మంచి నడవడితోనే మనుగడ | good behavior must for survive in politics, writes k.ramachandra murthy | Sakshi
Sakshi News home page

మంచి నడవడితోనే మనుగడ

Published Sun, Jul 16 2017 4:42 AM | Last Updated on Wed, Aug 15 2018 8:21 PM

మంచి నడవడితోనే మనుగడ - Sakshi

మంచి నడవడితోనే మనుగడ

త్రికాలమ్‌
రాజకీయ నాయకులకూ, ప్రభుత్వ ఉన్నతాధికారులకూ మధ్య విభేదాలు తలెత్తిన సందర్భాలు ప్రజాస్వామ్య దేశాలలో అనేకం కనిపిస్తాయి. సిద్ధాంతపరమైన, సూత్రప్రాయమైన అభిప్రాయభేదాలను అర్థం చేసుకోవచ్చు. అటు రాజకీయవాదీ, ఇటు అధికారీ తమ వాదనే సమంజసమైనదంటూ పట్టుదలకు పోయిన ఘట్టాలూ ఉన్నాయి. ఇవి సర్వసాధారణంగా అభివృద్ధి వ్యూహాలకో, సంక్షేమ కార్యక్రమాలకో సంబంధించినవై ఉంటాయి. జనహితంతో ప్రమేయం లేకుండా కేవలం అహంకారం ఆవహించిన సమయంలో రెండు పక్షాలూ గట్టి పట్టుపట్టినప్పుడు ప్రతిష్టంభన అనివార్యం.

మంత్రులతో తగాదా వచ్చిన ఐఏఎస్‌ అధికారులను ముఖ్యమంత్రులు వేరే శాఖలలో సర్దుతారు. ముఖ్యమంత్రితోనే పేచీ వచ్చిన అధికారులు కేంద్ర ప్రభుత్వానికి డిప్యుటేషన్‌పై వెళ్ళడం రివాజు. అది గౌరవప్రదమైన తీరు. ఇటీవల తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులకూ, అధికారులకూ మధ్య ఘర్షణాత్మక వాతావరణం ఏర్పడటానికి దారితీసిన పరిస్థితులు అంత గౌరవప్రదమైనవి కావు. సిద్ధాంతాలకూ, ప్రజాసంక్షేమానికీ, అభివృద్ధి ప్రణాళికకూ చెందిన అభిప్రాయాల ఘర్షణ కాదు. కేవలం అక్రమ వ్యాపారాన్ని అడ్డుకుంటున్నారనే దుగ్ధతో, మహిళల పట్ల సహజంగా ఉండే చులకన భావంతో దౌర్జన్యంగా, వెకిలిగా ప్రవర్తించిన సందర్భాలు.

ఖమ్మం జిల్లాలో ఒక ఉదంతానికి విశేష ప్రచారం లభించింది. శ్రీనివాసన్‌ అనే ఐఏఎస్‌ అధికారికీ, జిల్లా పరిషత్తు అధ్యక్షుడు జలగం వెంగళరావుకూ మధ్య జరిగిన వాగ్యుద్ధం గురించి జిల్లా ప్రజలు అదేపనిగా చెప్పుకునేవారు. వెంగళరావు విలక్షణమైన రాజకీయ నాయకుడు. వ్యక్తిగత ప్రయోజనం ఆశించి అధికారుల చేత ఏ పనీ చేయించే సంకుచిత మనస్తత్వం లేదు ఆయనకు. కానీ స్వతంత్రంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే నాయకుడు. అధికారులను విశ్వసించి వారికి బాధ్యతలు అప్పగించడం ఆయన ముఖ్యమంత్రిగా విజయాలు సాధించడానికి దోహదం చేసిన వైఖరి. కొన్ని సందర్భాలలో మాత్రం తనదే చివరిమాట కావాలన్న పట్టింపు ఉండేది. ఏదో ప్రజాప్రయోజనం విషయంలోనే వెంగళరావుకూ, శ్రీనివాసన్‌కూ మధ్య మాటామాటా పెరిగింది. చివరి మాట ఐఏఎస్‌ అధికారిదే అయింది. ‘నేను కావాలనుకొని శ్రమిస్తే జిల్లా పరిషత్తు చైర్మన్‌ను కాగలను. కానీ మీరు ఎంత శ్రమించినా ఐఏఎస్‌ అధికారి కాలేరు. జిల్లా కలెక్టర్‌ కాజాలరు’ అని శ్రీనివాసన్‌ అన్నమాటకు జలగంవారి దగ్గర జవాబు లేదు. అప్పటికే ఆయనకు నలభై ఏళ్ళు. చదువు డిగ్రీ దాకా వెళ్ళలేదు. పదో తరగతితోనే ఆగిపోయింది. ఈ సంభాషణ నిజంగా జరిగిందో లేక కల్పితమో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నం చేశాను. ఎవ్వరూ నిర్ధారించలేదు. కానీ ఇందులో సత్యం ఉన్నది.

అదేవిధంగా దళిత బాంధవుడు ఎస్‌ఆర్‌ శంకరన్‌కూ ముఖ్యమంత్రి డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డికీ మధ్య విభేదాలు వచ్చాయి. బాండెడ్‌ లేబర్‌ చట్టాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్న సమయంలో మెదక్‌ జిల్లా నుంచి కొందరు ప్రముఖులు ఒత్తిడి తెచ్చారు. చట్టం అమలును పర్యవేక్షిస్తున్న శంకరన్‌ను పిలిచి చూసీచూడనట్టు వ్యవహరించమని చెన్నారెడ్డి చెప్పారు. అట్లా చేయడం తన వల్ల కాదంటూ కేంద్రానికి డిప్యుటేషన్‌ కోరుకున్నారు. త్రిపుర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో కొంతమంది ఐఏఎస్‌ అధికారులు కళ్ళ ఎదుట అక్రమాలూ, అవినీతీ జరుగుతుంటే చూడలేక, వాటిలో భాగం కాలేక అమరావతికి దండం పెట్టి ఢిల్లీకి వెళ్ళిపోయారు. సమర్థుడైన, నిజాయితీపరుడైన అధికారిగా, కేంద్ర పెట్రోలి యం శాఖ మంత్రి ఎస్‌ జైపాల్‌రెడ్డి రిలయన్స్‌ సంస్థపైన సాగించిన సమరంలో విలువైన భూమిక నిర్వహించిన బ్యురాక్రాట్‌గా మంచిపేరు తెచ్చుకున్న గిరిధర్‌ వారిలో ఒకరు. ఫైనాన్స్‌ సెక్రటరీగా పనిచేసిన పీవీ రమేష్‌ మరొకరు.

తప్పుచేసి లెంపలేసుకున్న నెహ్రూ
ఆవేశపడి అధికారులపైన నోరు చేసుకున్నప్పుడో, చేయి చేసుకున్నప్పుడో నేతలు తమ పొరపాటు గ్రహించి క్షమాపణ చెప్పిన సందర్భాలూ లేకపోలేదు. తొలి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ ఒకసారి అలహాబాద్‌ వెళ్ళారు. డిజీపీ స్థాయి పోలీసు అధికారి విమానాశ్రయంలో నెహ్రూకి స్వాగతం చెప్పారు. ‘పంత్‌జీ కహా హై’ అని నెహ్రూ అడిగారు. గోవింద వల్లభపంత్‌ తొక్కిసలాటలో ఇరుక్కున్నారు కనుక రాలేకపోయారని పోలీసు ఉన్నతాధికారి చెప్పిన సమాధానం నెహ్రూకు కోపం తెప్పించింది. చెంప ఛెళ్లుమనిపించి, ‘ఆయన తొక్కిసలాటలో ఉంటే నువ్వు ఇక్కడేం చేస్తున్నావు?’ అంటూ కేకలేశారు. మర్నాడు ఢిల్లీ నుంచి పోలీసు అధికారికి ఫోన్‌. ప్రధాని సత్వరం రమ్మన్నారంటూ కబురు. మళ్ళీ ఏం గొడవ జరుగుతుందోనని భయపడుతూ వెళ్ళిన పోలీసు అధికారిని నెహ్రూ పార్లమెంటు భవనానికి పిలిపించుకున్నారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. పోలీసు అధికారిని పక్కన కూర్చోబెట్టుకొని భోజనం తినిపించి, ‘ఐ యామ్‌ సో సారీ. పంత్‌ నాకంటే ఎంతో పెద్దవారు. నేనైతే జంప్‌ చేయగలను. అటువంటి పెద్దమనిషి తొక్కిసలాటలో చిక్కుకున్నారని చెప్పేసరికి నాకు కోపం వచ్చింది. చేయరాని పనిచేశాను. క్షమించండి,’ అంటూ సంజాయిషీ చెప్పుకున్నారు.

ఎన్టీ రామారావు 1983లో అధికారంలోకి వచ్చిన వెంటనే హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌ స్థానానికి ఉప ఎన్నిక వచ్చింది. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన అభ్యర్థి విజయ వార్త వింటూనే గుండెపోటు వచ్చి మరణించారు. అప్పుడు తెలుగుదేశం అభ్యర్థిగా పర్వతనేని ఉపేంద్రను నిలబెట్టారు. ఉపేంద్ర ఓడిపోయారు. ఎన్నికలు జరిగిన సమయంలో డెయిరీ కార్పొరేషన్‌ పాల ధర పెంచింది. దాని ప్రభావం ఎన్నికలపైన పడి ఉండవచ్చు. పాలధర పెంపుపైన అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యులు రచ్చ చేస్తున్నారు. పరాజయ పరాభవానికి తోడు ప్రతిపక్షాల పరిహాసం. ఎన్‌టీఆర్‌ ఖిన్నులైనారు. డెయిరీ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్, ఐఏఎస్‌ అధికారి దయాచారిని అసెంబ్లీ భవనానికి పిలిపిం చారు. ‘ఏమిటి బ్రదర్‌! పాలధర పెంచే ముందు ప్రభుత్వానికి మాటవరుసకైనా చెప్పనక్కరలేదా?’ అని నిష్టూరమాడారు. ‘పాల ఉత్పత్తి ధర విపరీతంగా పెరి గింది సర్‌! పెంచక తప్పలేదు,’అని చెబుతూ ఎదురుగా ఉన్న వాటర్‌ బాటిల్‌ చూపించి, ‘ఈ బాటిల్‌ ధర పది రూపాయలు సర్, అంతకంటే తక్కువ ధరకి పాలు విక్రయించాలంటే ఎట్లా సాధ్యం? ఇప్పటికే కార్పొరేషన్‌ నష్టాలలో నడుస్తోంది’అన్నాడు. ఆ మాట విన్న ఎన్టీఆర్‌ ‘ఓకే బ్రదర్‌ వెళ్ళిరండి. యూ హేవ్‌ డన్‌ యువర్‌ డ్యూటీ. వియ్‌ విల్‌ మేనేజ్,’అంటూ తిరిగి సభలోకి వెళ్ళి లీటర్‌ పాల ధరనూ, వాటర్‌ బాటిల్‌లోని లీటర్‌ నీటి ధరనూ పోల్చి వాదన సమర్థంగా విని పించి ప్రతిపక్షాల వాదనను పూర్వపక్షం చేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో కుసంస్కారం
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఉదంతాలు అక్కడి రాజకీయ నాయకుల సంస్కారానికీ, ముఖ్యమంత్రి పనితీరుకూ అద్దం పడతాయి. కృష్ణాజిల్లా ముసునూరు మండలం రంగంపేట తహసీల్దార్‌ వనజాక్షిపై తెలుగుదేశం శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్‌ దుర్భాషలాడి, దాడి చేసిన వైనం అత్యంత అనాగరికమైనది. ఉద్యోగ సంఘాలు హాహాకారాలు చేసినా, రాష్ట ప్రజలంతా దిగ్భ్రాంతి చెందినా, అమె కళ్ళనీళ్ళ పర్యంతం అయినా ముఖ్యమంత్రి చంద్రబాబు తప్పు చేసిన శాసనసభ్యుడినే సమర్థించారు. హద్దుమీరావంటూ తహసీల్దార్‌నే మందలించారు. ఈ ఘటనపైన విచారణ జరిపేందుకు ప్రభుత్వం నియమించిన కమిటీ ఇటీవల వనజాక్షి నిర్దోషి అని తేల్చింది. ఆమె హద్దు దాటలేదని నిర్ధారించింది. చంద్రబాబుకి నెహ్రూ లేదా ఎన్టీఆర్‌ వంటి సమున్నత వ్యక్తిత్వం ఉన్నట్లయితే వనజాక్షిని పిలిపించుకొని క్షమాపణ కోరేవారు. అనంతరం ఐపీఎస్‌ అధికారి, ఆర్టీఏ కమిషనర్‌ బాలసుబ్రహ్మణ్యంపైన విజయవాడ పార్లమెంటు సభ్యుడు కేశినేని శ్రీని వాస్‌ (నానీ), శాసనసభ్యుడు బోండా ఉమామహేశ్వరరావు, శాసనమండలి సభ్యుడు బుద్ధా వెంకన్న, మరికొందరు ఈ యేడాది మార్చి 25న తిట్ల దండకంతో దాడిచేశారు. పని మీద బయటకు వెళ్ళబోతున్న కమిషనర్‌ కారుకు తమ కారు అడ్డంపెట్టి దౌర్జన్యం చేశారు. కమిషనర్‌ని చుట్టుముట్టారు. తాము వస్తుంటే ఎందుకు పోతున్నావంటూ నిలదీశారు. ఆరెంజ్‌ ట్రావెల్స్‌ పర్మిట్‌ను రద్దు చేయాలంటూ పట్టుపట్టారు. ధర్నా చేశారు. కమిషనర్‌పైన అనేక ఆరోపణలు చేశారు. ఈ విషయంలో మాత్రం ముఖ్యమంత్రి తప్పు చేసిన తమ్ముళ్ళ చేత ‘సారీ’ చెప్పించారు. ఐపీఎస్, ఐఏఎస్‌లతో పెట్టుకుంటే భారీ మూల్యం చెల్లించవలసివస్తుందన్న భయంతో వారిని బాలసుబ్రహ్మణ్యం దగ్గరికి పంపించారు. నానీ మనస్ఫూర్తిగా ‘సారీ’ చెప్పలేదనీ, ముఖ్యమంత్రి ఒత్తిడి మేరకే చెప్పారనీ అనంతరం ఆయన వ్యవహరణ తీరు స్పష్టం చేసింది. టీడీపీ నాయకులు చెప్పిన పనులు చేసిపెట్టాలంటూ సీఎం ఉన్నతాధికారుల సమావేశంలో ఆదేశించినప్పుడు అధికారులపైన రాజకీయులు రెచ్చిపోవడంలో ఆశ్చర్యం ఏముంది?

