స్విస్ ఛాలెంజ్ పద్ధతిలో ఏపీ రాజధాని నిర్మాణం
విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షత సుమారు నాలుగు గంటలపాటు జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. స్విస్ ఛాలెంజ్ పద్థతిలో రాజధాని నిర్మాణానికి కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. సమావేశం అనంతరం చంద్రబాబు మీడియా సమావేశంలో కేబినెట్ సమావేశం వివరాలను వెల్లడించారు. సింగపూర్ లాంటి నగరాన్ని నిర్మిస్తామని, రాజధాని నిర్మాణానికి జపాన్ కంపెనీ ముందుకు వచ్చిందని, చర్చలు జరుపుతున్నట్లు ఆయన తెలిపారు.
ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దడంతో పాటు పెట్టుబడులపై మంత్రివర్గ సమావేశంలో చర్చించినట్లు తెలిపారు. ముఖ్యంగా సింగపూర్, లండన్, జపాన్ వంటి దేశాలతో పెట్టుబడులపై సంప్రదింపులు జరిపినప్పటికి ముందుగా సింగపూర్ కు చెందిన రెండు కంపెనీలకు రాజధానిలో 58 శాతం భాగస్వామిగా ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదించిందని చంద్రబాబు చెప్పారు. అయితే మొత్తం రాజధాని ప్రాంత భూముల్లో ...సింగపూర్ కు కేటాయించిన 58శాతాన్ని మూడు దశల్లో అప్పగిస్తామన్నారు.
ఇందులో 50 ఎకరాల్ని సాధారణ ధరకు ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. 42శాతం రాష్ట్ర ప్రభుత్వానికి చెందినదిగా ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. అమరావతి డెవలప్మెంట్ కంపెనీ, రెండు సింగపూర్ కంపెనీలు కన్సార్టియంలో ముందుకెళ్తాయని చంద్రబాబు వెల్లడించారు. స్విస్ ఛాలెంజ్కు వైడర్ పబ్లిసిటీ ఇస్తామని, 45 రోజుల్లో ఆ ప్రక్రియ పూర్తవుతుందని, తర్వాత కేబినెట్ నిర్ణయం తీసుకుంటుందన్నారు.