ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అభ్యర్థుల నైతిక వర్తన నియమావళి (మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్)ని తొలిసారి 1960లో రూపొందించారు. ఈ కోడ్‌ను ఎన్నికల సందర్భంగా అన్ని పార్టీలకు జారీ చేయడం 1979 నుంచి ఆనవాయితీగా మారింది. 1991లో పార్టీలన్నింటి అనుమతితో దీన్ని మరింత బలపరిచారు. కానీ రాజకీయ వాతావరణం పదును తేలినకొద్దీ, ఉల్లంఘనలు పెరిగాయి.
కోడ్‌కు కట్టుబడి ఉండటం కంటే తప్పించుకునే మార్గాలను అన్వేషించేందుకే నేతలు ఇష్టపడుతుంటారు. కాబట్టి, వీలైనంత పారదర్శకంగా నిబంధనల ఉల్లంఘనలకు ఎలాంటి శిక్షలుంటాయో స్పష్టం చేయాలి. అదే సమయంలో, ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టుగా కోడ్‌ను మార్చాలి. ప్రజాజీవితంలో గౌరవ మర్యాదలను కొనసాగించేందుకు ఇది చాలా ముఖ్యం.
‘చాలాసార్లు ఎన్నికలు ఒక మనిషిలోని చెడ్డతనపు పార్శా్వన్ని బయటికి తెస్తాయి, అవి ప్రతిసారీ మంచి మనిషి విజయానికి దారితీయవనేది కూడా నిశ్చయం’ అన్నారు భారత తొలి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ. ఆయన రాసిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ పుస్తకంలోని ఈ పేరా ఎన్నికలు, ప్రజాస్వామ్య వ్యవస్థల్లోని లోటుపాట్లను ఎత్తిచూపుతుంది. అప్పటికి ఎన్నికల కమిషన్ లేదు... మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ (ఎంసీసీ– నైతిక వర్తన నియమావళి) కూడా లేదు.
రాజకీయ నేతలు, వ్యవస్థలన్నింటి ప్రత్యేక సమ్మతితో ఏర్పడిందీ ఎంసీసీ. మార్పులు, చేర్పులతో కాలంతోపాటు ఎదుగుతూ వచ్చింది. ఎన్నికల ప్రకటన వెలువడిన వెంటనే ఎంసీసీపై ఒత్తిడి విపరీతంగా పెరిగిపోతుంది. పార్టీలతో సహా నేతలు, అభ్యర్థులు... ఎన్నికల కమిషన్ కు సవాళ్లు విసురుతూనే ఉంటారు. ఇదంతా కూడా మీడియా నిఘా, న్యాయ వ్యవస్థ కీలక డేగ కన్ను మధ్యలోనే జరుగుతూంటుంది.
కేరళతో మొదలు...
గతాన్ని కొంచెం తరచి చూద్దాం. కేరళ అసెంబ్లీ ఎన్నికల సంద ర్భంగా కొన్ని విధివిధానాలతో మొదలైందీ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్. ప్రచార సభలు, ప్రదర్శనలు, ప్రసంగాలు, నినాదాలు, పోస్టర్లు, ప్లకార్డుల వంటివి ఎలా ఉండాలో ఈ విధి విధానాల్లో పొందుపరిచారు అప్పటి (1960) ఎన్నికల ప్రధాన అధికారి కేవీకే సుందరం. 1968లో ఎస్‌పీ సేన్ వర్మ ప్రధానాధికారిగా ఉండగా ఎన్నికల కమిషన్ దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరిపింది.
కేరళ ఎన్నికల సందర్భంగా రూపొందించిన విధి విధానాలను అందరికీ జారీ చేస్తూ, ఎన్నికలు సజావుగా జరిగేందుకు (ఫ్రీ అండ్ ఫెయిర్) కనీస మర్యాదలను పాటించాలని కోరింది. తరువాతికాలంలో అంటే 1979 నుంచి ఈ కోడ్‌ను సార్వత్రిక ఎన్నికల సంద ర్భంగా అన్ని పార్టీలకు జారీ చేయడం ఆనవాయితీగా మార్చారు అప్పటి సీఈసీ ఎస్.ఎల్. శక్‌ధర్. అంతేకాకుండా, రాజకీయ పార్టీల సమ్మతితో ఈ కోడ్‌ను మరింత విశదంగా రూపొందించారు.
అధికార పార్టీకి కొన్ని పరిమితులు విధించడం, అధికార దుర్వినియోగాన్ని అడ్డుకోవడం వంటి చర్యలు అమల్లోకి వచ్చింది అప్పుడే. 1991లో టీఎ¯Œ శేషన్ ఎన్నికల ప్రధానాధికారిగా ఉండగా మరో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి పార్టీలన్నింటి అను మతితో ‘కోడ్’ను మరింత బలపరిచారు. అయితే అప్పటినుంచి ఇప్పటివరకూ రాజకీయ వాతా వరణం మరింత పదును తేలింది. ఫలితంగా మోడల్ కోడ్ సామర్థ్యం మొద్దుబారింది. ఉల్లంఘనలు పెచ్చుమీరి పోయాయి.
ఉల్లంఘనల పరిణామాలు స్పష్టం చేయాలి...
ప్రస్తుతం అమల్లో ఉన్న మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్‌లో ఉన్న ప్రధాన లోపం కోడ్‌ను ఉల్లంఘిస్తే ఎటువంటి పరిణామాలను ఎదు ర్కోవాల్సి వస్తుందీ? అన్నది లేకపోవడం. అందుకే ఈ కోడ్... నిబంధనల ఉల్లంఘనలకు అడ్డు కావడం లేదు. కాబట్టి వీలైనంత పార దర్శకంగా నిబంధనల ఉల్లంఘనలకు ఎలాంటి శిక్షలు ఉంటాయో స్పష్టం చేయాల్సి ఉంటుంది. విద్వేషపూరిత ప్రసంగాలు, కుల మతాలను అడ్డం పెట్టుకుని ఓట్లు అడగడం వంటి విషయాల్లో మరీ కఠినంగా వ్యవహరించాల్సిన అవసరముంది.
ఓట్ల కోసం పెట్టే ప్రలోభాలు, ప్రత్యర్థి పార్టీలు, నేతల గురించి అసభ్యకరమైన సంభా షణలు, భారత సాయుధ దళాలను పొగుడుతూ లేదా విమర్శిస్తూ, చర్యలను ప్రశ్నిస్తూ చేసే ప్రసంగాల గురించి ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఏ రకమైన ఉల్లంఘనలకు ఎలాంటి శిక్షలుఉంటాయో స్పష్టంగా, బహిరంగంగా ప్రకటించాలి.
ఉదాహరణకు విద్వేషపూరిత ప్రసంగాల వంటి వాటికి ప్రచారంపై నిర్దిష్ట కాలం నిషేధం విధించడం, మరింత తీవ్రమైన ఉల్లంఘనలకు నిషేధ సమయాన్ని పొడిగించడం, అప్పటికీ ఉల్లంఘనలు మానకపోతే మోడల్ కోడ్ అమల్లో ఉన్నంత కాలం నిషేధాన్ని కొనసాగించడం చేయవచ్చు. ఇది కేవలం ప్రచార సభలకు మాత్రమే పరిమితం కాకుండా... మీడియాలో కనిపించడం, ఇంటర్వ్యూలు ఇవ్వడం వంటి వాటికీ వర్తించేలా నిబంధనలు రూపొందించాలి. ‘ఉల్లంఘనులు’ స్టార్ క్యాంపెయినర్లు అయితే తరువాతి ఎన్నికల్లో ఆ గుర్తింపు రద్దు చేయడం కూడా చేయవచ్చు.
అయితే వీటి నుంచి తప్పించుకునేందుకు నేతలు సర్వశక్తులూ ఒడ్డుతారు. యుక్తులు పన్నుతారు కూడా. ఒకప్పుడు కండబలం ఉపయోగిస్తే ఇప్పుడు ఆ స్థానాన్ని ధన బలం ఆక్రమించింది. టెక్నాలజీ ఈ ఆయుధానికి మరింత పదును పెట్టింది. కోడ్‌కు కట్టుబడి ఉండటం కంటే తప్పించుకునేందుకు ఉన్న మార్గాలను అన్వేషించేందుకు నేతలు మరింత ఎక్కువ ఇష్టపడుతూంటారు. అందుకే ప్రస్తుత పరిస్థితుల్లో ఎంసీసీని రీమోడల్ చేయాల్సిన అవసరముంది. అది కూడా వివక్షకు తావులేని విధంగా అమలు చేసేలా ఉండాలి. ప్రజాజీవితంలో కొద్దోగొప్పో గౌరవ మర్యాదలను కొనసాగించేందుకు ఇది చాలా ముఖ్యం.
పార్టీలకు నోటీసులు... కొత్త పంథా!
ఎన్నికల కమిషన్ (ఈసీ) ఈ మధ్యకాలంలో ఓ కొత్త పంథాను ఎంచుకుంది. కోడ్ ఉల్లంఘించిన వ్యక్తులకు కాకుండా... ఆ వ్యక్తుల పార్టీలకు నోటీసులు పంపుతోంది. అయితే ట్రాఫిక్ ఉల్లంఘనలకు డ్రైవరే బాధ్యుడైనట్లు కోడ్ ఉల్లంఘనల బాధ్యత కూడా పార్టీది కాదన్నది గుర్తించాలి. పైగా ఈసీ నోటీసు ప్రాథమికంగా ఉల్లంఘనపై సంతృప్తి చెందిన తరువాతే వెళుతుందన్న విషయం ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. పార్టీకి చెందిన స్టార్ క్యాంపెయినర్లు, కీలక వ్యక్తులు కోడ్‌ను ఉల్లంఘిస్తే ఈసీ ఆ పార్టీపై కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడరాదు.
ఈ చర్యలు జరిమానా కావచ్చు లేదా పార్టీ గుర్తులకు సంబంధించినదైనా కావచ్చు. అవసరమైతే ఈ రెండు రకాల చర్యలు కూడా తీసుకునేలా మార్పులు చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా... ఉల్లంఘనలు జరిగిన 72 గంటల్లోపే చర్యలు తీసు కోవడం కూడా అవసరం. వీటికి సంబంధించి స్పష్టమైన పద్ధతి ఒకదాన్ని సిద్ధం చేయాలి. ఆలస్యంగా తీసుకునే తూతూ మంత్రపు చర్యల వల్ల ప్రజల్లో ఈసీపై నమ్మకం సడలుతుంది.
కోడ్ ఉల్లంఘనలు ఎన్ని జరిగాయో ఒక జాబితా సిద్ధం చేసి వాటిల్లో ఎన్నింటిపై చర్యలు తీసుకున్నారు? ఎన్ని అంశాలు పెండింగ్‌లో ఉన్నాయి? వంటి వివరాలను వెబ్‌సైట్‌లో ఉంచాలి.కోడ్ ఉల్లంఘనలను నేరుగా ఇతర చట్టాలకు అనుసంధానించడం జరిగితే వాటిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై పడుతుంది. అయితే, ఈ చర్యలన్నీ రాజ కీయ పార్టీలు కోడ్ విషయంలో స్వీయ నియంత్రణ పాటించేలా చేస్తాయా? ఇది మన రాజకీయ నేతల క్యారెక్టర్‌పై ఆధారపడిఉంటుంది.
అయితే ఈ వ్యవహారాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించే వారి విచక్షణాధికారాలకు పరిమితి విధిస్తుందనడంలో సందేహం లేదు. తద్వారా ఎన్నికల ప్రధానాధికారిపై వివక్ష, ఏకపక్ష ధోరణివంటి ఆరోపణలు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఉల్లంఘనలపై తీసుకునే చర్యలు నిర్దిష్ట కాలావధిలోగా పూర్తవుతాయన్న భరోసా ఎన్నికల కమిషన్ ప్రజలకు కల్పించడం కూడా అవసరమే. వీటన్నింటికంటే ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది. నాయకత్వం వహిస్తున్న వారు ఆదర్శప్రాయంగా వ్యవహరిస్తే ఎలాంటి మోడల్ కోడ్‌లూ అవసరం ఉండదు.
- వ్యాసకర్త ఎన్నికల మాజీ ప్రధాన అధికారి
-అశోక్ లవాసా
Comments
Please login to add a commentAdd a comment