సాక్షి, అమరావతి: శరవేగంగా జరుగుతున్న నగరీకరణకు అనుగుణంగా ఏపీ రాజధాని నిర్మాణం చేపట్టినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. నగరీకరణే తమ విజన్ అని పేర్కొన్నారు. ప్రపంచ నగరాల సదస్సులో భాగంగా ఆదివారం సింగపూర్‌లో జరిగిన మేయర్ల ఫోరం సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. ఐదు నిమిషాల్లో ఎమర్జెన్సీ సేవలు, 15 నిమిషాల్లో వాక్ టు వర్క్ అనే సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నట్లు వివరించారు. సింగపూర్ సహకారంతో రాజధాని అమరావతిని నిర్మిస్తున్నట్లు తెలిపారు. అమరావతిని అభివృద్ధి పథాన నిలపడానికి మీ అందరి సహకారం కావాలంటూ సదస్సుకు హాజరైన వారిని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ‘సిటీ సెన్స్’ డెమోను పరిశీలించిన సీఎం.. అమరావతితో పాటు రాష్ట్రంలోని ఇతర నగరాల్లో ఈ తరహా విధానాలు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు. అనంతరం సింగపూర్ జాతీయాభివృద్ధి శాఖ మంత్రి వోంగ్‌తో సమావేశమయ్యారు. అమరావతిని పరిపాలన నగరంగానే కాకుండా ఆర్థికాభివృద్ధి కేంద్రంగా కూడా తీర్చిదిద్దుతున్నట్లు సీఎం చెప్పారు. రాజధానిలో నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికే రూ.30 వేల కోట్ల విలువైన టెండర్ల ప్రక్రియ చేపట్టినట్టు వివరించారు. రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.40 వేల కోట్ల నుంచి రూ.50 వేల కోట్లు అవసరమవుతాయన్నారు. వోంగ్ స్పందిస్తూ.. అమరావతి నిర్మాణంలో వినూత్న విధానాల అమలుకు సహకరిస్తామన్నారు. రాజధాని అభివృద్ధికి నిర్దిష్ట కాల పరిమితి నిర్ణయించుకోవాలని సీఎంకు వోంగ్ సూచించారు.
రియల్ ఎస్టేట్ సంస్థ ‘లోథా’ ఎండీతో భేటీ
రియల్ ఎస్టేట్ సంస్థ లోథా గ్రూపు ఎండీ అభిషేక్ లోథాతో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సీఎం కోరగా.. తగిన ప్రతిపాదనలతో సెప్టెంబర్‌లో ఏపీకి వస్తామని లోథా హామీ ఇచ్చారు. రియల్ డెవలపర్లను సంప్రదించి రాజధాని అభివృద్ధి కోసం ఒక ప్రత్యేక విధానాన్ని రూపొందిస్తున్నట్లు ఈ సందర్భంగా చంద్రబాబు ఆయనకు చెప్పారు.
కేంద్రంతో సంబంధం లేకుండా సహకరిస్తాం: ఏఐఐబీ
ఏపీలోని రోడ్లు, నీటిపారుదల, ఇంధన రంగాల అభివృద్ధికి ఆర్థిక సాయం అందించేందుకు సహకరిస్తామని ఆసియా మౌలిక వసతులు, పెట్టుబడుల బ్యాంకు(ఏఐఐబీ) హామీ ఇచ్చింది. భారత ప్రభుత్వంతో సంబంధం లేకుండా నేరుగా రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని ఆ సంస్థ డైరెక్టర్ జనరల్(పెట్టుబడి వ్యవహారాలు) పాంగ్ యీ ఇయాన్.. చంద్రబాబుకు హామీ ఇచ్చారు. కెపాసిటీ ఫండింగ్ విషయంలో సాయపడాలని చంద్రబాబు కోరగా.. ప్రాజెక్ట్ వివరాలు అందించాలని పాంగ్ సూచించారు. అనంతరం ఫోర్టెస్కు మెటల్స్ గ్రూపు బృందం చంద్రబాబుతో సమావేశమైంది. బ్యాటరీల తయారీ కేంద్రాన్ని భారత్‌లో నెలకొల్పేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని, ఏపీలో తగిన భూమి కేటాయించాలని కోరగా చంద్రబాబు అంగీకరించారు. అదే సమయంలో ఏపీలో ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేయాలని ఫోర్టెస్కు మెటల్స్ సంస్థను ముఖ్యమంత్రి కోరారు. ఆ తర్వాత భవన నిర్మాణ రంగానికి చెందిన సింగపూర్ కంపెనీ రాయల్ హోల్డింగ్స్ ప్రతినిధి రాజ్ కుమార్ హీరా నందానీతోనూ సీఎం సమావేశమయ్యారు. మెట్రో రైల్ తయారీ కర్మాగారం ఏర్పాటుకు ఏపీని కూడా పరిశీలిస్తున్నట్లు మలేసియాకు చెందిన ఎస్‌ఎంహెచ్ రైల్ కార్పొరేషన్ ప్రతినిధులు చంద్రబాబుకు తెలిపారు.
అమరావతికి ఉష్ణోగ్రతలు తగ్గించే పరిజ్ఞానం!
గాలివాలును అంచనా వేసి ఉష్ణోగ్రతలను క్రమబద్ధీకరించే సాంకేతికతను అమరావతిలో వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నట్లు డస్సాల్ట్ సీఈవో బెర్నార్డ్ చార్లెస్ ముఖ్యమంత్రికి తెలిపారు. వర్సిటీల్లో దీనికి సంబంధించిన కోర్సులు ప్రవేశపెట్టడానికి కూడా సహకరించాలని ముఖ్యమంత్రి కోరగా.. సెప్టెంబర్‌లో అమరావతికి వచ్చి పరిశీలిస్తామని జవాబిచ్చారు. డిసెంబర్‌లో ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు.
నగరీకరణే మా విజన్
Published Mon, Jul 9 2018 2:39 AM | Last Updated on Wed, May 29 2019 3:19 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment