జూన్ 4న ఏపీ జడ్జిమెంట్ డే
ఉదయం 8 గంటలకు మొదలవనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియ
ఏపీ ఎన్నికల ఫలితాలు వెలువడే తీరు
తొలుత పోస్టల్ ఓట్ల లెక్కింపు
ఆ తర్వాతే ఈవీఎంలలోని ఓట్ల కౌంటింగ్
ప్రతీ 30 నిమిషాలకు ఒక రౌండ్ ఫలితం
ఎన్టీఆర్, సాక్షి: ఆంధ్రప్రదేశ్‌లో జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపునకు ఎన్నికల సంఘం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఒక్కో శాసనసభ నియోజకవర్గానికి 14 కౌంటింగ్ టేబుళ్లు ఏర్పాటు చేయగా.. ఒక్కో రౌండ్ లెక్కింపునకు గరిష్ఠంగా 30 నిమిషాల సమయం పట్టనుంది.
తొలుత సైనికదళాల్లో పనిచేసే వారి ఓట్లు ఎలక్ట్రానిక్ ట్రాన్స్‌మిటెడ్ పోస్టల్ బ్యాలెట్ సిస్టమ్ (ఈటీబీపీఎస్) ఆధారంగా పోలైనవి లెక్కిస్తారు. ఆపై పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కింపు ఉంటుంది. ఆ తర్వాతే ఈవీఎంల లెక్కింపు ప్రారంభంకానుంది. 11 గంటల కల్లా ఫలితాలపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలుండగా.. మధ్యాహ్నానికి తుది ఫలితాలపై ఓ అంచనాకి వచ్చేయొచ్చు.
తొలి ఫలితం తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గాల నుంచి వెలువడే అవకాశాలు ఉన్నాయి. ఈ రెండు చోట్ల అత్యల్పంగా 13 రౌండ్లలోనే లెక్కింపు పూర్తి కానుంది. ఇక అల్లూరి జిల్లా రంపచొడవరం, తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గాల ఫలితాలు మాత్రం ఆలస్యంగా వెలువడనున్నాయి. ఈ రెండు చోట్లా 29 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు జరపనున్నారు.
మరోవైపు.. భీమిలి(విశాఖ), పాణ్యం(నంద్యాల) ఫలితాల కోసం రాత్రి వరకు వేచి చూడాల్సిందే. ఎందుకంటే.. ఈ రెండు నియోజకవర్గాల్లో 25 రౌండ్ల చొప్పున ఓట్ల లెక్కింపు జరగనుంది. అయితే వీవీ ప్యాట్ చీటీల లెక్కింపు(మొరాయించిన ఈవీఎంల వీవీప్యాట్ చీటీలు) పూర్తయ్యాకే అధికారికంగా తుది ఫలితాలు విడుదలవుతాయి.
Comments
Please login to add a commentAdd a comment