ఎన్నికల వ్యవస్థకు కాయకల్ప చికిత్స | K Ramachandra Murthy Article On Model Code Of Conduct | Sakshi
Sakshi News home page

ఎన్నికల వ్యవస్థకు కాయకల్ప చికిత్స

Published Sun, Apr 21 2019 1:20 AM | Last Updated on Sun, Apr 21 2019 1:35 AM

K Ramachandra Murthy Article On Model Code Of Conduct - Sakshi

ప్రజాస్వామ్యంలో  ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకమైనది. ఐదేళ్ళకు ఒక సారి చట్టసభలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఎన్నికలు నిష్పాక్షికంగా, ధర్మంగా, స్వేచ్ఛగా జరగాలి. స్వాతంత్య్ర పోరాటం నాటి విలువలు కొన్ని సార్వత్రిక ఎన్నికల వరకూ కొనసాగాయి. 1952లో ప్రథమ సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు పార్టీ సిద్ధాంతాలనూ, అభ్య ర్థుల అర్హతలనూ చూసి ప్రజలు ఓటు చేసేవారు. కాంగ్రెస్‌ను అధికారం చెడగొట్టింది. నైతిక, రాజకీయ విలువలకు పాతర వేసింది. ప్రజలకు ఆ పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లుతూ వచ్చింది. 1967 నుంచి ప్రతిపక్షాలను గెలిపించడం ప్రారంభించారు. 

కాలక్రమంలో అనేక ప్రయోగాలు జరిగాయి. కూటమి ప్రభు త్వాలు ఏర్పడినాయి. నేషనల్‌ ఫ్రంట్, యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వాల ప్రయో గాలు విఫలమైన తర్వాత బీజేపీ నాయకత్వంలో నేషనల్‌ డెమాక్రాటిక్‌ అల యెన్స్‌ (ఎన్‌డీఏ), కాంగ్రెస్‌ నేతృత్వంలో యునైటెడ్‌ ప్రోగ్రెసివ్‌ అలయెన్స్‌ (యూపీఏ) ప్రభుత్వాలు నిలకడగా పరిపాలించాయి. 2014లో బీజేపీకి లోక్‌ సభలో మెజారిటీ స్థానాలు దక్కినప్పటికీ మిత్రపక్షాలతో కలిసి ఎన్‌డీఏ ప్రభు త్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్‌ కొన్ని  రాష్ట్రాలకు మాత్రమే పరిమి తమైన జాతీయ పార్టీ కాగా 1984లో లోక్‌సభలో రెండు స్థానాలు మాత్రమే గెలు చుకున్న బీజేపీ ఇప్పుడు ఇరవైకి పైగా రాష్ట్రాలలో అధికారం చెలాయిస్తున్నది. ప్రభుత్వాలను మార్చడానికి ఓటు హక్కును ఎట్లా వినియోగించుకోవాలో ప్రజలు తెలుసుకున్నారు. 

ప్రతిపక్షాలు సైతం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్‌ వలెనే అవినీతికీ, అక్రమాలకూ, ఆశ్రితపక్షపాతానికీ ఒడిగడుతున్నాయి. రాజకీయ ప్రమాణాలు అడుగంటుతున్నాయి. ఎన్నికలు విపరీతమైన ఖర్చుతో కూడిన జూదంగా మారిపోయాయి. ఇది వరకు సంపన్నుల సరసన కనిపించడా నికి అగ్రనేతలు సంకోచించేవారు. క్రమంగా సంపన్నులూ, వ్యాపారులూ, పారి శ్రామికవేత్తలూ రాజకీయాలలోకి వచ్చారు. కార్పొరేట్‌ రంగానికీ, రాజకీయ పార్టీ లకూ అక్రమసంబంధం విడదీయలేనంతగా బలపడింది. ఇప్పుడు సంపన్నులకే రాజకీయాలలో పోటీ చేసి గెలిచే అవకాశం ఉంది. డబ్బు లేనిదే రాజకీయాలలో రాణించడం అసాధ్యం. టీఎన్‌ శేషన్‌ ఎన్నికల సంఘానికి అపారమైన ప్రతిష్ఠను సంపాదించి పెట్టారు కానీ ఎన్నికలలో డబ్బు పాత్రను తగ్గించలేక పోయారు. ఆయన పదవీ విరమణ తర్వాత ఈ జాడ్యం జడలు విచ్చుకొని స్వైరవిహారం చేస్తున్నది. ఎన్నికల ప్రధానాధికారులు ఎంతమంది మారినా వ్యవస్థ క్రమంగా క్షీణిస్తూ పోతున్నది. 

నియమావళి ఉల్లంఘన
ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినవారిపైన చర్య తీసుకునే అధికా రాలు తమకు ఉన్నాయో లేవో ఎన్నికల సంఘం సభ్యులకు సుప్రీంకోర్టు చెప్పే వరకూ స్పష్టంగా తెలియదు. నియమావళిని ఉల్లంఘించిన యోగి ఆదిత్యనాథ్, మాయావతి, మేనకాగాంధీ, ఆజంఖాన్‌లపైన రెండు, మూడు రోజులు ప్రచారం చేయకుండా ఆంక్షలు విధించారు. ఇటువంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమం. తొలి రెండు సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల నియమావళి అవసరం లేకపో యింది. రాజ్యాంగ నిర్మాతలే పాలకులుగా ఉన్న రోజులవి. ఎన్నికల సమ యంలో అధికార దుర్వినియోగం చేయకుండా వారిని నియంత్రించవలసిన అవ సరం లేకపోయింది. 

డబ్బు పెట్టి ఓట్లు కొనుగోలు చేసే జబ్బు అప్పటికి సోక లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు గట్టి పునాదులు వేసినవారు మొదటి తరం నాయకులు. ఆ తర్వాత తరం నాయకులకు నిగ్రహం లేదు. అధికార దుర్విని యోగానికి ఒడిగట్టడం ప్రారంభించారు. కనుక నియమావళిని ప్రవేశపెట్టవలసి వచ్చింది. మొదటి సారిగా 1960లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు దాన్ని అమలు చేశారు. అధికారంలో ఉన్నవారూ, ప్రతిపక్షానికి చెందినవారూ ఎన్నికల ప్రచార సమయంలో ఎటువంటి మార్గదర్శకాలు పాటించాలో ఎన్నికల సంఘం నిర్దేశించింది. సమావేశాలు ఎట్లా నిర్వహించుకోవాలి, ప్రసంగాలు ఎట్లా ఉండాలి, ఎటువంటి నినాదాలు ఇవ్వవచ్చు అనే అంశాలకే మార్గదర్శకాలు పరిమితమై ఉండేవి. 1962 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం నియమావళిని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకూ అందజేయవలసిందిగా కోరింది. 

అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలలో విజయం సాధించేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఎటువంటి నియమావళిని పాటించాలో 1979లో ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఈ నియ మావళిని గట్టిగా అమలు చేయడం 1991లోనే ప్రారంభమైంది. దాన్ని ప్రజా ప్రాతినిధ్యచట్టం (రిప్రజెంటేషన్‌ ఆఫ్‌ పీపుల్స్‌ యాక్ట్‌ 1951) లో భాగం చేయా లంటూ 2013లో లా, జస్టిస్‌ వ్యవహారాల స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. భారత శిక్షాస్మృతి (ఇండియన్‌ పీనల్‌కోడ్‌) ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావ ళిని అమలు చేయవచ్చునంటూ ఈ సంఘం సూచించింది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత 45 రోజులలో ఎన్నికల కార్యక్రమం పూర్తి చేయాలనీ, ఆ సమయంలో కోడ్‌ అమలు చేయవచ్చుననీ నిర్ణయించారు.  అంటే, నియమావళి క్రమంగా రూపుదిద్దుకొని ఈ స్థాయికి వచ్చింది. 

ఎన్నికల కమిషన్‌ చర్యల పట్ల హర్షం
ఇటీవల తనపైన ఎన్నికల సంఘం తీసుకున్న చర్యను సవాలు చేస్తూ మాయా వతి దాఖలు చేసిన రిట్‌పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు సమాజంలో హర్షం వ్యక్తమైంది. ఒక్క మాయావతిపైనే  కాదు, హద్దుమీరిన రాజకీయ నాయ కులందరిపైనా నిషేధం విధించాలనీ, శిక్షాత్మక చర్యలు తీసుకోవాలనీ ప్రజలు కోరుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తూ పుల్వా మాపైన ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల త్యాగాలనూ, పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్‌కు చెందిన ఉగ్రవాద శిక్షణ శిబిరాలపైన బాంబుల వర్షం కురిపించిన వైమానికదళానికి చెందిన సాహసికుల శౌర్యాన్నీ బీజేపీ ఎన్నికల ప్రచారానికి వినియోగించడాన్ని ప్రశ్నించకపోవడంతో ఎన్నికల సంఘం పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తున్నదనే అభిప్రాయం ప్రజలలో ప్రబలింది. 

ప్రధాని ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన అధికారిని ఎన్ని కల సంఘం సస్పెండ్‌ చేయడంతో ఇది మరింత బలపడింది.  2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థి హోదాలో ఎన్నికల ప్రచారం చేసిన మోదీ నియమావళిని రెండు సార్లు ఉల్లంఘించారు. రెండు విడతలా ఎన్నికల సంఘం ఆయనపైన ఎఫ్‌ఐఆర్‌ (ఫస్ట్‌ ఇన్పర్మేషన్‌ రిపోర్ట్‌–ప్రాథమిక సమాచార నివేదిక) దాఖలు చేశారు. భారత సైన్యాన్నీ, సైనిక చర్యలనూ ప్రచారాంశాలుగా వినియోగించుకోవడాన్ని ఖండిస్తూ పదవీ విరమణ చేసిన పలువురు సైన్యాధికారులు రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ పంపించారు.

మాటలతో, చేతలతో హిందూ ఓటర్ల హృదయాలు గెలుచుకోవాలన్న మోదీ–అమిత్‌షా ప్రయత్నంలో భాగమే భోపాల్‌ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి దిగ్విజయ్‌సింగ్‌పైన మాలేగాం ఉగ్రవాద ఘటనలో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకుర్‌ను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టడం. ఇలా నిర్ణయించిన తర్వాత అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్‌ స్థావరంగా చేసుకొని కశ్మీర్‌లో అగ్గి రగిలిస్తున్న ఉగ్రవాద సంస్థలపైన భారత దౌత్యాధికారులు చేస్తున్న విమర్శలకు విలువ ఏముంటుంది? ఎట్లాగైనా సరే ఎన్నికలలో గెలుపొందడం ప్రధానమని అన్ని పార్టీలూ భావిస్తున్నట్టు కనిపి స్తున్నది. ప్రతిపక్షంలో ఐక్యత లేక, మోదీకి దీటైన నాయకుడు లేక బీజేపీ నాయకత్వంలోని ఎన్‌డీఏ ఈ ఎన్నికల అనంతరం కూడా అధికారంలో కొనసాగ వచ్చునేమో కానీ ఎన్నికలు జరుగుతున్న పద్ధతి మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి తగినట్టుగా లేదు. 

తనపైనే ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రధాని మోదీ ఇంటెలిజెన్స్‌ అధికారులను కలుస్తుండగా తాను సమీక్షా సమావేశాలు పెడితే తప్పేమిటంటూ వాదిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌)కు లేని ఆంక్షలు చంద్రబాబుపైన ఎందుకంటూ నారా లోకేష్‌ ప్రశ్నిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష చేయవచ్చు. పోలవరంపైనా, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ కార్యకలాపాలపైనా సమీక్షించినందుకు ప్రతిపక్షం ఫిర్యాదు చేసిన కార ణంగా ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ ప్రమేయంతో ప్రభుత్వ ప్రధానాధికారి ఎల్‌వీ సుబ్రహ్మణ్యం అధికారులకు నోటీసులు ఇచ్చారు. మంచినీటి సమస్యపైన కూడా చంద్రబాబు సమీక్షించారు. ఆ శాఖకు సంబంధించిన అధికారులకు నోటీ సులు ఇవ్వలేదు. మంచినీటి ఎద్దడి అత్యవసరమైన సమస్య. 

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికలలో అధికారులను దుర్వినియోగం చేసిన తీరు నియమావళికి మరింత  పదును పెట్టవలసిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నది. ఎన్నికల షెడ్యూలు ప్రకటిం చడానికి కొద్ది రోజుల ముందే ముఖ్యమంత్రి తనకు ఇష్టులైన అధికారులను జిల్లా కలెక్టర్లుగా నియమించుకున్నారు. డీజేపీ, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ విధేయులే. అందరినీ ఎన్నికలలో టీడీపీ కోసం వినియోగించినట్టు ప్రతిపక్షం ఆరోపణలు చేసింది. ఈ దుర్వినియోగంతో పోల్చితే నలభై నాలుగు సంవత్సరాల కిందట చరిత్ర సృష్టిం చిన రాయ్‌బరేలీ కేసులో ఆరోపించిన అధికార దుర్వినియోగం చాలా స్వల్ప మైనది. 

చారిత్రక అలహాబాద్‌ కోర్టు తీర్పు
ఇప్పుడు ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్ల (ఈవీఎం)పైన అనుమానాలు వ్యక్తం చేస్తు న్నట్టుగానే 1971లోనూ ప్రతిపక్షాలు బ్యాలట్‌పత్రాలపైన రసాయనిక ప్రక్రియ జరిపారని ఆరోపించాయి. నాటి సార్వత్రిక ఎన్నికలలో రాయ్‌బరేలీలో ప్రధాని ఇందిరాగాంధీపైన ప్రతిపక్ష అభ్యర్థిగా రాజనారాయణ్‌ పోటీ చేశారు. ఇందిరకు 1,83,309 ఓట్లు వస్తే రాజ్‌నారాయణ్‌కు 71,499 ఓట్లు వచ్చాయి. ఓట్లు లెక్కించకముందే రాజ్‌నారాయణ్‌ విజయోత్సవం నిర్వహించారు. తానే గెలు స్తానని అంత ధీమా. తీరా ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటించే సరికి డీలా పడి పోయారు. కానీ బ్యాలెట్‌పత్రంపైన రసాయనిక ప్రయోగం చేశారని ఆయన గట్టిగా విశ్వసించారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఆయనను బలపరి చారు.

బ్యాలెట్‌ పత్రాలను ముద్రించే సమయంలోనే దానిపైన కాంగ్రెస్‌పార్టీ గుర్తు ముద్రించారనీ, దాన్ని కప్పి ఉంచేందుకు రసాయనం ఉపయోగించారనీ, ఎన్నికలలో ఓటర్లు పెట్టిన గుర్తు కొద్ది సేపటికి అదృశ్యమై కాంగ్రెస్‌పార్టీ గుర్తు బయటికి వచ్చిందనీ, ఓట్ల లెక్కింపు సమయానికి రసాయన ప్రయోగం చేసిన అన్ని బ్యాలట్‌ పత్రాలపైనా కాంగ్రెస్‌ గుర్తు ఉన్నదనీ రాజ్‌నారాయణ్‌ అను మానం. అందుకే ఆయన కోర్టులో పిటిషన్‌ వేశారు. శాంతిభూషణ్‌ ఆయన తరఫున వాదించారు. జూన్‌ 12, 1975నాడు అలహాబాద్‌ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్‌ జగ్‌మోహన్‌లాల్‌ సిన్హా ఇందిర ఎన్నిక చెల్లనేరదంటూ చారిత్రక తీర్పు ప్రకటించారు. యశ్పాల్‌ కపూర్‌ అనే ఉద్యోగిని ఎన్నికల ఏజెంట్‌గా ఇందిరాగాంధీ నియమించారనేది న్యాయమూర్తి తప్పుపట్టిన చర్య. నిజానికి యశ్పాల్‌ ప్రభుత్వ ఉద్యోగం నుంచి వైదొలిగి ఇందిర ఎన్నికల ఏజెంట్‌గా ఉన్నారు. 

ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రత్యేకాధికారి (ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ–ఓఎస్‌డీ)గా మళ్ళీ ఉద్యోగంలో చేరారు. ఈ తీర్పు కారణంగా ఇందిరా గాంధీ  పదవి నుంచి వైదొలిగి సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకుంటే బహుశా అలహాబాద్‌ హైకోర్టు తీర్పును కొట్టివేసేదేమో. కానీ ఆ పని చేయకుండా ఆత్యయిక పరిస్థితి ప్రకటించడంతో చరిత్ర మలుపు తిరిగింది. ఒక ఉద్యోగిని ఎన్నికల కార్యక్రమంలో వినియోగించుకున్నందుకు దేశ ప్రధాని ఎన్నిక చెల్లదని హైకోర్టు నిర్ణయించింది. ఆ రోజులతో పోల్చితే ఇప్పుడు అధికార దుర్వినియోగం  ఏ  స్థాయిలో జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. 

అధికార దుర్వినియోగం, ధనబలం, కండబలం, కులం, మతం, ప్రాంతం, తదితర అపభ్రంశాలన్నీ ఆవహించి ఎన్నికల ప్రక్రియను భ్రష్టుపట్టించాయి. ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం వంటి అరకొర సంస్కరణలతో  పరి స్థితి బాగుపడదు.  మొత్తం రాజకీయ వ్యవస్థకే కాయకల్ప చికిత్స జరగాలి. నియమావళిని కచ్చితంగా అమలు చేయడమే కాకుండా ఎన్నికల ప్రణాళికలలో రాజకీయ పార్టీలు ఇస్తున్న వాగ్దానాల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించే బాధ్యత సైతం ఎన్నికల సంఘమే స్వీకరించాలి. ఇప్పుడున్న ధోరణే కొనసాగినట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు విశ్వాసం నశిస్తుంది. అరాజకం ప్రబలు తుంది. రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా పౌరసమాజం యావత్తూ సమష్టిగా సమాలోచన జరిపి పరిష్కరించుకోవలసిన సమస్య ఇది.


-కె. రామచంద్రమూర్తి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement