సింగపూర్ సంస్థలే ఎందుకు?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులను సింగపూర్ సంస్థలకు అప్పగించడాన్ని తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించింది. రాజధాని నిర్మాణానికి సంబంధించి ప్రభుత్వం అనుసరిస్తున్న స్విస్ చాలెంజ్ విధానంపై పిటిషన్ విచారణ సందర్భంగా ఉన్నత న్యాయస్థానం పలు ప్రశ్నలు లేవనెత్తింది.
అమరావతిలో మౌలిక సదుపాయాల కల్పనకు సింగపూర్ సంస్థలే ఎందుకని ప్రశ్నించింది. ఏ కంపెనీ అయినా ఆ పని చేస్తుంది కదా అని వ్యాఖ్యానించింది. మొదటి విడత బిడ్డింగ్ నిబంధనలు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తలపించేలా ఉన్నాయని న్యాయస్థానం పేర్కొంది.
విదేశీ పెట్టుబడులు, ఉపాధి లక్ష్యంగా స్విస్ చాలెంజ్ నిబంధనలు తయారు చేశామని కోర్టుకు ఏపీ అడ్వకేట్ జనరల్ తెలిపారు. సీఆర్డీఏ, ప్రభుత్వం రెండూ ఒకటేనని వివరించారు. వాదనలు విన్న న్యాయస్థానం విచారణను బుధవారానికి వాయిదా వేసింది.