
బెంగళూరు: కర్ణాటకలో ఏ పార్టీకి మెజార్టీ దక్కకుండా హంగ్ ఏర్పడితే రాజకీయం ఏ మలుపులు తిరగనుంది? ఒకవేళ జేడీఎస్ కింగ్‌మేకర్‌గా అవతరిస్తే ప్రభుత్వ ఏర్పాటుకున్న సాధ్యాసాధ్యాలేంటీ? దీనిపై విశ్లేషకులు అనేక అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. బీజేపీతో జట్టుకట్టి వంతుల వారీగా సీఎం పీఠాన్ని పంచుకోవాలని జేడీఎస్ అధినేత హెచ్‌డీ కుమారస్వామి డిమాండ్ చేసే అవకాశముంది. బీజేపీలో తర్వాతి తరం నేతల్ని తెరపైకి తెచ్చే క్రమంలో.. యడ్యూరప్పను పక్కన పెట్టాలనే ప్రయత్నాలే నిజమైతే మాత్రం.. 2019 సాధారణ ఎన్నికల వరకూ జేడీఎస్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు బీజేపీ సుముఖత వ్యక్తం చేయవచ్చు. దీని ద్వారా కాంగ్రెస్‌కు కూడా చెక్ పెట్టవచ్చు. నిజానికి కాంగ్రెస్‌తో దోస్తీకి మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మొగ్గుచూపుతున్నా.. కొడుకు కోసం బీజేపీతో స్నేహానికి ఆయన అభ్యంతరం చెప్పకపోవచ్చు.
కాంగ్రెస్‌తో జేడీఎస్ జట్టుకడితే..?
తమకు మద్దతిచ్చేలా దేవెగౌడ, కుమారస్వామిల్ని ఒకవేళ కాంగ్రెస్ ఒప్పించగలిగితే.. ముఖ్యమంత్రి పదవిని వంతుల వారీగా పంచుకోవాలని జేడీఎస్ డిమాండ్ చేసే అవకాశముంది. అయితే మళ్లీ సీఎంగా సిద్దరామయ్యను కుమారస్వామి ఎంతమాత్రం అంగీకరించరు. దీంతో కాంగ్రెస్ నుంచి కొత్త ముఖ్యమంత్రి తెరపైకి రావచ్చు. అదే జరిగితే కాంగ్రెస్ సీనియర్ నేత మల్లికార్జున ఖర్గే, వొక్కలిగ వర్గానికి చెందిన మరో నాయకుడు డీకే శివకుమార్ పేర్లను సీఎం పదవి కోసం పరిశీలించవచ్చు. బీజేపీ, కాంగ్రెస్‌లు మెజార్టీకి అతి సమీపానికి వచ్చి ఆగిపోతే స్వతంత్రులు, ఇతర చిన్న పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశముంది. 2008లో ప్రభుత్వ ఏర్పాటు కోసం యడ్యూరప్పకు మూడు స్థానాలు తక్కువ పడగా.. ఆరుగురు స్వతంత్రుల మద్దతుతో ఆయన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ ఆరుగురికీ మంత్రి పదవులు కట్టబెట్టారు.
ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం: దేవెగౌడ
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో ఈసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవేగౌడ అన్నారు. శనివారం హసన్ జిల్లా హోలెనరసిపుర పట్టణంలో ఆయన కుటుంబ సభ్యులతో కలసి ఓటు వేశారు. భార్య చెన్నమ్మ, కుమారుడు హెచ్‌డీ రేవణ్ణ, ఇతర కుటుంబ సభ్యులు ఆయన వెంట ఉన్నారు. ఆ తరువాత మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో తమ పార్టీ స్పష్టమైన మెజారిటీతో గెలిచే అవకాశం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో çపర్యటించామని, అన్ని వైపులా నుంచి తమకు చక్కని మద్దతు వచ్చిందని, అధికార పీఠం తమదేనని చెప్పారు.