సభ్యతలో శిక్షణ
ఈ విషయంలో తెలంగాణ వెనకబడిలేదని మహబూబాబాద్‌ టీఆర్‌ఎస్‌ శాసనసభ్యుడు శంకర్‌ నాయక్‌ నిరూపించాడు. ఆదివాసీ నాయకుడు శంకర్‌ నాయక్‌కు చదువు వచ్చింది కానీ సంస్కారం అబ్బలేదు. వరంగల్లు రీజియనల్‌ ఇంజనీరింగ్‌ కాలేజీలో పట్టభద్రుడైన శంకర్‌ రోడ్లు, భవనాల శాఖలో డిప్యూటీ ఇంజనీరుగా పనిచేశారు. ఉద్యోగం వదిలి రాజకీయాలలో ప్రవేశించిన అనంతరం మొర టుగా మాట్లాడటం, ఆధిక్యం ప్రదర్శించడం అలవాటు చేసుకున్నారు. అధికారులను ‘ఏందిర భయ్‌’అంటూ ఏకవచనంలో సంబోధించడం, దబాయించి పను లు చేయించుకోవడం మామూలైపోయింది. శాసనసభ్యుడు కనుక ఏమి చేసినా చెల్లుతుందనే అహం పెరిగింది. అక్రమార్జనా వగైరా అవలక్షణాలు సరేసరి. కానీ వ్యాపార ప్రయోజనం కోసం కలెక్టర్‌పైన దాడి చేయలేదు. కేవలం ఆధిక్య భావనతో, వెకిలితనంతో బుధవారంనాడు కలెక్టర్‌ ప్రీతిమీనా చేతిని తాకారు. అంతక్రితం కలెక్టర్‌ లేని సమయంలో ఆమె చాంబర్‌లోకి వెళ్ళి నాయక్‌ కూర్చున్నారు. అప్పుడు ప్రీతీ మీనా ఎంఎల్‌ఏపైన మొదటిసారి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు నిర్ద్వంద్వంగా ఇచ్చిన ఆదేశం మేరకు టూరిజం మంత్రి చందూలాల్‌తోనూ, ఎంపీ సీతారామ్‌ నాయక్‌తోనూ కలిసి మీనా దగ్గరికి వెళ్ళి క్షమాపణ చెప్పారు. సీఎం అంటే భయంతో క్షమాపణ చెప్పారే కానీ మనస్ఫూర్తిగా మాత్రం కాదు. అరెస్టు చేసి విడుదల చేసిన తర్వాత సీఎం పట్ల గౌరవంతో క్షమాపణ చెప్పాను కానీ తప్పేమీ చేయలేదు అంటూ దబాయించారు.

రాజకీయవాదులలోనూ, ఉన్నతాధికారులలోనూ నైతిక విలువలు క్రమంగా పడిపోతున్నాయి. అధికారగణంలో కంటే రాజకీయవాదులలో ఈ పతనం ఎక్కువ వేగంగా జరుగుతోంది. నిజాయితీపరులైన, సమర్థులైన, జన సంక్షేమం కోసం అంకితభావంతో పనిచేసే ఉన్నతాధికారులు జాగ్రత్తగా వెతికితే దొరుకుతారు కానీ ఈ లక్షణాలు కలిగిన రాజకీయ నాయకులు మాత్రం కలికం వేసినా కని పించరు. ఉద్యోగంలో నియమించడానికి ముందు ఐఏఎస్‌ అధికారులకు మసూరీలోనూ, జిల్లాలలో రెవెన్యూ శాఖలోనూ శిక్షణ ఉంటుంది. ఎవరితో ఎట్లా వ్యవహరించాలో, ఏ సమస్యను ఎట్లా పరిష్కరించాలో, రాజకీయ వ్యవస్థతో ఏ విధంగా మసలుకోవాలో, విలువలతో రాజీ పడకుండా ప్రజాశ్రేయస్సుకోసం ఎట్లా పని చేయాలో విశేషమైన అనుభవం కలిగినవారు నేర్పుతారు. రాజకీయ నాయకులకు నైతికాంశాలలో శిక్షణ లేదు. ఎవరి సంస్కారానికి అనుగుణంగా వారు నేర్చుకోవడమే కానీ ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం కోసం అందులో ప్రధానపాత్రధారులైన ప్రజాప్రతినిధులకు సభ్యతాసంస్కారం నేర్పే ప్రయత్నం జరగడం లేదు. అధికారులతో ఎట్లా వ్యవహరించాలో, ప్రజల సమస్యలను ఎట్లా తెలుసుకొని పరిష్కరించాలో, ఆదర్శ రాజకీయ నాయకుడిగా ఎట్లా ఎదగాలో బోధించి, తగిన తర్ఫీదు ఇచ్చినట్లయితే విద్యాధికుడైన శంకర్‌ నాయక్‌ సంస్కారవంతుడైన రాజకీయ నాయకుడుగా ఎదిగేవారు. ఈ రోజున ఇంతగా అపహాస్యంపాలు కావలసిన దుస్థితి ఉండేది కాదు.


- కె. రామచంద్రమూర్తి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement