అలాగైతే స్విస్ చాలెంజ్ ఎలా అవుతుంది? | If so, how will the Swiss Challenge? | Sakshi
Sakshi News home page

అలాగైతే స్విస్ చాలెంజ్ ఎలా అవుతుంది?

Published Fri, Sep 9 2016 1:03 AM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM

అలాగైతే స్విస్ చాలెంజ్ ఎలా అవుతుంది? - Sakshi

అలాగైతే స్విస్ చాలెంజ్ ఎలా అవుతుంది?

ఏపీ ప్రభుత్వాన్ని నిలదీసిన హైకోర్టు
* మీరోవైపు స్విస్ చాలెంజ్ అంటారు.. మరోవైపు ఆదాయ వివరాలు చెప్పనంటారు
* చట్ట ప్రకారం ఆదాయ వివరాలు ప్రాథమిక దశలోనే వెల్లడించాలి
* అప్పుడు సింగపూర్ కన్సార్టియం కన్నా ఉత్తమ కంపెనీలు రావొచ్చు

* 12న మధ్యంతర ఉత్తర్వులు వెలువరిస్తానన్న న్యాయమూర్తి
* వ్యతిరేక ఉత్తర్వులిస్తే ‘సింగపూర్’ వెనక్కిపోయే ప్రమాదం ఉందన్న అటార్నీ జనరల్
* అర్హతల్లేని పిటిషనర్లు ప్రశ్నిస్తున్నారని వెల్లడి


సాక్షి, హైదరాబాద్: రాజధాని ప్రాంత అభివృద్ధి విషయంలో ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వివరాలను బహిర్గతం చేయని ఏపీ ప్రభుత్వాన్ని హైకోర్టు మరోసారి నిలదీసింది. స్విస్ చాలెంజ్ పద్ధతి అని ఒకవైపు చెబుతూ, మరోవైపు ఆదాయ వివరాలను బహిర్గతం చేయకపోవడం ఎంతవరకు సహేతుకమని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీని ప్రశ్నించింది. ఆదాయ వివరాలను బహిర్గతం చేయనప్పుడు ఇది స్విస్ చాలెంజ్ విధానం ఎలా అవుతుంద ని నిలదీసింది. ‘నిబంధనల ప్రకారం ప్రాథమిక దశలోనే ఆదాయ వివరాలను వెల్లడించాలి. మరింత మంది పోటీదారులు వస్తే నాణ్యత పెరిగేందుకు అవకాశం ఉంటుంది. ఆదాయ వివరాలను బహిర్గతం చేయకపోతే పోటీదారులు ఎలా స్పందిస్తారు. అసలు సింగపూర్ కన్సార్టియం ప్రతిపాదించిన ఆదాయ వివరాలు సీల్డ్ కవర్‌లో ఉన్నాయని, ఆ వివరాలు ఎవరికీ తెలియవని చెబుతున్నారు.

మరి అవి ప్రభుత్వానికి ప్రయోజనకరంగా ఉన్నాయనే నిర్ణయానికి ఎలా వచ్చారు.?’ అని హైకోర్టు ప్రశ్నించింది. సింగపూర్ కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనల విషయంలో ప్రభుత్వం నేరుగా జోక్యం చేసుకోవడంపై కూడా ప్రశ్నల వర్షం కురిపించింది. ఈ నెల 12న మధ్యంతర ఉత్తర్వులు వెలువరిస్తామని తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి ఎం.ఎస్.రామచంద్రరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని ప్రాంత అభివృద్ధి కోసం సింగపూర్ కంపెనీల కన్సార్టియం సమర్పించిన ప్రతిపాదనలకు పోటీగా ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ సీఆర్‌డీఏ జారీ చేసిన టెండర్ నోటిఫికేషన్‌ను, ఆ తర్వాత ఇచ్చిన సవరణ నోటిఫికేషన్‌లను సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఆదిత్య హౌసింగ్, చెన్నైకి చెందిన ఎన్వీయన్ ఇంజనీర్స్ కంపెనీలు వేర్వేరుగా హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాలను జస్టిస్ రామచంద్రరావు గురువారం మరోసారి విచారించారు. సీఆర్‌డీఏ, పురపాలకశాఖల తరఫున అటార్నీ జనరల్ వాదనలు వినిపించారు.
 
నోటిఫికేషన్లు నిలిపివేస్తే
జాతి ప్రయోజనాలకు విరుద్ధమవుతుంది

‘నోటిఫికేషన్ల అమలును నిలిపివేస్తూ ఏవైనా ఉత్తర్వులిస్తే అది జాతి ప్రయోజనాలకు విరుద్ధమవుతుంది. ప్రాజెక్టుపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రధాన ప్రతిపాదకుడైన సింగపూర్ కన్సార్టియం వెనక్కి వెళ్లిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి పిటిషనర్ల వంటి అర్హత లేని వ్యక్తులు దాఖలు చేసే వ్యాజ్యాలను ప్రాథమిక దశలోనే కొట్టేయాలి. సీఆర్‌డీఏ రూపొందించిన నిబంధనలు, విధించిన షరతులపై ఎల్ అండ్ టీ వంటి పెద్ద కంపెనీలే అభ్యంతరం చెప్పలేదు.

ఏ మాత్రం అర్హత లేని ఆదిత్య హౌసింగ్ వంటి కంపెనీలు మాత్రం అభ్యంతరాలు చెబుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయ వివరాలను బహిర్గతం చేయబోమని మేం చెప్పడం లేదు. అర్హత లేని పిటిషనర్ల వంటి కంపెనీలకు వెల్లడించబోమని మాత్రమే చెబుతున్నాం. సాంకేతికంగా అర్హత సాధించిన కంపెనీలకు ఆ వివరాలను వెల్లడిస్తాం. సింగపూర్ కంపెనీల కన్సార్టియంకు మన దేశంలో పనిచేసిన అనుభవంతో పాటు ప్రపంచ స్థాయిలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. అది ప్రతిపాదించిన ఆదాయం సంతృప్తికరంగా లేకపోతే ఆ ప్రతిపాదనలను తిరస్కరిస్తాం. అవసరమైతే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటాం. రాష్ట్ర ప్రభుత్వం తరఫున నేను చెబుతున్న ఈ విషయాన్ని కోర్టు రికార్డ్ చేసుకోవచ్చు.

ప్రభుత్వం నిర్దేశించిన అర్హతల్లో దేన్నీ సంతృప్తిపరిచే స్థితిలో ఆదిత్య హౌసింగ్ లేదు. ఆ కంపెనీ వ్యాజ్యాన్ని కొట్టేసేందుకు ఈ ఒక్క కారణం సరిపోతుంది. పిటిషనర్లను బిడ్లు దాఖలు చేసి ముందు అర్హత సాధించమనండి. వారికి అప్పుడు అన్ని వివరాలు వెల్లడిస్తాం. ఎవరు ఉత్తమ ప్రతిపాదనలు సమర్పిస్తే వారికే ప్రాజెక్టు పనులు దక్కుతాయి. కన్సార్టియం ప్రతిపాదనల్లో భవన డిజైన్లు, వారి ఆలోచనలు, వ్యూహాలు తదితరాలున్నాయి. వాటన్నింటినీ రహస్యంగా ఉంచవచ్చని చట్టం చెబుతోంది. కాబట్టే బహిర్గతం చేయడం లేదు..’ అని రోహత్గీ చెప్పారు.

కన్సార్టియం కన్నా
ఉత్తమ కంపెనీలు రావొచ్చు కదా

న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘పిటిషనర్ల విషయాన్ని పక్కనపెట్టి చట్టం ఏం చెబుతోందో ఓసారి చూడండి. స్విస్ చాలెంజ్ పద్ధతిలో ఆదాయ వివరాలను తప్పనిసరిగా ప్రాథమిక స్థాయిలోనే బహిర్గతం చేయాలి. ఏ ప్రాజెక్టుకైనా ఆదాయ వివరాలే ముఖ్యం. మీరు వాటిని బహిర్గతం చేస్తే సింగపూర్  కన్సార్టియం కన్నా ఉత్తమ కంపెనీలు ముందుకు రావొచ్చు. మీరు ప్రాథమిక దశలో ఆదాయ వివరాలను వెల్లడించకపోవడం ఆ ఉత్తమ కంపెనీలను ముందుకు రాకుండా చేయడమే అవుతుంది కదా? ఇంత భారీ ప్రాజెక్టు విషయంలో ప్రతి అంశాన్ని విస్తృత పరిధిలోనే చూడాలి. అంతిమంగా ప్రతి ఒక్కరికీ జాతి ప్రయోజనాలే ముఖ్యం.’ అని వ్యాఖ్యానించారు.

రోహత్గీ మాట్లాడుతూ..‘ ఎ నుంచి జెడ్ వరకు కన్సార్టియం ప్రతి పని తాలుకు వివరాలను బయటపడితే ఇక ఆ కంపెనీ పోటీలో ఉండటం ఎందుకు? ఎల్ అండ్ టీ వంటి అంతర్జాతీయ కంపెనీలే ప్రభుత్వ నిబంధనలపై ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. ఆదిత్య కంపెనీకి కనీస అర్హతలు లేవు. ఎన్వీయన్ ప్రీ బిడ్డింగ్ సమావేశంలోనే పాల్గొనలేదు. రోడ్డుపై వెళ్లే అనామకుడికి, పిటిషనర్లకు పెద్ద తేడా ఏమీ లేదు. ఇటువంటి వ్యక్తులు దాఖలు చేసే పిటిషన్లను పరిగణనలోకి తీసుకుని ప్రాజెక్టు ప్రక్రియ నిలిచిపోయేలా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తే ఊహించలేని పరిణామాలు తలెత్తుతాయి.’ అని అన్నారు.
 
ప్రభుత్వమే ముందుగా స్పందించినట్టుందే...
న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. ‘కన్సార్టియం ప్రతిపాదనల విషయంలో ముందుగా ప్రభుత్వమే జోక్యం చేసుకున్నట్లు కనిపిస్తోందే. కన్సార్టియం తన ప్రతిపాదనలను తొలుత సీఆర్‌డీఏకి సమర్పించాలి. అక్కడినుంచి అవి మౌలికసదుపాయాల సంస్థకు వెళతాయి. సంస్థ ఆమోదం తర్వాత ప్రభుత్వానికి చేరతాయి. కానీ ఇక్కడ అందుకు విరుద్ధంగా జరిగినట్లు కనిపిస్తోంది. ముందుగా ప్రభుత్వమే స్పందించినట్లు జీవో ద్వారా తెలుస్తోంది. ఒకసారి ప్రభుత్వం జోక్యం చేసుకుని నిర్ణయం తీసుకున్న తర్వాత కిందిస్థాయి వ్యవస్థలు ఆ నిర్ణయానికి విరుద్ధంగా వెళ్లలేవు కదా?’ అని వ్యాఖ్యానించారు.

రోహత్గీ దీనికి నేరుగా సమాధానం చెప్పకుండా మళ్లీ పిటిషనర్ల అర్హతలపైనే వాదనలు ప్రారంభించారు. వాటిని పరిగణనలోకి తీసుకుని ఈ వ్యాజ్యాన్ని కొట్టేయాలని, ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి వీల్లేదని అన్నారు. ఆయన వాదనలకు పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి, వేదుల వెంకటరమణలు తిరుగు సమాధానం ఇచ్చారు. బిడ్‌ల సమర్పణకు ఈ నెల 13 చివరి తేదీ కావడంతో 12వ తేదీన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తానని న్యాయమూర్తి చెప్పారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement