హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి సోమవారం కోర్టులో తమ వాదనలు వినిపించారు. ‘ఓటుకు కోట్లు కేసులో నిందితులు రెడ్హ్యాండెడ్గా ఏసీబీకి పట్టుబడ్డారు. ఆడియో, వీడియో టేపుల్లో అడ్డంగా దొరికిపోయారు. నామినేటెడ్ ఎమ్మెల్సీ స్టీఫెన్ సన్తో రూ.2.5కోట్లకు టీ.టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఒప్పందం కుదుర్చుకున్నారు. నన్ను బాసే మీ వద్దకు పంపారని రేవంత్ చెప్పారు. ఇంకేమన్నా కావాలంటే చంద్రబాబుతో నేరుగా మాట్లాడవచ్చని, స్టీఫెన్ సన్కు రేవంత్ చెప్పిన మాటలు రికార్డు అయ్యాయి.
రేవంత్ చెప్పిన తర్వాత స్టీఫెన్తో చంద్రబాబు నేరుగా మాట్లాడారు. మన వాళ్లు బ్రీఫ్డ్ మి అని స్టీఫెన్తో చంద్రబాబు అన్నారు. ఈ కేసుపై పిటిషనర్కు అర్హత లేదనడం సరికాదు. కీలక దశలో విచారణ ఆగిపోయింది. పురోగతి లేనందునే పిటిషనర్ కోర్టును ఆశ్రయించారు’ అని పొన్నవోలు ఈ సందర్భంగా న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. వాదనల అనంతరం తదుపరి విచారణ మంగళవారానికి వాయిదా పడింది.