మోదీకి అగ్నిపరీక్ష | K.Ramachandra Murthy writes on demonetisation effects | Sakshi
Sakshi News home page

మోదీకి అగ్నిపరీక్ష

Published Sun, Dec 18 2016 2:33 AM | Last Updated on Wed, Aug 15 2018 8:21 PM

మోదీకి అగ్నిపరీక్ష - Sakshi

మోదీకి అగ్నిపరీక్ష

త్రికాలమ్‌
ఇదివరకటి దూకుడు లేదు. అంతటి ఆత్మవిశ్వాసం లేదు. దర్పం లేదు. ప్రతి పక్షాలపై దాడి యాంత్రికంగా సాగింది. గతం తవ్వి కాంగ్రెస్‌ను దుయ్యబట్టడం, సిద్ధాంతాలతో రాజీపడి కాంగ్రెస్‌తో జతకట్టినందుకు కమ్యూనిస్టులను తప్పు పట్టడం యథావిధిగా జరిగిపోయింది. శుక్రవారం బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ప్రసంగించిన ప్రధాని నరేంద్రమోదీలో ఆవేశం కనిపించింది. దాని వెనుక ఆందోళన తొంగి చూసింది. తొలిప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పార్లమెంటులో ప్రసంగిస్తూ తన స్వప్నాన్ని అనేక సందర్భాలలో వివరించినట్టు మోదీ నగదు రహిత సమాజం గురించి భావోద్వేగంతో మాట్లాడటం విశేషం. ప్రతికూల పరిస్థితిని అధిగమించే ప్రయత్నంలో ప్రదర్శించిన నాటకీయత అది.

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సాహసోపేతమైనదే కానీ ఆ నిర్ణయాన్ని అమలు పర చిన తీరు సమంజసమైనదికాదని ప్రధాని గ్రహించినట్టు ఆయన హావభావాలు స్పష్టం చేశాయి. బిహార్‌ ముఖ్యమంత్రి తన ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాల వైఖరికి భిన్నంగా మోదీ నిర్ణయాన్ని సమర్థించినప్పటికీ దానిని పులిస్వారీగా అభివర్ణించడంలో చమత్కారం ఉంది. స్వారీ ఆపలేరు. కొనసాగించలేరు. ఇప్పుడు పరిస్థితిని తక్షణం మెరుగుపరచడానికి ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ మరెవ్వరైనా కానీ చేయగలిగింది ఏమీలేదు. రద్దు చేసిన నోట్ల విలువలో కనీసం 75 శాతం విలువచేసే  కొత్త నోట్లు ముద్రించి మార్కెట్లోకి పంపేవరకూ ప్రజ లకు కష్టాలూ, ప్రభుత్వానికి అపఖ్యాతీ అనివార్యం. ఇది మోదీ తన రాజకీయ జీవితంలో ఎదుర్కొంటున్న అగ్నిపరీక్ష.

ప్రజల స్వానుభవమే ప్రధానం
పార్లమెంటులో ప్రతిపక్షాన్ని ఓడించవచ్చు. టీవీ చర్చాగోష్ఠులలో బీజేపీ ప్రతినిధులు వాదనలో గెలవలేనప్పుడు తాము దేశంకోసం పోరాడుతున్నా మంటూ  దబాయించి ప్రత్యర్థుల నోరు మూయించవచ్చు. టీవీ చానళ్ళూ, పత్రికలూ వాస్తవాలను అంత వివరంగా కళ్ళకు కట్టలేకపోవచ్చు. మోదీ ప్రసంగాలను ఒకటికి రెండు విడతలు వివరంగా ప్రసారం చేయవచ్చు. కానీ ప్రజల అనుభవాన్ని కాదనలేము. తాము బ్యాంకులలో దాచుకున్న డబ్బు తీసుకోవడానికి రోజుల తరబడి క్యూలలో నిలబడి నానా తంటాలు పడుతూ ఆగ్రహంతో రగిలిపోతున్న సాధారణ ప్రజలను బీజేపీ కార్యకర్తలు లడ్డూలు పంచడం ద్వారా శాంతింపచేయలేరు. కూలీనాలీ లేక అలమటిస్తున్న పేద ప్రజ లనూ, ఉపాధి కోల్పోయినవారినీ, చేతిలో డబ్బు లేక నిత్యావసరాలు తీరక బాధలు పడుతున్నవారినీ, వంగడాలూ, ఎరువులూ కొనడానికి డబ్బు లేక నిస్సహాయంగా మిగిలిపోయిన రైతన్నలనీ, పింఛను కోసం క్యూలో నిలబడి తాళలేక మరణించిన వృద్ధులనూ ప్రధాని గమనించలేదని అనుకోలేము. మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసి, ప్రజలతో విస్తృతమైన సంబంధాలు కలిగిన ప్రజానాయకుడిగా మోదీకి క్షేత్ర వాస్తవికత తెలియదని అనుకోవడం పొరపాటు.

ప్రఖ్యాత వ్యాఖ్యాత ఆకార్‌పటేల్‌ ఇటీవల ‘సాక్షి’లో రాసిన వ్యాసంలో వెల్లడించినట్టు మోదీ కొందరు అధికారులపైన ఆధారపడి పెను నిర్ణయం తీసుకొని ఉండాలి. ఆకార్‌ గుజరాతీ. మోదీ ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఆయనను ఆకార్‌ ఇంటర్వ్యూ చేశారు. మనసు విప్పి మాట్లాడుతూ మోదీ తాను ఫైళ్ళు చదవననీ, ఉన్నతాధికారులు క్షుణ్ణంగా ఫైళ్ళు చదివి వాటిలోని సారాంశం చెబితే దాని ప్రాతిపదికగా నిర్ణయాలు తీసుకుంటాననీ చెప్పారు. అధికారులు పొరపాటున తప్పుడు సమాచారం ఇచ్చినా, బుద్ధి పూర్వకంగా తప్పుదారి పట్టించినా ముఖ్యమంత్రిగా మోదీ సరైన నిర్ణయాలు తీసుకోగలిగేవారు కాదు. అదే పెద్ద నోట్ల రద్దు విషయంలో కూడా జరిగి ఉంటుంది. సన్నిహితులైన అధికారులను సంప్రతించి వారి అభిప్రాయం ఆధా రంగా ఈ సంచలనమైన నిర్ణయం ప్రకటించినట్టు కనిపిస్తోంది. నవంబర్‌ 8వ తేదీ రాత్రి ఎనిమిది గంటలకు ప్రధాని అత్యంత నాటకీయంగా, తనదైన రీతిలో పెద్ద నోట్లు (వెయ్యి, అయిదు వందల నోట్లు) మర్నాటి నుంచి చెల్లని చిత్తు కాగితాలతో సమానమంటూ ప్రకటించిన అనంతరం మూడు రోజుల వరకూ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాట్లాడలేదు. రిజర్వ్‌బ్యాంక్‌ గవర్నర్‌ ఊర్జిత్‌ పటేల్‌ ఇరవై రోజుల దాకా నోరు విప్పనేలేదు. ఇది నిజంగానే పులిస్వారీ. ముందుకు పోవలసిందే కానీ వెనకంజ వేసే అవకాశం లేదు.

అందుకే తెగించి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మార్కెట్లో ఉన్న డబ్బు అంతా బ్యాంకులకు చేరుతోంది. కశ్మీర్‌లో మరణించిన ఉగ్రవాదుల జేబుల్లో రెండు వేల రూపాయల కొత్త నోట్లు దొరికాయి. దొంగ నోట్లు మొత్తం చలా మణిలో ఉన్న నోట్లలో 0. 02 శాతమే. నల్లధనం, దొంగ నోట్లు, ఉగ్రవాదం వెనక్కుపోయి నగదురహిత లావాదేవీలు ముందుకు వచ్చాయి. మొత్తం లావాదేవీలలో కేవలం రెండు శాతమే నగదు రహితంగా జరుగుతున్న దేశంలో రెండు శాతం పది శాతం దాకా పెరగడానికే చాలా సంవత్సరాలు పడుతుంది. నగదు రహిత లావాదేవీలు అభిలషించదగిన విధానమే. దాని వల్ల అవినీతి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. పన్నుల ద్వారా ప్రభుత్వాల ఆదాయం పెరిగే వీలుంది. నగదు రహిత విధానానికి ఎక్కడో ఒక చోట, ఎప్పుడో ఒకప్పుడు శ్రీకారం చుట్టవలసిందే. ఆ పని చేయడానికి పెద్ద నోట్లు రద్దు ద్వారా ఇంత రాద్ధాంతం చేయవలసిన అవసరం లేదు. పెద్ద నోట్లను దశలవారీగా ఉపసంహ రించుకోవచ్చు. వాటి స్థానంలో కొత నోట్లను ప్రవేశపెట్టవచ్చు. కానీ నాటకీ యత, సంచలనం ఇష్టపడే ప్రధానికి పెద్ద నోట్ల రద్దు నిర్ణయం సృష్టించిన ప్రకం పన హృదయానికి బలంగా హత్తుకుంటుంది.

దీటైన పోటీ లేకపోవడమే అదృష్టం
గుడ్డిలో మెల్ల అన్నట్టు నరేంద్రమోదీకి సానుకూలంగా మూడు అంశాలు ఉన్నాయి. 1) తన పార్టీలో కానీ వెలుపల కానీ ఆయనకు దీటైన నాయకుడు లేడు. 2)ఈ సంక్షోభం మరి నాలుగు మాసాలలో సమసిపోతుంది. అంతవరకూ తట్టుకుంటే సరిపోతుంది. 3)ప్రతిపక్షాలలో ఐక్యత లేదు. అగ్రనేత అడ్వాణీ అప్పుడప్పుడు ఆగ్రహించినా ఆయన మోదీకి ఎసరు పెట్టే ప్రయత్నం చేయరు. అడ్వాణీ మనస్తత్వం అటువంటిది కాదు. మరోనాయకుడు మోదీని సవాలు చేసే ప్రసక్తి లేదు. పార్టీ, ప్రభుత్వం రెండూ మోదీ అదుపులోనే సంపూర్ణంగా ఉన్నాయి.  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రధానిని ప్రశ్నించగలరు. ఇరకాటంలో పెట్టగలరు. అనూహ్యమైన వ్యాఖ్యలతో, వివాదాలతో సంచలనం సృష్టించగలరు. కానీ ఆయనకు దేశవ్యాప్తంగా ప్రాబల్యం లేదు. సొంత ఇంటి లోనే లుకలుకలు అనేకం. నేరం చేసి దొరికిన ఆమ్‌ ఆద్మీ పార్టీ శాసనసభ్యులు జైలులో ఊచలు లెక్కపెడుతున్నారు. ఆ పార్టీ పంజాబ్‌లోనూ, గోవాలోనూ (ఒక వేళ) గెలిచినప్పటికీ అది జాతీయ పార్టీ కాజాలదు. బీజేపీకి ఇప్పుడే ప్రత్యా మ్నాయం కాబోదు. ఇప్పటికీ ప్రత్యామ్నాయమైన కాంగ్రెస్‌ పార్టీ 2014 నాటి షాక్‌ నుంచి క్రమంగా కోలుకుంటోంది. 30 మాసాల కాలంగా యూపీఏ ప్రభుత్వ హయాంలోని కుంభకోణాల నిజం నిగ్గు తేల్చి శిక్షలు వేయించలేక పోయారు.

కుంభకోణాలను ప్రస్తావించి కాంగ్రెస్‌ పార్టీపై వాగ్దాడి చేయడమే కానీ దోష నిర్ధారణ జరగలేదు. దానిపైన ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఇప్పుడిప్పుడే రాజకీయాలను మనసుకు పట్టించు కొని అర్థవంతంగా మాట్లాడటం నేర్చుకుంటున్నారు. వాగ్ధాటిలో మోదీ స్థాయికి ఎప్పటికీ చేరలేకపోవచ్చును కానీ ప్రత్యర్థి తప్పిదాలు రాహుల్‌కి ఉపకరించ వచ్చు. సామాన్య ప్రజలపైన మోదీ ప్రసంగాల ప్రభావం కొత్తగా ఏమీ ఉండదు. ఆయన వాక్య విన్యాసం, అంగ విన్యాసం ప్రజలకు అలవాటైపోయింది. కాంగ్రెస్‌ పార్టీపైన కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలపైన కానీ ఆయన కొత్తగా చేయగలిగిన ఆరోపణలు ఏమీ లేవు. నల్లధనం ప్రతిపక్షాల దగ్గరే ఉన్నట్టు ప్రధాని మాట్లాడుతున్నారు కానీ ప్రజలు నమ్మరు. నల్లధనం అధికారం ఎవరి దగ్గర ఉంటే వారి దగ్గరే ఉంటుంది. ములాయంసింగ్, మాయావతిపైన కేసులు న్నాయి. వాటిపైన చురుకుగా దర్యాప్తు చేయమంటూ సీబీఐని పురమాయించ వచ్చు. ప్రియాంక భర్త రాబర్ట్‌ వద్రాపైన రాజస్థాన్‌ హైకోర్టు చేసిన నిర్ణయాన్ని వినియోగించుకొని ఉచ్చు బిగించవచ్చు. అంతవరకూ ఆగకుండా అరెస్టుల దాకా పోతే ప్రత్యర్థులకే ప్రయోజనం కలిగే ప్రమాదం ఉంది. కనుక సీబీఐని కొంత మేరకే వినియోగించవచ్చు.

సంక్షోభం సమసి పోతుందా?
పెద్దనోట్ల నిర్ణయం సృష్టించిన అలజడి సద్దుమణగడానికి 50 రోజులు పడు తుందనీ, అంతవరకూ ఓపికపట్టాలనీ ప్రధాని ప్రజలకు నేరుగా విజ్ఞప్తి చేశారు. ఆ గడువును నెలరోజులు పొడిగిస్తూ మరో అభ్యర్థన చేయవచ్చు. ప్రజలు క్యూలకు అలవాటు పడ్డారు. డిజిటల్‌ లావాదేవీలకూ సిద్ధపడుతున్నారు. క్రమంగా కొత్తనోట్ల రాకతో సమస్య తీవ్రత తగ్గిపోవచ్చు. ఈ ఒక్క నిర్ణయం వల్ల ప్రజలకు తీవ్ర అసౌకర్యం కలిగిన మాట వాస్తవమే కానీ మోదీ పట్ల మోజు పూర్తిగా తగ్గిపోయిందని భావించడానికి వీలు లేదు. మోదీ ఏదో స్వార్థబుద్ధితో ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రజలు అనుకోవడం లేదు. తొందరపడి నిర్ణయం ప్రకటించి ఉంటారనీ, పరిస్థితులు క్రమంగా సర్దుకుంటాయనీ, దేశం మేలు కోరే మోదీ ఈ సాహసం చేశారనీ భావించేవారే అధికం. కొన్ని రాష్ట్రాల ముఖ్య మంత్రులు ప్రాప్తకాలజ్ఞత ప్రదర్శించడం ప్రధానికి తోడ్పడుతోంది. నితీశ్‌ కుమార్‌ ఈ విషయంలో అగ్రగణ్యుడు.

నోట్లరద్దు నిర్ణయాన్ని మొదట్లో వ్యతి రేకించిన తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌) ఢిల్లీ వెళ్ళి ప్రధానిని కలిసిన తర్వాత పూర్తిగా మారిపోయారు. అక్బరుద్దీన్‌ ఒవైసీ శుక్రవారంనాడు తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో వ్యాఖ్యానించినట్టు ఎంఐఎం టీఆర్‌ఎస్‌ని సమర్థిస్తుంటే టీఆర్‌ఎస్‌ బీజేపీని బలపరుస్తోంది. శనివారం శాసనమండలిని పూర్తిగా వినియోగించుకొని కేసీఆర్‌ మోదీకి బాగా దగ్గర కావడానికి ప్రయత్నించారు. మోదీతో తాను జరిపిన చర్చల గురించి అనేక విడ తలు ప్రస్తావించారు. గుడ్డిగా వ్యతిరేకించనక్కరలేదు, గుడ్డిగా బలపరచనక్కర లేదు అని అంటూనే, నితీశ్‌కుమార్‌లాగా 50 రోజులు వేచి చూద్దామని చెబు తూనే నోట్ల రద్దు నిర్ణయం మంచిచెడులపైన చర్చ జరగడం సభానియమాలకు విరుద్ధమంటూ ప్రతిపక్షాల ముందరి కాళ్ళకు బంధాలు వేశారు. కేంద్ర నిర్ణ  యాలను శాసనసభలో చర్చించడమే కాదు వాటికి సవరణలు ప్రతిపాదిస్తూ తీర్మానాలు చేసిన సందర్భాలు గతంలో అనేకం ఉన్నాయి. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా వాదించి కేసీఆర్‌ ప్రతిపక్షాలను విజయవంతంగా కట్టడి చేశారు. కేంద్రంపైన, ముఖ్యంగా నరేంద్రమోదీపైన ఈగ వాలనివ్వలేదు. ఒడిశా ముఖ్య మంత్రి నవీన్‌ పట్నాయక్‌ కేంద్రం నుంచి ఆశిస్తున్నది ఏమీ లేకపోవచ్చు. సిద్ధాంతపరంగానే నోట్లరద్దును ఆయన సమర్థించి ఉండవచ్చు.

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు తమ ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. కేసీఆర్‌ ముందు వ్యతిరేకించి తర్వాత మద్దతు ప్రకటిస్తే, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ముందు మద్దతు తెలిపి ప్రజలలో నిరసన ప్రబలిన తర్వాత సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇద్దరికీ శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన, అసెంబ్లీ స్థానాల పెంపు అవసరం. ఈ మేరకు ఇద్దరి అర్జీలూ ప్రధాని ఎదుట నిరీక్షిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకించవలసిన అవ సరం కేసీఆర్‌కు లేదు. దానివల్ల ప్రయోజనం లేదు. కేసీఆర్‌కు చంద్రబాబు నాయుడికి ఉన్నంత ప్రైవేటు వ్యామోహం లేకపోయినప్పటికీ ప్రైవేటు పబ్లిక్‌ భాగస్వామ్యానికి (పీపీపీ) తెలంగాణ ముఖ్యమంత్రి వ్యతిరేకం కాదు. మోదీతో సిద్ధాంతపరంగా విభేదించే పరిస్థితి లేదు. నోట్ల రద్దు అంశంపైన ప్రతిపక్షాల మధ్య ఐక్యత వర్ధిల్లినప్పటికీ పార్లమెంటు శీతాకాల సమావేశాల చివరిరోజున ఇతర ప్రతిపక్షాలతో చెప్పకుండా కాంగ్రెస్‌ నాయకులు ప్రధానిని కలసి సమైక్యతకు విఘాతం కలిగించారు. యూపీలో ఎస్‌పీ అధికారంలో ఉంది. బిఎస్‌పీ అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తోంది. ఆ రెండు పార్టీల మధ్య సఖ్యత ఎంతకాలం ఉంటుంది? మోదీని రాహుల్‌ కలవడం కేవలం ఒక సాకు. ప్రతిపక్షాల మైత్రి నిలిచేది కాదు. దాని స్వభావమే అంత. నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సహకరించడం, ఇతర ప్రతిపక్షాలలో ఐక్యత లేకపోవడం మోదీకి సానుకూలమైన అంశం. యూపీ ఎన్నికలలో ఘనవిజయం సాధించ నక్కరలేదు. పాస్‌ మార్కులు సంపాదిస్తే చాలు. పాస్‌ మార్కులైనా వస్తాయా, రావా అన్నదే మోదీ అనుమానం. అందుకే ఆయన వదనంలో ఆందోళన ఛాయలు.

- కె. రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement