ఇన్ని విన్యాసాలు అవసరమా? | sakshi ED k ramchandramurthy article on amaravathi | Sakshi
Sakshi News home page

ఇన్ని విన్యాసాలు అవసరమా?

Published Sun, Jul 3 2016 1:49 AM | Last Updated on Wed, Aug 15 2018 8:15 PM

ఇన్ని విన్యాసాలు అవసరమా? - Sakshi

ఇన్ని విన్యాసాలు అవసరమా?

త్రికాలమ్
అసాధారణమైన రాజధాని నగరం నిర్మించే పేరుతో ముఖ్యమంత్రి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. పారదర్శకత లోపించడంతో సాధా రణ ప్రజలలో సైతం అనేక అనుమానాలు బలపడుతున్నాయి. సుప్రీం కోర్టూ, కేల్కర్ కమిటీ, వోహ్రా కమిటీలు చేసిన హెచ్చరికలు దడ పుట్టిస్తున్నాయి. రెండేళ్ళుగా రాష్ట్రంలో జరుగుతున్న ఏకపక్ష నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే, ‘స్విస్ చాలెంజ్ పద్ధతి’ విషయంలో ప్రజలను ఒప్పించిన తర్వాతనే అడుగు ముందుకు వేయాలి. లేకపోతే ఏకపక్షం అవుతుంది. అప్రజాస్వామికం అవుతుంది.
 
చైనా పర్యటన ముగించుకొని వచ్చిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్ర బాబునాయుడు ఆ దేశంలో జరిగిన అద్భుత ప్రగతి గురించి ప్రశంసాత్మకంగా వివరించారు. అరవై అంతస్తుల భవనాన్ని నెలరోజులలో నిర్మించిన సాంకేతిక పరిజ్ఞానం చైనా సొంతమని వెల్లడించారు. న్యూక్లియర్ సప్లయర్స్ గ్రూపు (ఎన్‌ఎస్‌జీ)లో చేరడానికి ఇండియా  చేసిన ప్రయత్నానికి చైనా మోకాలడ్డిన తర్వాత ఆ దేశాన్ని ముఖ్యమంత్రి స్తుతించడం విశేషం. అభివృద్ధి సాధించాలనే సంకల్పంతో, ప్రపంచంలోనే అత్యుత్తమమైన రాజధాని నగరంగా అమరావతిని నిర్మించాలన్న ఆకాంక్షతో, ఇంద్రుడి తలదన్నాలనే ఉబలాటంతో చేసే ఏకపక్ష నిర్ణయాల వల్లా, సింగపూర్ కన్సార్టియం పెట్టే షరతులన్నిటినీ ఒప్పుకోవడం వల్లా  ప్రజలకు హాని జరగకుండా జాగ్రత్తపడాలి. చైనా వెళ్ళడానికి ముందు చంద్రబాబునాయుడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్వహించారు.

అమరావతి నిర్మాణంలో ‘స్విస్ చాలెంజ్ పద్ధతి’ని అమలు చేయడానికి మంత్రివర్గం ఆమో దించిందని చెప్పారు. 6.84 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో సీడ్ కేపిటల్‌ను నిర్మించే నిమిత్తం 1,691 ఎకరాలను అభివృద్ధి చేసే కాంట్రాక్టును సింగపూర్ కన్సార్టియంకు ఇవ్వబోతున్నట్టు కూడా తెలిపారు. అద్భుతమైన శిఖరం (ఐకా నిక్ టవర్) నిర్మాణానికి 50 ఎకరాలు ఇచ్చారు. మరి 200 ఎకరాలు కన్సా ర్టియంకు అమ్మివేశారు. తక్కిన విస్తీర్ణంలో పరిశ్రమలూ, వాణిజ్య సము దాయాలూ ఏర్పాటు చేయడానికి వీలుగా భూమిని అభివృద్ధి చేస్తారు. భూమి అమ్మగా వచ్చిన ఆదాయంలో ఖర్చులు పోను మిగిలిన మొత్తాన్ని కన్సా ర్టియం, కేపిటల్ సిటీ డెవలప్‌మెంట్ మేనేజింగ్ కంపెనీ (సీసీడీఎంసీ)లు 58:42 నిష్పత్తిలో పంచుకుంటాయి. ఇదంతా స్విస్ చాలెంజ్ మెథడ్ (ఎస్‌సీఎం) కింద ఇచ్చే కాంట్రాక్టు ప్రకారం జరుగుతుంది.

‘స్విస్ చాలెంజ్’ అంటే?
పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ (పీపీపీ) విధానం కింద ఒకానొక ప్రాజెక్టునూ, పెట్టుబడిపెట్టే ప్రైవేటు భాగస్వామినీ ఎంచుకునేందుకు కొత్తగా అమలులోకి వచ్చిన పద్ధతి ‘స్విస్ చాలెంజ్’. ఈ పద్ధతి వల్ల పనులు సకాలంలో జరిగే అవకాశం ఉన్నది. ప్రభుత్వం వద్ద నిధులు లేని కారణంగా ప్రాజెక్టులు మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉండదు. సృజనాత్మకంగా పని త్వరితగతిన, సమర్థంగా పూర్తి చేసిన ప్రైవేటు భాగస్వామికి ప్రోత్సాహకం ఇచ్చే వీలు ఈ పద్ధతి కల్పిస్తుంది. మొత్తం ప్రాజెక్టును పూర్తిచేసే బాధ్యత ప్రైవేటు భాగస్వామిది.

అందుకు అవసరమైన భూమినీ, ఇతర ప్రాథమిక సౌకర్యాలనూ అందించే బాధ్యత  ప్రభుత్వానిది. ఒక ప్రైవేట్ డెవలపర్ ఏదైనా ప్రాజెక్టుకు రూపకల్పన చేసి ఫలానా విధంగా దాన్ని నిర్మిస్తానని ప్రతిపాదించవచ్చు. ఇటువంటి ప్రతిపాదనను అన్‌సాలిసిటెడ్ బిడ్ అంటారు. అంటే ప్రభుత్వం అడగకుండానే ప్రైవేటు భాగస్వామిగా పని చేసేందుకు ముందుకు వచ్చిన సంస్థ చేసిన ప్రతిపాదన. ఈ ప్రతిపాదనకు విస్తృతమైన ప్రచారం ఇచ్చి దానికి పోటీగా ఏ ప్రైవేట్ సంస్థలైనా మెరుగైన ప్రతిపాదనలు సమర్పించవచ్చునని ప్రభుత్వం ప్రకటిస్తుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ పని చేస్తానని కానీ మెరుగైన పని చేస్తానని కానీ ఏ సంస్థ అయినా ముందుకు రావచ్చు. అదే ఖర్చుతో అంతే వాసిగల పని చేస్తానని అన్‌సాలిసిటెడ్ బిడ్డర్ అంగీకరిస్తే ఆ కాంట్రాక్టు అన్‌సాలిసిటర్ బిడ్డర్‌కే దక్కుతుంది. ఈ క్రమంలో పాలకులు పక్షపాతంగా వ్యవ హరించే అవకాశం ఉన్నదనీ, ఆశ్రీత పెట్టుబడిదారులు (క్రోనీ కేపిటలిస్టులు) లబ్ధిపొందే వీలున్నదనీ, అవినీతికి ఆస్కారం ఉన్నదని కూడా కేంద్ర ప్రభుత్వం నియమించిన కేల్కర్ కమిటీ నిర్ధారించింది.

కేంద్ర ఆర్థికశాఖ మాజీ కార్యదర్శి కేల్కర్ నాయకత్వంలోని ఈ కమిటీ నివేదికను 2015 డిసెంబర్‌లో ప్రభుత్వానికి సమర్పించింది. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ కూడా ‘స్విస్ చాలెంజ్’లో అక్ర మాలకు ఆస్కారం ఉన్నదనే అభిప్రాయం వెలిబుచ్చింది. పాలకులకూ, కాంట్రా క్టర్లకూ మధ్య అక్రమ సంబంధం హద్దులు మీరిన ఈ రోజుల్లో ఈ పద్ధతిని దుర్వినియోగం చేసే అవకాశం ఉన్నదనే అభిప్రాయం ప్రబలంగా ఉంది. సహజ వనరులనూ, ప్రభుత్వ నిధులనూ స్వార్థశక్తులు స్వప్రయోజనాలకు వినియోగిం చుకునే ప్రమాదం ఉన్నది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం నియమించిన ఎన్‌ఎన్ వోహ్రా కమిటీ సైతం ధ్రువీకరించింది.  అన్‌సాలిసిటర్ బిడ్డర్‌ను సవాలు చేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా వారి అర్హతలను నిర్ణయించే అధికారం ప్రభుత్వ సంస్థలదే. అక్రమాలు జరగకుండా నివారించే న్యాయపరమైన, పటి ష్ఠమైన నియంత్రణ వ్యవస్థ మన దేశంలో ఇంకా ఏర్పడలేదు. మనదేశ ప్రగతి యాత్రలో ఇంతవరకూ పీపీపీ పద్ధతి ప్రైవేటు సంస్థలకు ప్రయోజనం కలిగిం చిన దృష్టాంతాలే ఎక్కువ. అందుకే భయాలు.

అసమానమైన ఒప్పందం
రాజధాని ప్రాంతంలో ఇప్పుడున్న ధరల ప్రకారం ఎకరం వెల నాలుగు లేదా అయిదు కోట్ల రూపాయలు. సింగపూర్ కన్సార్టియంకు ఎకరం నాలుగు కోట్ల రూపాయల వంతునే ప్రభుత్వం భూమిని విక్రయించింది. మొత్తం 1,691 ఎకరాలలో సింగపూర్ కన్సార్టియంకు ఇచ్చిన, విక్రయిచిన 250 ఎకరాలు తీసివేస్తే మిగిలేది 1,441 ఎకరాలు. ఎకరం  నాలుగు కోట్లు అనుకుంటే 1,441 ఎకరాల విలువ రూ. 5,764 కోట్లు. ఇంత విలువైన భూమి ఇవ్వడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం రోడ్లు, విద్యుచ్ఛక్తి, నీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలి. ఇందుకు చాలా ఖర్చు అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంత చేసిన తర్వాత సింగపూర్ కంపెనీలు చేసే వ్యయం లేదా పెట్టే పెట్టుబడి కేవలం రూ. 306 కోట్లు. ప్రాథమిక సదుపాయాల కోసం పెట్టే ఖర్చు పక్కన పెట్టినా, భూమి రూపంలో ప్రభుత్వం పెట్టుబడి రూ. 5,764 కోట్లు, సింగపూర్ కంపెనీల పెట్టుబడి రూ. 306 కోట్లు అయినప్పుడు ఆదాయాన్ని ప్రభుత్వం, సింగపూర్ కంపెనీలు 42:58 నిష్పత్తిలో పంచుకోవడంలో అర్థం ఉన్నదా? ఇది సింగపూర్ కంపెనీలకు పూర్తిగా లాభదాయకమైన, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పూర్తిగా నష్టదా యకమైన ప్రతిపాదన కాదా? పైగా ఎటువంటి షరతులకు ఒప్పుకున్నారు? ఈ ప్రాజెక్టు నుంచి ప్రభుత్వం తప్పుకుంటే మొత్తం ఖర్చుకి 150 శాతం కన్సా ర్టియంకు చెల్లించాలి.

విపత్తులు సంభవిస్తే వంద శాతం నష్టాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాలి. ఏమైనా వివాదాలు వస్తే లండన్ కోర్టులో తేల్చుకోవాలి. ‘నా నోట్లో నువ్వు వేలు పెట్టు, నీ కంట్లో నేను వేలు పెడతాను’ అన్నట్టు ఉన్న టువంటి షరతులకు తలవొగ్గి సింగపూర్ కన్సార్టియంతో వ్యవహారం చేయడం అవసరమా? ఇంతకీ అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్, సెంబ్‌కార్ప్ కంపెనీలతో కూడిన కన్సార్టియం ఏమి చేస్తుంది. రియల్ ఎస్టేట్ కంపెనీ చేసే పని చేస్తుంది. భూమిని అభివృద్ధి చేసి ప్లాట్లు వేసి విక్రయించడం. ఈ పనులూ, తర్వాత జరిగే నిర్మాణం పనులు చేసేది స్వదేశీ కాంట్రాక్టర్లే. సింగపూర్ కన్సార్టియంలో ఉన్న కంపెనీలు ఇదివరకు చైనాలో, వియత్నాంలో, ఇండియాలోని కొన్ని రాష్ట్రాలలో పనులు చేసినప్పుడు కూడా ఇదే రకమైన షరతులు విధించాయా? రాబడిలో ఇంత శాతం వాటా పొందాయా? ఈ ప్రశ్నలకు సంతృప్తికరమైన సమాధానం చెప్పి ప్రజలనూ, రాజకీయ పక్షాలనూ ఒప్పించవలసిన బాధ్యత ప్రభుత్వానిది. ప్రశ్నించినవారందరినీ అభివృద్ధి నిరోధకులంటూ, రాజధాని నిర్మాణానికి వ్యతి రేకులంటూ దబాయించి నోరుమూయించే ప్రయత్నం మానుకోవాలి. విశ్రాంత ఐఏఎస్ అధికారి ఇఏఎస్ శర్మ వంటి విజ్ఞులు సంధిస్తున్న లేఖాస్త్రాలకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ ప్రత్యుత్తరాలు రాయాలి.
 
2001 ఏపీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ ఎనేబ్లింగ్ యాక్ట్‌లోని  2(జి) సెక్షన్ ప్రకారం ప్రైవేటు భాగస్వామికి 49 శాతం ఈక్విటీ కంటే ఎక్కువ వాటా ఇవ్వకూడదు. ఏపీ ప్రభుత్వం సింగపూర్ కన్సార్టియంకు 58 శాతం ఇవ్వడానికి సిద్ధపడుతోంది. స్విస్ చాలెంజ్ కింద ప్రైవేటు భాగస్వాములతో సమాలోచనలు జరిపి, నిర్ణయాలు తీసుకునే అధికారం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీకీ, దాని తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికీ ఉన్నది. కానీ సింగపూర్ కంపెనీలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ చర్చలు జరపడం లేదు. ఆర్థికశాఖ కార్యదర్శికి ప్రమేయం లేదు.  స్వయంగా ముఖ్యమంత్రే సమాలోచనలు జరుపుతున్నారు.

ఎందుకీ డొంకతిరుగుడు?
ఇప్పటికే సింగపూర్ కన్సార్టియం అన్‌సొలిసిటెడ్ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభు త్వానికి సమర్పించింది. ఒకటి, రెండు రోజుల్లో ప్రభుత్వం ఉత్తర్వు (జీవో) జారీ చేస్తుంది. అన్‌సాలిసిటెడ్ ప్రతిపాదనకు పోటీగా ఎవరైనా బిడ్ చేయ వచ్చునని ప్రకటించి అందుకోసం 45 రోజులు గడువు ఇస్తుంది. రేపు సబ్ కాంట్రాక్టు తీసుకునే కంపెనీల చేత బిడ్ వేయించి, వాటికి నచ్చజెప్పి తిరిగి సింగపూర్ కన్సార్టియంకే కాంట్రాక్టు దక్కేటట్టు చంద్రబాబునాయుడు చక్రం తిప్పుతారని అభిజ్ఞవర్గాలలో నలుగుతున్న మాట. ఇంత చుట్టు ఎందుకు తిప్పు తున్నారు? సింగపూర్ ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ఒప్పందం కుదుర్చుకున్నా మూడో భాగస్వామిగా కేంద్ర ప్రభుత్వం ఉండాలి. కేంద్ర ప్రభుత్వం ప్రమేయం లేకుండా చేసేందుకు సింగపూర్ కన్సార్టియంతో ఆంధ్ర ప్రదేశ్ కంపెనీ అయిన సీసీడీఎంసి (దీనికి ముఖ్యమంత్రి అధ్యక్షులు) ఒప్పందం కుదుర్చుకుంటుంది.

ఇది రెండు వ్యాపార సంస్థల మధ్య ఒప్పందం. ఈ వ్యవహారాన్ని ప్రశ్నించే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. ఖరీదైన రాజధాని నగరానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వదు. పదిహేను సంవత్సరాల కిందట ఏర్పడిన చత్తీస్‌గఢ్ రాష్ట్రం నయారాయపూర్‌లో రాజధాని నిర్మించుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఇంతవరకూ ఇచ్చింది వేయి కోట్ల రూపాయలే. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేంద్ర ఇచ్చే మొత్తం రూ. 2,500 కోట్లు మాత్రమేనంటూ కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ స్పష్టం చేశారు. ఈ మొత్తం అండర్‌గ్రౌండ్ వైరింగ్‌కు కూడా సరిపోదంటూ చంద్ర బాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్రం ఇప్పటికే కృష్ణా, గుంటూరు జిల్లా లకు చెరి రూ. 500 కోట్ల చొప్పున ఇచ్చింది. ఇక మిగిలింది రూ. 1,500 మాత్రమే. ఇది ఏ మూలకూ చాలదు.

అందుకే సింగపూర్ కన్సార్టియంతో కలిసి భూమి అభివృద్ధి వ్యాపారం చేసి, అందులో వచ్చే వేల కోట్ల లాభంతో రాజధాని నిర్మించాలనీ, అందుకు తన తెలివితేటలన్నీ వినియోగించాలన్నది చంద్రబాబునాయుడు వ్యూహం. డబ్బు లేకుండా, కేవలం రైతుల నుంచి సేకరించిన భూమిని (ల్యాండ్‌బ్యాంక్) వినియోగించుకొని అసాధారణమైన రాజధాని నగరం నిర్మించే పేరుతో ముఖ్యమంత్రి రకరకాల విన్యాసాలు చేస్తున్నారు. పారదర్శకత లోపించడంలో సాధారణ ప్రజలలో సైతం అనేక అనుమానాలు బలపడుతున్నాయి. సుప్రీంకోర్టూ, కేల్కర్ కమిటీ, వోహ్రా కమిటీలు చేసిన హెచ్చరికలు దడపుట్టిస్తున్నాయి. రెండేళ్ళుగా రాష్ట్రంలో జరుగుతున్న ఏకపక్ష నిర్ణయాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అందుకే, ‘స్విస్ చాలెంజ్ పద్ధతి’ విషయంలో ప్రజలను ఒప్పించిన తర్వాతనే అడుగు ముందుకు వేయాలి. లేకపోతే ఏకపక్షం అవుతుంది. అప్రజాస్వామికం అవు తుంది. అడ్డదారి అవుతుంది.

సాక్షి ఎడిటోరియల్ డైరెక్టర్,
కె.రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement