ఏపీ ప్రభుత్వానికి, సింగపూర్ ప్రతినిధుల మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయని వాసిరెడ్డి పద్మ అన్నారు.
హైదరాబాద్ : ఏపీ రాజధాని నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, సింగపూర్ ప్రతినిధుల మధ్య రహస్య ఒప్పందాలు జరిగాయని వైఎస్ఆర్ సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ అన్నారు. ఆమె మంగళవారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ స్విస్ ఛాలెంజ్ కేసులో అటార్నీ జనరల్ను తీసుకురావడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. స్విస్ ఛాలెంజ్ను సమర్థించడానికి అటార్నీ జనరల్ అవసరమా అని వాసిరెడ్డి పద్మ అన్నారు.
మనమే పంచుకుందాం, మూడో వ్యక్తికి ఛాన్స్ ఇవ్వకూడదన్నట్లుగా వ్యవహరిస్తున్నారని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. అర్హతల పేరుతో మూడో వ్యక్తిని బిడ్లో పాల్గొనకుండా చేస్తున్నారని ఆమె అన్నారు. కేంద్రం పెద్దలు, బీజేపీ నేతలు ఈ విషయాన్ని గమనించాలని వాసిరెడ్డి పద్మ సూచించారు.
ఓటుకు కోట్లు కేసులో ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పును కొన్ని పత్రికలు దాచేశాయని, చంద్రబాబును కాపాడటానికి జర్నలిజం విలువలను కాలరాస్తారా అని వాసిరెడ్డి పద్మ ప్రశ్నలు సంధించారు. జాతీయ పత్రికలు ఈ వార్తను మొదటి పేజీలో ప్రచురిస్తే మీకు కనపడలేదా, చంద్రబాబు చేసే తప్పులు మీకు ఒప్పులుగా కనిపిస్తున్నాయా అని ఆమె ప్రశ్నించారు.