jai jawan jai kisan
-
Lok sabha elections 2024: స్లోగన్ పేలింది
సినిమాల్లో ‘పంచ్’ పడితే కలెక్షన్ల సునామీ! అదే పొలిటికల్ ‘పంచ్’ పేలితే? గెలుపు గ్యారంటీ! రాజకీయ పార్టీలు అదిరిపోయే నినాదాలతో జనాల్లోకి వెళ్తున్నాయి. సూటిగా, సుత్తి లేకుండా ఉండే ఈ స్లో‘గన్స్’ ప్రచారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తున్నాయి. విపరీతంగా వైరలై ప్రజల మనసులతో పాటు ఓటు బ్యాంకులనూ కొల్లగొడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో 2019 ఎన్నికల్లో ‘రావాలి జగన్, కావాలి జగన్’ ఎలా ఊపేసిందో తెలిసిందే. భారత ఎన్నికల చరిత్ర తిరగేస్తే లాల్ బహదూర్ శాస్త్రి మొదలుకుని ఇందిరాగాందీ, వాజ్‌పేయి, మోదీ, కేజ్రీవాల్ దాకా ప్రతి ఒక్కరి జమానాలోనూ ఆయా పార్టీల విజయాలకు దన్నుగా నిలిచి, రాజకీయాలను మలుపు తిప్పిన నినాదాలెన్నో... జై జవాన్, జై కిసాన్ లాల్ బహదూర్ శాస్త్రి ఇచ్చిన ఈ నినాదం ఇప్పటికీ మార్మోగుతూనే ఉంది. 1964లో నెహ్రూ మరణంతో ప్రధాని పదవి చేపట్టిన శాస్త్రికి యుద్ధం స్వాగతం పలికింది. 1965 భారత్–పాక్ వార్‌లో పోరాడుతున్న సైనికుల్లో జోష్ నింపేందుకు, మరోపక్క దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించి దేశంలో తిండిగింజల ఉత్ప త్తిని పెంచేలా రైతుల్లో స్థైర్యాన్ని పెంచేందుకు ఆయన ఈ నినాదమిచ్చారు. హరిత విప్లవానికి కూడా ఇది దన్నుగా నిలిచింది. తాషె్కంట్‌లో శాస్త్రి మరణానంతరం 1967లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఇందిర సారథ్యంలో కాంగ్రెస్‌కు మళ్లీ విజయం సాధించిపెట్టిందీ ఇదే నినాదం! గరీబీ హటావో 1971లో ప్రతిపక్షాలు, సొంత పార్టీ చీలిక వర్గం ఏకమై ఎన్నికల పోరుకు దిగినా కూడా ఒంటిచేత్తో కాంగ్రెస్(ఆర్)ను గెలిపించుకున్నారు ఇందిరా గాం«దీ. పేదరికాన్ని నిర్మూలిద్దామంటూ ఆ ఎన్నికల సందర్భంగా ఆమె ఇచ్చిన ఈ స్లోగన్ జనాల్లోకి బలంగా వెళ్లింది. ఇందిర హటావో, దేశ్ బచావో ఎమర్జెన్సీలో అష్టకష్టాలు పడ్డ ప్రతిపక్షాలన్నీ జనతా పార్టీ పేరిట ఏకమై ఇచ్చిన సమైక్య నినాదం. ఇందిరను తొలగించి దేశాన్ని కాపాడాలన్న పిలుపు ఓటర్లను ఆలోచింపజేసింది. దాంతో 1977 సార్వత్రిక ఎన్నికల్లో జనతా పార్టీ ఘనవిజయం సాధించింది. ఇందిరతోపాటు ఆమె తనయుడు సంజీవ్ గాంధీ కూడా ఓటమి చవిచూశారు. దాంతో కాంగ్రెస్ మళ్లీ చీలింది. కాంగ్రెస్(ఐ) సారథిగా 1978 ఉప ఎన్నికలో కర్నాటకలోని చిక్మగుళూరు లోక్‌సభ స్థానం నుంచి ఇందిర ఘన విజయం సాధించారు. ఆ సందర్భంగా ‘ఏక్ షేర్నీ, సౌ లంగూర్; చిక్‌మగళూరు భాయ్ చిక్‌మగళూరు’ (ఇటు ఒక్క ఆడపులి, అటు వంద కోతులు) స్లోగన్ మారుమోగింది. జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా, ఇందిరా తేరా నామ్ రహేగా 1984లో ఇందిర హత్యానంతరం రాజీవ్ ప్రధాని అయ్యారు. వెంటనే లోక్‌సభను రద్దు చేసి ముందస్తుకు వెళ్లారు. కాంగ్రెస్(ఐ)కి దేశవ్యాప్తంగా మద్దతు వెల్లువెత్తింది. ‘సూర్యచంద్రులు ఉన్నంతదాకా ఇందిర పేరు నిలిచి ఉంటుంది’ అంటూ ప్రజల్లోకి వెళ్లిన రాజీవ్ ఏకంగా 413 సీట్లతో క్లీన్ స్వీప్ చేసి మళ్లీ ప్రధాని అయ్యారు. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్ 1996 సార్వత్రిక ఎన్నికల్లో ‘బారీ బారీ సబ్ కీ బారీ, అబ్ కీ బారీ అటల్ బిహారీ’ (అందరి వంతూ అయింది, ఈసారి అటల్ బిహారీ వంతు) అంటూ బీజేపీ పిలుపునిచ్చింది. దీనికి మచ్చలేని వాజ్‌పేయి ఇమేజ్ తోడై బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమికి అధికారం దక్కింది. తొలిసారి 16 రోజుల్లో పడిపోయిన వాజ్‌పేయి ప్రభుత్వం రెండోసారి 13 నెలలకే పరిమితమైంది. దేశాన్ని వృద్ధి బాటన నడిపేందుకు వైజ్ఞానిక రంగంలో స్వయం ప్రతిపత్తి సాధించాలంటూ 1998లో పిలుపునిచ్చిన ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్’ నినాదం 1999లో బీజేపీకి విజయాన్ని అందించింది. మూడోసారి ఎన్డీఏ సర్కారును విజయవంతంగా నడిపారు వాజ్‌పేయి. కొంప ముంచిన ‘ఇండియా షైనింగ్’ దేశంలో సెల్ ఫోన్లను ప్రవేశపెట్టడం నుంచి ‘స్వర్ణ చతుర్భుజి’ హైవేల ప్రాజెక్టు తదితరాలతో ప్రగతికి పెద్దపీట వేసిన వాజ్‌పేయి సర్కారు 2004 ఎన్నికల్లో అతి విశ్వాసంతో బొక్క బోర్లా పడింది. ధరాభారం తదితరాలతో తాము సతమతమవుతుంటే ‘ఇండియా షైనింగ్ (భారత్ వెలిగిపోతోంది)’ నినాదంతో ఊరూవాడా ఊదరగొట్టడం జనానికి అస్సలు నచ్చలేదు. దాంతో బీజేపీ కొంప మునిగింది. వాజ్‌పేయి సర్కారు ఇంటిబాట పట్టింది. కాంగ్రెస్ కా హాత్, ఆమ్ ఆద్మీ కే సాత్ దాదాపు ఎనిమిదేళ్ల పాటు అధికారానికి దూరమైన కాంగ్రెస్‌కు 2004లో పూర్వ వైభవం తీసుకొచ్చిన స్లోగన్. వాజ్‌పేయి సర్కారు పేదలను విస్మరించిందని, తాము సంక్షేమ పథకాలతో వారిని ఆదుకుంటామని చెప్పిన తీరు జనాలకు కనెక్టయింది. కాంగ్రెస్ సారథ్యంలో యూపీఏ సర్కారు గద్దెనెక్కింది. సోనియాగాంధీ విదేశీయత వివాదంతో మన్మోహన్ సింగ్ ప్రధానిగా పదేళ్లు కొనసాగారు. అచ్చే బీతే 5 సాల్, లగే రహో కేజ్రీవాల్ నయా రాజకీయ సంచలనంగా దూసుకొచ్చిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను 2020లో ఢిల్లీ పీఠంపై మరోసారి బంపర్ మెజారిటీతో కూర్చోబెట్టిన స్లోగన్. ‘ఐదేళ్లు బాగా గడిచాయి. సాగిపో కేజ్రీవాల్’ అన్న ప్రచారం ఓటర్లను ఆకర్షించింది. 2015 అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 70 సీట్లకు ఏకంగా 67 దక్కించుకున్న కేజ్రీవాల్ 2020లోనూ 62 సీట్లతో ప్రత్యర్థులపై ‘చీపురు’ తిరగేశారు. అబ్ కీ బార్ మోదీ సర్కార్ పదేళ్లపాటు ప్రతిపక్షంలో కూర్చున్న కమలనాథులకు 2014లో మళ్లీ అధికారం కట్టబెట్టిన స్లోగన్. నరేంద్ర మోదీని ప్రధాని అభ్యరి్థగా ప్రకటించి, ‘ఈసారి మోదీ ప్రభుత్వం’ నినాదంతో బీజేపీ ఎన్నికల బరిలోకి దిగింది. ఇది కార్యకర్తల్లో జోష్ నింపడమే గాక దేశవ్యాప్తంగా మార్మోగి బీజేపీని గెలిపించింది. తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ కూడా ‘అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్’ నినాదంతో ఇండో–అమెరికన్ ఓటర్లను ఆకట్టుకున్నారు. అలాగే ‘అచ్చే దిన్ ఆయేంగే (మంచి రోజులొస్తాయ్)’, ‘చాయ్ పే చర్చ’, సబ్ కా సాత్ సబ్ కా వికాస్ వంటి నినాదాలూ ఆ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకున్నాయి. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్ (మరోసారి మోదీ ప్రభుత్వం)’, ‘మోదీ హై తో ముమ్కిన్ హై (మోదీతో సాధ్యం)’ నినాదాలు వైరలయ్యాయి. ఈసారి కమలనాథులు ‘తీస్రీ బార్ మోదీ సర్కార్’ (మూడోసారీ మోదీ సర్కారు), ‘అబ్ కీ బార్ 400 పార్’ (ఈసారి 400 పై చిలుకు)’ నినాదంతో ఎన్నికల బరిలోకి దిగారు. ఎన్నికల్లో పేలిన మరికొన్ని నినాదాలు... ► జన్‌సంఘ్ కో వోట్ దో, బీడీ పీనా చోడ్ దో; బీడీ మే తంబాకు హై, కాంగ్రెస్‌వాలా డాకూ హై (1967లో భారతీయ జనసంఘ్ నినాదం) ► ప్రోగ్రెస్ త్రూ కాంగ్రెస్ (కాంగ్రెస్‌తోనే అభివృద్ధి. 1960ల్లో నినాదమిది. అయితే, ‘ప్రోగ్రెసా, కాంగ్రెసా’ అంటూ శివసేన ఇచ్చిన కౌంటర్ అప్పట్లో బాగా పేలింది) ► వోట్ ఫర్ కాఫ్ అండ్ కౌ; ఫర్గెట్ అదర్స్ నౌ (ఆవుదూడ గుర్తుకు ఓటేయండి, మిగతా పార్టీలను మర్చిపోండి అంటూ ఇందిరా కాంగ్రెస్ ఇచ్చిన నినాదం. కానీ ఆ గుర్తు ఇందిర, సంజయ్‌లకు ప్రతీక అంటూ వ్యంగ్యా్రస్తాలు పేలాయి) ► జబ్ తక్ రహేగా సమోసా మే ఆలూ, తబ్ తక్ రహేగా బిహార్ మే లాలూ (సమోసాలో ఆలూ ఉన్నంతకాలం బిహార్‌లో లాలూ ఉంటారు) ► జాత్ పర్ నా పాత్ పర్, మొహర్ లగేగీ హాత్ పర్ (కులమతాలకు అతీతంగా హస్తం గుర్తుకు ఓటేద్దామంటూ 1996 ఎన్నికల్లో పీవీ ఇచ్చిన నినాదం) ► సోనియా నహీ, యే ఆంధీ హై; దూస్రీ ఇందిరాగాంధీ హై (సోనియా కాదు, తుఫాను; మరో ఇందిర అంటూ 2009లో కాంగ్రెస్ ఇచ్చిన నినాదం) – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘జై జవాన్, జై కిసాన్’ నినాదం ఎలా వచ్చింది?
దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రైతులు ‘జై జవాన్, జై కిసాన్’అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇంతకీ ఈ నినాదాన్ని ఎవరు తొలుత లేవనెత్తారు? ఏ సందర్భంలో ఇది జరిగింది? ‘జై జవాన్, జై కిసాన్’ నినాదాన్ని 1965లో భారత మాజీ ప్రధాని, దివంగత లాల్ బహదూర్ శాస్త్రి వినిపించారు. శాస్త్రి చేసిన నాటి ఈ నినాదం ఎంతో స్ఫూర్తిదాయకంగానూ, ప్రభావవంతంగానూ నిలిచింది. భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ 1964, మే 27న కన్నుమూశారు. దీంతో నెహ్రూ వారసులెవరనే ప్రశ్న నాడు కాంగ్రెస్ మదిలో మెదిలింది. ఆ సమయంలో మొరార్జీ దేశాయ్ ప్రధాని అభ్యర్థి రేసులో ముందంజలో ఉన్నారు. అయితే దేశాయ్ ప్రధానిగా ఉండేందుకు పార్టీలోని పలువురు నేతలు అంగీకరించలేదు. చరిత్రకారుడు రామచంద్ర గుహ ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’ (2007)లో ఇలా రాశారు. ‘ప్రధాని అభ్యర్థిగా దేశాయ్‌ని ఎంపిక చేయడం సరికాదని కొద్దిరోజుల్లోనే పార్టీలో స్పష్టమైంది. అతని శైలి దూకుడుగా ఉంది. దేశాయ్ స్థానంలో లాల్ బహదూర్ శాస్త్రిని కాంగ్రెస్ తన ప్రధాని అభ్యర్థిగా ఎంపికచేసింది. శాస్త్రి మంచి నిర్వాహకుడు. హిందీ బెల్ట్ నుండి వచ్చారు. ప్రజలకు మరింత చేరువైన వ్యక్తి’ అని రాశారు. నెహ్రూ మరణానంతరం దేశానికి పలు సవాళ్లు ఎదురయ్యాయి. అదే సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన శాస్త్రి భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో భారత్‌పై తిరుగుబాటుకు పాకిస్తాన్ ప్లాన్ చేసి, బరితెగించింది. సరిహద్దుల్లోని వంతెనలను పేల్చివేసింది. ప్రభుత్వ భవనాలపై బాంబులు వేసింది. అయితే భారత సైన్యం ఎదురుదాడికి పాక్ వెన్నుచూపింది. ఈ పరిణామం భారత్-పాకిస్తాన్ మధ్య యుద్ధానికి (1965) దారితీసింది. శాస్త్రి నాయకత్వంలో భారత సైన్యం తన శక్తియుక్తులను ప్రదర్శించింది. 1965, సెప్టెంబరు 23న ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇండో-పాక్ యుద్ధ సమయంలో శాస్త్రి 1965లో యూపీలోని అలహాబాద్ జిల్లాలోని ఉరువా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ‘జై జవాన్, జై కిసాన్’ నినాదాన్ని వినిపించారు. వీరిద్దరూ దేశ శ్రేయస్సు, భద్రతకు మూల స్తంభాలని శాస్త్రి భావించారు. ఆయన తన హయాంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్‌ను మరింత పెంచారు. హరిత విప్లవానికి శాస్త్రి పునాది వేశారు. -
జై జవాన్, జై కిసాన్.. జై అనుసంధాన్
జలంధర్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/గురుదాస్‌పూర్: దేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశోధన–అభివృద్ధి రంగంలో ఏ దేశపు శక్తిసామర్థ్యాలైనా అక్కడి జాతీయ పరిశోధనాశాలలు, ఐఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాల వంటి సంస్థలపై ఆధారపడి ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు అనుకూలమైన వాతావరణాన్ని, వసతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. చికున్ గున్యా, డెంగీ, మెదడువాపు వ్యాధులతో పాటు పౌష్టికాహారలోపంపై టెక్నాలజీ ఆధారిత, చవ ౖMðన పరిష్కారాన్ని భారత శాస్త్రవేత్తలు కనుగొనాల్సిన సమయం ఆసన్నమయిందని అభిప్రాయపడ్డారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ(ఎల్పీయూ)లో ప్రారంభమైన ‘106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్’ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివంగత ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి ‘జై జవాన్ జై కిసాన్’ అని నినాదం ఇచ్చారనీ, దానికి మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి జై విజ్ఞాన్‌ను జోడించారనీ.. తాజాగా తాను దీనికి జై అనుసంధాన్ అనే పదాన్ని జోడిస్తున్నట్లు పేర్కొన్నారు. నాలుగేళ్లలోనే ఎక్కువ స్టార్టప్‌లు.. ప్రస్తుతం దేశంలోని విద్యార్థుల్లో 95 శాతం మంది రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చేరుతున్నారని ప్రధాని తెలిపారు. ‘‘ఈ విద్యా సంస్థలో పరిశోధనల్ని ప్రోత్సహించేందుకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖతో చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రధానమంత్రి శాస్త్ర, సాంకేతిక మండలిని కోరుతున్నా. దీనివల్ల వేర్వేరు మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం పెరగడంతో పాటు విధానపరమైన ఉమ్మడి నిర్ణయాలను అమలు చేయడం వీలవుతుంది. ఇది ఇన్నొవేషన్, స్టార్టప్‌లకు ఎంతో అవసరం. గత 40 ఏళ్ల కంటే కేవలం గత నాలుగేళ్లలోనే టెక్నాలజీ రంగంలో ఎక్కువ స్టార్టప్‌లను స్థాపించాం. నేటి నినాదం ఏంటంటే ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్’ ఈ నినాదానికి జై అనుసంధాన్ అనే పదాన్ని నేను జోడించాను’’ అని వెల్లడించారు. దేశంలోని జాతీయ సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయనీ, రాష్ట్ర స్థాయి వర్సిటీలు, కళాశాలల్లో వీటిని పెంపొందించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. మళ్లీ ఆ అవకాశం వచ్చింది.. ‘భారత్‌లో ప్రాచీన జ్ఞానం అంతా పరిశోధన ద్వారా లభించిందే. గణితం, సైన్స్, కళలు, సంస్కృతి విషయంలో భారత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. అదే స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఇండియాకు మరోసారి లభించింది. ఇందుకోసం దేశంలో కీలకమైన వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలు ఏకమై మన పరిశోధనలు, ఆవిష్కరణల ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది. బిగ్ డేటా అనాలసిస్, కృత్రిమ మేధ, బ్లాక్ చైన్ టెక్నాలజీని వ్యవసాయ రంగంలో ముఖ్యంగా చిన్న కమతాలు ఉన్న రైతులకు సాయంచేసేందుకు వినియోగించాలి. ప్రజల జీవితాలను మరింత సుఖమయం చేసేలా శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగాలి’ అని మోదీ పేర్కొన్నారు. భవిష్యత్ అంతా కనెక్టెట్ టెక్నాలజీలదే అని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశంలోని పరిశోధన–అభివృద్ధి రంగం వాణిజ్యపరంగా ముందుకు వెళ్లాలనీ, అప్పుడే సరికొత్త పారిశ్రామిక ఉత్పత్తులతో భారత్‌కు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు. దేశీయ సాంకేతికత అభివృద్ధి అవసరం: సతీశ్ భారత రక్షణ రంగానికి సంబంధించి భవిష్యత్ అవసరాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు డీఆర్డీవో చైర్మన్ డా.జి.సతీశ్ రెడ్డి తెలిపారు. తర్వాతితరం రక్షణ వ్యవస్థలకు సంబంధించి పదార్థాలు, స్మార్ట్ వస్త్రాలు, తయారీ రంగం, త్రీడీ ప్రింటింగ్‌పై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఈ కొత్త సాంకేతికతలను దేశీయంగా, చవకగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్ భద్రత రంగంలో ఇజ్రాయెల్ అగ్రగామిగా నిలవడానికి అక్కడి యువతే కారణమన్నారు. వారికి సీఎం పదవులిస్తోంది పంజాబ్‌లో రుణమాఫీపై పెద్దపెద్ద మాట లు చెప్పిన కాంగ్రెస్ అధికారం దక్కాక మాత్రం రైతులను మోసగించిందని ప్రధాని మోదీ విమర్శించారు. గతంలో పేదరికాన్ని తరిమేద్దాం(గరీబీ హఠావో) పేరుతో ప్రజలను ఏళ్ల పాటు మోసం చేసిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేస్తున్నారన్నా రు. అంతేకాకుండా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో పాల్గొన్నవారికి పార్టీ ముఖ్యమంత్రి పదవులను కూడా అప్పగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుదాస్‌పూర్‌లో గురువారం జరిగిన సభలో మాట్లాడుతూ.. ‘కేవలం ఒకే కుటుంబం ఆదేశాలతో అల్లర్లలో పాలుపంచుకున్న వ్యక్తుల కేసు ఫైళ్లను మరుగున పడేశారు. కానీ వీటిని వెలికితీసిన ఎన్డీయే ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. దాని ఫలితాలు ఇప్పుడు మీముందు ఉన్నాయి’ అని తెలిపారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ నుంచి పాక్‌లోని కర్తార్‌పూర్ వరకూ కర్తార్‌పూర్ కారిడార్ నిర్మించాలని కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. కర్ణాటకలో రైతులు రుణాలు చెల్లించకపోవడంతో పోలీసులు అరెస్ట్‌చేయడానికి వస్తున్నారనీ, దీంతో రైతులు ఇళ్ల నుంచి పారిపోతున్నారన్నారు. -
‘నాన్న ఆశయాలే నడిపిస్తున్నాయి’
అరసవల్లి: దేశంలో నిత్యపూజలందుకుంటున్న ఏకైక సూర్యదేవాలయంగా శ్రీకాకుళంలోని అరసవల్లి ప్రఖ్యాతి గాంచిందని, ఇక్కడ వాతావరణం అద్భుతమని దివంగత మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి తనయుడు సునీల్ శాస్త్రి అన్నారు. భార్య మీనాతో కలిసి అరసవల్లి సూర్యదేవాలయాన్ని తొలిసారిగా శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ..‘జై జవాన్ జై కిసాన్’ నినాదంతో దేశానికి స్ఫూర్తినిచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి అనుసరించిన సిద్ధాంతాలే తనను నడిపిస్తున్నాయని చెప్పారు. పెద్ద నోట్ల రద్దు ధైర్యమైన చర్య అని, దేశాభివృద్ధికి ఇది తోడ్పడుతుందని అభిప్రాయపడ్డారు. వారికి సంప్రదాయం ప్రకారం ఆలయ అధికారులు, అర్చకులు గౌరవ స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. -
మర్ జవాన్...మర్ కిశాన్
నాందేడ్, న్యూస్‌లైన్: పత్తి ఎగుమతులపై కేంద్రం నిషేధం విధించడం విదర్భ రైతుకు శపంగా పరిణమించిందని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆరోపించారు. యూపీఏ సర్కార్ తీసుకున్న విధాన నిర్ణయాల వల్ల లాల్ బహుదూర్ శాస్త్రి నినాదమైన జై జవాన్ జై కిసాన్ కాస్తా మర్ జవాన్, మర్ కిశాన్గా మారిందని అకోలాలో ఆదివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో మోడీ మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో వారి నినాదం ఇదేనని చమత్కరించా రు. విదర్భ కన్నా గుజరాత్లో అనేక మంది రైతులు ఉన్నారని, అయితే ఇక్కడి వారి మాదిరిగా అక్కడ ఆత్మహత్యలు చేసుకోవడం లేదన్నారు. ఉత్పాదక నాణ్య త పెరిగేలా కేంద్రం ఏమీ చర్య లు తీసుకోవడం లేదని, అందుకే విదర్భలో రైతుల ఆత్మహత్యలు పెరిగాయని చెప్పారు. అకోలాలో వ్యవసాయ విశ్వ విద్యాలయమున్నా స్థానిక రైతులకు ఉపయోగపడం లేదన్నారు. రైతులను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్, కాంగ్రెస్ వంచి స్తోందని మండిపడ్డారు. మాజీ సీఎం అశోక్ చవాన్‌కు టికెటివ్వడమేంటి? ‘ఆదర్శ్ సొసైటీ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ అభ్యర్థిత్వంపై నేను ప్రశ్నిం చినప్పుడు, సమగ్ర దర్యాప్తు చేసి ఆయనపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఢిల్లీలో విలేకరుల సమావేశంలో హామీ ఇచ్చారు. చర్యలు తీసుకోవడమంటే ఎన్నికల్లో పోటీచేసేందుకు టికెట్ ఇవ్వడమా..? అ’ని మోడీ ఎద్దేవా చేశారు. నాందేడ్ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ, శివసేన, ఆర్పీఐ (ఆఠవలే వర్గం) మహా కూటమి అభ్యర్థి డీబీ పాటిల్‌కు మద్దతుగా ఆదివారం నిర్వహించిన ప్రచారసభకు మోడీ హాజరయ్యారు. నాందేడ్‌లోని శ్రీ గురుగోవింద్ సింగ్ స్టేడియంలో ఏర్పాటుచేసిన ప్రచార సభకు సుమారు లక్షన్నరకుపైగా జనం వచ్చారు. ఈ సందర్భంగా భారీ జనానుద్ధేశించి మోడీ మాట్లాడుతూ... దేశంలో కాంగ్రెస్‌కు నూక లు చెల్లాయని, మే 16వ తేదీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆఖరు రోజ న్నారు. కార్గిల్ యుద్ధంలో తమ భర్తలను పొగొట్టుకున్న వితంతువులకు తీరని అన్యాయం చేశారని దుయ్యబట్టారు. మన సంస్కృతిలో సోదరికి ఇవ్వడమే తప్ప వారి నుంచి పుచ్చుకునే సంప్రదా యం లేదని, అయితే ఓ సోదరుడు సోదరి ఇంటి టికెట్నే కాజేశారని చవాన్ ఉద్ధేశించి పరోక్షంగా విమర్శించారు. శ్రీగురుగోవింద్ సింగ్ పుట్టిన ఈ నాందే డ్ గడ్డమీద ఒట్టేసి చెబుతున్న కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాగానే, అవినీతి కుంభకోణంలో చిక్కుకున్న వారిని చట్టపరంగా శిక్షించి తీరుతామని, వారి ని వదిలే ప్రసక్తి లేదన్నారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరలతో పేదలు బేజారైపోయారని, ఎక్క డ చూసిన కాంగ్రెస్ నాయకుల అవినీతి భాగోతాలే వెలుగులోకి వస్తున్నాయన్నారు. అవినీతిలో కూరుకుపోయిన కాం గ్రెస్‌కు గుణపాఠం చెప్పాలంటే అధికారంలోంచి గద్దె దింపడమే ప్రత్యామ్నా య మార్గమని ప్రజలకు మోడీ పిలుపునిచ్చారు. అనంతరం బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే మాట్లాడుతూ...అశోక్ చవాన్ పరాజయం తథ్యమని జోస్యం చెప్పారు. అకాల వర్షాల వల్ల తీవ్రం గా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో దాదాపు 40 లోక్‌సభ స్థానాల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఆర్పీఐ అధ్యక్షుడు రాందాస్ అథవలే, బీజేపీ ప్రదేశ్ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవీస్, అభ్యర్థి డి.బి.పాటిల్ తదితరు లు మాట్లాడుతూ కాంగ్రెస్ గుణపాఠం చెప్పి, మహా కూటమికి అధికారం అప్పగించాలని అన్నారు. పాటిల్‌ను గెలిపించేందుకు నడుం బిగించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సభలో మహాకూటమి నాయకులు, ఎమ్మెల్యేలు, పదాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ ఎన్నికలు శివసేనకు సవాల్: ఉద్ధవ్‌ఠాక్రే ముంబై: తన తండ్రి బాల్‌ఠాక్రే మరణం తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఈ ఎన్నికలు తమ పార్టీకి సవాల్ అని శివసేన పార్టీ అధ్యక్షుడు ఉద్ధవ్‌ఠాక్రే స్పష్టం చేశారు. ఇప్పటికీ బాల్‌ఠాక్రే సమక్షంలోనే పార్టీ నడుస్తుందన్న భావన కలుగుతోందని ఆదివా రం సామ్నా సంపాదకీయంలో పేర్కొన్నారు. కొంత మంది నాయకులే పార్టీ వీడుతున్నారే తప్ప క్యాడర్ అంతా తమతోనే ఉందన్నారు. టికెట్లు నిరాకరించడంతో కొంత మంది బయటకు వెళుతున్నారని చచెప్పారు. అక్రమాస్తుల కేసులో శివసేన పార్టీ నాయకుడు బాబన్‌రావ్ గోలప్కు శిక్ష పడటంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 14 ఏళ్ల తర్వాత కూడా, అది కూడా ఎన్నికల సమయంలో తీర్పు రావడం ఏంటోనని అన్నారు. కాగా, దేశవ్యాప్తంగా బీజేపీ నేతృత్వం లోని నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీఏ) అనుకూల పవనాలు వీస్తున్నాయన్నారు. త్వరలోనే ఇది కాషాయ తుఫానుగా మారుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌కు బలమైన నాయకత్వం లోపించిం దని, బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేం ద్ర మోడీని ప్రత్యమ్నాయంగా ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు. అటల్ బీహారి వాజ్‌పేయి మినహా మిగతా ఏ నాయకుల గురించి బీజేపీ ప్రచారంలో పేర్కొనడం లేదని, అదే కాంగ్రెస్ నెహ్రూ, ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ పేర్లు వాడుకుంటున్నా రాహుల్ గాంధీ, అదే సమయంలో ప్రియాంక వాద్రాను ప్రజల ముందు కు తేవడంలో విఫలమైం దన్నారు. ప్రతిపక్ష పార్టీలన్నీ నరేంద్ర మోడీకి సంపూర్ణ మద్దతును ప్రకటించాయని తెలిపారు.