సాక్షి, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు రాసిచ్చేశారు. సమీకరణ పేరుతో రైతుల నుంచి బలవంతంగా లాక్కున్న వేలాది ఎకరాల భూముల్లో సింగపూర్ కంపెనీలు ఇష్టారాజ్యంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవచ్చని హామీ ఇచ్చేశారు. ఒప్పందాలను మార్చడానికి, భవిష్యత్తులో ప్రభుత్వం గానీ, రైతులు గానీ ప్రశ్నించడానికి వీల్లేకుండా గంపగుత్తగా అధికారాన్ని(పవర్ ఆఫ్ అటార్నీ) కట్టబెట్టారు. అంటే రాజధాని భూములపై విదేశీ ప్రైవేట్ కంపెనీలే ఇక పెత్తనం సాగించవచ్చన్న మాట!
అభ్యంతరాలు బేఖాతర్
స్టార్టప్ ఏరియా అభివృద్ధి ప్రాజెక్టు పేరుతో సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు రాజధాని అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అత్యంత విలువైన 1,691 ఎకరాల భూములను కట్టబెట్టిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో అధికారుల అభ్యంతరాలను కూడా ప్రభుత్వం లెక్కచేయలేదు. స్టార్టప్ ఏరియా ప్రాజెక్టు సంబంధించి అభివృద్ధి–రాయితీ ఒప్పందం, షేర్ హోల్డర్స్ ఒప్పందాల్లో మార్పులు, చేర్పులకు అవకాశం లేకుండా, ఎలాంటి షరతులు విధించేందుకు అవకాశం లేకుండా సింగపూర్ కంపెనీలకు పవర్ ఆఫ్ అటార్నీ రాసి ఇచ్చేశారు. ఈ ఒప్పందాల్లోని పలు అంశాలపై అధికార యంత్రాంగం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రధానంగా ప్రాజెక్టు వ్యయంలో 20 శాతానికి మించి రాయితీలు ఇవ్వరాదని ఆర్థిక శాఖ సంబంధిత ఫైల్‌లో స్పష్టంగా రాసింది.
ఈ ప్రాజెక్టులో సింగపూర్ కంపెనీల పెట్టుబడి రూ.336 కోట్లు మాత్రమే. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.5,000 కోట్లతో స్టార్టప్ ఏరియాలో మౌలిక సదుపాయాలు కల్పిస్తుందట! స్విస్ చాలెంజ్‌లో పాల్గొన్న సింగపూర్ కంపెనీలు అభివృద్ధి–రాయితీ, షేర్ హోల్డర్స్ ఒప్పందాలపై సంతకాలు చేయలేదు. ఆ కంపెనీల తరుపున ఇటీవల ఏర్పాటు చేసిన సింగపూర్ అమరావతి ఇన్వెస్ట్‌మెంట్ హోల్డింగ్స్ పీటీఈ లిమిటెడ్‌తో సంతకాలు చేసుకోవడాన్ని ఆర్థిక శాఖ వ్యతిరేకించింది. అలాగే వివాదాలను లండన్ కోర్టుల్లోనే పరిష్కరించుకోవాలన్న క్లాజును ఆర్థిక శాఖ తప్పుపట్టింది. అలాగే అమరావతిలో సింగపూర్ కంపెనీలకు ఇచ్చే భూమిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత వాటా ఇస్తారో ఒప్పందాల్లో పేర్కొనకుండా ఖాళీగా ఉంచడం గమనార్హం.
సింగపూర్ కంపెనీలకు పవర్ ఆఫ్ అటార్నీ ఇస్తున్నట్లు తెలిపే జీవో నంబర్ 168లోని ఓ భాగం
ఈ నేపథ్యంలో ఒప్పందాల్లో మార్పులు, కొత్తగా షరతులు విధించేందుకు అవకాశం లేకుండా పవర్ ఆఫ్ అటార్నీ రాసివ్వాలని సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు కోరగా, రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. ‘అమరావతి డెవలప్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్’కు ప్రభుత్వం తరపున సీఆర్‌డీఏ పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చేందుకు ఇటీవల కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపారు. ఈ నేపథ్యంలో పవర్ అటార్నీ ఇచ్చేస్తూ సీఆర్‌డీఏ ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ తాజాగా జీవో నం.168 జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తొలినుంచీ సింగపూర్ ప్రైవేట్ కంపెనీలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. ఆయా కంపెనీలకు మేలు చేకూర్చేలా నిబంధనలు, చట్టాలను సవరిస్తూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా సింగపూర్ కంపెనీలకు రాజధానిపై గుత్తాధిపత్యం కట్టబెట్టారు. సీఎం చంద్రబాబు స్వప్రయోజనాల కోసమే విదేశీ కంపెనీలకు దాసోహం అంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజధాని రాసిచ్చారు
Published Sun, May 27 2018 3:36 AM | Last Updated on Wed, May 29 2019 3:19 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment