అమరావతి: వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు పటిష్టంగా చేసుకోవాలని ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ ఆదేశించారు. ఎన్నికల ఫలితాల ప్రకటన విషయంలో ఏమాత్రం జాప్యం చేయకుండా భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరితగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు.
ఐదు దశల్లో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల సీఈవోలు, ఆయా నియెజకవర్గాల ఆర్వోలు, జిల్లాల ఎన్నికల అధికారులతో ఎలక్షన్ కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సందు తో కలసి సోమవారం ఆయన వీడియో కాన్పరెన్సు నిర్వహించి ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. దశల వారీగా దేశవ్యాప్తంగా జరుగుచున్న సార్వత్రిక ఎన్నికలను అందరి సమిష్టి కృషితో ఎంతో విజయవంతంగా జరుగుచున్నదని అభినందించారు. అదే స్పూర్తితో వచ్చే నెల 4 వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేయాలన్నారు. ఓట్ల లెక్కింపు రోజు ఈవీఎంలను భద్రపర్చిన స్ట్రాంగ్ రూమ్ల వద్ద క్రౌడ్ మేనేజ్మంట్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, నిర్ణీత పాస్ లేకుండా ఎవరినీ అనుమతించవద్దన్నారు.
నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పవర్ బ్యాక్అప్, ఫైర్ సేప్టీ పరికరాలను సిద్దంగా ఉంచుకోవాలని, అత్యవసర ఆరోగ్య సేవలు అందజేసేందుకు అంబులెన్సులను కూడా సిద్దంగా ఉంచుకోవాలన్నారు.
ఈవీఎంలలో పోల్ అయిన ఓట్ల లెక్కింపుకు సంబందించి ఎన్నికల అధికారులు, సిబ్బందికి ముందస్తుగానే సరైన శిక్షణ నివ్వాలన్నారు. సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు, ప్రింటర్లు, స్కానర్ వంటి ఐ.టి. పరికాలను ముందస్తుగా ఓట్ల లెక్కింపు కేంద్రాల సిద్దంగా ఉంచుకోవాలన్నారు. కౌంటింగ్ రోజు లెక్కించే ఈవీఎంలను ఎడాపెడా పడేయకుండా ఒక క్రమ పద్దతిలో తీసుకురావడం, ఓట్ల లెక్కింపు పూర్తి అయిన తదుపరి “లెక్కింపు పూర్తి అయినట్లుగా” ఆయా ఈవీఎంలపై మార్కుచేస్తూ వెంటనే వాటిని సీల్ చేసి ఒక క్రమపద్దతిలో సురక్షితంగా భద్రపర్చాలన్నారు.
అనవసరంగా ఈవీఎం లను అటూ ఇటూ మువ్ చేయవద్దని సూచించారు. ఎలక్ట్రానిక్ ట్రాన్సుఫర్ పోస్టల్ బ్యాలెట్ మేనేజ్మెంట్ సిస్ట్మ్‌ను (ETPBMS) చక్కగా నిర్వహించాలని, వాటి లెక్కింపుకు సంబందించి ప్రత్యేకంగా టేబుళ్లను, స్కానర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రకటించే విషయంలో ఏమాత్రము ఆలస్యం చేయవద్దని, డిప్లే బోర్డుల ద్వారా ఎప్పటికప్పుడు ఖచ్చితమైన ఎన్నికల ఫలితాలను ప్రకటించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా, అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు, ఎమ్ ఎన్ హరేంధిర ప్రసాద్ ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అదే విధంగా ఐదు దశలో ఎన్నికలు జరిగిన ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిస్సా మరియు సిక్కిం అసెంబ్లీలతోపాటు 543 పార్లమెంటరీ నియోజకవర్గాలకు చెందిన ఆర్వోలు / డీఈవో, ఆయా రాష్ట్రాల చీఫ్ ఎలెక్టోరల్ అధికారులు వారి ప్రాంతాల నుండి ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment