జై జవాన్, జై కిసాన్‌.. జై అనుసంధాన్‌ | Narendra Modi adds Jai Anusandhan to Jai jawan, Jai kisan and Jai Vigyan | Sakshi
Sakshi News home page

జై జవాన్, జై కిసాన్‌.. జై అనుసంధాన్‌

Published Fri, Jan 4 2019 3:54 AM | Last Updated on Fri, Jan 4 2019 3:54 AM

Narendra Modi adds Jai Anusandhan to Jai jawan, Jai kisan and Jai Vigyan - Sakshi

ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌ వేడుకల్లో మోదీ

జలంధర్‌ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/గురుదాస్‌పూర్‌: దేశంలోని కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలను ప్రోత్సహించేందుకు ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పరిశోధన–అభివృద్ధి రంగంలో ఏ దేశపు శక్తిసామర్థ్యాలైనా అక్కడి జాతీయ పరిశోధనాశాలలు, ఐఐటీ, కేంద్రీయ విశ్వవిద్యాలయాల వంటి సంస్థలపై ఆధారపడి ఉంటాయని వ్యాఖ్యానించారు. ఈ కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనకు అనుకూలమైన వాతావరణాన్ని, వసతులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు.

చికున్‌ గున్యా, డెంగీ, మెదడువాపు వ్యాధులతో పాటు పౌష్టికాహారలోపంపై టెక్నాలజీ ఆధారిత, చవ ౖMðన పరిష్కారాన్ని భారత శాస్త్రవేత్తలు కనుగొనాల్సిన సమయం ఆసన్నమయిందని అభిప్రాయపడ్డారు. పంజాబ్‌లోని జలంధర్‌లో ఉన్న లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ(ఎల్పీయూ)లో ప్రారంభమైన ‘106వ ఇండియన్‌ సైన్స్‌ కాంగ్రెస్‌’ వేడుకలకు మోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. దివంగత ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ‘జై జవాన్‌ జై కిసాన్‌’ అని నినాదం ఇచ్చారనీ, దానికి మాజీ ప్రధాని దివంగత వాజ్‌పేయి జై విజ్ఞాన్‌ను జోడించారనీ.. తాజాగా తాను దీనికి జై అనుసంధాన్‌ అనే పదాన్ని జోడిస్తున్నట్లు పేర్కొన్నారు.

నాలుగేళ్లలోనే ఎక్కువ స్టార్టప్‌లు..
ప్రస్తుతం దేశంలోని విద్యార్థుల్లో 95 శాతం మంది రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చేరుతున్నారని ప్రధాని తెలిపారు. ‘‘ఈ విద్యా సంస్థలో పరిశోధనల్ని ప్రోత్సహించేందుకు కేంద్ర మానవవనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖతో చర్చించి కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని ప్రధానమంత్రి శాస్త్ర, సాంకేతిక మండలిని కోరుతున్నా. దీనివల్ల వేర్వేరు మంత్రిత్వశాఖల మధ్య సమన్వయం పెరగడంతో పాటు విధానపరమైన ఉమ్మడి నిర్ణయాలను అమలు చేయడం వీలవుతుంది. ఇది ఇన్నొవేషన్, స్టార్టప్‌లకు ఎంతో అవసరం.

గత 40 ఏళ్ల కంటే కేవలం గత నాలుగేళ్లలోనే టెక్నాలజీ రంగంలో ఎక్కువ స్టార్టప్‌లను స్థాపించాం. నేటి నినాదం ఏంటంటే ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్‌’ ఈ నినాదానికి జై అనుసంధాన్‌ అనే పదాన్ని నేను జోడించాను’’ అని వెల్లడించారు. దేశంలోని జాతీయ సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు ఎక్కువగా జరుగుతున్నాయనీ, రాష్ట్ర స్థాయి వర్సిటీలు, కళాశాలల్లో వీటిని పెంపొందించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు.

మళ్లీ ఆ అవకాశం వచ్చింది..
‘భారత్‌లో ప్రాచీన జ్ఞానం అంతా పరిశోధన ద్వారా లభించిందే. గణితం, సైన్స్, కళలు, సంస్కృతి విషయంలో భారత్‌ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది. అదే స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఇండియాకు మరోసారి లభించింది. ఇందుకోసం దేశంలో కీలకమైన వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగాలు ఏకమై మన పరిశోధనలు, ఆవిష్కరణల ద్వారా ప్రపంచానికి దిశానిర్దేశం చేయాల్సి ఉంటుంది. బిగ్‌ డేటా అనాలసిస్, కృత్రిమ మేధ, బ్లాక్‌ చైన్‌ టెక్నాలజీని వ్యవసాయ రంగంలో ముఖ్యంగా చిన్న కమతాలు ఉన్న రైతులకు సాయంచేసేందుకు వినియోగించాలి. ప్రజల జీవితాలను మరింత సుఖమయం చేసేలా శాస్త్రవేత్తల పరిశోధనలు కొనసాగాలి’ అని మోదీ పేర్కొన్నారు. భవిష్యత్‌ అంతా కనెక్టెట్‌ టెక్నాలజీలదే అని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశంలోని పరిశోధన–అభివృద్ధి రంగం వాణిజ్యపరంగా ముందుకు వెళ్లాలనీ, అప్పుడే సరికొత్త పారిశ్రామిక ఉత్పత్తులతో భారత్‌కు లబ్ధి చేకూరుతుందని అభిప్రాయపడ్డారు.

దేశీయ సాంకేతికత అభివృద్ధి అవసరం: సతీశ్‌
భారత రక్షణ రంగానికి సంబంధించి భవిష్యత్‌ అవసరాలను అందిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు డీఆర్‌డీవో చైర్మన్‌ డా.జి.సతీశ్‌ రెడ్డి తెలిపారు. తర్వాతితరం రక్షణ వ్యవస్థలకు సంబంధించి పదార్థాలు, స్మార్ట్‌ వస్త్రాలు, తయారీ రంగం, త్రీడీ ప్రింటింగ్‌పై దృష్టి సారించినట్లు వెల్లడించారు. ఈ కొత్త సాంకేతికతలను దేశీయంగా, చవకగా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందన్నారు. సైబర్‌ భద్రత రంగంలో ఇజ్రాయెల్‌ అగ్రగామిగా నిలవడానికి అక్కడి యువతే కారణమన్నారు.

వారికి సీఎం పదవులిస్తోంది
పంజాబ్‌లో రుణమాఫీపై పెద్దపెద్ద మాట లు చెప్పిన కాంగ్రెస్‌ అధికారం దక్కాక మాత్రం రైతులను మోసగించిందని ప్రధాని మోదీ విమర్శించారు. గతంలో పేదరికాన్ని తరిమేద్దాం(గరీబీ హఠావో) పేరుతో ప్రజలను ఏళ్ల పాటు మోసం చేసిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు రైతులను రుణమాఫీ పేరుతో మోసం చేస్తున్నారన్నా రు. అంతేకాకుండా 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లలో పాల్గొన్నవారికి పార్టీ ముఖ్యమంత్రి పదవులను కూడా అప్పగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గురుదాస్‌పూర్‌లో గురువారం జరిగిన సభలో మాట్లాడుతూ.. ‘కేవలం ఒకే కుటుంబం ఆదేశాలతో అల్లర్లలో పాలుపంచుకున్న వ్యక్తుల కేసు ఫైళ్లను మరుగున పడేశారు.

కానీ వీటిని వెలికితీసిన ఎన్డీయే ప్రభుత్వం విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేసింది. దాని ఫలితాలు ఇప్పుడు మీముందు ఉన్నాయి’ అని తెలిపారు. పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌ నుంచి పాక్‌లోని కర్తార్‌పూర్‌ వరకూ కర్తార్‌పూర్‌ కారిడార్‌ నిర్మించాలని కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందన్నారు. కర్ణాటకలో రైతులు రుణాలు చెల్లించకపోవడంతో పోలీసులు అరెస్ట్‌చేయడానికి వస్తున్నారనీ, దీంతో రైతులు ఇళ్ల నుంచి పారిపోతున్నారన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement