‘చంద్రబాబుకు వణుకు మొదలైంది’
హైదరాబాద్ : ఓటుకు కోట్లు కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. ఈ కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇవాళ కూడా న్యాయస్థానం ఎదుట వాదనలు వినిపించారు. కాగా ఓటుకు కోట్లు కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు పాత్రపై విచారణ జరపాలంటూ ఎమ‍్మెల్యే ఆర్కే పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఏసీబీ అడ్వకేట్ సోమవారం కోర్టులో వాదనలు వినిపించే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆర్కే మాట్లాడుతూ ఓటుకు కోట్లు కేసులో సీఎం చంద్రబాబుకు వణుకు మొదలైందని విమర్శించారు. చట్టాలన్నీ తమకు అనుకూలంగా ఉన్నప్పటికీ చంద్రబాబు తరపు లాయర్లు పసలేని వాదన వినిపించారని అన్నారు. 482 క్వాష్ పిటిషన్ చెల్లదని తెలిసి కూడా మొండిగా వాదించారని, గత మూడు రోజులుగా చంద్రబాబు తరఫు న్యాయవాదులపై ధీటైన వాదన వినిపించామన్నారు.
ఇక అవినీతి నిరోధక చట్టం కింద నమోదైన ఏ కేసు విచారణను ఆపడానికి వీల్లేదన్న అంశాన్ని ఆర్కే తరపు లాయర్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. 482 క్వాష్ పిటిషన్ చెల్లదని ఆయన కోర్టుకు వివరించారు. 190 పీఆర్పీసీ ద్వారా తమకు వాదన వినిపించే అవకాశం ఉందని తెలిపారు. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కేసులో ఎంపీలు, పబ్లిక్ సర్వెంట్లు పీసీ యాక్ట్ కింద వస్తారని సుప్రీంకోర్టు ఇప్పటికే తెలిపిందన్న విషయాన్ని న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లారు.