Election Trends About Before 2014 To 2023 In India - Sakshi
Sakshi News home page

ఎన్నికల చిత్రం మారుతోంది.. ప్రధాన కారణం అదేనా?

Published Thu, Jun 8 2023 3:49 AM | Last Updated on Thu, Jun 8 2023 11:15 AM

Election trends About before 2014 to 2023 in india - Sakshi

మన దేశంలో ఎన్నికల తీరుతెన్నులను 2014కు ముందు, తర్వాత అని స్పష్టంగా ఒక విభజన రేఖ గీయొచ్చు. కేంద్రంలో నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో విభిన్నమైన ధోరణులు కనిపించాయి. ఒకప్పుడు వివిధ రాష్ట్రాల్లో బహుముఖ పోరు ఉంటే, ఇప్పుడు రెండు పార్టీలే నేరుగా తలపడుతున్న రాష్ట్రాల సంఖ్య పెరుగుతోంది.

బీజేపీ వివిధ రాష్ట్రాల్లో బలపడడం,  కాంగ్రెస్‌ బలహీనపడడం , రాష్ట్రాల్లో మొదటి, రెండు స్థానాల్లో ఉండే కీలక పార్టీల వైపే ఓటర్లు మొగ్గు చూపిస్తూ ఉండడంతో ఎన్నికల ట్రెండ్స్‌ మారిపోతున్నాయి. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో త్రిముఖ పోరు నెలకొంటుందని అందరూ భావించినప్పటికీ జేడీ(ఎస్‌) తన ప్రాభవాన్ని కోల్పోయి బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్యే నేరుగా పోటీ జరగడం అతి పెద్ద ఉదాహరణ. ఇకపై ఎన్నికల్లో కింగ్‌మేకర్లు అన్న పదమే వినిపించేలా లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.  

► హిందీ హార్ట్‌ల్యాండ్‌గా పిలుచుకునే రాష్ట్రాలైన ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఢిల్లీ రాష్ట్రాల్లో ఒకప్పుడు ముఖాముఖి పోరు నెలకొని ఉండేది. ఇప్పుడు ఎన్నికల తీరుతెన్నుల్ని చూస్తే  ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌ వంటి రాష్ట్రాల్లో కూడా రెండు పార్టీల మధ్యే ప్రధానంగా పోరు నెలకొని ఉంది. గుజరాత్, పంజాబ్, తెలంగాణ రాష్ట్రాల్లో రెండు పార్టీల మధ్య పోరు ఉంటే, ఇప్పుడు ఆ రాష్ట్రాల్లో పార్టీల మధ్య బహుముఖ పోరాటం నెలకొంది.  
► కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలే మారిపోయే పరిస్థితి వచ్చింది. ఉదాహరణకి ఢిల్లీ తీసుకుంటే 2014కి ముందు ఆ రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు ఉండేది. కానీ కాలక్రమంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ పుంజుకోవడం, కాంగ్రెస్‌ బలహీనపడడం మొదలైంది. దీంతో దేశరాజధానిలో ఆప్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. మరోవైపు  హరియాణాలో బీజేపీ బలం పుంజుకోవడంతో అక్కడ ముఖాముఖి పోరు కాస్త బహుముఖ పోరుగా మారింది. బీజేపీ, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్‌ (ఐఎన్‌ఎల్‌డీ), జననాయక్‌ జనతా పార్టీ (జేజేపీ)ల మధ్య ఎన్నికల్లో రసవత్తరంగా పోరు నడుస్తోంది.  

► కొన్ని రాష్ట్రాల్లో పోలయిన ఓట్లను విశ్లేషిస్తే రెండు ప్రధాన పార్టీలకే ఓట్లు వేసే ధోరణి కనిపిస్తుంది. ఒకటి, రెండు స్థానాల్లో ఉండే పార్టీలే అత్యధిక ఓటు షేర్‌ని సొంతం చేసుకున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మాయావతికి చెందిన బీఎస్‌పీ, కర్ణాటకలో జేడీ(ఎస్‌), బెంగాల్‌లో వామపక్ష పార్టీలకు ఓట్లు వేసినా ఉపయోగం లేదన్న  భావన ఓటర్లలో వచ్చింది. అందుకే రెండు పార్టీల్లో ఏదో ఒకదానిపైనే మొగ్గు చూపించే రోజులొచ్చాయని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.  


2014లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాల అసెంబ్లీలలో కమలనాథులు పట్టు బిగిస్తే, కాంగ్రెస్‌ పార్టీ ప్రాభవం తగ్గుతూ వచ్చింది. ఒడిశా, త్రిపుర రాష్ట్రాలే దీనికి ఉదాహరణ. ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ పాగా వేస్తూ ఇతర పార్టీల ఓటు బ్యాంకును కొల్లగొట్టడం వల్ల ఎన్నికల తీరు మారిపోయి రెండు పార్టీల మధ్య పోరు నెలకొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement