‘జై జవాన్‌, జై కిసాన్‌’ నినాదం ఎలా వచ్చింది? | Jai Jawan Jai Kisan Said by Former PM Lal Bahadur Shastri | Sakshi
Sakshi News home page

Jai Jawan Jai Kisan: ‘జై జవాన్‌, జై కిసాన్‌’ నినాదం ఎలా వచ్చింది?

Published Tue, Mar 19 2024 2:14 PM | Last Updated on Tue, Mar 19 2024 2:14 PM

Jai Jawan Jai Kisan Said by Former PM Lal Bahadur Shastri - Sakshi

దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల నిరసనలు కొనసాగుతున్నాయి. రైతులు ‘జై జవాన్, జై కిసాన్’అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఇంతకీ ఈ నినాదాన్ని ఎవరు తొలుత లేవనెత్తారు? ఏ సందర్భంలో ఇది జరిగింది?

‘జై జవాన్, జై కిసాన్’ నినాదాన్ని 1965లో భారత మాజీ ప్రధాని, దివంగత లాల్ బహదూర్ శాస్త్రి వినిపించారు. శాస్త్రి చేసిన నాటి ఈ నినాదం  ఎంతో స్ఫూర్తిదాయకంగానూ, ప్రభావవంతంగానూ నిలిచింది. భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ 1964, మే 27న కన్నుమూశారు. దీంతో నెహ్రూ వారసులెవరనే ప్రశ్న నాడు కాంగ్రెస్ మదిలో మెదిలింది. ఆ సమయంలో మొరార్జీ దేశాయ్ ప్రధాని అభ్యర్థి రేసులో ముందంజలో ఉన్నారు. అయితే దేశాయ్ ప్రధానిగా ఉండేందుకు పార్టీలోని పలువురు నేతలు అంగీకరించలేదు.

చరిత్రకారుడు రామచంద్ర గుహ ‘ఇండియా ఆఫ్టర్ గాంధీ’ (2007)లో ఇలా రాశారు. ‘ప్రధాని అభ్యర్థిగా దేశాయ్‌ని  ఎంపిక చేయడం సరికాదని కొద్దిరోజుల్లోనే పార్టీలో స్పష్టమైంది. అతని శైలి  దూకుడుగా ఉంది. దేశాయ్ స్థానంలో లాల్ బహదూర్ శాస్త్రిని కాంగ్రెస్ తన ప్రధాని అభ్యర్థిగా ఎంపికచేసింది. శాస్త్రి మంచి నిర్వాహకుడు. హిందీ బెల్ట్ నుండి వచ్చారు. ప్రజలకు మరింత చేరువైన వ్యక్తి’ అని రాశారు. నెహ్రూ మరణానంతరం దేశానికి పలు సవాళ్లు ఎదురయ్యాయి. అదే సమయంలో ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన శాస్త్రి భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు ప్రయత్నించారు.  

అదే సమయంలో భారత్‌పై తిరుగుబాటుకు పాకిస్తాన్‌ ప్లాన్‌ చేసి, బరితెగించింది. సరిహద్దుల్లోని వంతెనలను పేల్చివేసింది. ప్రభుత్వ  భవనాలపై బాంబులు వేసింది. అయితే భారత సైన్యం ఎదురుదాడికి పాక్‌ వెన్నుచూపింది. ఈ పరిణామం  భారత్‌-పాకిస్తాన్ మధ్య యుద్ధానికి (1965) దారితీసింది. శాస్త్రి నాయకత్వంలో భారత సైన్యం తన శక్తియుక్తులను ప్రదర్శించింది. 

1965, సెప్టెంబరు 23న ఇరుపక్షాలు కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఇండో-పాక్ యుద్ధ సమయంలో శాస్త్రి 1965లో యూపీలోని అలహాబాద్ జిల్లాలోని ఉరువా గ్రామంలో జరిగిన బహిరంగ సభలో ‘జై జవాన్, జై కిసాన్’ నినాదాన్ని వినిపించారు. వీరిద్దరూ దేశ శ్రేయస్సు, భద్రతకు మూల స్తంభాలని శాస్త్రి భావించారు. ఆయన తన హయాంలో వ్యవసాయ రంగానికి బడ్జెట్‌ను మరింత పెంచారు. హరిత విప్లవానికి శాస్త్రి పునాది వేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement