హంగే అంటున్నారు..! | 70% voter turnout, exit polls predict hung assembly | Sakshi
Sakshi News home page

హంగే అంటున్నారు..!

Published Sun, May 13 2018 2:56 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

70% voter turnout, exit polls predict hung assembly - Sakshi

శనివారం కర్ణాటకలోని తుమకూరులో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న మహిళలు

కన్నడనాట హంగ్‌ తప్పదా? ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 112 స్థానాలను ఏ పార్టీ అందుకోలేదా? ముందునుంచీ అనుకుంటున్నట్టు జేడీఎస్‌ కింగ్‌మేకర్‌ అవబోతోందా? ఎగ్జిట్‌ పోల్స్‌ ఇదే చెబుతున్నాయి. కొన్ని చానళ్లు బీజేపీ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించనుందని తేల్చగా..మరికొన్ని కాంగ్రెసేనని పేర్కొన్నాయి. 

బెంగళూరు: దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకీ స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలు కనిపించటం లేదు. ప్రీపోల్స్‌ సర్వేల్లాగే ఎగ్జిట్‌ పోల్స్‌ కూడా హంగ్‌ తప్పదనే సంకేతాలిచ్చాయి. శనివారం సాయంత్రం పోలింగ్‌ ముగిసే సమయానికి 70% ఓటింగ్‌ నమోదైంది. దీని ఆధారంగా వెల్లడైన ఎగ్జిట్‌పోల్స్‌ వివరాల సగటు ప్రకారం బీజేపీ 103 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించే అవకాశాలుండగా.. 86 సీట్లతో కాంగ్రెస్‌ రెండో స్థానంలో, జేడీఎస్‌ 31 సీట్లతో మూడో స్థానంలో నిలువనుంది.

ఈ వివరాల ప్రకారం ఏ ఒక్క పార్టీ కూడా ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 112 స్థానాల మేజిక్‌ ఫిగర్‌ను చేరుకోవటం లేదు. దీంతో జేడీఎస్‌ కింగ్‌మేకర్‌గా మారటం ఖాయంగా కనబడుతోంది. విడుదలైన అన్ని సర్వేల్లోనూ బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య ఓట్లశాతంలో తేడా పెద్దగా లేదు. 2–3 శాతం తేడా మాత్రమే కనిపిస్తోంది. అయితే ఈ తేడాయే కనీసం 10కిపైగా సీట్లను ప్రభావితం చేస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తం ఏడు ప్రధాన సర్వే సంస్థల్లో ఐదు బీజేపీ, రెండు కాంగ్రెస్‌ అతిపెద్ద పార్టీగా నిలుస్తుందని పేర్కొన్నాయి.

బీజేపీ వైపు కాస్త మొగ్గు
వివిధ వార్తాసంస్థలు పలు సర్వే గ్రూపులతో కలిసి ఎగ్జిట్‌పోల్స్‌ నిర్వహించాయి. ఇందులో ఇండియాటుడే–యాక్సిస్‌ మై ఇండియా సర్వేలో (కాంగ్రెస్‌కు 112 సీట్లు) తప్ప మిగిలిన అన్నింటిలోనూ బీజేపీకే మెజారిటీ రానుందని వెల్లడవుతోంది. టైమ్స్‌నౌ గ్రూప్‌ కూడా రెండు సర్వే సంస్థలతో కలిసి ఎగ్జిట్‌పోల్స్‌ నిర్వహించింది. ఇందులో వీఎంఆర్‌తో కలిసి చేసిన సర్వే బీజేపీ 94 స్థానాల్లో, కాంగ్రెస్‌ 97 స్థానాల్లో, జేడీఎస్‌ 28 చోట్ల గెలిచే అవకాశాలున్నాయని తెలిపింది.

అయితే టుడేస్‌ చాణక్యతో జరిపిన సర్వే మాత్రం బీజేపీకి స్పష్టమైన మెజారిటీ రావొచ్చని తెలిపింది. బీజేపీ 120 స్థానాల్లో.. కాంగ్రెస్‌ 73 సీట్లలో గెలిచే అవకాశముందని ఈ సర్వే పేర్కొంది. అయితే మిగిలిన సర్వేల ప్రకారం బీజేపీ పెద్ద పార్టీగా నిలుస్తున్నప్పటికీ జేడీఎస్‌ కింగ్‌మేకర్‌ కానుందని వెల్లడైంది. చివర్లో ప్రధాని మోదీ చేసిన సుడిగాలి ప్రచారం ఫలితంగానే బీజేపీకి అనుకూలంగా ఓటింగ్‌ శాతం స్వల్పంగా పెరిగినట్లు తెలుస్తోంది. దీని కారణంగానే బీజేపీ తన సీట్ల సంఖ్యను కొంతమేర పెంచుకునే అవకాశాలు కనబడుతున్నాయి.  

కాంగ్రెస్‌ నుంచి బీజేపీకి..!
సాయంత్రం ఆరున్నర గంటలకు ఎన్నిక పూర్తవగానే టైమ్స్‌నౌ–సీఓటర్‌ మొదటగా సర్వే వివరాలు వెల్లడించింది. ఇందులో కాంగ్రెస్‌కే ఎక్కువ సీట్లొస్తాయని వెల్లడైంది. అయితే.. కాసేపటికే మిగిలిన సంస్థలు ఒక్కొక్కటిగా తమ సర్వే వివరాలు వెల్లడించాయి. వాటిలో రిపబ్లిక్‌ టీవీ, జన్‌కీ బాత్‌ సంయుక్తంగా నిర్వహించిన సర్వే.. బీజేపీకి 105, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 37 సీట్లు రావొచ్చని పేర్కొంది. అయితే.. ఇండియాటుడే యాక్సిస్‌ సర్వే మాత్రం.. కాంగ్రెస్‌ ఎక్కువ స్థానాల్లో గెలిచే అవకాశముందని పేర్కొంది.

బీజేపీకి 85 సీట్లు ఇచ్చిన ఈ సర్వే.. కాంగ్రెస్‌ 112 చోట్ల గెలుస్తుందని, జేడీఎస్‌ 26 స్థానాలకే పరిమితమవుతుందని వెల్లడించింది. టుడేస్‌ చాణక్యతోపాటు న్యూస్‌ నేషన్, న్యూస్‌ఎక్స్‌–సీఎన్‌ఎక్స్, ఏబీపీ–సీఓటర్, రిపబ్లిక్‌ సర్వేలు బీజేపీ 100 సీట్ల మార్కును దాటుతుందని తెలిపాయి. టుడేస్‌ చాణక్య తన సర్వేలో మీరు ప్రభుత్వాన్ని మార్చాలనుకుంటున్నారా? అని ప్రశ్నించగా 47 శాతం మంది అవునని, 40 శాతం మంది సిద్దరామయ్య ప్రభుత్వ పనితీరుతో సంతృప్తికరంగానే ఉన్నామని పేర్కొన్నారు. కాగా, ఇండియా టుడే – యాక్సిస్‌ మై ఇండియా సంస్థ 70,500 శాంపిల్స్‌తో సర్వే చేసినట్లు వెల్లడించింది.  మంగళవారం (మే 15న) ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. ఆ రోజు మధ్యాహ్నం కల్లా ఫలితాలపై స్పష్టత రానుంది.

పాత మైసూరులో కాంగ్రెస్‌!
బాంబే కర్ణాటక, సెంట్రల్, కోస్తా కర్ణాటకల్లో బీజేపీ గత ఎన్నికల కన్నా బలం పుంజుకున్నట్లు సర్వేలు చెబుతున్నాయి. వీటి కారణంగానే కాంగ్రెస్‌ కన్నా ఎక్కువసీట్లు సంపాదించనున్నట్లు తెలుస్తోంది. పాత మైసూరు ప్రాంతంలో కాంగ్రెస్‌ పూర్తి ఆధిక్యం కనబర్చనుంది. 50 సీట్లలో 28–30 సీట్లు ఈపార్టీకి వస్తా యని సర్వేలు పేర్కొన్నాయి. ముస్లిం, దళిత ఓట్లు ఎక్కువగా ఉన్న హైదరాబాద్‌ కర్ణాటకలో మాత్రం ఇరు పార్టీల మధ్య హోరాహోరీ తప్పేట్లు లేదు.

ఏ ప్రాంతంలో ఎవరికెన్ని..?
బెంగళూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకారం ప్రాంతాల వారీగా ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలవొచ్చనే విషయాన్ని గమనిస్తే..
కోస్తా కర్ణాటక: ఈ ప్రాంతంలో మొత్తం 21 స్థానాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌ 13 చోట్ల గెలిచింది. కానీ ఎగ్జిట్‌పోల్స్‌లో బీజేపీ అత్యధికంగా 14–16 స్థానాలు గెలిచే అవకాశం ఉందని.. కాంగ్రెస్‌ 5–7 స్థానాలకే పరిమితమవుతుందని పేర్కొన్నాయి. ఇది వ్యవసాయ ఆధారిత ప్రాంతం. కాంగ్రెస్‌ హయాంలో 3,500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవటాన్ని బీజేపీ బలంగా ప్రచారం చేసింది. అధికారంలోకి వస్తే రూ.లక్ష వరకూ రుణమాఫీ చేస్తామనీ ప్రకటించింది. ఇది బీజేపీకి అనుకూలంగా మారినట్లు ఎగ్జిట్‌ పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి.

బాంబే కర్ణాటక: ఇక్కడ 50 స్థానాలు ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్‌లకు సమానస్థాయిలో 25–26 సీట్లు రావచ్చు. మహదాయి నదీ నీటి పంపకం విషయంలో మహారాష్ట్ర, గోవాతో కర్నాటకకు విభేదాలు ఉన్నాయి. ఈ విషయాన్ని కూడా మోదీ ప్రచారంలో ప్రస్తావించారు. మహదాయినదీ వివాద పరిష్కారంపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని, ఆ సమస్యను తాము పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇది కూడా ఇక్కడ ప్రభావం చూపింది.

పాత మైసూర్‌: ఇక్కడ 55 స్థానాలు ఉన్నాయి. వక్కలిగ సామాజికవర్గం ఈ ప్రాంతంలో బలంగా ఉంటుంది. జేడీఎస్‌ అత్యంత బలంగా ఉన్న ప్రాంతం ఇదే! ఇక్కడ కాంగ్రెస్‌ 27–29 స్థానాలు, జేడీఎస్‌ 19–21, బీజేపీ 4–6 స్థానాలు గెలిచే అవకాశం ఉంది. ఇక్కడ వక్కలిగలకు కాంగ్రెస్, జేడీఎస్‌లు ఎక్కువ స్థానాలు కేటాయించాయి. దేవెగౌడపై మోదీ సానుకూల వ్యాఖ్యలు చేసినా అది బీజేపీకి ఓట్లు సంపాదించిపెట్టలేక పోయిందని ఈ పోల్స్‌ స్పష్టం చేస్తున్నాయి.

హైదరాబాద్‌ కర్ణాటక: ఇక్కడ మొత్తం 31 సీట్లు ఉన్నాయి. ఇక్కడ కూడా బీజేపీ వర్సెస్‌ కాంగ్రెస్‌ అన్నట్లుగానే తీవ్రమైన పోటీ నెలకొంది. బీజేపీ 15–17, కాంగ్రెస్‌ 14–16లు గెలిచే అవకాశం ఉంది. జేడీఎస్‌ ఒకస్థానానికి పరిమితం కావొచ్చు. బీదర్, గుల్బర్గా, రాయచూర్, యాదగిరి, కొప్పల్‌ జిల్లాల్లో తెలుగు ఓటర్ల ప్రభావం ఎక్కువ. ఇక్కడ మౌలిక వసతుల కల్పన, నీటి వనరుల అభివృద్ధి విషయంలో గత ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశాయి. దీంతోనే ఏ పార్టీకి ప్రజలు ఏకపక్షంగా తీర్పు ఇవ్వరు.

సెంట్రల్‌ కర్ణాటక: ఈ ప్రాంతంలో 35 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ చిత్రదుర్గ, దావణగిరి, హవేరి, బళ్లారి జిల్లాలో శ్రీరాములు బలమైన నేతగా ఉన్నారు. అలాగే ఇక్కడ రెడ్డిబ్రదర్స్‌ ప్రభావం కూడా ఎక్కువ. ఈ ఎన్నికలను శ్రీరాములుతో పాటు రెడ్డిబ్రదర్స్‌ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇక్కడ బీజేపీ 22–24, కాంగ్రెస్‌ 9–11 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉంది. జేడీఎస్‌కు 1–3 స్థానాలు దక్కొచ్చు.  

గ్రేటర్‌ బెంగళూరు: బెంగళూరు రీజియన్‌లో 30 స్థానాలున్నాయి. బీజేపీ 18–20, కాంగ్రెస్‌ 8–10, జేడీఎస్‌ 2 స్థానాలు గెలవచ్చు. నగరంలో పారిశుద్ధ్యం లేకపోవటంతో పాటు నేరాలు పెరగటం, మహిళల భద్రతపై అనుమానాలు బీజేపీకి వరంగా మారాయి. దీంతోపాటు ట్రాఫిక్, కాలుష్యం సిటీ ప్రజలు ఇబ్బంది పెడుతున్నారు. ఈ ప్రభావం ఎన్నికల్లో స్పష్టమైనట్లు తెలుస్తోంది.  



ఈసారి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయం. ఈ నెల 17న నేను ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తా. 15న ఢిల్లీకి వెళ్లి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని మోదీని ఆహ్వానిస్తా. మా పార్టీ 140– 150 సీట్లు గెలుపొందుతుంది.
– బీజేపీ సీఎం అభ్యర్థి బీఎస్‌ యడ్యూరప్ప

బీజేపీ భారీ మెజారిటీతో గెలుస్తుందని యడ్యూరప్ప చెప్పడాన్ని చూస్తే ఆయన మతి భ్రమించినట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో హంగ్‌ వచ్చే పరిస్థితి లేదు. మేమే మళ్లీ అధికారం చేపడతాం. 120కి పైగా స్థానాల్లో గెలుస్తాం. బీజేపీకి 60–65 స్థానాలు కూడా దక్కవు.
– కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య



                        శివమొగ్గ జిల్లా శికారిపురలో ఓటేసిన యడ్యూరప్ప


                                మైసూరు జిల్లాలో కుమారుడు యతీంద్రతో సిద్దరామయ్య


                        రామ్‌నగర్‌లో ఓటేసిన కుమారస్వామి, ఆయన భార్య అనిత

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement