ఏపీ ప్రభుత్వంలో స్విస్ చాలెంజ్ కేసు వణుకు!
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై పిటిషన్ విచారణ ఏపీ ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తోంది. స్విస్ చాలెంజ్ కేసులో హైకోర్టు సునిశితమైన విచారణపై ఏపీ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. స్విస్ చాలెంజ్ కేసు విచారణ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష జరుపుతున్నట్టు తెలిసింది. ఈ కేసు విచారణ విషయంలో హుటాహుటినా ఏజీ దమ్మలపాటి శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి విమానంలో అత్యవసరంగా విజయవాడకు వెళ్లినట్టు సమాచారం.
స్విస్ చాలెంజ్ కేసులో హైకోర్టు ఉన్నత న్యాయస్థానం పలు ప్రశ్నలు లేవనెత్తింది. అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు సింగపూర్ సంస్థలే ఎందుకని ప్రశ్నించింది. ఏ కంపెనీ అయినా ఆ పని చేస్తుంది కదా అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సింగపూర్ కంపెనీల సీల్డ్ కవర్‌పై హైకోర్టు లేవనెత్తిన ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పాలని.. ఏపీ ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్నట్టు సమాచారం.