ఎన్నికల్లో దుమ్మురేపిన నినాదాలు
గెలిపించినవి కొన్ని
పుట్టి ముంచినవి మరికొన్ని
సినిమాల్లో ‘పంచ్’ పడితే కలెక్షన్ల సునామీ! అదే పొలిటికల్ ‘పంచ్’ పేలితే? గెలుపు గ్యారంటీ! రాజకీయ పార్టీలు అదిరిపోయే నినాదాలతో జనాల్లోకి వెళ్తున్నాయి. సూటిగా, సుత్తి లేకుండా ఉండే ఈ స్లో‘గన్స్’ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. విపరీతంగా వైరలై ప్రజల మనసులతో పాటు ఓటు బ్యాంకులనూ కొల్లగొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో ‘రావాలి జగన్, కావాలి జగన్’ ఎలా ఊపేసిందో తెలిసిందే. భారత ఎన్నికల చరిత్ర తిరగేస్తే లాల్ బహదూర్ శాస్త్రి మొదలుకుని ఇందిరాగాందీ, వాజ్‌పేయి, మోదీ, కేజ్రీవాల్ దాకా ప్రతి ఒక్కరి జమానాలోనూ ఆయా పార్టీల విజయాలకు దన్నుగా నిలిచి, రాజకీయాలను మలుపు తిప్పిన నినాదాలెన్నో...
జై జవాన్, జై కిసాన్
లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన ఈ నినాదం ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. 1964లో నెహ్రూ మరణంతో ప్రధాని పదవి చేపట్టిన శాస్త్రికి యుద్ధం స్వాగతం పలికింది. 1965 భారత్–పాక్ వార్‌లో పోరాడుతున్న సైనికుల్లో జోష్ నింపేందుకు, మరోపక్క దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశంలో తిండిగింజల ఉత్ప త్తిని పెంచేలా రైతుల్లో స్థైర్యాన్ని పెంచేందుకు ఆయన ఈ నినాదమిచ్చారు. హరిత విప్లవానికి కూడా ఇది దన్నుగా నిలిచింది. తాషె్కంట్‌లో శాస్త్రి మరణానంతరం 1967లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిర సారథ్యంలో కాంగ్రెస్‌కు మళ్లీ విజయం సాధించిపెట్టిందీ ఇదే నినాదం!
గరీబీ హటావో
1971లో ప్రతిపక్షాలు, సొంత పార్టీ చీలిక వర్గం ఏకమై ఎన్నికల పోరుకు దిగినా కూడా ఒంటిచేత్తో కాంగ్రెస్(ఆర్)ను గెలిపించుకున్నారు ఇందిరా గాం«దీ. పేదరికాన్ని నిర్మూలిద్దామంటూ ఆ ఎన్నికల సందర్భంగా ఆమె ఇచ్చిన ఈ స్లోగన్ జనాల్లోకి బలంగా వెళ్లింది.
ఇందిర హటావో, దేశ్ బచావో
ఎమర్జెన్సీలో అష్టకష్టాలు పడ్డ ప్రతిపక్షాలన్నీ జనతా పార్టీ పేరిట ఏకమై ఇచ్చిన సమైక్య నినాదం. ఇందిరను తొలగించి దేశాన్ని కాపాడాలన్న పిలుపు ఓటర్లను ఆలోచింపజేసింది. దాంతో 1977 సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. ఇందిరతోపాటు ఆమె తనయుడు సంజీవ్ గాంధీ కూడా ఓటమి చవిచూశారు. దాంతో కాంగ్రెస్ మళ్లీ చీలింది. కాంగ్రెస్(ఐ) సారథిగా 1978 ఉప ఎన్నికలో కర్నాటకలోని చిక్‌మగుళూరు లోక్‌సభ స్థానం నుంచి ఇందిర ఘన విజయం సాధించారు. ఆ సందర్భంగా ‘ఏక్ షేర్నీ, సౌ లంగూర్; చిక్‌మగళూరు భాయ్ చిక్‌మగళూరు’ (ఇటు ఒక్క ఆడపులి, అటు వంద కోతులు) స్లోగన్ మారుమోగింది.
జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, ఇందిరా తేరా నామ్ రహేగా
1984లో ఇందిర హత్యానంతరం రాజీవ్ ప్రధాని అయ్యారు. వెంటనే లోక్‌సభను రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. కాంగ్రెస్(ఐ)కి దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తింది. ‘సూర్యచంద్రులు ఉన్నంతదాకా ఇందిర పేరు నిలిచి ఉంటుంది’ అంటూ ప్రజల్లోకి వెళ్లిన రాజీవ్ ఏకంగా 413 సీట్లతో క్లీన్ స్వీప్ చేసి మళ్లీ ప్రధాని అయ్యారు.
జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్
1996 సార్వత్రిక ఎన్నికల్లో ‘బారీ బారీ సబ్ కీ బారీ, అబ్ కీ బారీ అటల్ బిహారీ’ (అందరి వంతూ అయింది, ఈసారి అటల్ బిహారీ వంతు) అంటూ బీజేపీ పిలుపునిచ్చింది. దీనికి మచ్చలేని వాజ్‌పేయి ఇమేజ్ తోడై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి అధికారం దక్కింది. తొలిసారి 16 రోజుల్లో పడిపోయిన వాజ్‌పేయి ప్రభుత్వం రెండోసారి 13 నెలలకే పరిమితమైంది. దేశాన్ని వృద్ధి బాటన నడిపేందుకు వైజ్ఞానిక రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించాలంటూ 1998లో పిలుపునిచ్చిన ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్’ నినాదం 1999లో బీజేపీకి విజయాన్ని అందించింది. మూడోసారి ఎన్డీఏ సర్కారును విజయవంతంగా నడిపారు వాజ్‌పేయి.
కొంప ముంచిన ‘ఇండియా షైనింగ్’
దేశంలో సెల్ ఫోన్లను ప్రవేశపెట్టడం నుంచి ‘స్వర్ణ చతుర్భుజి’ హైవేల ప్రాజెక్టు తదితరాలతో ప్రగతికి పెద్దపీట వేసిన వాజ్‌పేయి సర్కారు 2004 ఎన్నికల్లో అతి విశ్వాసంతో బొక్క బోర్లా పడింది. ధరాభారం తదితరాలతో తాము సతమతమవుతుంటే ‘ఇండియా షైనింగ్ (భారత్ వెలిగిపోతోంది)’ నినాదంతో ఊరూవాడా ఊదరగొట్టడం జనానికి అస్సలు నచ్చలేదు. దాంతో బీజేపీ కొంప మునిగింది. వాజ్‌పేయి సర్కారు ఇంటిబాట పట్టింది.
కాంగ్రెస్ కా హాత్, ఆమ్ ఆద్మీ కే సాత్
దాదాపు ఎనిమిదేళ్ల పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌కు 2004లో పూర్వ వైభవం తీసుకొచ్చిన స్లోగన్. వాజ్‌పేయి సర్కారు పేదలను విస్మరించిందని, తాము సంక్షేమ పథకాలతో వారిని ఆదుకుంటామని చెప్పిన తీరు జనాలకు కనెక్టయింది. కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ సర్కారు గద్దెనెక్కింది. సోనియాగాంధీ విదేశీయత వివాదంతో మన్మోహన్ సింగ్
ప్రధానిగా పదేళ్లు కొనసాగారు.
అచ్చే బీతే 5 సాల్, లగే రహో కేజ్రీవాల్
నయా రాజకీయ సంచలనంగా దూసుకొచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను 2020లో ఢిల్లీ పీఠంపై మరోసారి బంపర్ మెజారిటీతో కూర్చోబెట్టిన స్లోగన్. ‘ఐదేళ్లు బాగా గడిచాయి. సాగిపో కేజ్రీవాల్’ అన్న ప్రచారం ఓటర్లను ఆకర్షించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 70 సీట్లకు ఏకంగా 67 దక్కించుకున్న కేజ్రీవాల్ 2020లోనూ 62 సీట్లతో ప్రత్యర్థులపై ‘చీపురు’ తిరగేశారు.
అబ్ కీ బార్ మోదీ సర్కార్
పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చున్న కమలనాథులకు 2014లో మళ్లీ అధికారం కట్టబెట్టిన స్లోగన్. నరేంద్ర మోదీని ప్రధాని అభ్యరి్థగా ప్రకటించి, ‘ఈసారి మోదీ ప్రభుత్వం’ నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. ఇది కార్యకర్తల్లో జోష్ నింపడమే గాక దేశవ్యాప్తంగా మార్మోగి బీజేపీని గెలిపించింది. తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ నినాదంతో ఇండో–అమెరికన్ ఓటర్లను ఆకట్టుకున్నారు.
అలాగే ‘అచ్చే దిన్ ఆయేంగే (మంచి రోజులొస్తాయ్)’, ‘చాయ్ పే చర్చ’, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ వంటి నినాదాలూ ఆ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ (మరోసారి మోదీ ప్రభుత్వం)’, ‘మోదీ హై తో ముమ్‌కిన్ హై (మోదీతో సాధ్యం)’ నినాదాలు వైరలయ్యాయి. ఈసారి కమలనాథులు ‘తీస్‌రీ బార్ మోదీ సర్కార్’ (మూడోసారీ మోదీ సర్కారు), ‘అబ్ కీ బార్ 400 పార్’ (ఈసారి 400 పై చిలుకు)’ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగారు.
ఎన్నికల్లో పేలిన మరికొన్ని నినాదాలు...
► జన్‌సంఘ్ కో వోట్ దో, బీడీ పీనా చోడ్ దో; బీడీ మే తంబాకు హై, కాంగ్రెస్‌వాలా డాకూ హై (1967లో భారతీయ జనసంఘ్ నినాదం)
► ప్రోగ్రెస్ త్రూ కాంగ్రెస్ (కాంగ్రెస్‌తోనే అభివృద్ధి. 1960ల్లో నినాదమిది. అయితే, ‘ప్రోగ్రెసా, కాంగ్రెసా’ అంటూ శివసేన ఇచ్చిన కౌంటర్ అప్పట్లో బాగా పేలింది)
► వోట్ ఫర్ కాఫ్ అండ్ కౌ; ఫర్‌గెట్ అదర్స్ నౌ (ఆవుదూడ గుర్తుకు ఓటేయండి, మిగతా పార్టీలను మర్చిపోండి అంటూ ఇందిరా కాంగ్రెస్ ఇచ్చిన నినాదం. కానీ ఆ గుర్తు ఇందిర, సంజయ్‌లకు ప్రతీక అంటూ వ్యంగ్యా్రస్తాలు పేలాయి)
► జబ్ తక్ రహేగా సమోసా మే ఆలూ, తబ్ తక్ రహేగా బిహార్ మే లాలూ (సమోసాలో ఆలూ ఉన్నంతకాలం బిహార్లో లాలూ ఉంటారు)
► జాత్ పర్ నా పాత్ పర్, మొహర్ లగేగీ హాత్ పర్ (కులమతాలకు అతీతంగా హస్తం గుర్తుకు ఓటేద్దామంటూ 1996 ఎన్నికల్లో పీవీ ఇచ్చిన నినాదం)
► సోనియా నహీ, యే ఆంధీ హై; దూస్రీ ఇందిరాగాంధీ హై (సోనియా కాదు, తుఫాను; మరో ఇందిర అంటూ 2009లో కాంగ్రెస్ ఇచ్చిన నినాదం)
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment