం తీసుకొని, ఇతరత్రా ఆధారాలు సేకరించి తెలంగాణ అవినీతి నిరోధక సంస్థ (యాంటీ కరప్షన్ బ్యూరో–ఏసీబీ) అభి యోగపత్రాన్ని (చార్జిషీట్) తెలంగాణ ఏసీబీ కోర్టులో దాఖలు చేసింది. అందులో చంద్రబాబునాయుడు పేరును 30 కంటే ఎక్కువ సార్లు పేర్కొన్నది. అన్ని సార్లు ప్రస్తావనకు వచ్చిన వ్యక్తిని ఏసీబీ అధికారులు గవర్నర్ అనుమతి తీసుకొని విచారిస్తారనే ఎవరైనా భావిస్తారు. కానీ ఆ పని జరగలేదు. ఎందుకు జరగలేదో ప్రజలకు తెలియదు. చంద్రబాబునాయుడు ఉమ్మడి రాష్ట్రాన్ని వదిలి అమ రావతికి తరలివెళ్ళడంతో రాజకీయ సమీకరణలు మారాయి. ఇద్దరు ముఖ్య మంత్రుల మధ్య రాజీ కుదర్చడంలో బీజేపీ పెద్దల ప్రమేయం ఉందని కూడా సమాచారం ప్రచారంలో ఉంది. ప్రజలలో ఉన్న అనుమానాలు బలపడే విధంగా ఈ కేసులో తెలంగాణ ఏసీబీ దర్యాప్తు మందగించింది. చంద్రబాబునాయుడు స్టీఫెన్‌సన్‌తో మాట్లాడినట్టు ఆరోపిస్తున్న స్వరాన్ని తెలంగాణ ఏబీసీ పరీక్షకు పంపించకుండా తాత్సారం చేసింది. ఈ దశలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఏసీబీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ కేసులో చంద్ర బాబునాయుడి పాత్రపై దర్యాప్తు జరపాలంటూ తెలంగాణ ఏసీబీ కోర్టు తెలంగాణ ఏసీబీని ఆదేశించింది. దీన్ని చంద్రబాబునాయుడు హైకోర్టులో సవాలు చేశారు. తెలంగాణ ఏబీసీ కోర్టు ఆదేశంపైన హైకోర్టు 2016 సెప్టెంబర్ 2న తాత్కాలిక స్టే మంజూరు చేసింది. ఆ నిర్ణయాన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి సుప్రీంకోర్టులో సవాలు చేశారు. వాదనలు ఆలకించిన సుప్రీం ఈ కేసును నాలుగు వారాలలో పరిష్కరించాలంటూ హైకోర్టును ఆదేశించింది.
చంద్రబాబు నాయుడు తరఫున ఢిల్లీ నుంచి దిగ్గజాలవంటి న్యాయవాదులు వచ్చారు. రామ కృష్ణారెడ్డి తరఫున సుధాకరరెడ్డి వాదించారు. నవంబర్ చివరలో వాదనలు ముగిశాయి. తీర్పు శుక్రవారం ఇచ్చారు. తీర్పు పాఠం వంద పేజీలు వచ్చింది. చంద్రబాబునాయుడికి ఊరట లభించింది. రామకృష్ణారెడ్డి మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తానంటూ ప్రకటించారు. చంద్రబాబునాయుడు ఆంధ్రప్రదేశ్‌కి చెందిన వ్యక్తి అనీ, ఆయనకి తెలంగాణ యంత్రాంగం, తెలంగాణ ఏసీబీపై ఎటువంటి నియంత్రణా ఉండదనీ న్యాయమూర్తి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఏసీబీని పిటిషనర్ చంద్రబాబునాయుడు ప్రభావితం చేస్తున్నారంటూ ఆళ్ల రామకృష్ణా రెడ్డి చేసిన ఆరోపణ కేవలం కాల్పనికమైనది మాత్రమేనని నిర్థారించారు. ఎవరిపైన అయినా నిరాధారమైన, అర్థం లేని ఆరోపణలు చేయడం సులభ మంటూ వ్యాఖ్యానించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబునాయుడు పాత్ర పైన దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలంటూ తెలంగాణ ఏసీబీకోర్టు ఏసీబీని ఆదేశించడం న్యాయబద్ధమా, కాదా అన్నదే జస్టిస్ సునీల్ చౌదరి ఎదుట ఉన్న ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పడంతో సరిపుచ్చుకోకుండా చంద్రబాబు నాయుడు నిర్దోషి అంటూ తీర్పు ఇవ్వడం విశేషం. మొత్తంమీద జస్టిస్ సునీల్ చౌదరి తీర్పుకు అత్యంత ప్రాధాన్యం ఉంది. ఈ తీర్పు ప్రభావం తెలంగాణ ఏసీబీలో విచారణలో ఉన్న అసలు కేసుపైన పడే అవకాశాలు ఉన్నాయి. ఏసీబీ కోర్టుకు హైకోర్టు తీర్పు మార్గదర్శనం చేస్తుంది.
న్యాయమూర్తి అన్ని కోణాల నుంచీ సాక్ష్యాధారాలను జాగ్రత్తగా పరిశీలించే సుదీర్ఘమైన తీర్పు వెలువరించి ఉంటారు. సుప్రీంకోర్టు లోగడ ఇచ్చిన తీర్పులను ఉటంకిస్తూ సాధికారికంగా తీర్పు రచించి ఉంటారు. చట్టపరమైన అంశాల జోలికి వెళ్ళకుండా కేవలం ఇంగితజ్ఞానం వినియోగించి తీర్పు చదివినవారికి కొన్ని సందేహాలు కలుగుతాయి. వాటిలో ప్రధానమైనవి ఇవి: 1) రెండో ప్రతి వాది రామకృష్ణారెడ్డికి తెలంగాణ ఏసీబీకోర్టులో పిటిషన్ దాఖలు చేసే అర్హత (లోకస్‌స్టాండీ) లేదని న్యాయమూర్తి నిర్ణయించారు. 2) రెండో ప్రతివాది సమర్పించిన స్వరనమూనాను విశ్వసించడం కష్టం అనీ, అది సేకరించిన విధం సరైనది కాదనీ, ప్రతివాది ఏసీబీ కోర్టులో దాఖలు చేసిన ఫిర్యాదు ఏసీబీ చార్జిషీట్‌కు నకలు మాత్రమేననీ వ్యాఖ్యానించారు. 3) కక్షిదారు (పిటిషనర్) చంద్రబాబునాయుడూ, స్టీవెన్‌సన్ మధ్య జరిగినట్టు చెబుతున్న సంభాషణను సమగ్రంగా పరిశీలించాలి కానీ ఒకటి, రెండు వాక్యాలను చూపించి భాష్యం చెప్పకూడదని అన్నారు. తమ పార్టీకి ఓటు వేయమని కానీ ఓటింగ్ రోజున నగరంలో ఉండకుండా విదేశాలకు వెళ్ళమని కానీ స్టీఫెన్‌సన్‌కు చంద్రబాబు నాయుడు చెప్పలేదని న్యాయమూర్తి తెలిపారు. 4) ఒక వ్యక్తికి తెలియకుండా అతని స్వరాన్ని రికార్డు చేసినట్లయితే అది న్యాయస్థానంలో చెల్లనేరదని చెప్పారు. 5) రెండో ప్రతివాది వ్యక్తిగత, రాజకీయ కక్ష సాధింపు కోసం ఈ వ్యాజ్యం తీసుకువచ్చారని అనుకునే అవకాశం లేకపోలేదని అన్నారు. రామ కృష్ణారెడ్డికి నిగూఢమైన లక్ష్యం (హిడెన్ ఎజెండా) ఉన్నదని ఆరోపించారు. ప్రజా ప్రయోజన వ్యాజ్యం పేరుతో వ్యక్తిగత ప్రయోజనాల కోసం న్యాయస్థానాలను వినియోగించుకునేవారిని ఉపేక్షించరాదంటూ ఉద్ఘాటించారు. 6) ఏబీసీ ప్రత్యేక కోర్టు మెదడు ఉపయోగించకుండా ఆదేశాలు జారీ చేసిందంటూ తప్పుపట్టారు. ఈ ఆరు అంశాలలో ఏమైనా వైరుధ్యాలు ఉన్నాయేమో పరిశీలిద్దాం.
రాజ్యానిదే బాధ్యత
నేరం ఎవరు చేసినా, ఎక్కడ జరిగినా దాన్ని విచారించి దోషులను శిక్షించే బాధ్యత, హక్కు పూర్వకాలంలో రాజులకు ఉండేది. రాజ్యాంగ పాలన అమలులోకి వచ్చిన తర్వాత ఈ తరహా రాజ్యాంగ విధులు నిర్వహించడానికి న్యాయవ్యవస్థ ఏర్పడింది. నేరం జరిగినప్పుడు దాని తాలూకు సమాచారం ఎవరు న్యాయస్థానానికి అందించారన్నది ప్రశ్న కాదు. సమాచారం సరైనదా కాదా అన్నదే పరిశీలనాంశం. ఫిర్యాదు చేసినవారు ఎక్కడివారైనా, ఎవరైనా కావచ్చు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యుడికి తెలంగాణ ఏసీబీకోర్టులో పిటిషన్ వేసే హక్కు లేదనడం చట్టం ప్రకారం సహేతుకమేమో కానీ చట్టం తెలియని సాధా రణ పౌరులకు సమంజసంగా కనిపించదు. బాధితులు మినహా తక్కినవారికి అర్హతే లేదంటే న్యాయం నిర్ణయించే క్రమానికి అది పరిమితి అవుతుంది. టూజీ స్కాం వంటి నేరాలు ప్రజాప్రయోజన వ్యాజ్యం (పీఐఎల్) కారణంగా వెలుగు లోకి వచ్చినవే. కేవలం ఉత్తరం రాస్తే దాన్ని పిల్‌గా స్వీకరించిన జస్టిస్ భగవతి వంటి గొప్ప న్యాయమూర్తుల గురించి గర్వంగా చెప్పుకుంటాం. క్రిమినల్ కేసుకూ, ప్రజాప్రయోజనాల వ్యాజ్యానికీ అంతరం ఉన్నది. క్రిమినల్ ప్రోసీజర్ కోడ్ ప్రకారమే వ్యవహరించాలన్న మాట వాస్తవమే. కానీ సంబంధం లేనివారు ఫిర్యాదు చేయకూడదన్నా, పిటిషన్ దాఖలు చేయరాదన్నా రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడూ, దాడులు జరిగినప్పుడూ పోలీసులకు సమాచారం అందించడా నికి ఎవ్వరూ ముందుకు రారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మను షులోయ్ అని గురజాడ చెప్పింది రాజ్యానికీ వర్తిస్తుంది. రాజ్యం (స్టేట్) అంటే పౌరులే. పౌరులు తమ సౌలభ్యం కోసం సృష్టించుకున్న రాజ్యాంగ వ్యవస్థల సమాహారమే. ప్రతి పౌరుడికీ ఏ కోర్టులోనైనా పిటిషన్ వేసే స్వేచ్ఛ రాజ్యాంగం ప్రసాదించిందనే భావన అందరిలో ఉంది.
స్వరనమూనాపై విశ్లేషణ
కోర్టుకు దరఖాస్తు పెట్టుకొని కోర్టు అనుమతితో స్వరనమూనాను తీసుకోవా లన్న మాట నిజమే. రెండో ప్రతివాది ఏదో ఒక విధంగా స్వరనమూనా సంపా దించి ముంబయ్‌లోని లాబ్‌లో పరీక్షించడం న్యాయస్థానానికి సాంకేతి కంగా ఆమోదయోగ్యం కాకపోవచ్చు. కానీ తన ఎదుట దాఖలైన స్వర నమూనాను న్యాయస్థానంలో ఉన్న నమూనాతో పోల్చి ప్రతివాది దాఖలు చేసింది దొంగ నమూనా అని నిరూపించవచ్చు. అదే జరిగితే న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టిం చినందుకు చట్టప్రకారం ప్రతివాదిని శిక్షించవచ్చు. రెండు నమూనాలూ ఒకటే అయితే దాన్ని ఆమోదించవచ్చు. ఎన్ని నిబంధనలు పెట్టుకున్నా అంతిమంగా నిజాన్ని నిగ్గు తేల్చడమే కదా న్యాయస్థానాల కర్తవ్యం? స్వరనమూనాకు విలువ లేదంటూనే అందులోని అంశాలపై న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. చంద్ర బాబునాయుడివిగా చెబుతున్న మాటలన్నిటినీ సమ్యక్ దృష్టితో చూడాలని చెబుతూ ‘ఫ్రీలీ యూకెన్ డిసైడ్’ అని చెప్పారు కదా ఎక్కడా ఒత్తిడి చేయలేదు కదా అంటూ న్యాయమూర్తి తర్కించారు (తీర్పు పూర్తి పాఠంలో 153 నుంచి 157వ పేరా వరకూ). వారి తర్కం ప్రకారమే ఆ సంభాషణను మొత్తం స్వీకరిం చాలి లేదా మొత్తం తిరస్కరించాలి. ఒక వ్యక్తికి తెలియకుండా, ఆ వ్యక్తి అనుమతి లేకుండా ఎలక్ట్రానిక్ పరికరంపైన రికార్డు చేసిన స్వరం చట్టం దృష్టిలో ఆమోద యోగ్యం కాదు (Recording voice of an individual on electronic record without his knowledge or consent cannot be treated as his admitted voice) అని తీర్పు 142వ పేరాలో (86వ పేజీ ఎగువ వాక్యాలు) స్పష్టం చేశారు. ఇదే సూత్రం సర్వత్రా అమలు జరిగితే రహస్యంగా రికార్డు చేసే స్వరాలకూ, స్టింగ్ ఆపరేషన్లకూ, తెహల్కా కథనాలకూ చట్టబద్ధత లేనట్టే భావిం చాలి. నీరా రాడియా టేపులకూ విలువ లేదనుకోవాలి. ఇవన్నీ న్యాయమూర్తి చెప్పినట్టు అవినీతి నిరోధక చట్టంలోని 12వ సెక్షన్, భారత శిక్షాస్మృతి 120–బి సెక్షన్ ప్రకారం చెల్లవు.
న్యాయమూర్తులు తమ ఎదుట సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించి నిర్ణయాలకు వస్తారు. కక్షిదారుల రాజకీయ విశ్వాసాలనూ, దేశంలో, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులనూ పరిగణనలోకి సాధారణంగా తీసుకోరు. ప్రతి కేసు వెనుకా ఏదో ఒక ప్రయోజనమో, ఆక్రోశమో, ఆందోళనో ఉంటుంది. వాటితో నిమిత్తం లేకుండా తన ఎదుట వినిపించిన వాదనలు ఆలకించి వస్తునిష్ఠంగా న్యాయాన్యాయాలను నిర్ణయిస్తారని న్యాయస్థానాలతో పరిచయం లేనివారు భావిస్తారు. జస్టిస్ సునీల్‌చౌదరి రాజకీయ నేపథ్యాలను చర్చించారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి, పిటిషనర్ తెలుగుదేశం నాయకుడనీ, ప్రతివాది ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీకి చెందిన శాసనసభ్యుడనీ, పిటిషనర్‌పైన వ్యక్తిగత, రాజకీయ కక్ష సాధించడం కోసం ఏసీబీ కోర్టులో పిటిషన్ వేసి ఉండవచ్చుననీ వ్యాఖ్యానిం చారు (130,131వ పేరా). రామకృష్ణారెడ్డి తెలంగాణ శాసనమండలి సభ్యుడు కాదనీ, తెలంగాణలో జరిగిన నేరంతో ఆయనకు సంబంధం ఏమిటనీ ప్రశ్నిం చారు. ప్రజాప్రయోజన వ్యాజ్యం అంటే ఏమిటో న్యాయస్థానానికి తెలుసుననీ, ప్రజాప్రయోజన వ్యాజ్యం ముసుగులో ఎవరైనా రహస్య ఎజెండా పెట్టుకొని వ్యాజ్యం తీసుకొని వస్తే న్యాయస్థానాలు దాన్ని అనుమతించరాదని కూడా న్యాయమూర్తి స్పష్టం చేశారు. కక్షిదారుల రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవహా రాలతో నిమిత్తం లేకుండా విషయ ప్రాధాన్యం, నిజానిజాల ఆధారంగా న్యాయ స్థానాలు తీర్పు ఇవ్వాలన్న అభిప్రాయానికి ఇది విరుద్ధం. అయినప్పటికీ చట్టం ప్రకారం న్యాయమూర్తి నిర్ణయం సరైనదే కావచ్చు.
పరిశోధన ఏబీసీ చేయవలసిందే
ఏసీబీ విచారణ సవ్యంగా జరగడం లేదని భావించి, సజావుగా జరిగే విధంగా ఏసీబీని ఆదేశించాలంటూ అభ్యర్థిస్తూనే రెండో ప్రతివాది ఏబీసీ కోర్టును ఆశ్రయించారు. తాను స్వయంగా పరిశోధన చేస్తానంటూ రాలేదు. ఒక వ్యక్తికి అది సాధ్యం కూడా కాదు. కేసు పరిశోధన బాధ్యతను తాను స్వీకరిస్తానంటూ రెండో ప్రతివాది –రామకృష్ణారెడ్డి– ముందుకు వచ్చారని న్యాయమూర్తి అన్నారు (This clearly indicates that the second respondent came forward to showlder the responsibility of investigation-Para 127). పరిశోధ నలో పాల్గొనడానికి ప్రతివాదిని అనుమతిస్తే ఏబీసీ నైతికంగా దెబ్బ తింటుందని వ్యాఖ్యానించారు. ప్రతివాది ప్రతిపాదన అది కాదు. న్యాయమూర్తి స్పష్టం చేసినట్టే అన్ని అంశాలూ సమ్యక్‌దృష్టితో చూసినప్పుడు రేవంతరెడ్డికి అంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో, స్టీఫెన్‌సన్‌కు డబ్బు ఇచ్చి ఆయనను లోబరచు కోవలసిన అవసరం రేవంత్‌రెడ్డికి ఎందుకు కలిగిందో, స్టీఫెన్‌సన్‌కి డబ్బు అప్పజెప్పడం వల్ల, ఆయనను సుముఖుడిని చేసుకోవడం వల్ల ప్రయోజనం ఎవరికో ఆలోచించాలి. ఇది చంద్రబాబునాయుడి నాయకత్వంలోని తెలుగు దేశం పార్టీ రచించిన వ్యూహమనీ, దీని అమలు బాధ్యత టీడీపీ శాసనసభ్యుడు రేవంత్‌రెడ్డికి అప్పగించారనీ, స్టీఫెన్‌సన్‌ను ‘కొనుగోలు’ చేసే ప్రయత్నం తెలుసు కొని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏసీబీ వలలో రేవంత్‌రెడ్డి చిక్కే విధంగా వ్యవహరించారనీ చట్టం తెలియని సాధారణ పౌరులకు అర్థం అవుతుంది. టీవీలో దృశ్యాలను చూసినవారందరికీ ఇది తేటతెల్లమే. ఈ విషయాలు న్యాయ స్థానాలలో ఎప్పటికీ నిర్థారణ కాకపోవచ్చు. అది వేరే సంగతి. ఈ కేసులో న్యాయస్థానాలలో నిర్ణయాలు ఏమైనా జనాభిప్రాయం మాత్రం మారదు.
- కె. రామచంద్రమూర్తి