ఇదేం పద్ధతి..?
- సీఎం చంద్రబాబు తీరుపై ఉన్నతాధికారుల తీవ్ర అసంతృప్తి
- స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ కంపెనీల ప్రతిపాదనలు
- ముందు తాను ఆమోదించి తర్వాత ఆ ఫైలును అధికారులకు పంపిన సీఎం
- దీనిపై సీఎస్ నేతృత్వంలోని మౌలిక వసతుల అథారిటీ అభ్యంతరం
సాక్షి, హైదరాబాద్: రాజధాని అమరావతి నిర్మాణంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పద్ధతులన్నీ తుంగలో తొక్కి ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారనడానికి ఇది మరో ఉదాహరణ. స్విస్ చాలెంజ్ విధానంలో అమరావతి అభివృద్ధి భాగస్వామి ఏర్పాటుకు సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు సమర్పించిన ప్రతిపాదనలను ముందు తాను ఆమోదించి.. తరువాత అధికారులకు సీఎం చంద్రబాబు పంపారు. ప్రభుత్వ పెద్ద అనుసరించిన ఈ విధానం పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన మౌలిక వసతుల కల్పన అథారిటీ సమావేశం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇది స్విస్ చాలెంజ్ విధానంలా లేదని నామినేషన్ పద్ధతిపై పనులు కేటాయించే విధానంలా ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ సింగపూర్ ప్రైవేట్ కంపెనీల ప్రతిపాదనలను ఆమోదించిన తరువాత మళ్లీ మౌలిక వసతుల కల్పన అథారిటీకి ఆ ప్రతిపాదనలు పంపించడాన్ని అధికారులందరూ తప్పుబట్టారు. ఒకసారి ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్న తరువాత అధికారుల కమిటీ ఇంక దానికి ఆమోదం చెప్పే అవసరం ఏముందని, అయినా ఎలా చెబుతుందని సీఆర్‌డీఏ అధికారులను ఉన్నతాధికారులు ప్రశ్నించారు. సంబంధిత శాఖల అభిప్రాయాలు లేకుండా మంత్రివర్గ సమావేశానికి పంపాలంటూ ఫైలును అథారిటీకి పంపించడాన్ని సమావేశం తీవ్రంగా తప్పుబట్టింది.
ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేసి..
స్విస్ చాలెంజ్ విధానంలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు సమర్పించిన ప్రతిపాదనలపై ఆయా కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరిపేందుకు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో మంత్రులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ కమిటీ సింగపూర్ ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులతో రెండు సార్లు చర్చలు కూడా జరిపింది. కమిటీ ఈ నెల 9న చివరి సమావేశం నిర్వహించింది. అంతకు రెండు రోజుల ముందు అంటే ఈ నెల 7వ తేదీన సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు సంప్రదింపులు జరిపారు. అనంతరం సింగపూర్ ప్రైవేట్ కంపెనీల ప్రతినిధులు సమర్పించిన ప్రతిపాదనలకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఈ నెల 9వ తేదీన యనమల నేతృత్వంలోని కమిటీ సమావేశమైనా.. అప్పటికే ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినందున ఇక చేసేదేమీ లేక సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్టియం ప్రతిపాదనలకు ‘మమ’ అంటూ ఆమోదం తెలిపింది.
అధికారుల అభ్యంతరం..: ముఖ్యమంత్రి, మంత్రుల కమిటీ ఆమోదం తెలిపిన తరువాత ఇక ఆ ప్రతిపాదనలు మంత్రివర్గం ఆమోదానికే వెళ్లాలి తప్ప అధికారులతో కూడిన అథారిటీకి కాదు. ప్రభుత్వ పెద్దలు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా.. అధికారులు కూడా ఆమోదించారని చూపడానికి సీఎస్ నేతృత్వంలోని అథారిటీకి ఆ ఫైలు పంపించారు. దీనిపైనే ఉన్నతాధికారులందరూ అభ్యంతరం వ్యక్తం చేశారు. స్విస్ చాలెంజ్ విధానంలో ప్రతిపాదనలు సమర్పించిన కంపెనీల ప్రతినిధులతో ఎటువంటి చర్చలు జరపడానికి వీల్లేదనే నిబంధన స్పష్టంగా ఉందని అథారిటీ గుర్తించింది. నిబంధనలకు విరుద్ధంగా సింగపూర్ కంపెనీల ప్రతినిధులతో చర్చలకు మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశాక.. అది స్విస్ చాలెంజ్ ఎలా అవుతుందని అధికారులు ప్రశ్నించారు. ఇది నామినేషన్‌పై పనులు కట్టపెట్టడమే అవుతుందని అభిప్రాయపడ్డారు.
స్విస్ చాలెంజ్ అంటే ఇలా.. : స్విస్ చాలెంజ్ విధానంలో ప్రతిపాదనల వచ్చిన తర్వాత వాటిపై ఎవరితోనూ చర్చలు జరపకూడదని, ఆ ప్రతిపాదనలను బహిరంగ పర్చాలని అధికారులు చెబుతున్నారు. అలాచేసినపుడు ముందు వచ్చిన ప్రతిపాదనలను చాలెంజ్ చేస్తూ మరింత మెరుగ్గా ఇచ్చే సంస్థలు ఏమైనా ఉంటే అప్పుడు ముందుకు వస్తాయంటున్నారు. తొలుత ప్రతిపాదనలు ఇచ్చిన సంస్థకన్నా చాలెంజ్‌లో మరో సంస్థ మెరుగైనవి చేయడానికి వీలుంది. అదే జరిగితే రెండో సంస్థ ప్రతిపాదనలకు మీరు సిద్ధమా అంటూ తొలి సంస్థను అడగవచ్చు.అపుడు రెండో సంస్థ ప్రతిపాదనలకు మొదటిది అంగీకరిస్తే... ఆ మొదటి సంస్థనే ఎంపిక చేయాల్సి ఉంటుంది. అప్పుడే దాన్ని స్విస్ చాలెంజ్ పద్ధతిగా భావించాలి. అలా కాకుండా ఇప్పుడు ప్రభుత్వం వ్యవహరించిన తీరు విచిత్రంగా, అడ్డదిడ్డంగా ఉందని అధికారులు అభిప్రాయపడ్డారనేది విశ్వసనీయ సమాచారం. ఈ అథారిటీ సమావేశంలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు కూడా పాల్గొనడం విశేషం.
శాఖలకు ఫైల్ పంపాల్సిందే..
సంబంధిత శాఖలన్నింటికీ ఆ ఫైలును పంపాల్సిందేనని సీఎస్ టక్కర్ స్పష్టం చేశారు. ఆయా శాఖల ఉన్నతాధికారుల అభిప్రాయాలను ఫైలుపై స్పష్టం చేయాల్సిందేనన్నారు. ప్రభుత్వ నిర్ణయాల్లో పాటించాల్సిన నియమ నిబంధలను పాటించకపోవడంపై సీఆర్‌డీఏ అధికారులపై సీఎస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మౌలిక వసతుల కల్పన అథారిటీ ఏ నిర్ణయం తీసుకోకుండానే సమావేశం ముగిసింది. శాఖలన్నింటికీ ఫైలును సర్క్యులేట్ చేసి, ఆయా శాఖల అభిప్రాయాలు అందాక మళ్లీ సమావేశమైన తరువాతే ఆ ఫైలుపై నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది.