సీఎం జగన్‌ గెలుస్తారనే నమ్మకం ఉంది: కేటీఆర్‌ | KTR Key Comments On AP Assembly Lok Sabha Election YS Jagan Winning | Sakshi
Sakshi News home page

సీఎం జగన్‌ గెలుస్తారనే నమ్మకం ఉంది: కేటీఆర్‌

Published Mon, May 13 2024 1:10 PM | Last Updated on Mon, May 13 2024 3:03 PM

KTR Key Comments On AP Assembly Lok Sabha Election YS Jagan Winning

సాక్షి, హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఆయన సతీమణితో కలిసి హైదరాబాద్‌లోని నందినగర్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలపై కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో తనకు అనేకమంది మిత్రులు ఉన్నారని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన సోదరుడిలాంటివాడని, ఈ ఎన్నికల్లో ఆయన మంచి ఫలితాలు సాధిస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు.

కాగా ఆంధ్రప్రదేశ్‌లో  వైఎస్‌  జగన్ రెండో సారి అధికారంలో వస్తారంటూ  తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్‌ గతంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. ‘వైఎస్‌ జగన్‌ ఏపీలో రెండోసారి సీఎం అవుతారనే సమాచారం నాకు ఉంది. షర్మిల వంటి వ్యక్తులతో ఏదీ సాధ్యం కాదు. ఒకవేళ ఎవరైనా షర్మిల వంటి వారిని అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టాలని చూసినా అవి ఫలించవు’ అని ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్‌ పేర్కొన్నారు.

2019 ఎన్నికల కంటే ఎక్కువ స్థానాలు గెలుస్తాం..
తెలంగాణ లోక్‌సభ ఎన్నికలపై స్పందిస్తూ.. గతంలో ఇంతకంటే అనేక సవాళ్లతో కూడిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధించిందని గుర్తుచేశారు. 2019 ఎన్నికల్లో సాధించిన సీట్ల కన్నా ఎక్కువ గెలుస్తామనే నమ్మకం ఉందన్నారు. ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిపార్టీ తామే గెలుస్తామంటుంది కానీ ప్రజలు నిర్ణయిస్తారని చెప్పారు.

పోలింగ్ స్టేషన్‌ల దగ్గర కరెంటు కోతలు లేకుండా జనరేటర్లు పెట్టి ముగ్గురు ముగ్గురు అధికారులతో తెలంగాణ ప్రభుత్వం కష్టపడుతుందని సెటైర్లు వేశారు. ఆరు గ్యారంటీల్లో  తెలంగాణ ప్రభుత్వం ఒక గ్యారెంటీని సగం సగం అమలు చేసిందని విమర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తాను ముఖ్యమంత్రినని గుర్తించాలని, ఆయన ప్రభుత్వ పనితీరుపైన దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు చెప్పారు.

ఎలాంటి వివక్ష లేకుండా నిధులను కేటాయించాలి..
కరెంటు కోతలు నీటి కొరతల వంటి అసలైన సమస్యలపైన రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్లు కేటీఆర్‌ తెలిపారు. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజా సమస్యలపైన ప్రభుత్వం పని చేసేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామచంద్ర ప్రభువుకు చెప్పినట్టు రాజా ధర్మాన్ని పాటించాలి. అన్ని రాష్ట్రాల మధ్యన ఎలాంటి వివక్ష లేకుండా నిధులను కేటాయించడం లేదా ప్రాజెక్టులు కేటాయించడం చేయలేదు.

 భారతదేశం మొత్తం ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. ప్రజలు ఎవరికి ఓటేస్తారో నాలుగో తేదీన తేలుతుంది. పది సంవత్సరాల నుంచి నరేంద్ర మోదీ ప్రజలని మోసం చేస్తుంటే.. వందరోజుల నుంచి ఇక్కడ రేవంత్ రెడ్డి మోసం చేస్తున్నారు. ఈరోజు కరెంటు కోతల పైన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు ఇచ్చినట్టుగా ఉంది.

తెలంగాణ తెచ్చిన నాయకుడికే ఓటు..
ఇన్వర్టర్లు జనరేటర్లు, క్యాండిల్స్, పవర్ బ్యాంకులు, చార్జింగ్ లైట్, ఇవే కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు. ఐదేళ్లకోసారి ప్రభుత్వాలని ఎన్నుకునే అరుదైన అవకాశం ఎన్నికలు. ఎలాంటి ప్రభుత్వం కావాలో రాజ్యాంగం ఇచ్చిన గొప్ప అవకాశం. మన ప్రభుత్వాలని మనం నిర్ణయించే అధికారం ప్రజల చేతుల్లోనే ఉన్నప్పుడు ఈరోజు ఓటు వేయకుండా తర్వాత నిందిస్తే లాభం లేదు. దయచేసి అందరూ బయటకు వచ్చి ఓటు వేయండి. మంచి ప్రభుత్వాలను మంచి నాయకులను మీ సమస్యలకు ప్రాతినిధ్యం వహించే వారికి ఓటు వేయండి. తెలంగాణ తెచ్చిన నాయకుడు తెలంగాణ తెచ్చిన పార్టీకి నాయకుడు కేసీఆర్ .తెలంగాణ కోసం తెలంగాణ భవిష్యత్తు కోసం నేను ఓటు వేశాను

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement