ప్రతి చర్యకూ ప్రతిచర్య (రియాక్షన్) ఉంటుందని పాకిస్తాన్‌కూ, ఆ దేశాన్ని స్థావరంగా ఉపయోగించుకొని, ఆ దేశ సైనిక వ్యవస్థ ప్రోత్సాహంతో కశ్మీర్‌లో కల్లోలం సృష్టిస్తున్న ఉగ్రవాద మూకలకూ స్పష్టం చేయడంలో భారత ప్రభుత్వం సఫలమయింది. 2016లో ఉడీ సైనిక స్థావరంపైన ఉగ్రవాదుల దాడికి ప్రతిగా భారత సైన్యం మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) చేసింది. పక్షం రోజుల కిందట పుల్వామాలో అదిల్ అహ్మద్ దార్ అనే ఇరవై సంవత్సరాల కశ్మీరీ యువకుడు మానవబాంబుగా మారి కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సీఆర్‌పీఎఫ్) ప్రయాణిస్తున్న ట్రక్కుల శ్రేణిపై దాడి చేసి తాను పేలిపోయి 40 మంది జవాన్ల మరణానికి కారకుడైనాడు. ఈ దాడి తమ సంస్థ పనేనంటూ జైషే హంతకముఠా నాయకుడు మసూద్ అజహర్ ప్రకటించాడు. ఇందుకు ప్రతీకా రంగా భారత వాయుసేనకు చెందిన 12 మిరాజ్ 2000 యుద్ధవిమానాలు సరి హద్దు దాటి పాక్ భూభాగంలో ప్రవేశించి జైషే ఉగ్రవాద స్థావరాలపై బాంబులు వేసి సుమారు 300 మంది ఉగ్రవాదులనూ, వారి శిక్షకులనూ, కమాండర్లనూ మట్టుబెట్టినట్టు ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.
ఇందుకు సమాధానంగా పాకిస్తాన్ ఎఫ్–16 యుద్ధ విమానాలతో భారత సైనిక స్థావరాలపైన దాడులు చేయడానికి రాగా వాటిని భారత్ మిగ్ యుద్ధవిమానాలతో ఎదుర్కొని వెనక్కు పంపింది. ఈ క్రమంలో పాకిస్తాన్‌కు చెందిన ఒక ఎఫ్–16 విమానాన్ని మన యుద్ధవిమానాలు కూల్చివేయగా, మన మిగ్ విమానాన్ని పాకిస్తాన్ యుద్ధవిమానాలు పడగొ ట్టాయి.భారత యోధుడు వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ కూలుతున్న మిగ్ విమానం నుంచి పారాచ్యూట్ సాయంతో కిందికి దిగి పాక్ సైనికులకు బందీగా చిక్కాడు. జెనీవా ఒప్పందం ప్రకారం అభినందన్‌ను యుద్ధఖైదీగా పరి గణించి గౌరవంగా చూడాలనీ, భారత్‌కు అప్పగించా లనీ నరేంద్రమోదీ ప్రభు త్వం డిమాండ్ చేసింది. శాంతికోసం అభినందన్‌ను భారత్‌కు అప్పగిస్తానంటూ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ పాకిస్తాన్ పార్లమెంటులో ప్రకటన చేశారు. శుక్రవారం రాత్రి అభినందన్ భారత్ గడ్డపైన భద్రంగా అడు గుపెట్టాడు. ఇంతవరకూ జరిగిన పరిణామాలు క్లుప్తంగా ఇవి.
యుద్ధమేఘాలు
సరిహద్దుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయి. పరస్పరం కాల్పులు జరుపు కుంటూనే ఉన్నారు. కానీ పూర్తి స్థాయి యుద్ధానికి దిగలేదు. అందుకు భారత్, పాకిస్తాన్ ప్రజలే కాకుండా దక్షిణాసియా ప్రజలూ, అంతర్జాతీయ సమాజం కూడా సంతోషించాలి. పక్షం రోజులుగా భారత్, పాకిస్తాన్‌ల మధ్య సంభవి స్తున్న పరిణామాలు అసాధారణమైనవి. ప్రమాదకరమైనవి. ఆందోళనకరమై నవి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య ప్రత్యక్షంగా యుద్ధవిమాన దాడులు జరగడం ఇదే ప్రథమం. 1971 తర్వాత భారత్, పాక్ యుద్ధవిమానాలు తలబడి పూర్తి స్థాయి సంప్రదాయ యుద్ధ ప్రమాదాన్ని భారతీయుల, పాకిస్తానీల గడప వరకూ తీసుకురావడం కూడా ఇదే మొదటిసారి. 1999లో కార్గిల్‌లో తిష్టవేసిన పాకిస్తాన్ సైనికులను వెనక్కు పంపేందుకు భారత యుద్ధం చేయవలసి వచ్చింది. అది పరిమితమైన లక్ష్యంకోసం జరిగిన పోరాటం. 2008లో ముంబైపై ఉగ్రవాదులు దాడి చేసినా, అంతకు ముందు 2001లో మన పార్లమెంటు భవనంపైన ఉగ్ర పంజా విసిరినా హెచ్చరికలకూ, దౌత్య చర్యలకే భారత ప్రతిస్పందన పరి మితమైనది కానీ ప్రతీకార దాడులు చేయలేదు. 1999లో సరిహద్దు పొడవునా సైన్యాన్ని మోహరించారు కానీ పూర్తి స్థాయి యుద్ధానికి దిగలేదు. ‘మా జోలికి వస్తే ఊరుకోం. ప్రతీకారం తీర్చుకుంటాం,’ అని భారత్ కార్యాచరణ రూపంలో స్పష్టం చేసింది మోదీ హయాంలోనే. దీని ఫలితం ఆశించినట్టు ఉన్నదా? ఉగ్రవాదులు వెనుకంజ వేశారా? పాకిస్తాన్ జంకుతున్న లక్షణాలు కనిపి స్తున్నాయా? ఉగ్రవాదులను అరికట్టడానికి పాకిస్తాన్ ప్రయత్నిం చిన దాఖలాలు ఉన్నాయా? నాలుగు ప్రశ్నలకూ లేదనే జవాబు.
నెహ్రూ నుంచి మన్మోహన్‌సింగ్ దాకా ప్రధానులందరూ కశ్మీర్ అంతర్గత వ్యవహారమనీ, పాకిస్తాన్‌తో భారత్ ముఖాముఖి చర్చించి పరిష్కరించుకుం టుందనీ, మూడో పక్షం జోక్యాన్ని ఆమో దించబోమనీ కరాఖండిగా చెబుతూ వచ్చారు. సిమ్లాలో ఇందిరాగాంధీ, భుట్టోల మధ్య కుదిరిన ఒప్పందం కూడా అదే. మెరుపుదాడుల వల్లా, యుద్ధవిమానాల ప్రయోగం వల్లా ఏమి జరిగింది? ప్రపంచంలోని అన్ని దేశాలూ శాంతి, శాంతి అంటున్నాయి. నిగ్రహం పాటించాలని కోరుతున్నాయి. రెండు అణ్వస్త్ర దేశాల మధ్య యుద్ధం జరిగే వాతావరణం కనిపిస్తే స్పందించవ లసిన అగత్యం, హక్కు అన్ని దేశాలకూ ఉంటుంది. ఇప్పుడు కశ్మీర్ అంతర్జా తీయ సమస్యగా మారింది. పాకిస్తాన్‌కు దౌత్యపరమైన మద్దతు తగ్గింది. ఉగ్ర వాదానికి పాకిస్తాన్ బలమైన స్థావరంగా మారిందనే అభిప్రాయం చైనాతో సహా అన్ని ప్రపంచ దేశాలలో బలంగా నాటుకున్నది. ఈ ఉగ్రవాదంతో నష్టపోతున్నది భారత్ ఒక్కటే కాదు. ఇరాన్‌పైనా తాలిబాన్ ఉగ్రదాడులు జరుగుతున్నాయి. అఫ్ఘానిస్తాన్ సంగతి సరేసరి. ఆ దేశం మూడు దశాబ్దాలుగా తాలిబన్ దాడులతో, అగ్రరాజ్యాల సైనిక జోక్యంతో, ఆక్రమణలతో, పాకిస్తాన్ ప్రమేయంతో సత మతం అవుతోంది. దౌత్యపరమైన మద్దతు కూడగట్టడం వల్ల భారత్‌కు ప్రయో జనం ఏమిటి? చైనా అండదండలు ఉన్నంత వరకూ పాకిస్తాన్ దారికి వస్తుందా? అభినందన్‌ను భారత్‌కు పంపుతానని ప్రకటించడం ద్వారా ఇమ్రాన్‌ఖాన్ హుందాగా ప్రవర్తిం చినట్టు కనిపించారు.
సైన్యాధికారుల ఆమోదంతోనే...
సైన్యం ఆమోదం లేకుండా ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటే భుట్టో, నవాజ్‌షరీఫ్‌లకు పట్టినే గతే తనకూ పడుతుందని ఇమ్రాన్‌కు తెలుసు. సైన్యా ధికారులు సైతం జెనీవా ఒప్పందాన్ని గౌరవించాలని నిర్ణయించి ఉంటారు. చిన్న పొరబాటు జరిగితే ఎంతటి తీవ్రమైన పరిణామాలు ఉంటాయో ఊహిం చుకోవాలని నరేంద్రమోదీకి ఇమ్రాన్ చేసిన సూచన కొట్టిపారవేయదగినది కాదు. పరిమిత దాడులైతే నష్టం కూడా పరిమితమే. సంప్రదాయరీతిలో యుద్ధా నికి రెండు దేశాలూ సిద్ధంగా లేవు. యుద్ధమంటూ జరిగితే మారణహోమం అనివార్యం. అది అణ్వస్త్రయుద్ధానికి దారితీస్తే ప్రళయమే. అందుకే అంతర్జాతీయ సమాజం దీన్ని రెండు దేశాల మధ్య వివాదంగా పరిగణించి చేతులు కట్టుకొని కూర్చోజాలదు. రెండు దేశాల అధినేతలకూ ప్రపంచ దేశాధినేతలు సుద్దులు చెబుతారు. చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోమంటారు. ఒక్క అభినందన్ పాకిస్తాన్ సైనికుల చేత చిక్కితేనే దేశం యావత్తూ ఊపిరి బిగపట్టి అతని విడుదల కోసం నిరీక్షించింది. చైనాతో, పాకిస్తాన్‌తో జరిగిన యుద్ధాలలో అనేక మంది భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. దేశవ్యాప్తంగా నాలుగు వందల టీవీ చానళ్ళు ఇటువంటి వివరాలన్నీ కళ్ళకు కట్టినట్టు చూపిస్తే అధికార పార్టీ పరిస్థితి దారుణంగా ఉంటుంది.
పరిమిత చర్యలే అయినప్పటికీ ఎన్నికల సమయంలో వచ్చిన అవకాశాన్ని అపరిమితంగా సద్వినియోగం చేసుకోవడానికి రాజకీయ పార్టీలు ప్రయత్ని స్తున్నాయి. దేశంలో ఇప్పుడున్న వాతావరణం అధికార జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డీఏ)కి అనుకూలం. ఉద్రిక్తలను సొమ్ము చేసుకునే ప్రయత్నం ఎన్‌డీఏ నిస్సంకోచంగా చేస్తున్నది. ఇందులో నరేంద్రమోదీ సిద్ధ హస్తుడు. అధి కారపార్టీకి ఆ ప్రయోజనం దక్కకుండా ఎట్లా నివారించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు ఆలోచిస్తున్నారు. బీజేపీ నాయకుల మాటలు కోటలు దాటుతున్నాయి. రాజకీయ ప్రయోజనాలకోసం దేశాన్ని బలహీన పరచవద్దనీ, సైనికులను అవమానించవద్దనీ ప్రతిపక్షాలకు మోదీ విజ్ఞప్తి చేశారు.
జైట్లీ సమరోత్సాహం
అమెరికా అధ్యక్షుడుగా ఒబామా ఉండగా అమెరికా కమాండోలు పాకిస్తాన్‌లో రహస్యంగా జీవిస్తున్న అల్ కాయిదా అధినేత ఒసామా బిన్ లాడెన్‌ను హత మార్చినట్టు మన సేనలు కూడా పాకిస్తాన్‌లో నివసిస్తున్న మసూర్ అజహర్‌ని అంతం చేయాలని ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ అన్నారు. ఇది ‘పైలట్ ప్రాజెక్టు’ మాత్రమేనని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు. మెరుపు దాడులైనా, పరిమి తమైన యుద్ధవిమానాల ప్రయోగమైనా దేశ ప్రజల ఆవేశాలను తగ్గించడానికీ, ప్రభుత్వం పట్ల, సైన్యం పట్ల విశ్వాసం నిలుపుకోవడానికీ పనికివస్తాయి కానీ అసలు సమస్య పరిష్కారం కాదు. శాశ్వత శాంతి నెలకొనదు.
అసలు సమస్య ఏమిటి? కశ్మీర్‌లోయలో అశాంతి. ఎన్ని వేల కోట్ల రూపాయలు లోయలో కుమ్మరించినా, ఎన్ని లక్షలమంది సైనికులను మోహరిం చినా, ఎంతమంది ఉగ్రవాదులూ, సాధారణ పౌరులూ, సాయుధబలగాలూ ప్రాణాలు కోల్పోయినా సమస్య క్రమంగా జటిలం అవుతున్నదే కానీ సమసి పోవడం లేదు. కశ్మీర్ సమస్య స్వభావం అటువంటిది. 1990 నుంచి ఇప్పటి వరకూ కశ్మీర్‌లో 70 వేలమంది పౌరులూ, పోలీసు ఉద్యోగులూ, ఉగ్రవాదులూ మరణించి ఉంటారు. పెల్లెట్ గన్ గాయాలతో అంధులైనవారూ, కాల్పులలో వికలాంగులైనవారూ వేలమంది ఉంటారు. కశ్మీర్ ప్రజల మనోభావాలు ఏమిటో పాకిస్తాన్‌కు పట్టించుకోదు. భారత్‌కూడా కశ్మీర్‌ను కాపాడుకోవాలనే ఆరాటంలో కశ్మీరీల మనోగతం తెలుసుకునే ప్రయత్నం చేయవలసినంత చేయడం లేదు. సాయుధ బలగాలతో కశ్మీర్ సమస్య పరిష్కారం కాదని అందరికీ తెలుసు. ఎట్లా పరిష్కరించాలో తెలియక ఆ సమస్యను మరింత జటిలం చేస్తున్నారు. కశ్మీర్ ప్రజల దృష్టికోణం నుంచి చూసి వారి సమస్యను గుర్తించే అవకాశం ఉన్నప్పటికీ ఆ సాహసం ఎవరు చేయగలరు? కశ్మీర్ లోయలో అత్యధికులు కోరుకుంటున్న ఆజాదీ వారికి అందని ద్రాక్ష. వారి అభీష్ఠాన్ని మన్నించే వాతావరణం దేశంలో లేదు. వీలైనంత మేరకు స్వతంత్ర నిర్ణయాధికారాలు కల్పించడం ఆచరణ సాధ్యౖ మెన విధానం. అందుకే రాజ్యాంగంలో 370వ అధికరణను చేర్చింది. కశ్మీరీలు ప్రశాంతంగా భారతపౌరులుగా జీవించాలంటే వేర్పాటువాదానికి స్వస్తి చెప్పాలి. అది జరగాలంటే భారత ప్రజలు కశ్మీరీల హృదయాలు గెలుచుకోవాలి. అందుకు రాజకీయ పార్టీలకూ, ప్రభుత్వాలకీ అతీతంగా సమగ్రమైన కార్యక్రమం నిరంత రాయంగా అమలు జరగాలి. వాజపేయి చెప్పినట్టు జమ్రూ హియత్ (ప్రజాస్వా మ్యం), కశ్మీరియత్(కశ్మీర్ సంస్కృతి), ఇన్సానియత్(మానవత్వం) అనే మూడు మూల సూత్రాలు ప్రాతిపదికగా నూతన కశ్మీర్ విధాన రూపకల్పన జరగాలి. కశ్మీర్‌వైపు తేరిపార చూడకుండా పాకిస్తాన్‌ను శాసించే స్థితికి భారత్ చేరుకోవాలి.
బంగ్లాదేశ్ ఆవిర్భవించి తూర్పు పాకిస్తాన్ అంతర్థానం కావడంతో ప్రతీకారేచ్ఛతో రగిలిపోయిన పాకిస్తాన్ పాలకవర్గం భారత్ నుంచి కశ్మీర్‌ను వేరు చే సేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నది. సంప్రదాయ యుద్ధంలో భారత్‌ను ఓడిం చడం అసాధ్యం కనుక పరోక్షంగా జిహాదీ శక్తులకు అండదండలు సమకూర్చి కశ్మీర్‌ని రావణకాష్టం చేయాలన్నది జనరల్ జియా–ఉల్–హక్ సంకల్పం. అం తకు ముందు జుల్ఫికర్ అలీభుట్టో సైతం భారత్‌పైన వేయి సంవత్సరాల యుద్ధం చేస్తామంటూ ప్రగల్భాలు పలికారు. భారతదేశానికి వేయి గాయాలు చేసి రక్తం పారించాలని ప్రతిన పూనారు. పాకిస్తాన్ ప్రజలకు భారత్‌పట్ల ద్వేషాన్ని నూరిపోశారు. ఉగ్రవాదులలో మంచి ఉగ్రవాదులూ, చెడు ఉగ్రవా దులూ అంటూ జనరల్ ముషార్రఫ్ విభజించారు. కశ్మీర్‌లో రక్తపాతం సృష్టించే జిహాదీలను మంచి ఉగ్రవాదులుగా పరిగణించి వారికి అవసరమైన సహాయ సహకారాలు ప్రభుత్వాలూ, సైన్యం అందిస్తున్నాయి. పాకిస్తాన్ బుద్ధి మారదు. ప్రజలు ఎన్నుకున్న ప్రధానులు భారత్‌తో శాంతికోసం ప్రయత్నించినా పాకిస్తాన్ సైన్యాధిపతులు సహకరించరు. ఎన్నికైనవారిని గద్దె దింపి తామే పగ్గాలు చేపడతారు. భారత్‌తో వైరంలో వారి ప్రయోజనాలు ఉన్నాయి. కశ్మీర్‌లో చిచ్చు ఆరకుండా రగిలించాలనే దుర్మార్గపు విధానం వల్ల పాకిస్తాన్ బావుకున్నది ఏమీ లేదు. ఉగ్రవాదుల దాడులలో పాకిస్తాన్‌లోనూ సుమారు 70 వేలమంది పౌరులు మృతి చెందారు. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఛిన్నాభిన్నమైపోయింది. మొన్న అమె రికా, నిన్న చైనా, ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) ఆదుకుంటే తప్ప నిలబడలేని పరిస్థితి. పాకిస్తాన్ ఉగ్రవాదులను కశ్మీర్‌పైన ప్రయోగించ కుండా ఉండాలంటే ఆర్థికంగా, సైనికంగా భారత్ ఇంకా ఎదగాలి. అందుకోసం శాంతిసుస్థిరతలు కావాలి. యుద్ధం వద్దు. ఇదే భారత ప్రజల అభిమతం.
-కె. రామచంద్రమూర్తి
Comments
Please login to add a commentAdd a comment