indian Election History
-
Lok sabha elections 2024: స్లోగన్ పేలింది
సినిమాల్లో ‘పంచ్’ పడితే కలెక్షన్ల సునామీ! అదే పొలిటికల్ ‘పంచ్’ పేలితే? గెలుపు గ్యారంటీ! రాజకీయ పార్టీలు అదిరిపోయే నినాదాలతో జనాల్లోకి వెళ్తున్నాయి. సూటిగా, సుత్తి లేకుండా ఉండే ఈ స్లో‘గన్స్’ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. విపరీతంగా వైరలై ప్రజల మనసులతో పాటు ఓటు బ్యాంకులనూ కొల్లగొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో ‘రావాలి జగన్, కావాలి జగన్’ ఎలా ఊపేసిందో తెలిసిందే. భారత ఎన్నికల చరిత్ర తిరగేస్తే లాల్ బహదూర్ శాస్త్రి మొదలుకుని ఇందిరాగాందీ, వాజ్‌పేయి, మోదీ, కేజ్రీవాల్ దాకా ప్రతి ఒక్కరి జమానాలోనూ ఆయా పార్టీల విజయాలకు దన్నుగా నిలిచి, రాజకీయాలను మలుపు తిప్పిన నినాదాలెన్నో... జై జవాన్, జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన ఈ నినాదం ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. 1964లో నెహ్రూ మరణంతో ప్రధాని పదవి చేపట్టిన శాస్త్రికి యుద్ధం స్వాగతం పలికింది. 1965 భారత్–పాక్ వార్‌లో పోరాడుతున్న సైనికుల్లో జోష్ నింపేందుకు, మరోపక్క దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశంలో తిండిగింజల ఉత్ప త్తిని పెంచేలా రైతుల్లో స్థైర్యాన్ని పెంచేందుకు ఆయన ఈ నినాదమిచ్చారు. హరిత విప్లవానికి కూడా ఇది దన్నుగా నిలిచింది. తాషె్కంట్‌లో శాస్త్రి మరణానంతరం 1967లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిర సారథ్యంలో కాంగ్రెస్‌కు మళ్లీ విజయం సాధించిపెట్టిందీ ఇదే నినాదం! గరీబీ హటావో 1971లో ప్రతిపక్షాలు, సొంత పార్టీ చీలిక వర్గం ఏకమై ఎన్నికల పోరుకు దిగినా కూడా ఒంటిచేత్తో కాంగ్రెస్(ఆర్)ను గెలిపించుకున్నారు ఇందిరా గాం«దీ. పేదరికాన్ని నిర్మూలిద్దామంటూ ఆ ఎన్నికల సందర్భంగా ఆమె ఇచ్చిన ఈ స్లోగన్ జనాల్లోకి బలంగా వెళ్లింది. ఇందిర హటావో, దేశ్ బచావో ఎమర్జెన్సీలో అష్టకష్టాలు పడ్డ ప్రతిపక్షాలన్నీ జనతా పార్టీ పేరిట ఏకమై ఇచ్చిన సమైక్య నినాదం. ఇందిరను తొలగించి దేశాన్ని కాపాడాలన్న పిలుపు ఓటర్లను ఆలోచింపజేసింది. దాంతో 1977 సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. ఇందిరతోపాటు ఆమె తనయుడు సంజీవ్ గాంధీ కూడా ఓటమి చవిచూశారు. దాంతో కాంగ్రెస్ మళ్లీ చీలింది. కాంగ్రెస్(ఐ) సారథిగా 1978 ఉప ఎన్నికలో కర్నాటకలోని చిక్మగుళూరు లోక్‌సభ స్థానం నుంచి ఇందిర ఘన విజయం సాధించారు. ఆ సందర్భంగా ‘ఏక్ షేర్నీ, సౌ లంగూర్; చిక్‌మగళూరు భాయ్ చిక్‌మగళూరు’ (ఇటు ఒక్క ఆడపులి, అటు వంద కోతులు) స్లోగన్ మారుమోగింది. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, ఇందిరా తేరా నామ్ రహేగా 1984లో ఇందిర హత్యానంతరం రాజీవ్ ప్రధాని అయ్యారు. వెంటనే లోక్‌సభను రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. కాంగ్రెస్(ఐ)కి దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తింది. ‘సూర్యచంద్రులు ఉన్నంతదాకా ఇందిర పేరు నిలిచి ఉంటుంది’ అంటూ ప్రజల్లోకి వెళ్లిన రాజీవ్ ఏకంగా 413 సీట్లతో క్లీన్ స్వీప్ చేసి మళ్లీ ప్రధాని అయ్యారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ 1996 సార్వత్రిక ఎన్నికల్లో ‘బారీ బారీ సబ్ కీ బారీ, అబ్ కీ బారీ అటల్ బిహారీ’ (అందరి వంతూ అయింది, ఈసారి అటల్ బిహారీ వంతు) అంటూ బీజేపీ పిలుపునిచ్చింది. దీనికి మచ్చలేని వాజ్‌పేయి ఇమేజ్ తోడై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి అధికారం దక్కింది. తొలిసారి 16 రోజుల్లో పడిపోయిన వాజ్‌పేయి ప్రభుత్వం రెండోసారి 13 నెలలకే పరిమితమైంది. దేశాన్ని వృద్ధి బాటన నడిపేందుకు వైజ్ఞానిక రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించాలంటూ 1998లో పిలుపునిచ్చిన ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్’ నినాదం 1999లో బీజేపీకి విజయాన్ని అందించింది. మూడోసారి ఎన్డీఏ సర్కారును విజయవంతంగా నడిపారు వాజ్‌పేయి. కొంప ముంచిన ‘ఇండియా షైనింగ్’ దేశంలో సెల్ ఫోన్లను ప్రవేశపెట్టడం నుంచి ‘స్వర్ణ చతుర్భుజి’ హైవేల ప్రాజెక్టు తదితరాలతో ప్రగతికి పెద్దపీట వేసిన వాజ్‌పేయి సర్కారు 2004 ఎన్నికల్లో అతి విశ్వాసంతో బొక్క బోర్లా పడింది. ధరాభారం తదితరాలతో తాము సతమతమవుతుంటే ‘ఇండియా షైనింగ్ (భారత్ వెలిగిపోతోంది)’ నినాదంతో ఊరూవాడా ఊదరగొట్టడం జనానికి అస్సలు నచ్చలేదు. దాంతో బీజేపీ కొంప మునిగింది. వాజ్‌పేయి సర్కారు ఇంటిబాట పట్టింది. కాంగ్రెస్ కా హాత్, ఆమ్ ఆద్మీ కే సాత్ దాదాపు ఎనిమిదేళ్ల పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌కు 2004లో పూర్వ వైభవం తీసుకొచ్చిన స్లోగన్. వాజ్‌పేయి సర్కారు పేదలను విస్మరించిందని, తాము సంక్షేమ పథకాలతో వారిని ఆదుకుంటామని చెప్పిన తీరు జనాలకు కనెక్టయింది. కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ సర్కారు గద్దెనెక్కింది. సోనియాగాంధీ విదేశీయత వివాదంతో మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదేళ్లు కొనసాగారు. అచ్చే బీతే 5 సాల్, లగే రహో కేజ్రీవాల్ నయా రాజకీయ సంచలనంగా దూసుకొచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను 2020లో ఢిల్లీ పీఠంపై మరోసారి బంపర్ మెజారిటీతో కూర్చోబెట్టిన స్లోగన్. ‘ఐదేళ్లు బాగా గడిచాయి. సాగిపో కేజ్రీవాల్’ అన్న ప్రచారం ఓటర్లను ఆకర్షించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 70 సీట్లకు ఏకంగా 67 దక్కించుకున్న కేజ్రీవాల్ 2020లోనూ 62 సీట్లతో ప్రత్యర్థులపై ‘చీపురు’ తిరగేశారు. అబ్ కీ బార్ మోదీ సర్కార్ పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చున్న కమలనాథులకు 2014లో మళ్లీ అధికారం కట్టబెట్టిన స్లోగన్. నరేంద్ర మోదీని ప్రధాని అభ్యరి్థగా ప్రకటించి, ‘ఈసారి మోదీ ప్రభుత్వం’ నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. ఇది కార్యకర్తల్లో జోష్ నింపడమే గాక దేశవ్యాప్తంగా మార్మోగి బీజేపీని గెలిపించింది. తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ నినాదంతో ఇండో–అమెరికన్ ఓటర్లను ఆకట్టుకున్నారు. అలాగే ‘అచ్చే దిన్ ఆయేంగే (మంచి రోజులొస్తాయ్)’, ‘చాయ్ పే చర్చ’, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ వంటి నినాదాలూ ఆ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ (మరోసారి మోదీ ప్రభుత్వం)’, ‘మోదీ హై తో ముమ్కిన్ హై (మోదీతో సాధ్యం)’ నినాదాలు వైరలయ్యాయి. ఈసారి కమలనాథులు ‘తీస్రీ బార్ మోదీ సర్కార్’ (మూడోసారీ మోదీ సర్కారు), ‘అబ్ కీ బార్ 400 పార్’ (ఈసారి 400 పై చిలుకు)’ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నికల్లో పేలిన మరికొన్ని నినాదాలు... ► జన్‌సంఘ్ కో వోట్ దో, బీడీ పీనా చోడ్ దో; బీడీ మే తంబాకు హై, కాంగ్రెస్‌వాలా డాకూ హై (1967లో భారతీయ జనసంఘ్ నినాదం) ► ప్రోగ్రెస్ త్రూ కాంగ్రెస్ (కాంగ్రెస్‌తోనే అభివృద్ధి. 1960ల్లో నినాదమిది. అయితే, ‘ప్రోగ్రెసా, కాంగ్రెసా’ అంటూ శివసేన ఇచ్చిన కౌంటర్ అప్పట్లో బాగా పేలింది) ► వోట్ ఫర్ కాఫ్ అండ్ కౌ; ఫర్గెట్ అదర్స్ నౌ (ఆవుదూడ గుర్తుకు ఓటేయండి, మిగతా పార్టీలను మర్చిపోండి అంటూ ఇందిరా కాంగ్రెస్ ఇచ్చిన నినాదం. కానీ ఆ గుర్తు ఇందిర, సంజయ్‌లకు ప్రతీక అంటూ వ్యంగ్యా్రస్తాలు పేలాయి) ► జబ్ తక్ రహేగా సమోసా మే ఆలూ, తబ్ తక్ రహేగా బిహార్ మే లాలూ (సమోసాలో ఆలూ ఉన్నంతకాలం బిహార్‌లో లాలూ ఉంటారు) ► జాత్ పర్ నా పాత్ పర్, మొహర్ లగేగీ హాత్ పర్ (కులమతాలకు అతీతంగా హస్తం గుర్తుకు ఓటేద్దామంటూ 1996 ఎన్నికల్లో పీవీ ఇచ్చిన నినాదం) ► సోనియా నహీ, యే ఆంధీ హై; దూస్రీ ఇందిరాగాంధీ హై (సోనియా కాదు, తుఫాను; మరో ఇందిర అంటూ 2009లో కాంగ్రెస్ ఇచ్చిన నినాదం) – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఎన్నికల చిత్రం మారుతోంది.. ప్రధాన కారణం అదేనా?
మన దేశంలో ఎన్నికల తీరుతెన్నులను 2014కు ముందు, తర్వాత అని స్పష్టంగా ఒక విభజన రేఖ గీయొచ్చు. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో విభిన్నమైన ధోరణులు కనిపించాయి. ఒకప్పుడు వివిధ రాష్ట్రాల్లో బహుముఖ పోరు ఉంటే, ఇప్పుడు రెండు పార్టీలే నేరుగా తలపడుతున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది. బీజేపీ వివిధ రాష్ట్రాల్లో బలపడడం, కాంగ్రెస్ బలహీనపడడం , రాష్ట్రాల్లో మొదటి, రెండు స్థానాల్లో ఉండే కీలక పార్టీల వైపే ఓటర్లు మొగ్గు చూపిస్తూ ఉండడంతో ఎన్నికల ట్రెండ్స్ మారిపోతున్నాయి. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంటుందని అందరూ భావించినప్పటికీ జేడీ(ఎస్) తన ప్రాభవాన్ని కోల్పోయి బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే నేరుగా పోటీ జరగడం అతి పెద్ద ఉదాహరణ. ఇకపై ఎన్నికల్లో కింగ్మేకర్లు అన్న పదమే వినిపించేలా లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. ► హిందీ హార్ట్‌ల్యాండ్‌గా పిలుచుకునే రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒకప్పుడు ముఖాముఖి పోరు నెలకొని ఉండేది. ఇప్పుడు ఎన్నికల తీరుతెన్నుల్ని చూస్తే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో కూడా రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోరు నెలకొని ఉంది. గుజరాత్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు పార్టీల మధ్య పోరు ఉంటే, ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో పార్టీల మధ్య బహుముఖ పోరాటం నెలకొంది. ► కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలే మారిపోయే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి ఢిల్లీ తీసుకుంటే 2014కి ముందు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు ఉండేది. కానీ కాలక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ పుంజుకోవడం, కాంగ్రెస్ బలహీనపడడం మొదలైంది. దీంతో దేశరాజధానిలో ఆప్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. మరోవైపు హరియాణాలో బీజేపీ బలం పుంజుకోవడంతో అక్కడ ముఖాముఖి పోరు కాస్త బహుముఖ పోరుగా మారింది. బీజేపీ, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్ఎల్డీ), జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)ల మధ్య ఎన్నికల్లో రసవత్తరంగా పోరు నడుస్తోంది. ► కొన్ని రాష్ట్రాల్లో పోలయిన ఓట్లను విశ్లేషిస్తే రెండు ప్రధాన పార్టీలకే ఓట్లు వేసే ధోరణి కనిపిస్తుంది. ఒకటి, రెండు స్థానాల్లో ఉండే పార్టీలే అత్యధిక ఓటు షేర్ని సొంతం చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మాయావతికి చెందిన బీఎస్పీ, కర్ణాటకలో జేడీ(ఎస్), బెంగాల్లో వామపక్ష పార్టీలకు ఓట్లు వేసినా ఉపయోగం లేదన్న భావన ఓటర్లలో వచ్చింది. అందుకే రెండు పార్టీల్లో ఏదో ఒకదానిపైనే మొగ్గు చూపించే రోజులొచ్చాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. 2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాల అసెంబ్లీలలో కమలనాథులు పట్టు బిగిస్తే, కాంగ్రెస్ పార్టీ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. ఒడిశా, త్రిపుర రాష్ట్రాలే దీనికి ఉదాహరణ. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేస్తూ ఇతర పార్టీల ఓటు బ్యాంకును కొల్లగొట్టడం వల్ల ఎన్నికల తీరు మారిపోయి రెండు పార్టీల మధ్య పోరు నెలకొంది. -
ఎన్నికల వ్యవస్థకు కాయకల్ప చికిత్స
ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియ అత్యంత కీలకమైనది. ఐదేళ్ళకు ఒక సారి చట్టసభలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉన్నంత మాత్రాన సరిపోదు. ఎన్నికలు నిష్పాక్షికంగా, ధర్మంగా, స్వేచ్ఛగా జరగాలి. స్వాతంత్య్ర పోరాటం నాటి విలువలు కొన్ని సార్వత్రిక ఎన్నికల వరకూ కొనసాగాయి. 1952లో ప్రథమ సార్వత్రిక ఎన్నికలు జరిగినప్పుడు పార్టీ సిద్ధాంతాలనూ, అభ్య ర్థుల అర్హతలనూ చూసి ప్రజలు ఓటు చేసేవారు. కాంగ్రెస్‌ను అధికారం చెడగొట్టింది. నైతిక, రాజకీయ విలువలకు పాతర వేసింది. ప్రజలకు ఆ పార్టీ పట్ల విశ్వాసం సన్నగిల్లుతూ వచ్చింది. 1967 నుంచి ప్రతిపక్షాలను గెలిపించడం ప్రారంభించారు. కాలక్రమంలో అనేక ప్రయోగాలు జరిగాయి. కూటమి ప్రభు త్వాలు ఏర్పడినాయి. నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వాల ప్రయో గాలు విఫలమైన తర్వాత బీజేపీ నాయకత్వంలో నేషనల్ డెమాక్రాటిక్ అల యెన్స్ (ఎన్డీఏ), కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్ (యూపీఏ) ప్రభుత్వాలు నిలకడగా పరిపాలించాయి. 2014లో బీజేపీకి లోక్ సభలో మెజారిటీ స్థానాలు దక్కినప్పటికీ మిత్రపక్షాలతో కలిసి ఎన్డీఏ ప్రభు త్వం ఏర్పాటు చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమి తమైన జాతీయ పార్టీ కాగా 1984లో లోక్‌సభలో రెండు స్థానాలు మాత్రమే గెలు చుకున్న బీజేపీ ఇప్పుడు ఇరవైకి పైగా రాష్ట్రాలలో అధికారం చెలాయిస్తున్నది. ప్రభుత్వాలను మార్చడానికి ఓటు హక్కును ఎట్లా వినియోగించుకోవాలో ప్రజలు తెలుసుకున్నారు. ప్రతిపక్షాలు సైతం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ వలెనే అవినీతికీ, అక్రమాలకూ, ఆశ్రితపక్షపాతానికీ ఒడిగడుతున్నాయి. రాజకీయ ప్రమాణాలు అడుగంటుతున్నాయి. ఎన్నికలు విపరీతమైన ఖర్చుతో కూడిన జూదంగా మారిపోయాయి. ఇది వరకు సంపన్నుల సరసన కనిపించడా నికి అగ్రనేతలు సంకోచించేవారు. క్రమంగా సంపన్నులూ, వ్యాపారులూ, పారి శ్రామికవేత్తలూ రాజకీయాలలోకి వచ్చారు. కార్పొరేట్ రంగానికీ, రాజకీయ పార్టీ లకూ అక్రమసంబంధం విడదీయలేనంతగా బలపడింది. ఇప్పుడు సంపన్నులకే రాజకీయాలలో పోటీ చేసి గెలిచే అవకాశం ఉంది. డబ్బు లేనిదే రాజకీయాలలో రాణించడం అసాధ్యం. టీఎన్ శేషన్ ఎన్నికల సంఘానికి అపారమైన ప్రతిష్ఠను సంపాదించి పెట్టారు కానీ ఎన్నికలలో డబ్బు పాత్రను తగ్గించలేక పోయారు. ఆయన పదవీ విరమణ తర్వాత ఈ జాడ్యం జడలు విచ్చుకొని స్వైరవిహారం చేస్తున్నది. ఎన్నికల ప్రధానాధికారులు ఎంతమంది మారినా వ్యవస్థ క్రమంగా క్షీణిస్తూ పోతున్నది. నియమావళి ఉల్లంఘన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినవారిపైన చర్య తీసుకునే అధికా రాలు తమకు ఉన్నాయో లేవో ఎన్నికల సంఘం సభ్యులకు సుప్రీంకోర్టు చెప్పే వరకూ స్పష్టంగా తెలియదు. నియమావళిని ఉల్లంఘించిన యోగి ఆదిత్యనాథ్, మాయావతి, మేనకాగాంధీ, ఆజంఖాన్లపైన రెండు, మూడు రోజులు ప్రచారం చేయకుండా ఆంక్షలు విధించారు. ఇటువంటి చర్య తీసుకోవడం ఇదే ప్రథమం. తొలి రెండు సార్వత్రిక ఎన్నికలలో ఎన్నికల నియమావళి అవసరం లేకపో యింది. రాజ్యాంగ నిర్మాతలే పాలకులుగా ఉన్న రోజులవి. ఎన్నికల సమ యంలో అధికార దుర్వినియోగం చేయకుండా వారిని నియంత్రించవలసిన అవ సరం లేకపోయింది. డబ్బు పెట్టి ఓట్లు కొనుగోలు చేసే జబ్బు అప్పటికి సోక లేదు. ప్రజాస్వామ్య వ్యవస్థకు గట్టి పునాదులు వేసినవారు మొదటి తరం నాయకులు. ఆ తర్వాత తరం నాయకులకు నిగ్రహం లేదు. అధికార దుర్విని యోగానికి ఒడిగట్టడం ప్రారంభించారు. కనుక నియమావళిని ప్రవేశపెట్టవలసి వచ్చింది. మొదటి సారిగా 1960లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు దాన్ని అమలు చేశారు. అధికారంలో ఉన్నవారూ, ప్రతిపక్షానికి చెందినవారూ ఎన్నికల ప్రచార సమయంలో ఎటువంటి మార్గదర్శకాలు పాటించాలో ఎన్నికల సంఘం నిర్దేశించింది. సమావేశాలు ఎట్లా నిర్వహించుకోవాలి, ప్రసంగాలు ఎట్లా ఉండాలి, ఎటువంటి నినాదాలు ఇవ్వవచ్చు అనే అంశాలకే మార్గదర్శకాలు పరిమితమై ఉండేవి. 1962 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఎన్నికల సంఘం నియమావళిని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించి గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీలకూ అందజేయవలసిందిగా కోరింది. అధికారంలో ఉన్న పార్టీ ఎన్నికలలో విజయం సాధించేందుకు అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా ఎటువంటి నియమావళిని పాటించాలో 1979లో ఎన్నికల సంఘం నిర్దేశించింది. ఈ నియ మావళిని గట్టిగా అమలు చేయడం 1991లోనే ప్రారంభమైంది. దాన్ని ప్రజా ప్రాతినిధ్యచట్టం (రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ 1951) లో భాగం చేయా లంటూ 2013లో లా, జస్టిస్ వ్యవహారాల స్థాయీ సంఘం సిఫార్సు చేసింది. భారత శిక్షాస్మృతి (ఇండియన్ పీనల్‌కోడ్) ద్వారా ఎన్నికల ప్రవర్తనా నియమావ ళిని అమలు చేయవచ్చునంటూ ఈ సంఘం సూచించింది. ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన తర్వాత 45 రోజులలో ఎన్నికల కార్యక్రమం పూర్తి చేయాలనీ, ఆ సమయంలో కోడ్ అమలు చేయవచ్చుననీ నిర్ణయించారు. అంటే, నియమావళి క్రమంగా రూపుదిద్దుకొని ఈ స్థాయికి వచ్చింది. ఎన్నికల కమిషన్ చర్యల పట్ల హర్షం ఇటీవల తనపైన ఎన్నికల సంఘం తీసుకున్న చర్యను సవాలు చేస్తూ మాయా వతి దాఖలు చేసిన రిట్పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసినప్పుడు సమాజంలో హర్షం వ్యక్తమైంది. ఒక్క మాయావతిపైనే కాదు, హద్దుమీరిన రాజకీయ నాయ కులందరిపైనా నిషేధం విధించాలనీ, శిక్షాత్మక చర్యలు తీసుకోవాలనీ ప్రజలు కోరుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఉగ్రవాదం గురించి ప్రస్తావిస్తూ పుల్వా మాపైన ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్ల త్యాగాలనూ, పాకిస్తాన్‌లోని బాలాకోట్‌లోని జైషే మొహమ్మద్‌కు చెందిన ఉగ్రవాద శిక్షణ శిబిరాలపైన బాంబుల వర్షం కురిపించిన వైమానికదళానికి చెందిన సాహసికుల శౌర్యాన్నీ బీజేపీ ఎన్నికల ప్రచారానికి వినియోగించడాన్ని ప్రశ్నించకపోవడంతో ఎన్నికల సంఘం పక్షపాత బుద్ధితో వ్యవహరిస్తున్నదనే అభిప్రాయం ప్రజలలో ప్రబలింది. ప్రధాని ప్రయాణం చేస్తున్న హెలికాప్టర్‌ను తనిఖీ చేసిన అధికారిని ఎన్ని కల సంఘం సస్పెండ్ చేయడంతో ఇది మరింత బలపడింది. 2014లో బీజేపీ ప్రధాని అభ్యర్థి హోదాలో ఎన్నికల ప్రచారం చేసిన మోదీ నియమావళిని రెండు సార్లు ఉల్లంఘించారు. రెండు విడతలా ఎన్నికల సంఘం ఆయనపైన ఎఫ్ఐఆర్ (ఫస్ట్ ఇన్పర్మేషన్ రిపోర్ట్–ప్రాథమిక సమాచార నివేదిక) దాఖలు చేశారు. భారత సైన్యాన్నీ, సైనిక చర్యలనూ ప్రచారాంశాలుగా వినియోగించుకోవడాన్ని ఖండిస్తూ పదవీ విరమణ చేసిన పలువురు సైన్యాధికారులు రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ పంపించారు. మాటలతో, చేతలతో హిందూ ఓటర్ల హృదయాలు గెలుచుకోవాలన్న మోదీ–అమిత్‌షా ప్రయత్నంలో భాగమే భోపాల్ నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అభ్యర్థి దిగ్విజయ్సింగ్పైన మాలేగాం ఉగ్రవాద ఘటనలో నిందితురాలు సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకుర్‌ను బీజేపీ అభ్యర్థిగా నిలబెట్టడం. ఇలా నిర్ణయించిన తర్వాత అంతర్జాతీయ వేదికలపైన పాకిస్తాన్ స్థావరంగా చేసుకొని కశ్మీర్లో అగ్గి రగిలిస్తున్న ఉగ్రవాద సంస్థలపైన భారత దౌత్యాధికారులు చేస్తున్న విమర్శలకు విలువ ఏముంటుంది? ఎట్లాగైనా సరే ఎన్నికలలో గెలుపొందడం ప్రధానమని అన్ని పార్టీలూ భావిస్తున్నట్టు కనిపి స్తున్నది. ప్రతిపక్షంలో ఐక్యత లేక, మోదీకి దీటైన నాయకుడు లేక బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ఈ ఎన్నికల అనంతరం కూడా అధికారంలో కొనసాగ వచ్చునేమో కానీ ఎన్నికలు జరుగుతున్న పద్ధతి మాత్రం ప్రజాస్వామ్య స్ఫూర్తికి తగినట్టుగా లేదు. తనపైనే ఎన్నికల నియమావళిని అమలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిర్యాదు చేస్తున్నారు. ప్రధాని మోదీ ఇంటెలిజెన్స్ అధికారులను కలుస్తుండగా తాను సమీక్షా సమావేశాలు పెడితే తప్పేమిటంటూ వాదిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్)కు లేని ఆంక్షలు చంద్రబాబుపైన ఎందుకంటూ నారా లోకేష్ ప్రశ్నిస్తున్నారు. అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష చేయవచ్చు. పోలవరంపైనా, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ కార్యకలాపాలపైనా సమీక్షించినందుకు ప్రతిపక్షం ఫిర్యాదు చేసిన కార ణంగా ఎన్నికల ప్రధానాధికారి ద్వివేదీ ప్రమేయంతో ప్రభుత్వ ప్రధానాధికారి ఎల్వీ సుబ్రహ్మణ్యం అధికారులకు నోటీసులు ఇచ్చారు. మంచినీటి సమస్యపైన కూడా చంద్రబాబు సమీక్షించారు. ఆ శాఖకు సంబంధించిన అధికారులకు నోటీ సులు ఇవ్వలేదు. మంచినీటి ఎద్దడి అత్యవసరమైన సమస్య. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో అధికారులను దుర్వినియోగం చేసిన తీరు నియమావళికి మరింత పదును పెట్టవలసిన అవసరాన్ని స్పష్టం చేస్తున్నది. ఎన్నికల షెడ్యూలు ప్రకటిం చడానికి కొద్ది రోజుల ముందే ముఖ్యమంత్రి తనకు ఇష్టులైన అధికారులను జిల్లా కలెక్టర్లుగా నియమించుకున్నారు. డీజేపీ, ఇంటెలిజెన్స్ చీఫ్ విధేయులే. అందరినీ ఎన్నికలలో టీడీపీ కోసం వినియోగించినట్టు ప్రతిపక్షం ఆరోపణలు చేసింది. ఈ దుర్వినియోగంతో పోల్చితే నలభై నాలుగు సంవత్సరాల కిందట చరిత్ర సృష్టిం చిన రాయ్‌బరేలీ కేసులో ఆరోపించిన అధికార దుర్వినియోగం చాలా స్వల్ప మైనది. చారిత్రక అలహాబాద్ కోర్టు తీర్పు ఇప్పుడు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం)పైన అనుమానాలు వ్యక్తం చేస్తు న్నట్టుగానే 1971లోనూ ప్రతిపక్షాలు బ్యాలట్పత్రాలపైన రసాయనిక ప్రక్రియ జరిపారని ఆరోపించాయి. నాటి సార్వత్రిక ఎన్నికలలో రాయ్‌బరేలీలో ప్రధాని ఇందిరాగాంధీపైన ప్రతిపక్ష అభ్యర్థిగా రాజనారాయణ్ పోటీ చేశారు. ఇందిరకు 1,83,309 ఓట్లు వస్తే రాజ్‌నారాయణ్‌కు 71,499 ఓట్లు వచ్చాయి. ఓట్లు లెక్కించకముందే రాజ్‌నారాయణ్ విజయోత్సవం నిర్వహించారు. తానే గెలు స్తానని అంత ధీమా. తీరా ఓట్లు లెక్కించి ఫలితం ప్రకటించే సరికి డీలా పడి పోయారు. కానీ బ్యాలెట్‌పత్రంపైన రసాయనిక ప్రయోగం చేశారని ఆయన గట్టిగా విశ్వసించారు. కొంతమంది ప్రతిపక్ష నాయకులు ఆయనను బలపరి చారు. బ్యాలెట్ పత్రాలను ముద్రించే సమయంలోనే దానిపైన కాంగ్రెస్‌పార్టీ గుర్తు ముద్రించారనీ, దాన్ని కప్పి ఉంచేందుకు రసాయనం ఉపయోగించారనీ, ఎన్నికలలో ఓటర్లు పెట్టిన గుర్తు కొద్ది సేపటికి అదృశ్యమై కాంగ్రెస్‌పార్టీ గుర్తు బయటికి వచ్చిందనీ, ఓట్ల లెక్కింపు సమయానికి రసాయన ప్రయోగం చేసిన అన్ని బ్యాలట్ పత్రాలపైనా కాంగ్రెస్ గుర్తు ఉన్నదనీ రాజ్‌నారాయణ్ అను మానం. అందుకే ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. శాంతిభూషణ్ ఆయన తరఫున వాదించారు. జూన్ 12, 1975నాడు అలహాబాద్ హైకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జగ్మోహన్లాల్ సిన్హా ఇందిర ఎన్నిక చెల్లనేరదంటూ చారిత్రక తీర్పు ప్రకటించారు. యశ్పాల్ కపూర్ అనే ఉద్యోగిని ఎన్నికల ఏజెంట్‌గా ఇందిరాగాంధీ నియమించారనేది న్యాయమూర్తి తప్పుపట్టిన చర్య. నిజానికి యశ్పాల్ ప్రభుత్వ ఉద్యోగం నుంచి వైదొలిగి ఇందిర ఎన్నికల ఏజెంట్‌గా ఉన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రత్యేకాధికారి (ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ–ఓఎస్డీ)గా మళ్ళీ ఉద్యోగంలో చేరారు. ఈ తీర్పు కారణంగా ఇందిరా గాంధీ పదవి నుంచి వైదొలిగి సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకుంటే బహుశా అలహాబాద్ హైకోర్టు తీర్పును కొట్టివేసేదేమో. కానీ ఆ పని చేయకుండా ఆత్యయిక పరిస్థితి ప్రకటించడంతో చరిత్ర మలుపు తిరిగింది. ఒక ఉద్యోగిని ఎన్నికల కార్యక్రమంలో వినియోగించుకున్నందుకు దేశ ప్రధాని ఎన్నిక చెల్లదని హైకోర్టు నిర్ణయించింది. ఆ రోజులతో పోల్చితే ఇప్పుడు అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో జరుగుతున్నదో అర్థం చేసుకోవచ్చు. అధికార దుర్వినియోగం, ధనబలం, కండబలం, కులం, మతం, ప్రాంతం, తదితర అపభ్రంశాలన్నీ ఆవహించి ఎన్నికల ప్రక్రియను భ్రష్టుపట్టించాయి. ప్రవర్తనా నియమావళిని అమలు చేయడం వంటి అరకొర సంస్కరణలతో పరి స్థితి బాగుపడదు. మొత్తం రాజకీయ వ్యవస్థకే కాయకల్ప చికిత్స జరగాలి. నియమావళిని కచ్చితంగా అమలు చేయడమే కాకుండా ఎన్నికల ప్రణాళికలలో రాజకీయ పార్టీలు ఇస్తున్న వాగ్దానాల అమలు సాధ్యాసాధ్యాలను పరిశీలించే బాధ్యత సైతం ఎన్నికల సంఘమే స్వీకరించాలి. ఇప్పుడున్న ధోరణే కొనసాగినట్లయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకు విశ్వాసం నశిస్తుంది. అరాజకం ప్రబలు తుంది. రాజకీయ నాయకులు మాత్రమే కాకుండా పౌరసమాజం యావత్తూ సమష్టిగా సమాలోచన జరిపి పరిష్కరించుకోవలసిన సమస్య ఇది. -కె. రామచంద్రమూర్తి -
ఓట్ల వేటలో స్లో‘గన్స్’
* ఓటర్లను ఆకట్టుకుని... బ్యాలెట్లు నింపి.. * నినాదాలే పార్టీలకు కొంగు బంగారం ఎన్నికల రణరంగంలో పార్టీల నడుమ మాటల తూటాలు పేలడం పరిపాటే. దాంతోపాటే పార్టీలన్నీ ఓటర్లపై హామీల జల్లు కూడా కురిపిస్తుంటాయి. ఆ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అవి నమ్ముకునేది నినాదాలనే. పార్టీల జయాపజయాలను ప్రభావితం చేయడంలోనూ నినాదాల పాత్రను తోసిపుచ్చలేం. - ఎలక్షన్ సెల్ ఎన్నికల మేనిఫెస్టోలో గుప్పించే పుంఖానుపుంఖాల వాగ్దానాల కంటే, సూటిగా సంధించే నినాదాలే ఓటర్లను బాగా ఆకట్టుకుంటాయి. ఓటర్లను ఏకతాటిపై నడిపిన నినాదాలూ భారత ఎన్నికల చరిత్రలో ఉన్నాయంటే వాటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కొన్ని నినాదాలైతే ఓటర్లకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వాటిలో కొన్ని వినోదదాయకాలైతే మరికొన్ని ఆలోచనాత్మకాలు. నినాదాల ప్రాధాన్యాన్ని మన పార్టీలు బాగానే వంటబట్టించుకున్నాయి. బాగా పేలినవే కాదు, మొత్తంగా బెడసికొట్టి ఆయా పార్టీల పుట్టి ముంచిన నినాదాలూ లేకపోలేదు. మన దేశ ఎన్నికల చరిత్రలో చోటుచేసుకున్న పలు నినాదాలను ఒక్కసారి చూస్తే... జై జవాన్.. జై కిసాన్... 1965లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రచారంలోకి తెచ్చిన ‘జై జవాన్ జై కిసాన్’ నినాదం జనాన్ని ఏకతాటిపై ముందుకు నడిపింది. 1967 సాధారణ ఎన్నికల నాటికి శాస్త్రి జీవించి లేకున్నా ఆ నినాదమే కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చింది. 1971లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ‘గరీబీ హఠావో’ (పేదరిక నిర్మూలన) నినాదం కూడా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్ల వర్షం కురిపించింది. కాంగ్రెస్ చెప్పేది ‘గరీబీ హఠావో’ అయినా నిజానికి చేసేది మాత్రం ‘గరీబోంకో హఠావో’ (పేదల నిర్మూలన) అంటూ ప్రత్యర్థి పార్టీలు చేసిన ప్రచారం కూడా జనాన్ని బాగానే ఆకట్టుకుంది. జేపీ నినాదం... ఇందిరా హటావో ఎమర్జెన్సీ తర్వాత 1977 లోక్‌సభ ఎన్నికల్లో సోషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్ తెరపైకి తెచ్చిన ‘ఇందిరా హటావో... దేశ్ బచావో’ (ఇందిరను గద్దె దించండి... దేశాన్ని కాపాడండి) ప్రభంజనమే సృష్టించింది. ఈ నినాదం దెబ్బకు తొలిసారిగా దేశంలో కాంగ్రెస్ అధికారానికి దూరమైంది. కేంద్రంలో జనతా ప్రభుత్వం కొలువుదీరింది. 1980 ఎన్నికల్లో ‘నా జాత్ పర్... నా పాత్ పర్... మొహర్ లగేగీ హాథ్ పర్’ (కులంపై కాదు, మతంపై కాదు... హస్తం గుర్తుపైనే ఓటు ముద్ర) నినాదంతో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. 1984లో ఇందిర హత్యతో వీచిన సానుభూతి పవనాలకు, ‘జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా... తబ్ తక్ ఇందిరా తేరా నామ్ రహేగా’ (ఇందిరా! నీ కీర్తి ఆచంద్రతారార్కం) నినాదం తోడవడంతో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. అబ్ కీ బారీ అటల్ బిహారీ’ 1996 ఎన్నికల్లో బీజేపీ కూడా నినాదాలతో దూసుకెళ్లింది. ‘బారీ బారీ సబ్కీ బారీ... అబ్కీ బారీ అటల్ బిహారీ’ (ఇప్పటిదాకా అందరూ వచ్చారు... ఇప్పుడిక అటల్ బిహారీ వంతు) నినాదంతో ఆ ఎన్నికల్లో తొలిసారిగా అధికారం దక్కించుకుంది. కానీ మెజారిటీ చాలక వాజ్‌పేయి 13 రోజుల్లోనే గద్దె దిగాల్సి వచ్చింది. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షల నేపథ్యం అనంతరం ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ ‘జై జవాన్... జై కిసాన్... జై విజ్ఞాన్’ నినాదం ఇచ్చింది. షైనింగ్... ఢమాల్ ‘ఇండియా షైనింగ్’ (భారత్ వెలిగిపోతోంది) నినాదంతో ఎన్డీయే సర్కారు 2004 ఎన్నికలకు వెళ్లింది. కానీ ఎలాంటి ప్రభావం చూపలేదు. ‘కాంగ్రెస్ కా హాత్... ఆమ్ ఆద్మీకే సాథ్’ (కాంగ్రెస్ హస్తం... సామాన్యుడికి తోడు) అన్న కాంగెరస్ నినాదం పని చేసింది. 2009 ఎన్నికల్లోనూ బీజేపీకి నినాదాలు కలిసిరాలేదు. అద్వానీని ప్రధాని అభ్యర్థిగా నిలిపి ‘మజ్బూత్ నేతా... నిర్ణాయక్ సర్కార్’ (సమర్థ నేత... నిర్ణాయక సర్కారు) నినాదంతో బీజేపీ హోరాహోరీ పోరాడినా లాభం లేకపోయింది. ‘ఏక్తా సే హీ దేశ్ కీ శక్తి... ఏక్తా సే హీ దేశ్ కీ ప్రగతి’ (సమైక్యతతోనే దేశానికి శక్తి, ప్రగతి) నినాదంతో యూపీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది. లాలూ ‘సమోసా’ సూపర్‌హిట్ జాతీయ పార్టీలకు దీటుగా ప్రాంతీయ పార్టీల నినాదాల్లోనూ కొన్ని జనాన్ని విపరీతంగా ఆకట్టుకునేవీ ఉన్నాయి. నినాదాలంటే ముందుగా గుర్తొచ్చేది ఆర్జేడీ అధినేత లాలుప్రసాదే. ‘జబ్ తక్ రహేగా సమోసా మే ఆలూ... తబ్ తక్ రహేగా బీహార్ మే లాలూ’(సమోసాలో బంగాళాదుంప ఉన్నంతకాలం బీహార్‌లో లాలూ పాలనే) అంటూ ఆయన ఇచ్చిన నినాదం సూపర్‌హిట్ అయింది. అయితే దాణా కేసులో ఆయన జైలుకు వెళ్లినప్పుడు ‘సమోసా మే ఆలూ... జైల్ మే లాలూ’ (సమోసాలో ఆలూ, జైల్లో లాలూ) అంటూ ప్రత్యర్థులు వెక్కిరించడానికి కూడా కారణమైంది! బీఎస్పీ రూటే వేరు దళిత జనోద్ధరణ లక్ష్యంతో బీఎస్పీని స్థాపించిన కాన్షీరామ్ అప్పట్లో అగ్రవర్ణాలపై విద్వేషాన్ని రేకెత్తించే రీతిలో ‘తిలక్ తరాజు ఔర్ తల్వార్... ఇన్కో మారో జూతే చార్’ (బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులకు చెప్పులతో నాలుగు తగిలించండి) అంటూ ప్రచారంలోకి తెచ్చిన నినాదం వివాదాస్పదంగా మారింది. అయితే, ‘ఓట్ హమారా... రాజ్ తుమ్హారా? నహీ చలేగా... నహీ చలేగా’ (ఓట్లు మావి, అధికారం మీదా? ఇకపై చెల్లదు) అన్న కాన్షీరాం నినాదం అట్టడుగు వర్గాల ఓటర్లలో ఆలోచన రేకెత్తించింది. మాయావతి మాత్రం ఉన్నత కులాల మద్దతూ కూడగట్టుకునే ఉద్దేశంతో తమ పార్టీ గుర్తయిన ఏనుగు పేరుతో, ‘పండిత్ శంఖ్ బజాయెగా, హాథీ బడ్తా జాయెగా’ (బ్రాహ్మణుడు శంఖమూదుతుంటే ఏనుగు సాగుతుంటుంది), ‘హాథీ నహీ, గణేశ్ హై... బ్రహ్మ విష్ణు మహేశ్ హై’ (ఏనుగు కాదది, గణేశుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు) అంటూ ఇచ్చిన నినాదం పని చేసింది. బీఎస్పీయే ప్రచారంలోకి తెచ్చిన ‘చలేగా హాథీ... ఉడేగా ధూల్... నా రహే పాంజా, నా రహే ఫూల్’ (ఏనుగు నడిస్తే దుమ్ము రేగుతుంది... ‘హస్తం’, ‘కమలం’ అందులో కొట్టుకుపోతాయి) నినాదం కూడా ఆకట్టుకుంది. తృణమూల్ అధినేత్రి మమత ‘మా... మాటి... మనుష్’ నినాదం 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం కట్టబెట్టింది లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్ ఇచ్చిన ‘ఊపర్ ఆస్మాన్... నీచే పాశ్వాన్’ (పైన ఆకాశం... నేలపై పాశ్వాన్) నినాదం కూడా బాగా ప్రచారం పొందింది. తమిళనాడు ఓట్ ఫర్..! ప్రఖ్యాత సినీనటుడు కమల్‌హాసన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. అవునా? ఏ పార్టీకి? అని అడక్కండి. ఆయన ప్రచారం చేస్తోంది ఏదో ఓ పార్టీ తరఫున కాదు.. తమిళనాడు ఎన్నికల సంఘం తరఫున. తమిళనాడు ఎలక్షన్ కమిషన్ రూపొందించిన ఒక ప్రచార వీడియోలో కమల్‌హాసన్ నటించారు. ‘డబ్బులు తీసుకుని ఓటేయవద్దు. మీ భవిష్యత్తును అమ్ముకోవద్దు. ఏవో కొద్ది మొత్తాల కోసం మీ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టవద్దు. ఏ పార్టీ లేదా ఏ నాయకుడు ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడని చూడకండి. ఏ నాయకుడి చేతిలో మీ భవిత భద్రంగా ఉంటుందో ఆలోచించుకుని అర్హత కలిగిన, సమర్థుడైన అభ్యర్థికే ఓటేయండి’ అంటూ ఆ వీడియోలో కమల్‌హాసన్ ఓటర్లను చైతన్యపరిచారు. జమ్మూ కాశ్మీర్ ‘పొగ’ లేని పోలింగ్ జమ్మూ కాశ్మీర్లో ఈసారి ఎన్నికలు ‘పొగ’ బెడద లేకుండా జరగనున్నాయి. పోలింగ్ బూత్‌లను ‘పొగరహిత ప్రాంతాలు’గా మంగళవారం ప్రకటించిన జమ్మూ కాశ్మీర్, ఈ విషయంలో దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డు సాధించింది. రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్ వద్ద ‘నో స్మోకింగ్ జోన్’ అనే హెచ్చరికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలంటూ జమ్మూ కాశ్మీర్ ప్రధాన ఎన్నికల అధికారి ఉమంగ్ నారులా అన్ని జిల్లాలకు సర్కులర్ జారీ చేశారు. పశ్చిమ బెంగాల్ ఫ్యామిలీ ప్యాక్ పశ్చిమబెంగాల్ బరిలో కొన్ని చోట్ల సమీప బంధువులే పరస్పర ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. రాయ్‌గంజ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ సిటింగ్ ఎంపీ, దీపా దాస్‌మున్షీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, ఆమె మరిది సత్యనారాయణ దాస్‌మున్షీ తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. దీపా దాస్‌మున్షీ భర్త, కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మాజీ మంత్రి ప్రియరంజన్ దాస్‌మున్షీ ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో కొన్నేళ్లుగా కోమాలో ఉన్నారు. జాల్పాయిగుడి జిల్లా అలీపూర్‌దువార్ అసెంబ్లీ స్థానం నుంచి తృణమూల్ అభ్యర్థిగా దశరథ్ తిర్కీ, లెఫ్ట్‌ఫ్రంట్ అభ్యర్థిగా ఆయన తోడల్లుడు మనోహర్ తిర్కీ పోటీ చేస్తున్నారు. ఇదివరకు లెఫ్ట్‌ఫ్రంట్ భాగస్వామ్య పార్టీ అయిన ఆర్ఎస్పీ తరఫున దశరథ్ తిర్కీ మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. కొద్దికాలం కిందట ఆయన తృణమూల్‌లో చేరారు. బెంగాలీ నటుడు దేవ్ తృణమూల్ అభ్యర్థిగా ఘటాల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుండగా, ఆయన బాబాయి శక్తిపద అధికారి పొరుగునే ఉన్న కేశ్పూర్ అసెంబ్లీ స్థానం నుంచి సీపీఎం టికెట్పౌ బరిలోకి దిగారు. కోల్‌కతాలోని రెండు వేర్వేరు నియోజకవర్గాల నుంచి బీజేపీ అభ్యర్థిగా తథాగత రాయ్, తృణమూల్ అభ్యర్థిగా ఆయన సోదరుడు సౌగత రాయ్ పోటీ చేస్తున్నారు. డమ్‌డమ్ స్థానం నుంచి సౌగత రాయ్ పోటీ చేస్తుండగా, దక్షిణ కోల్‌కతా నుంచి తథాగత రాయ్ పోటీ చేస్తున్నారు. మహారాష్ర్ట రాఖీ.. మిర్చి బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ పార్లమెంటుపై కన్నేశారు. బీజేపీ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని, టికెట్టు లభించకుంటే, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. వాయవ్య ముంబై లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గురుదాస్ కామత్‌పై రాఖీ పోటీ చేయాలనుకుంటున్నారు. అలాగే, ‘పచ్చి మిరపకాయ’ గుర్తుతో సొంత పార్టీ పెట్టే ఆలోచన కూడా ఆమెకు ఉన్నట్లు సమాచారం. తమిళనాడు సన్నాఫ్.. డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు అళగిరికి ఆ పార్టీ ప్రత్యర్థుల్లో డిమాండ్ పెరిగింది. తండ్రిపై కినుక వహించి, తొలుత సస్పెన్షన్‌కు, తాజాగా బహిష్కరణకు గురైన అళగిరిని దువ్వేందుకు పలు పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. అందరి కంటే ముందుగా ఎండీఎంకే అధినేత వైగో రంగంలోకి దిగి, అళగిరి నివాసానికి వెళ్లి మరీ మంతనాలు సాగించారు. కాంగ్రెస్, బీజేపీలు కూడా అళగిరిని తమవైపు తిప్పుకునే యత్నాల్లో పడ్డాయి. అళగిరిని ఈ నెలాఖరులోగా కలుసుకోనున్నట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి.ఎస్.చంద్రశేఖరన్ చెప్పారు. బీహార్ జూ.. షాట్ గన్ బీహార్‌లోని పాట్నా సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న బాలీవుడ్ ‘షాట్‌గన్’ శతృఘ్న సిన్హా తరఫున ఆయన తనయుడు, యువ నటుడు లవ్ సిన్హా ప్రచారపర్వంలోకి దూకనున్నారు. ఇప్పటికే ‘ట్విట్టర్’లో తండ్రి తరఫున ప్రచారం సాగిస్తున్న లవ్ సిన్హా, త్వరలోనే ప్రత్యక్ష ప్రచారంలోకి దిగనున్నారు. శతృఘ్న కుమార్తె, బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా ప్రచారానికి దూరంగానే ఉండనున్నారు. ఈ విషయాన్ని శతృఘ్న సిన్హానే స్వయంగా మీడియాకు చెప్పారు.