సాక్షి, హైదరాబాద్: నవ్యాంధ్ర రాజధాని అమరావతిని సింగపూర్ కంటే మహాద్భుత నగరంగా నిర్మిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి స్పష్టంచేశారు. అమరావతిలో విశాలమైన రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, వరద నియంత్రణ వ్యవస్థ తదితర ఏర్పాట్లన్నింటిని ఒక్కొక్కటిగా చేపడుతూ వస్తున్నామని వివరించారు. ఒక్కరోజు పర్యటన కోసం సింగపూర్ వెళ్లిన ఆయన శుక్రవారం హిందుస్తాన్ టైమ్స్-మింట్ ఆసియాలు సంయుక్తంగా నిర్వహించిన సదస్సులో మాట్లాడారు. కాగా, నాలుగేళ్లలో ఒక్కటంటే ఒక్క శాశ్వత భవనమైనా నిర్మించని చంద్రబాబు.. సింగపూర్ వెళ్లి అదే సింగపూర్ కంటే గొప్పరాజధాని కడతానని గప్పలు చెప్పడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రపంచంలోనే అత్యుత్తమ డిజైన్లు: ‘‘అమరావతి కోసం ప్రపంచంలోనే అత్యుత్తమ కన్సల్టెన్సీలను నియమించాం. వారు అత్యుత్తమ డిజైన్లను రూపొందించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేను.. 20 ఏళ్లుగా సింగపూర్‌ను తీక్షణంగా పరిశీలిస్తున్నాను. వేగవంతమైన అభివృద్ధికి చిరునామా సింగపూర్. హైదరాబాద్‌ను నిర్మించిన అనుభవంతో అమరావతి నిర్మాణానికి పూనుకున్నా. కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న రాష్ట్రం. దీనికి రాజధాని లేకపోవడం అన్నింటి కంటే పెద్ద మైనస్’’ అని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
బ్లేయర్‌తో బాబు: సింగపూర్ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబుకు బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లేయర్‌ను కలిశారు. తన పదవీకాలంలో ఒకమారు ఏపీకి వచ్చిన బ్లేయర్.. బాబుతో అనుబంధాన్ని గుర్తుచేసుకుని మురిసిపోయినట్లు చంద్రబాబు వర్గీయులు పేర్కొన్నారు. కొత్త రాష్ట్రం ఏర్పడిన సంగతి తనకు తెలుసని, రాజధాని కోసం రైతులు భూములివ్వడం కూడా తెలుసని బ్లేయర్ అనగా, సరికొత్త రీతిలో ఏపీని అభివృద్ధి చేస్తున్నట్లు ఏపీ సీఎం వివరించారని తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment