కాళేశ్వర స్వప్న సాకారం | Kaleshwaram Project Will Change Telangana Agriculture | Sakshi
Sakshi News home page

కాళేశ్వర స్వప్న సాకారం

Published Sun, Apr 15 2018 12:27 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

Kaleshwaram Project Will Change Telangana Agriculture - Sakshi

ఒక బృహత్తరమైన ప్రాజెక్టును స్వప్నించి, సకల అనుమతులూ సాధించి, కోర్టు కేసులను అధిగమించి, పొరుగు రాష్ట్రంతో వివాదం పరిష్కరించుకొని, నిధులు సమకూర్చుకొని, నిర్మాణం పూర్తి చేసి, సాగునీరూ, తాగునీరూ అందించడం అనే మహాయజ్ఞాన్ని అయిదేళ్ళ వ్యవధిలో పూర్తి చేయడం దేశంలో ఎక్కడా ఇంతవరకూ జరగలేదు. నాగార్జునసాగర్‌ బహుళార్థ సాధక ప్రాజెక్ట్‌కు ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1955 డిసెంబర్‌ 10న శంకుస్థాపన చేసినప్పుడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి బెజవాడ గోపాలరెడ్డి, హైదరాబాద్‌ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావడానికి పుష్కరకాలం పట్టింది. 1967లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ సాగర్‌ జలాశయం నుంచి కుడి, ఎడమ కాలువలకు నీరు వదిలి ప్రాజెక్టును ప్రారంభించినప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి. నర్మదానదిపైన సర్దార్‌ సరోవర్‌ డామ్‌కు నెహ్రూ 1961 ఏప్రిల్‌ 5న శంకుస్థాపన చేస్తే 55 సంవత్సరాల అనంతరం డామ్‌ను ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. 

భాక్రా–నంగల్‌ డామ్‌ నిర్మాణం తొమ్మిదేళ్ళలో పూర్తయింది. దానికి శంకుస్థాపన (1955), ప్రారంభోత్సవం (1963) కూడా నెహ్రూ చేతుల మీదుగా జరగడం విశేషం. జవహర్‌లాల్‌ నెహ్రూ దేశానికి మేలు చేయలేదనీ, తీరని అపకారం చేశారనీ వాదించే కొందరు వర్తమాన రాజకీయ నాయకులు చరిత్ర తెలుసుకుంటే మంచిది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు అతి తక్కువ కాలంలో నిర్మించిన అతిపెద్ద ప్రాజెక్టుగా చరిత్రకు ఎక్కనున్నది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం 2007–08లో నిర్మాణం ప్రారంభించిన డాక్టర్‌ బిఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత–చేవెళ్ళ సుజల స్రవంతి పథకానికి అధిగమించలేని అడ్డంకులు కొన్ని ఉన్నాయి. ఈ ఎత్తిపోతల పథకం లక్ష్యం తమ్మిడిహట్టి (పెన్‌గంగ, వార్థా నదుల సంగమ ప్రదేశం) వద్ద 152 మీటర్ల పూర్తి స్థాయి మట్టంతో బ్యారేజి నిర్మించి 160 టీఎంసీల ప్రాణహిత నీటిని ఎల్లంపల్లి బ్యారేజికి తరలించడం. అక్కడి నుంచి మిడ్‌మానేరు, తడ్కపల్లి, పాములపర్తి, చేవెళ్లకు నీరు చేరవేయడం. ఈ ప్రాజెక్టు కింద 16. 40 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటుందని అంచనా. తమ భూభాగంలో ముంపును అనుమతించబోమంటూ సరిహద్దులోని మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం చెప్పింది. తమ్మిడిహట్టి బ్యారేజీ ఎఫ్‌ఆర్‌ఎల్‌ (ఫుల్‌ రివర్‌ లెవల్‌)ని 148 మీటర్లకు తగ్గించాలని ఉడుంపట్టు పట్టింది.

ప్రాణహిత ప్రాజెక్టులో ప్రతిపాదించిన జలాశయాల సామర్థ్యంపైన కేంద్ర జలసంఘం అనుమానాలు వెలిబుచ్చింది. ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వ అంచనా ప్రకారం ఎగువ ప్రాజెక్టుల అవసరాలకు పోను తమ్మిడిహట్టి ప్రాజెక్టు వద్ద 273.14 టిఎంసీల నీరు లభ్యం అవుతుంది. కానీ జలసంఘం లెక్కల ప్రకారం అక్కడ లభ్యమయ్యే నీటి పరిమాణం 165 టీఎంసీలకు మించదు. ఇందులో 63 టీఎంసీలు ఎగువ ప్రాజెక్టులు వాడుకుంటున్నాయని జలసంఘమే చెప్పింది. అందువల్ల తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు నిర్మించడం గురించి పునరాలోచించాలని సూచించింది. శాస్త్రీయంగా అధ్యయనం చేసి, సర్వేలు జరిపిన తర్వాత కాళేశ్వరం దిగువన మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు నిర్మించడం ఉత్తమం అని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అక్కడ 283 టీఎంసీల నీటి లభ్యత ఉంటుందని అంచనా వేసింది. అందువల్ల ప్రాణహిత–చేవెళ్ళ ప్రాజెక్టును సమూలంగా మార్చవలసి (రీడిజైనింగ్‌ చేయవలసి) వచ్చింది.

రీడిజైనింగ్‌ ఆవశ్యకత
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును రెండుగా విభజించింది. ఒకటి, బిఆర్‌ అంబేడ్కర్‌ ప్రాణహిత ప్రాజెక్టు. తమ్మిడిహట్టి దగ్గర 148 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌ వద్ద ప్రాజెక్టు నిర్మించి 20 టీఎంసీల నీరు తరలించి ఆదిలాబాద్‌ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడం. రెండు, కాళేశ్వరం ప్రాజెక్టు. కాళేశ్వరం దిగువన మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎఫ్‌ఆర్‌ఎల్‌తో ఒక బ్యారేజీ నిర్మించడం, దానికి ఎగువన అన్నారం, సుందిళ్ళ గ్రామాల వద్ద రెండు బ్యారేజీలు నిర్మించడం, 180 టీఎంసీల నీరు మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లికి ఎత్తిపోయడం కొత్త ప్రణాళిక. 13 కొత్త జిల్లాలలోని 18. 25 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన జలాశయాలూ, టన్నళ్ళూ, పంప్‌హౌజ్‌లూ, కాలువలూ గట్రా నిర్మించాలి. ఇంత భారీ ప్రాజెక్టును నెత్తికెత్తుకోవడం ఒక సాహసం. అత్యంత క్లిష్టమైన ఈ ప్రాజెక్టు అన్ని అవరోధాలనూ దాటుకుంటూ వచ్చింది. పనులు వేగంగా, సమర్థంగా జరుగుతున్నాయి. నీటి పారుదల మంత్రి హరీష్‌రావు పరుగెడుతూ, నిర్మాణ సంస్థలనూ, ప్రభుత్వ యంత్రాంగాన్నీ పరుగెత్తిస్తున్నారు. పనులను పర్యవేక్షించేందుకు ఇంతవరకూ 20 విడతల ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాలను మంత్రి సందర్శించారు. ప్రాజెక్టు రూపశిల్పి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్‌). శంకుస్థాపన చేయడం, ఇటీవల గవర్నర్‌ నరసింహ న్‌తో కలసి ప్రాజెక్టును సందర్శించడంతో పాటు కేసీఆర్‌ పనుల పురోగతిని వీడియోల ద్వారా ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వానికీ, తెలం గాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌)కీ ఈ ప్రాజెక్టు అత్యంత ప్రతిష్ఠాత్మకమైనది. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తలపెట్టిన మూడు ఘనకార్యాలు. 2019 ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడానికి మునుపే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా సాగునీటిని రైతులకు అందించాలని ప్రయత్నం. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పడిన కొత్తల్లో జర్నలిస్టులకు అక్రెడిటేషన్‌ మంజూ రుకు అనుసరించవలసిన విధివిధానాలను రూపొందించే కమిటీకి నాయకత్వం వహించే అవకాశం నాకు ప్రభుత్వం కల్పించింది. కమిటీ నాలుగు విడతల సమాలోచన జరిపి తయారుచేసిన నివేదికను సమర్పించేందుకు బాధ్యులమంతా కేసీఆర్‌ దగ్గరికి వెళ్ళాం. నివేదికను స్వీకరించి, వివరాలు టూకీగా తెలుసుకున్న అనంతరం హాలులో రెండు పాయలుగా కుర్చీలు వేయాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. మమ్మల్ని కూర్చోమన్నారు. ప్రాణహిత–చేవెళ్ళ ప్రాజెక్టు రీడిజైనింగ్‌ (పునఃరూపకల్పన) ఏ విధంగా చేసిందీ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ స్వయంగా చేస్తూ వివరించారు. తర్వాత అసెంబ్లీలోనూ కాళేశ్వరం రూపురేఖలు ఎట్లా ఉండబోతున్నాయో, ప్రాణహిత–చేవెళ్ళ సుజల స్రవంతి పథకాన్ని ఎందుకు మార్చవలసివచ్చిందో చెప్పారు. అసెంబ్లీలో జరిగిన చర్చను ఆలకించాం. నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ కాళేశ్వరం ప్రాజెక్టు పనులపైన ‘స్టే’ ఇవ్వడం గమనించాం.

ప్రభుత్వం భూసేకరణ విషయంలో 2013 నాటి చట్టాన్ని విధిగా పాటించాలంటూ కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన ఎక్స్‌పర్ట్‌ అప్రైజల్‌ కమిటీ షరతు విధించిందని తెలుసుకున్నాం. ఈ చట్టాన్ని పూర్వపక్షం చేస్తూ 2015లో ప్రభుత్వం 123 వ నంబరు జీవో జారీ చేసింది. దాన్ని హైకోర్టు నిరుడు కొట్టివేసింది. వెంటనే కొత్త భూసేకరణ బిల్లును అసెంబ్లీ ఆమోదించింది. రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. గ్రీన్‌ ట్రిబ్యూనల్‌ ‘స్టే’ని ఉమ్మడి హైకోర్టు ఎత్తివేసింది. ఈ ప్రాజెక్టుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అభ్యంతరం తెలిపింది. అంతకు మునుపే గోదావరి రివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డు (జీఆర్‌ఎంబీ) కేంద్ర జలసంఘానికి రాసిన లేఖలో పెక్కు అభ్యంతరాలను లేవనెత్తింది. ఎంత విస్తీర్ణానికి సాగునీరు అందుతుందనే విషయంలోనూ, ఎంత నీరు మళ్ళిస్తారనే అంశంలోనూ, ఎంత ప్రాంతం ముంపునకు గురి అవుతుందనే వివరాలలోనూ, అంత భారీ స్థాయిలో నీటిని పంపు చేయడానికి అవసరమైన విద్యుచ్ఛక్తి తెలంగాణలో ఉన్నదా అనే ప్రశ్నపైనా గోదావరి బోర్డు అనుమానాలు వెలిబుచ్చింది.

ప్రశ్నించడం ప్రజాస్వామ్య హక్కు
భారీ ప్రాజెక్టులను వ్యతిరేకించేవారూ, భూములు కోల్పోతున్న రైతులకు సంతృప్తికరమైన పరిహారం ఇవ్వాలని వాదించేవారూ, పర్యావరణానికి హాని కలగరాదంటూ పోరాడేవారూ, అటవీప్రాంత విస్తీర్ణం తగ్గకూడదని పట్టుపట్టేవారూ అన్ని రాష్ట్రాలలో ఉన్నట్టే తెలంగాణలోనూ ఉన్నారు. వారు ప్రజాకంటకులూ, ప్రగతి నిరోధకులూ కారు. ప్రజాస్వామ్య వ్యవస్థ పౌరులందరికీ ప్రశ్నించే హక్కు ప్రసాదించింది. తమ తరఫున పోరాడేవారు ఉన్నారనే ఎరుకే ప్రజలకు ఆత్మవిశ్వాసం ప్రసాదిస్తుంది. ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల నమ్మకం పెంచుతుంది. సర్దార్‌ సరోవర్‌ నిర్వాసితుల తరఫున మేధాపాట్కర్‌ అనేక సంవత్సరాలు పోరాటం చేసినప్పటికీ ఆమెను ప్రజావ్యతిరేకిగా ఎవ్వరూ అభివర్ణించడం లేదు. అటువంటివారికీ, కేంద్ర సంస్థలకీ, న్యాయస్థానాలకీ నచ్చజెప్పి నెగ్గుకు రావడం పాలకుల బాధ్యత. ప్రగతి ఫలాలు ప్రజలకు అందివచ్చినప్పుడు నిర్మాణ క్రమంలో ఎదురైన వివాదాలను విస్మరిస్తాం. తెలంగాణ ప్రభుత్వం చాలా సమస్యలను చాకచక్యంగా పరిష్కరించింది. కేసీఆర్‌ ముంబయ్‌ వెళ్ళి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో చర్చించి, ఆయన భయసందేహాలను తీర్చి, ఉభయతారకంగా పరి ష్కారం ప్రతిపాదించి, ప్రాజెక్టు నిర్మాణానికి సమ్మతింపజేశారు. వివిధ జాతీయ సంస్థల నుంచి అనుమతులు సంపాదించారు. అయినప్పటికీ క్షేత్ర స్థాయిలో పనులు ఎట్లా జరుగుతున్నాయనే విషయంలో నాబోటివారికి అవగాహన లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ప్రగతిని చూసిరావాలని అనుకుంటూనే నెలలు గడిచిపోయాయి. 

మసూద్‌ పర్యటన
‘కేంద్ర జలసంఘం (సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌) అధ్యక్షుడూ, నేనూ హెలికాప్టర్‌లో కాళేశ్వరం వెడుతున్నాం. ఉదయం వెళ్ళి సాయంత్రం తిరిగి రావచ్చు. మాతో మీరూ వస్తే బాగుంటుంది,’ అని హరీష్‌ పిలిచారు. వారితో కలసి సోమవారంనాడు (ఏప్రిల్‌ 9) నేనూ, బుద్ధవనం ప్రాజెక్టు సారథి మల్లెపల్లి లక్ష్మయ్య వెళ్ళాం. కేంద్ర జలసంఘం అధ్యక్షుడు మసూద్‌ హుస్సేన్, మరి ఇద్దరు కేంద్ర అధికారులూ, తెలంగాణ రాష్ట్ర ఇంజనీర్‌–ఇన్‌–చీఫ్‌ మురళీధరరావు, చీఫ్‌ ఇంజ నీర్‌ హరేరామ్‌ అధికార బృందంలో ఉన్నారు. హెలికాప్టర్‌ ఎక్కడానికి ముందు, ఎక్కిన తర్వాత మసూద్‌ హుస్సేన్‌ మనసులో ఏమున్నదో తెలియదు. ఏమి చూడబోతున్నారో ఊహించి ఉండరు. కేంద్ర జలసంఘం అధికారులకు ఇతర సంస్థల నుంచి అందిన సమాచారం ప్రోత్సాహకరంగా లేదు. కొత్త రాష్ట్రం, చిన్న రాష్ట్రం ఇంత భారీ ప్రాజెక్టును నిర్మించగలదా అనే సందేహం ఢిల్లీలో చాలామందికి ఉంది. మొదటి మజిలీ మేడిగడ్డలో హెలికాప్టర్‌ దిగిన తర్వాత అక్కడ చకచకా జరుగుతున్న పనులు గమనిస్తుంటే ఆయనకు అడుగడుగునా విస్మయం. అనంతరం అన్నారంలో అద్భుతాలు చూసి ఆనందం. మూడో అడుగు ఎల్లంపల్లిలో. అన్నారం, ఎల్లంపల్లిలో టన్నెళ్ళ, పంపుహౌస్‌ల చూసి పరవశం. చివరగా భూగర్భంలో సబ్‌స్టేషన్‌ నిర్మాణం తిలకించిన తర్వాత పులకింత.

మసూద్‌ హుస్సేన్‌ వంటి అనుభవజ్ఞుడైన ఇంజనీర్‌ పర్యటన ముగింపు దశలో రామడుగు (కరీంనగర్‌ జిల్లా)లో మీడియా ప్రతినిధులను కలుసుకునే సమయానికి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అన్ని అనుమానాలూ నివృత్తి చేసుకొని నిర్వాహకులను మనసారా అభినందించడానికి సిద్ధమైపోయారు. మీడియా గోష్ఠిలో తెలంగాణ సర్కార్‌నూ, హరీష్‌రావునూ ప్రశంసలతో ముంచెత్తారు. ఇటువంటి ప్రాజెక్టును ఇంతకు మునుపు ఆయన ఎక్కడా చూడలేదు. ఇంత వేగంగా దేశంలో మరెక్కడా పని జరగడంలేదు. ఇంత జటిలమైన ప్రాజెక్టు, ఇంత ఎత్తుకు (మేడిగడ్డ నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకూ సుమారు 520 మీటర్లు ఎత్తు) నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టు దేశంలో మరొకటి లేదు. వివాదాలూ, అభ్యంతరాలూ, వ్యాజ్యాలూ ఒక వైపు సాగుతుంటే మరోవైపు ప్రాజెక్టు నిర్మాణం పని ఆగకుండా రహస్యోద్యమంలాగా కొనసాగింది. కలసి వచ్చిన అంశం ఏమంటే భారీ నిర్మాణాల అనుభవం కలిగిన ఎల్‌ అండ్‌ టి, నవయుగ, మెఘా, ఆఫ్కాన్స్,హెచ్‌ఇఎస్, సీమన్స్‌ వంటి కంపెనీలు కాలంతో పరుగులు తీస్తూ పనులు పూర్తి చేస్తున్నాయి. బీహెచ్‌ఇఎల్‌ పూర్తి స్థాయిలో పాలు పంచుకుంటున్నది. తెలంగాణ ఉద్యమానికి మూలకారణమైన మూడు అంశాలు నీరు, నిధులు, నియామకాలు. సాగునీటి సమస్య పరి ష్కారానికి ఈ ప్రాజెక్టు నిశ్చయంగా దోహదం చేస్తుంది. 

కె. రామచంద్రమూర్తి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement