మరాఠా యోధుడి మనోగతం | Maratha warrior frame of mind, k ramachandra murthy writes about sharad pawar | Sakshi
Sakshi News home page

మరాఠా యోధుడి మనోగతం

Published Sun, Dec 13 2015 3:34 AM | Last Updated on Sun, Sep 3 2017 1:53 PM

మరాఠా యోధుడి మనోగతం

మరాఠా యోధుడి మనోగతం

త్రికాలమ్
 
‘వో లంబీ రేస్ కీ ఘోడా హోగీ’ (అది చాలా దూరం పరుగెత్తగల గుర్రం) అంటూ సోనియాకు ఆమె సలహాదారులు నూరిపోసి తనకు ప్రధానమంత్రి పదవి దక్కకుండా చేశారంటూ మరాఠా నాయకుడు శరద్‌పవార్ ఆత్మకథలో రాసుకున్నారు. లోక్‌సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా ఉన్న తనను కాదని, అనారోగ్యం కారణంగా ఎన్నికలలో పోటీ చేయకుండా హైదరా బాద్ వెళ్లిపోవటానికి బిస్తరు సర్దుకున్న పీవీ నరసింహారావును ప్రధాని పదవిలో నియమించడానికి కారణం స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్నవారికి పదవి అప్పగించడం సోనియాగాంధీకి ఇష్టం లేకపోవడమేనని వ్యాఖ్యానించారు. తనకు స్వతంత్ర వ్యక్తిత్వం, స్వాభిమానం దండిగా ఉన్నాయని ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన అనంతరం సోనియాకూ, శరద్ పవార్‌కూ, ప్రపంచానికీ నిర్ద్వంద్వంగా పీవీ నిరూపించారు. అది వేరే విషయం.

1991 నాటి సార్వత్రిక ఎన్నికలలో ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాజీవ్‌గాంధీ తమిళనాడులోని శ్రీపెరంబదూరులో ఎల్‌టీటీఈ మానవబాంబు దాడిలో ప్రాణాలు వదిలారు.  ఇందిరాగాంధీ హత్య జరిగిన కొన్ని గంటలలోనే రాజీవ్ చేత ప్రధానిగా ప్రమాణం చేయించిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు రెండో దశ ఎన్నికలు పూర్తయిన తర్వాత మైనారిటీ ప్రభు త్వం ఏర్పాటు చేసే అవకాశం ముందుగా సోనియాగాంధీకే ఇచ్చేవారు. కానీ ఆమె అందుకు సిద్ధంగా లేరు. కొంతకాలం మరో నాయకుడిని ప్రధానిగా నియమించాలని నిర్ణయించారు. ఈ పదవిని ఆశించినవారిలో శరద్ పవార్, అర్జున్‌సింగ్, నారాయణ్ దత్ తివారీ ముఖ్యులు. ఈ ముగ్గురినీ కాకుండా హైదరాబాద్‌లో రామానంద తీర్థ ఇన్‌స్టిట్యూట్‌లో చదువుకుంటూ, రాసు కుంటూ కాలక్షేపం చేయాలనుకుంటున్న పీవీని పదవి వరించింది.

శరద్ పవార్ ఆత్మకథ ‘లైఫ్ ఆన్ మై టర్మ్స్-ఫ్రమ్ గ్రాస్ రూట్స్ టు కారిడార్స్ ఆఫ్ పవర్’లో చెప్పినట్టు అప్పట్లో సోనియాగాంధీని ప్రభావితం చేసిన వ్యక్తులు ఫోతేదార్, ఆర్‌కె ధవన్, వి జార్జితో పాటు మధ్య ప్రదేశ్ ఠాకూర్ అర్జున్‌సింగ్. ఇందిరాగాంధీకి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన పీసీ అలెగ్జాండర్‌ది కూడా ముఖ్య భూమికే. వీరు ముందు శంకర్‌దయాళ్ శర్మను సూచించారు. ఆయన అనారోగ్యం మూలంగా పదవీ భారం మోయలేనంటూ నిరాకరించడంతో అనుభవజ్ఞుడూ, మృదుస్వభావి అయిన పీవీ నరసింహా రావును అడిగారు. అయిష్టంగానే అంగీకరించిన పీవీ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత శక్తివంచనలేకుండా పదవికీ, దేశానికీ న్యాయం చేసేందుకు ప్రయత్నించారు. అర్జున్‌సింగ్ అభ్యర్థిత్వం గురించి పెద్దగా చర్చ జరగలేదు.

ఇందిరతో విభేదాలు
శరద్ పవార్‌ని సోనియాగాంధీ మాత్రమే కాదు ఆమె అత్తగారు ఇందిరాగాంధీ సైతం విశ్వసించలేదు. కారణం ఏమిటి? మొదటి నుంచి బొంబాయి రాష్ట్రంలో, మహారాష్ట్రలో ఢిల్లీ వ్యతిరేక భావజాలం ఎక్కువ. మరాఠా-మొఘల్ వైరం కొనసాగింపు కావచ్చు. తమదైన ఢిల్లీ సింహాసనాన్ని మొఘల్‌లూ, బ్రిటిష్ వారూ, నెహ్రూ-గాంధీ కుటుంబీకులూ ఆక్రమించుకున్నారనే భావన మరాఠా లలో బలంగా ఉండి ఉండవచ్చు. చక్కెర పరిశ్రమను గుప్పిటలో పెట్టుకున్న మరాఠాలు పశ్చిమ మహారాష్ట్రలో మహాశక్తిమంతులు. యశ్వంతరావ్ బల్వం తరావ్ (వైబీ) చవాన్ మరాఠా నాయకుడుగా, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా, రక్షణమంత్రిగా అనేక పదవులు నిర్వహించి సమర్థుడైన నేతగా పేరు తెచ్చు కున్నారు. శరద్‌కు చవాన్ ప్రోత్సాహం ఉంది. 1967లో శాసనసభకు బారా మతి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొందారు.

ఎమర్జెన్సీ అనంతరం ఇందిరాగాంధీతో విభేదించి కాంగ్రెస్ పార్టీ నుంచి నిష్ర్కమించి జనతా పార్టీతో భుజం కలిపి 1978లో ప్రోగ్రెసివ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) ప్రభుత్వం ఏర్పాటు చేశారు. అతి పిన్న వయస్సులో (38 ఏళ్ళకే) ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఘనత ఆయనది. ఇందిరాగాంధీ తిరిగి అధికారంలోకి రాగానే చేసిన మొదటి పనులలో శరద్ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయడం ఒకటి. ముఖ్య మంత్రిగా ఇందిర నియమించిన అబ్దుల్ రెహమాన్ అంతూలే ఇందిరా ప్రతిభా ప్రతిష్ఠాన్ పేరుతో సంస్థను నెలకొల్పి అక్రమంగా చందాల దందా నిర్వహించి పదవిని కోల్పోయాడు (12 సంవత్సరాల విచారణ తర్వాత న్యాయస్థానాలు అంతూలేని నిర్దోషిగా తేల్చాయి). అంతూలే తర్వాత బాబాసాహెబ్ భోంస్లే ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన తర్వాత సహమరాఠా నాయకత్వంలో పని చేయడానికి సిద్ధపడిన పవార్ తిరిగి 1987లో రాజీవ్‌గాంధీ హయాంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు.

శంకర్‌రావ్ చవాన్‌ను కేంద్ర ఆర్థిక మంత్రిగా పంపించి 1988లో  రెండోసారి ముఖ్యమంత్రి పదవి స్వీకరించాడు. 1990 ఎన్నికలలో కాంగ్రెస్‌కు 288 స్థానాల అసెంబ్లీలో 141 స్థానాలు దక్కాయి. 12 మంది ఇండిపెండెంట్ల సహాయంతో మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసి పదవిలో కొనసాగారు. 1993 మార్చి 6న నాలుగో విడత మహరాష్ట్ర ముఖ్య మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 1984లో బారామతి నుంచి లోక్‌సభకు ఎన్నికైనప్పటికీ మరుసటి సంవత్సరమే శాసనసభకు ఎన్నికై లోక్‌సభ స్థానానికి రాజీనామా చేసి మహారాష్ట్ర రాజకీయాలలో కొనసాగారు.1991లో ప్రధాని పదవి దక్కకపోయినా పీవీ మంత్రిమండలిలో రక్షణ మంత్రిగా పనిచేశారు పవార్. తనకూ, పీవీకి మధ్య అలెగ్జాండర్ రాజీ చేసినట్టు ఆత్మకథలో రాసుకున్నారు.

తనకంటే వయస్సులోనూ, అనుభవంలోనూ పెద్దవాడైన పీవీకి పవార్ సహకరిస్తూనే ఒక ప్రత్యామ్నాయంగా ఉంటూ వచ్చారు. అపర చాణక్యుడుగా పేరు తెచ్చుకున్న పీవీ అయిదేళ్లపాటూ  నిరాఘా టంగా పరిపాలించారు. 1996 ఎన్నికలలో పరాజయం తర్వాత ప్రధాని పద వికీ, పార్టీ అధ్యక్ష పదవికీ రాజీనామా చేసిన పీవీని పార్టీ దారుణంగా అవమా నించింది. సీతారాం కేసరిని పార్టీ అధ్యక్షుడుగా నియమించింది పీవీనే. కానీ 1998 పార్లమెంటు ఎన్నికలలో పీవీకి పార్టీ టిక్కెట్టు ఇవ్వడం లేదంటూ కేసరి ప్రకటించినప్పుడు మౌన ప్రేక్షకుడుగా మిగిలిపోయాన ని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ తన పుస్తకం ‘ది బ్రింక్ అండ్ బ్యాక్’లో ఆవేదన వెలిబుచ్చారు.

అటు అర్జున్, ఇటు శరద్
పీవీ హయాంలో హరియాణాలోని సూరజ్‌కుంద్‌లో (1993) ఏఐసీసీ సమావే శాలు జరిగాయి. ఢిల్లీలో పనిచేస్తున్న ఒక విలేకరిగా నేనూ వెళ్ళాను. ఒకవైపు శరద్ పవార్, మరోవైపు అర్జున్‌సింగ్. సభాస్థలికి వెళ్లే మార్గంలో శివశంకర్, షీలాదీక్షిత్, మొహిసినా కిద్వాయ్, నట్వర్‌సింగ్ కూర్చొని నిరసన ప్రకటిస్తు న్నారు. వీరంతా సోనియా విధేయులు. పీవీకి వ్యతిరేకులు. వేదిక మీద కూర్చున్న అర్జున్‌సింగ్ మద్దతు వీరికి ఉన్నది. అయన ప్రధానమంత్రిపైన రోజుకో లేఖాస్త్రం సంధించేవాడు.  

1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ నాయక త్వంలోని నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) విజయం సాధించింది. కార్గిల్ యుద్ధంలో సాధించిన విజయం తాలూకు కీర్తి ఎన్‌డీఏ గెలుపునకు తోడ్పడింది. బాలయోగి స్పీకర్‌గా ఉన్న లోక్‌సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు శరద్‌పవార్. పార్లమెంటరీ కమిటీలలో కాంగ్రెస్ పక్షాన ఎవరిని సభ్యులుగా నియమించాలో సోనియాతో చర్చించి ఒక జాబితా తయారు చేసి స్పీకర్‌కు పవార్ సమర్పించారు. స్పీకర్‌కు కాంగ్రెస్ తరఫున రెండో జాబితాను పార్టీ విప్ కురియన్ అందజేశాడు. కురియన్ ఇచ్చిన జాబితాను ఉపసంహ రించుకోవలసిందిగా సోనియాను పవార్ అడిగితే ఆమె ససేమిరా అనే సరికి పవార్ హతాశుడైనారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్  నుంచి వైదొలగి నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీని నెలకొల్పారు. యూపీఏలో భాగస్వామిగా వ్యవ సాయ మంత్రిత్వ శాఖను నిర్వహించారు.

అవినీతి ఆరోపణలు
మహారాష్ట్రలో బీజేపీ, శివసేనల తాకిడి తట్టుకోవడానికి పవార్ అన్ని మాయో పాయాలూ వినియోగించారు. హాజీ మస్తాన్‌తో, దావూద్ ఇబ్రహీంతో సంబం ధాలు ఉండేవని ఆరోపణలు ఎదుర్కొన్నారు. మహారాష్ట్రలో శాంతిభద్రతలు క్షీణిస్తున్న దశలో తన మంత్రిమండలిలో సభ్యుడుగా ఉన్న శరద్ పవార్‌ను మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా  పంపించారు పీవీ. 1993 మార్చి 6న నాలుగో సారి ముఖ్యమంత్రిగా పవార్ ప్రమాణం చేస్తే వారం తిరగకుండానే మార్చి 12న బొంబాయిలో పేలుళ్లు సంభవించాయి. బృహత్‌ముంబయ్ మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ జీఆర్ ఖైర్నార్ పవార్‌పైన అనేక ఆరోపణలు చేశారు. గాంధేయవాది అన్నా హజారే పవార్‌పై అవినీతి ఆరోపణలు చేసి ఉద్యమం నిర్వహించారు.

1995లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ- శివసేన కూటమి విజయం సాధించి మనోహర గజానన్ జోషి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడంతో మహారాష్ట్ర స్థాయిలో పవార్ పదవీకాలం ముగిసింది. ఆ తర్వాత కేంద్రంలోనే. క్రికెట్ బోర్డు అధ్యక్షుడుగా పని చేసినా, పార్టీ అధ్యక్షుడుగా వ్యవహరించినా, మంత్రిగా ఉన్నా అవినీతి ఆరోపణలు ఆయనను విడిచిపెట్టలేదు. పశ్చమ మహారాష్ట్రలో విస్తృతమైన ప్రాబల్యం కాపాడుకుంటూ పవార్ పార్టీని నిలబెట్టుకున్నారు. కుమార్తె సుప్రియా సూలేకి పార్టీ బాధ్యతలు అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని తలపోస్తున్నారు.

సోనియాగాంధీ, ఇతర రాజకీయ ప్రముఖుల సమక్షంలో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీలు విడుదల చేసిన పవార్ ఆత్మకథలో నిజాలూ, నిష్టూరాలతో పాటు కొత్తతరం  నాయకులు తెలుసుకోవలసిన అంశాలు ఎన్నో ఉంటాయి. మరాఠా యోధుడుగా, తిరుగుబాటు స్వభావం కలిగిన గండరగండ డుగా, ప్రగతిశీల రాజకీయవాదిగా, రాజనీతిజ్ఞుడు కావడానికి ప్రయత్నించి ఒక అడుగు కిందనే నిలిచిపోయిన విఫలమనోరథుడుగా శరద్ పవార్ చరిత్రలో  ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ఇందిరనే ధిక్కరించి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ (సోషలిస్టు) నెలకొల్పి, ఎన్‌టీ రామారావు విజయవాడలో నిర్వహిం చిన ప్రతిపక్ష సదస్సుకు హాజరై ప్రత్యామ్నాయ రాజకీయాలకోసం పాటుపడిన వ్యక్తి పవార్.

అటువంటి రాజకీయవాదిని ఇందిర కోడలునంటూ సగర్వంగా చెప్పుకునే సోనియాగాంధీ విశ్వసించకపోవడంలో వింత ఏమున్నది? తమిళ నాడు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవలసివచ్చిన రెండు సందర్భాలలోనూ జయలలిత తన స్థానంలో పన్నీర్ సెల్వంనే నియమించారు కానీ వెన్నెముక కలిగిన రాజకీయ నాయకుడిని నిలబెట్టలేదు. వెన్నెముక లేదనుకొని భావించి బిహార్ ముఖ్యమంత్రిగా మాంఝీని నిలబెట్టిన నితీశ్ కుమార్ ఎంత మూల్యం చెల్లించవలసి వచ్చిందో చూశాం. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పీవీ నరసింహారావులో వచ్చిన మార్పు గమనించాం.

ఈ నేపథ్యంలో రాజకీయాలతో ప్రమేయం లేని, ముఠాలు కట్టే తెలివితేటలు లేని  మన్మోహన్‌సింగ్ వంటి సౌమ్యుడైన మేధావిని సోనియా నమ్ముతారు కానీ శరద్ పవార్ వంటి బలమైన రాజకీయవాదిని నమ్మి ప్రధాని పదవిని అప్పగిస్తారా? అత్యున్నత పదవిని ఆశించడం పవార్ తప్పిదం కాదు. ఆయన చేతికి పగ్గాలు అప్పగించకపోవడం సోనియా దుర్మార్గం కాదు. రాజ కీయం అంటే అదే.

-కె. రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement