ఓట్ల వేటలో స్లో‘గన్స్’ | National political parties follow using of slogans for Votes | Sakshi
Sakshi News home page

ఓట్ల వేటలో స్లో‘గన్స్’

Published Wed, Mar 26 2014 1:34 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM

ఓట్ల వేటలో స్లో‘గన్స్’ - Sakshi

ఓట్ల వేటలో స్లో‘గన్స్’

* ఓటర్లను ఆకట్టుకుని... బ్యాలెట్లు నింపి..
* నినాదాలే పార్టీలకు కొంగు బంగారం

ఎన్నికల రణరంగంలో పార్టీల నడుమ మాటల తూటాలు పేలడం పరిపాటే. దాంతోపాటే పార్టీలన్నీ ఓటర్లపై హామీల జల్లు కూడా కురిపిస్తుంటాయి. ఆ క్రమంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు అవి నమ్ముకునేది నినాదాలనే. పార్టీల జయాపజయాలను ప్రభావితం చేయడంలోనూ నినాదాల పాత్రను తోసిపుచ్చలేం.    
 - ఎలక్షన్ సెల్
 
ఎన్నికల మేనిఫెస్టోలో గుప్పించే పుంఖానుపుంఖాల వాగ్దానాల కంటే, సూటిగా సంధించే నినాదాలే ఓటర్లను బాగా ఆకట్టుకుంటాయి. ఓటర్లను ఏకతాటిపై నడిపిన నినాదాలూ భారత ఎన్నికల చరిత్రలో ఉన్నాయంటే వాటి ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కొన్ని నినాదాలైతే ఓటర్లకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వాటిలో కొన్ని వినోదదాయకాలైతే మరికొన్ని ఆలోచనాత్మకాలు. నినాదాల ప్రాధాన్యాన్ని మన పార్టీలు బాగానే వంటబట్టించుకున్నాయి. బాగా పేలినవే కాదు, మొత్తంగా బెడసికొట్టి ఆయా పార్టీల పుట్టి ముంచిన నినాదాలూ లేకపోలేదు. మన దేశ ఎన్నికల చరిత్రలో చోటుచేసుకున్న పలు నినాదాలను ఒక్కసారి చూస్తే...
 
 జై జవాన్.. జై కిసాన్...
 1965లో నాటి ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ప్రచారంలోకి తెచ్చిన ‘జై జవాన్ జై కిసాన్’ నినాదం జనాన్ని ఏకతాటిపై ముందుకు నడిపింది. 1967 సాధారణ ఎన్నికల నాటికి శాస్త్రి జీవించి లేకున్నా ఆ నినాదమే కాంగ్రెస్‌ను తిరిగి అధికారంలోకి తెచ్చింది. 1971లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ‘గరీబీ హఠావో’ (పేదరిక నిర్మూలన) నినాదం కూడా ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓట్ల వర్షం కురిపించింది. కాంగ్రెస్ చెప్పేది ‘గరీబీ హఠావో’ అయినా నిజానికి చేసేది మాత్రం ‘గరీబోంకో హఠావో’ (పేదల నిర్మూలన) అంటూ ప్రత్యర్థి పార్టీలు చేసిన ప్రచారం కూడా జనాన్ని బాగానే ఆకట్టుకుంది.
 
 జేపీ నినాదం... ఇందిరా హటావో
 ఎమర్జెన్సీ తర్వాత 1977 లోక్‌సభ ఎన్నికల్లో సోషలిస్టు నేత జయప్రకాశ్ నారాయణ్ తెరపైకి తెచ్చిన ‘ఇందిరా హటావో... దేశ్ బచావో’ (ఇందిరను గద్దె దించండి... దేశాన్ని కాపాడండి) ప్రభంజనమే సృష్టించింది. ఈ నినాదం దెబ్బకు తొలిసారిగా దేశంలో కాంగ్రెస్ అధికారానికి దూరమైంది. కేంద్రంలో జనతా ప్రభుత్వం కొలువుదీరింది. 1980 ఎన్నికల్లో ‘నా జాత్ పర్... నా పాత్ పర్... మొహర్ లగేగీ హాథ్ పర్’ (కులంపై కాదు, మతంపై కాదు... హస్తం గుర్తుపైనే ఓటు ముద్ర) నినాదంతో కాంగ్రెస్ అధికారం దక్కించుకుంది. 1984లో ఇందిర హత్యతో వీచిన సానుభూతి పవనాలకు, ‘జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా... తబ్ తక్ ఇందిరా తేరా నామ్ రహేగా’ (ఇందిరా! నీ కీర్తి ఆచంద్రతారార్కం) నినాదం తోడవడంతో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది.
 
 అబ్ కీ బారీ అటల్ బిహారీ’
 1996 ఎన్నికల్లో బీజేపీ కూడా నినాదాలతో దూసుకెళ్లింది. ‘బారీ బారీ సబ్‌కీ బారీ... అబ్‌కీ బారీ అటల్ బిహారీ’ (ఇప్పటిదాకా అందరూ వచ్చారు... ఇప్పుడిక అటల్ బిహారీ వంతు) నినాదంతో ఆ ఎన్నికల్లో తొలిసారిగా అధికారం దక్కించుకుంది. కానీ మెజారిటీ చాలక వాజ్‌పేయి 13 రోజుల్లోనే గద్దె దిగాల్సి వచ్చింది. 1998లో పోఖ్రాన్ అణుపరీక్షల నేపథ్యం అనంతరం ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో బీజేపీ ‘జై జవాన్... జై కిసాన్... జై విజ్ఞాన్’ నినాదం ఇచ్చింది.
 
 షైనింగ్... ఢమాల్
 ‘ఇండియా షైనింగ్’ (భారత్ వెలిగిపోతోంది) నినాదంతో ఎన్డీయే సర్కారు 2004 ఎన్నికలకు వెళ్లింది. కానీ ఎలాంటి ప్రభావం చూపలేదు. ‘కాంగ్రెస్ కా హాత్... ఆమ్ ఆద్మీకే సాథ్’ (కాంగ్రెస్ హస్తం... సామాన్యుడికి తోడు) అన్న కాంగెరస్ నినాదం పని చేసింది. 2009 ఎన్నికల్లోనూ బీజేపీకి నినాదాలు కలిసిరాలేదు. అద్వానీని ప్రధాని అభ్యర్థిగా నిలిపి ‘మజ్‌బూత్ నేతా... నిర్ణాయక్ సర్కార్’ (సమర్థ నేత... నిర్ణాయక సర్కారు) నినాదంతో బీజేపీ హోరాహోరీ పోరాడినా లాభం లేకపోయింది. ‘ఏక్‌తా సే హీ దేశ్ కీ శక్తి... ఏక్‌తా సే హీ దేశ్ కీ ప్రగతి’ (సమైక్యతతోనే దేశానికి శక్తి, ప్రగతి) నినాదంతో యూపీఏ అధికారాన్ని నిలబెట్టుకుంది.
 
 లాలూ ‘సమోసా’ సూపర్‌హిట్
 జాతీయ పార్టీలకు దీటుగా ప్రాంతీయ పార్టీల నినాదాల్లోనూ కొన్ని జనాన్ని విపరీతంగా ఆకట్టుకునేవీ ఉన్నాయి. నినాదాలంటే ముందుగా గుర్తొచ్చేది ఆర్జేడీ అధినేత లాలుప్రసాదే. ‘జబ్ తక్ రహేగా సమోసా మే ఆలూ... తబ్ తక్ రహేగా బీహార్ మే లాలూ’(సమోసాలో బంగాళాదుంప ఉన్నంతకాలం బీహార్‌లో లాలూ పాలనే) అంటూ ఆయన ఇచ్చిన నినాదం సూపర్‌హిట్ అయింది. అయితే దాణా కేసులో ఆయన జైలుకు వెళ్లినప్పుడు ‘సమోసా మే ఆలూ... జైల్ మే లాలూ’ (సమోసాలో ఆలూ, జైల్లో లాలూ) అంటూ ప్రత్యర్థులు వెక్కిరించడానికి కూడా కారణమైంది!
 
 బీఎస్పీ రూటే వేరు
 దళిత జనోద్ధరణ లక్ష్యంతో బీఎస్పీని స్థాపించిన కాన్షీరామ్ అప్పట్లో అగ్రవర్ణాలపై విద్వేషాన్ని రేకెత్తించే రీతిలో ‘తిలక్ తరాజు ఔర్ తల్వార్... ఇన్‌కో మారో జూతే చార్’ (బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులకు చెప్పులతో నాలుగు తగిలించండి) అంటూ ప్రచారంలోకి తెచ్చిన నినాదం వివాదాస్పదంగా మారింది. అయితే, ‘ఓట్ హమారా... రాజ్ తుమ్హారా? నహీ చలేగా... నహీ చలేగా’ (ఓట్లు మావి, అధికారం మీదా? ఇకపై చెల్లదు) అన్న కాన్షీరాం నినాదం అట్టడుగు వర్గాల ఓటర్లలో ఆలోచన రేకెత్తించింది. మాయావతి మాత్రం ఉన్నత కులాల మద్దతూ కూడగట్టుకునే ఉద్దేశంతో తమ పార్టీ గుర్తయిన ఏనుగు పేరుతో, ‘పండిత్ శంఖ్ బజాయెగా, హాథీ బడ్‌తా జాయెగా’ (బ్రాహ్మణుడు శంఖమూదుతుంటే ఏనుగు సాగుతుంటుంది), ‘హాథీ నహీ, గణేశ్ హై... బ్రహ్మ విష్ణు మహేశ్ హై’ (ఏనుగు కాదది, గణేశుడు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు) అంటూ  ఇచ్చిన నినాదం పని చేసింది. బీఎస్పీయే ప్రచారంలోకి తెచ్చిన ‘చలేగా హాథీ... ఉడేగా ధూల్... నా రహే పాంజా, నా రహే ఫూల్’ (ఏనుగు నడిస్తే దుమ్ము రేగుతుంది... ‘హస్తం’, ‘కమలం’ అందులో కొట్టుకుపోతాయి) నినాదం కూడా ఆకట్టుకుంది. తృణమూల్ అధినేత్రి మమత ‘మా... మాటి... మనుష్’ నినాదం 2011 అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం కట్టబెట్టింది లోక్ జనశక్తి పార్టీ అధినేత రామ్‌విలాస్ పాశ్వాన్ ఇచ్చిన ‘ఊపర్ ఆస్మాన్... నీచే పాశ్వాన్’ (పైన ఆకాశం... నేలపై పాశ్వాన్) నినాదం కూడా బాగా ప్రచారం పొందింది.
 
 తమిళనాడు
 ఓట్ ఫర్..!
 ప్రఖ్యాత సినీనటుడు కమల్‌హాసన్ ఎన్నికల ప్రచారం చేస్తున్నాడు. అవునా? ఏ పార్టీకి? అని అడక్కండి. ఆయన ప్రచారం చేస్తోంది ఏదో ఓ పార్టీ తరఫున కాదు.. తమిళనాడు ఎన్నికల సంఘం తరఫున. తమిళనాడు ఎలక్షన్ కమిషన్ రూపొందించిన ఒక ప్రచార వీడియోలో కమల్‌హాసన్ నటించారు. ‘డబ్బులు తీసుకుని ఓటేయవద్దు. మీ భవిష్యత్తును అమ్ముకోవద్దు. ఏవో కొద్ది మొత్తాల కోసం మీ ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టవద్దు. ఏ పార్టీ లేదా ఏ నాయకుడు ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడని చూడకండి. ఏ నాయకుడి చేతిలో మీ భవిత భద్రంగా ఉంటుందో ఆలోచించుకుని అర్హత కలిగిన, సమర్థుడైన అభ్యర్థికే ఓటేయండి’ అంటూ ఆ వీడియోలో కమల్‌హాసన్ ఓటర్లను చైతన్యపరిచారు.
 
 జమ్మూ కాశ్మీర్
 ‘పొగ’ లేని పోలింగ్
 జమ్మూ కాశ్మీర్‌లో ఈసారి ఎన్నికలు ‘పొగ’ బెడద లేకుండా జరగనున్నాయి. పోలింగ్ బూత్‌లను ‘పొగరహిత ప్రాంతాలు’గా మంగళవారం ప్రకటించిన జమ్మూ కాశ్మీర్, ఈ విషయంలో దేశంలోనే తొలి రాష్ట్రంగా రికార్డు సాధించింది. రాష్ట్రంలోని ప్రతి పోలింగ్ బూత్ వద్ద ‘నో స్మోకింగ్ జోన్’ అనే హెచ్చరికను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలంటూ జమ్మూ కాశ్మీర్ ప్రధాన ఎన్నికల అధికారి ఉమంగ్ నారులా అన్ని జిల్లాలకు సర్కులర్ జారీ చేశారు.  
 
 పశ్చిమ బెంగాల్
 ఫ్యామిలీ ప్యాక్
 పశ్చిమబెంగాల్ బరిలో కొన్ని చోట్ల సమీప బంధువులే పరస్పర ప్రత్యర్థులుగా తలపడుతున్నారు. రాయ్‌గంజ్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ సిటింగ్ ఎంపీ, దీపా దాస్‌మున్షీ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా, ఆమె మరిది సత్యనారాయణ దాస్‌మున్షీ తృణమూల్ కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్నారు. దీపా దాస్‌మున్షీ భర్త, కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మాజీ మంత్రి ప్రియరంజన్ దాస్‌మున్షీ ఢిల్లీలోని ఒక ఆస్పత్రిలో కొన్నేళ్లుగా కోమాలో ఉన్నారు. జాల్పాయిగుడి జిల్లా అలీపూర్‌దువార్ అసెంబ్లీ స్థానం నుంచి తృణమూల్ అభ్యర్థిగా దశరథ్ తిర్కీ, లెఫ్ట్‌ఫ్రంట్ అభ్యర్థిగా ఆయన తోడల్లుడు మనోహర్ తిర్కీ పోటీ చేస్తున్నారు. ఇదివరకు లెఫ్ట్‌ఫ్రంట్ భాగస్వామ్య పార్టీ అయిన ఆర్‌ఎస్పీ తరఫున దశరథ్ తిర్కీ మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు.
 
 కొద్దికాలం కిందట ఆయన తృణమూల్‌లో చేరారు. బెంగాలీ నటుడు దేవ్ తృణమూల్ అభ్యర్థిగా ఘటాల్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తుండగా, ఆయన బాబాయి శక్తిపద అధికారి పొరుగునే ఉన్న కేశ్‌పూర్ అసెంబ్లీ స్థానం నుంచి సీపీఎం టికెట్‌పౌ బరిలోకి దిగారు. కోల్‌కతాలోని రెండు వేర్వేరు నియోజకవర్గాల నుంచి బీజేపీ అభ్యర్థిగా తథాగత రాయ్, తృణమూల్ అభ్యర్థిగా ఆయన సోదరుడు సౌగత రాయ్ పోటీ చేస్తున్నారు. డమ్‌డమ్ స్థానం నుంచి సౌగత రాయ్ పోటీ చేస్తుండగా, దక్షిణ కోల్‌కతా నుంచి తథాగత రాయ్ పోటీ చేస్తున్నారు.
 
 మహారాష్ర్ట
 రాఖీ.. మిర్చి
 బాలీవుడ్ ఐటెం గర్ల్ రాఖీ సావంత్ పార్లమెంటుపై కన్నేశారు. బీజేపీ టికెట్‌పై లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని, టికెట్టు లభించకుంటే, ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తానని ప్రకటించారు. వాయవ్య ముంబై లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి గురుదాస్ కామత్‌పై రాఖీ పోటీ చేయాలనుకుంటున్నారు. అలాగే, ‘పచ్చి మిరపకాయ’ గుర్తుతో సొంత పార్టీ పెట్టే ఆలోచన కూడా ఆమెకు ఉన్నట్లు సమాచారం.
 
 తమిళనాడు
 సన్నాఫ్..
 డీఎంకే అధినేత కరుణానిధి కుమారుడు అళగిరికి ఆ పార్టీ ప్రత్యర్థుల్లో డిమాండ్ పెరిగింది. తండ్రిపై కినుక వహించి, తొలుత సస్పెన్షన్‌కు, తాజాగా బహిష్కరణకు గురైన అళగిరిని దువ్వేందుకు పలు పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. అందరి కంటే ముందుగా ఎండీఎంకే అధినేత వైగో రంగంలోకి దిగి, అళగిరి నివాసానికి వెళ్లి మరీ మంతనాలు సాగించారు. కాంగ్రెస్, బీజేపీలు కూడా అళగిరిని తమవైపు తిప్పుకునే యత్నాల్లో పడ్డాయి. అళగిరిని ఈ నెలాఖరులోగా కలుసుకోనున్నట్లు తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి.ఎస్.చంద్రశేఖరన్ చెప్పారు.  
 
 బీహార్
 జూ.. షాట్ గన్
 బీహార్‌లోని పాట్నా సాహిబ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీచేస్తున్న బాలీవుడ్ ‘షాట్‌గన్’ శతృఘ్న సిన్హా తరఫున ఆయన తనయుడు, యువ నటుడు లవ్ సిన్హా ప్రచారపర్వంలోకి దూకనున్నారు. ఇప్పటికే ‘ట్విట్టర్’లో తండ్రి తరఫున ప్రచారం సాగిస్తున్న లవ్ సిన్హా, త్వరలోనే ప్రత్యక్ష ప్రచారంలోకి దిగనున్నారు. శతృఘ్న కుమార్తె, బాలీవుడ్ నటి సోనాక్షీ సిన్హా ప్రచారానికి దూరంగానే ఉండనున్నారు. ఈ విషయాన్ని శతృఘ్న సిన్హానే స్వయంగా మీడియాకు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement