కేసులు నన్నేమీ చేయలేవు
‘ఓటుకు కోట్లు’ కేసును అసెంబ్లీలో పరోక్షంగా ప్రస్తావించిన సీఎం
సాక్షి, అమరావతి: ‘‘ప్రతిపక్ష సభ్యులు శాసనసభలో ఒకే అంశాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. ఇదే అంశంపై హైకోర్టుకు వెళ్లారు.. సుప్రీంకోర్టుకు వెళ్లారు. ఆ చట్టం(అవినీతి నిరోధక చట్టం) దానికి(ఓటుకు కోట్లు కేసు) వర్తించదని హైకోర్టు చెప్పింది. మళ్లీ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అది కేసే కాదు.. కేసులు నన్నేమీ చేయలేవు’’ అని సీఎం చంద్రబాబు పునరుద్ఘాటించారు. ప్రపంచ జలదినోత్సవం సందర్భంగా సీఎం శాసనసభలో బుధవారం సాగునీటి ప్రాజెక్టులపై ప్రకటన చేశారు.
అందులో అన్నీ అసత్యాలేనంటూ ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. అయితే ప్రతిపక్ష నేతకు మాట్లాడేందుకు స్పీకర్ కోడెల అవకాశమివ్వకపోవడంతో వైఎస్సార్‌సీపీ సభ్యులు పోడియం వద్దకు చేరుకుని నిరసన తెలిపారు. స్పీకర్ మాట్లాడేందుకు అవకాశమివ్వకపోవడంతో ప్రధాన ప్రతిపక్షం సీఎం చంద్రబాబు ప్రకటనను నిరసిస్తూ సభకు ఓ నమస్కారం అంటూ వెలుపలకు వచ్చింది. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ సభలో లేని ప్రధాన ప్రతిపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శలకు పాల్పడ్డారు.
సీఎం చేతికి మార్పులతో కూడిన రాజధాని డిజైన్స్
ఏపీ రాజధాని నిర్మాణానికి సంబంధించిన ప్రాథమిక డిజైన్స్‌లో మార్పులతో కూడిన బృహత్తర ప్రణాళికను నార్మర్ ఫోస్టర్ ప్రతినిధులు బుధవారం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అందచేశారు. వెలగపూడి సచివాలయంలో కలిసిన ఈ ప్రతినిధులు డిజైన్ వివరాలను సీఎంకు వివరించారు. గత నెలలో చూపించిన నాలుగు రకాల డిజైన్స్‌లో రెండింటి డిజైన్స్ మార్పు చేయాలని చంద్రబాబు సూచించగా.. ఆ మేరకు మార్పులు చేసిన డిజైన్స్‌ను నార్మర్ ఫోస్టర్ ప్రతినిధులు బుధవారం సీఎంకు చూపించారు. ఇందులో 51 శాతం ఆకుపచ్చని ప్రదేశం, 10 శాతం జలభాగం, 14 శాతం రహదారులు, 25 శాతం భవంతుల కట్టడాలకు ఉపయోగించే విధంగా రూపొందించారు.