మరో మోదీ ప్రభంజనం | Another Modi wave: K.Ramachandra murthy writes on five states elections results | Sakshi
Sakshi News home page

మరో మోదీ ప్రభంజనం

Published Sun, Mar 12 2017 2:02 AM | Last Updated on Fri, Aug 24 2018 1:53 PM

మరో మోదీ ప్రభంజనం - Sakshi

మరో మోదీ ప్రభంజనం

త్రికాలమ్‌
భారత ఓటర్ల అంతరంగం అంత తేలికగా అర్థం కాదు. ఎన్నికలు జరిగిన రాష్ట్రాలలో ప్రచార సమయంలో ఎన్నిరోజులు తిరిగినా, ఎంతమందితో మాట్లా డినా ఏ పార్టీ గెలుస్తుందో, ఎంత ఆధిక్యంతో విజయం సాధిస్తుందో చెప్పడం అసాధ్యం. ఎన్నికలకు పూర్వం జరిగిన సర్వేలే కాదు ఎన్నికల అనంతరం జరిగిన ఎగ్జిట్‌పోల్స్‌లో సైతం భిన్నమైన ఫలితాలు రావడానికి కారణం ఇదే. ఓటర్ల మనసులో మాట తెలుసుకోవడం కష్టం. ఓటు వేయకముందు అసలే చెప్పరు. ఓటు వేసిన తర్వాత సైతం నిజం చెప్పరు.

ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్‌ అత్యంత ప్రధానమైనది. తర్వాత స్థానం పంజాబ్‌ది. ఉత్తరాఖండ్‌ది మూడో స్థానం. గోవా, మణిపూర్‌లు బుల్లి రాష్ట్రాలు. ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ ఎంత గొప్పగా గెలిచిందో అంతే అద్భుత మైన విజయం పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ సాధించింది. పంజాబ్‌లో అకాలీ– బీజేపీ సంకీర్ణం పదేళ్ళుగా అధికారంలో ఉండటం, అకాలీ పార్టీ, ప్రభుత్వంపై ఒకే ఒక్క కుటుంబ పెత్తనం ఉండటం, అక్కడ బీజేపీ చిన్న భాగస్వామి కావడం, మత్తుపదార్థాల బెడద, అవినీతి చెద, వ్యవసాయ సంక్షోభం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించాయి. అకాలీ–బీజేపీ సంకీర్ణం చిత్తు కావడం ఖాయం అనే విషయంలో అన్ని సర్వేలదీ ఏకాభి ప్రాయమే. నిజానికి సర్వేల అంచనాలు పదిలోపు స్థానా లే ఈ సంకీర్ణానికి ఇచ్చాయి. ఫలితాలు అంతకంటే మెరుగ్గానే వచ్చాయి. కానీ కాంగ్రెస్, ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) మధ్య ఇంత అంతరం ఉంటుందని ఏ సర్వే కూడా అంచనా వేయలేదు. రెండు పార్టీలకూ చెరి 55 సీట్లు ఇచ్చిన సర్వేలే ఎక్కువ.

117 స్థానాలున్న పంజాబ్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 77, ఆప్‌కు 20, అకాలీ–బీజేపీ జోడీకి 18 స్థానాలు వచ్చాయి. ఆప్‌లో అసమ్మతి, అరాచకం ఇందుకు కొంతవరకూ కారణం. పంజాబ్‌ గ్రామీణ ప్రాంతంలో జాట్‌ సిక్కులు అకాలీదళ్‌ను పూర్తిగా విడిచిపెట్టకపోవడం కూడా అకాలీల స్థానాలు గౌరవ ప్రదమైన స్థాయిలో రావడానికీ, ఆప్‌కు ఆశాభంగం కలగడానికీ దారితీసి ఉండవచ్చు. 2014లో పంజాబ్‌ నుంచి నలుగురు ఆప్‌ అభ్యర్థులు పార్లమెం టుకు ఎన్నికైతే, కాంగ్రెస్‌కు చెందిన లోక్‌సభ సభ్యులు ముగ్గురే. కానీ  నలుగురు ఆప్‌ లోక్‌సభ సభ్యులలో ఇద్దరిని సస్పెండ్‌ చేయగా, ఒక సభ్యుడు ఆరోగ్యం బాగాలేదనే మిషతో ఇల్లు కదలలేదు. ఒక్క భగవంత్‌ మన్‌ మాత్రం ఎన్నికల ప్రచారంలో పాల్గొనడమే కాకుండా శాసనసభకు పోటీ చేశారు. పీసీసీ అధ్యక్షుడు కెప్టెన్‌ అమరిందర్‌సింగ్‌ సామర్థ్యం, ప్రాబల్యం, అకాలీల పట్ల ప్రబలిన ప్రతి కూలత, ఆప్‌ నాయకుల అనుభవ రాహిత్యం, అనైక్యత  కలిసి కాంగ్రెస్‌కు చారి త్రక విజయం సాధించిపెట్టాయి. ఇందులో పార్టీ అధిష్ఠానం పాత్ర పెద్దగా లేదు. చాలా జాప్యం తర్వాత, పార్టీ నుంచి వైదొలుగుతానంటూ సంకేతాలు పంపిన అనంతరం అమరిందర్‌సింగ్‌ని పీసీసీ అధ్యక్షుడిగా నియమించడానికి అంగీకరిం చడం ఒక్కటే పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ  చేసిన మేలు.

మోదీ, షాలకు లక్ష్యసాధనే ప్రధానం
వాజపేయి, అడ్వాణీ రాజకీయాలకీ, నరేంద్రమోదీ, అమిత్‌షా రాజకీయాలకీ మధ్య హస్తిమశకాంతరం ఉంది. లక్ష్యంతో పాటు మార్గం కూడా పరిశుభ్రంగా ఉండాలని భావించిన పాతతరం నాయకులు వాజపేయి, అడ్వాణీ. లక్ష్యం సాధించడమే పరమావధి అనీ, అందుకోసం  ఏ మార్గం అనుసరించినా తప్పు లేదని భావించే కొత్తతరం నేతలు మోదీ, షా. అస్సాంలో కాంగ్రెస్‌కి చెందిన సమర్థులైన నాయకులను తమవైపు లాక్కొని ఎన్నికలలో లబ్ధి పొందినట్టే ఉత్తరాఖండ్‌లో కూడా పదిహేను మంది కాంగ్రెస్‌ నాయకుల ఫిరాయింపులను ప్రోత్సహించి, వారికి టిక్కెట్లు ఇచ్చి అరువు తెచ్చుకున్న బలంతో ఘనవిజయం సాధించింది బీజేపీ. బీజేపీ నాయకులలో ఖండూరీ ఒక్కరే మాననీయుడు. విజయ్‌ బహుగుణ, సాక్షి మహరాజ్‌ వంటి ఫిరాయింపు నాయకుల ప్రాబ ల్యంతో బీజేపీ ఎన్నికల వ్యూహం ఫలించింది. ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ రెండుచోట్ల పోటీ చేసి ఓడిపోవడం ఈ ఫిరాయింపు నాయకుల ధర్మమే. ఉత్తరాఖండ్‌ ఏర్పడినప్పటి నుంచీ కాంగ్రెస్‌ పార్టీ విజయాలకు కారకుడు రావత్‌. కానీ ముఖ్యమంత్రి పదవి మాత్రం ఎన్‌డి తివారీకో, విజయ్‌ బహుగుణకో దక్కేది. 2013 జలవిలయం అనంతరం విజయ్‌బహుగుణ రాజీనామా చేయడం వల్ల ముఖ్యమంత్రి పదవి హరీశ్‌రావత్‌కు దక్కింది. ఆయన ప్రశాంతంగా పనిచేసిన రోజులు తక్కువ. ఫిరాయింపుదారులూ, గవర్నర్, కేంద్రమంత్రులూ ఆయనను పలు ఇబ్బందులు పెట్టారు. పైగా ఈ రాష్ట్రంలో ఎవరినీ వరుసగా రెండోసారి గెలిపించే ఆనవాయితీ లేదు. ఎప్పుడూ మార్పు కోసమే ఓటు.


ఉత్తరప్రదేశ్‌ ఒక మినీ భారతం. ప్రపంచంలోని చాలా దేశాల కంటే అధిక జనాభా. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇంతవరకూ అయిదేళ్ళు పూర్తిగా అధికారంలో ఉన్న ముఖ్యమంత్రులు ఇద్దరే. 2007–2012లో మాయావతి, 2012–2017లో అఖిలేశ్‌. ఒకే పార్టీని వరుసగా రెండోసారి గెలిపించిన సందర్భం ఇటీవలి కాలంలో లేదు. ఉత్తరప్రదేశ్‌ రాంమనోహర్‌ లోహియా, ఆచార్య నరేంద్రదేవ్‌ వంటి సోషలిస్టు పార్టీ అగ్రనేతల రాజకీయ ప్రయోగశాల. హిందూ సమాజంలో కులాలు వాస్తవం. వాటిని లెక్కలోకి తీసుకోకుండా ఏ ఆలోచన చేసినా అది వ్యర్థమే అన్న సిద్ధాంతం వారిది. మత రాజకీయాలకూ, కుల రాజకీ యాలకూ కార్యక్షేత్రమైన ఉత్తర ప్రదేశ్‌కు దేశ రాజకీయాలలో విశేష ప్రాముఖ్యం ఉంది. అత్యధికమంది ప్రధానులు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారే. ఉత్తరాఖండ్‌ విభజన తర్వాత కూడా ఉత్తరప్రదేశ్‌లో లోక్‌సభ స్థానాల సంఖ్య 80. 1967లో కాంగ్రెసేతర ప్రభుత్వ ఏర్పడినప్పటి నుంచీ అది కులాల కురుక్షేత్రమే. ములాయంసింగ్‌ ఎస్‌పీ, మాయావతి బీఎస్‌పీ కుల రాజకీయాలకు రాజకీయ ప్రతిపత్తిని ఆపాదించాయి. వాస్తవానికి దేశవ్యాప్తంగా ఏ పార్టీ అయినా ఫలానా నియోజకవర్గంలో ఏ కులంవారు అధికంగా ఉన్నారో చూసి ఆ కులాల నేతలకు టిక్కెట్లు ఇవ్వడం సర్వసాధారణమైపోయింది. కులభావన ప్రజలలో కంటే రాజకీయ నాయకులలో అధికం.  కులాలు తిరుగులేని వాస్తవం అని గ్రహించిన తర్వాత కుల నిర్మూలన కంటే వాటి మధ్య సయోధ్యకూ, స్నేహబంధాలకూ ప్రయత్నించడం మంచిదనే ఎరుక కూడా ఉత్తరప్రదేశ్, బిహార్‌ రాష్ట్రాలలో పుట్టినదే. అంతకు ముందు తమిళనాడులో వెనుకబడిన కులాలు సమైక్యంగా తిరుగుబాటు ఉద్యమం చేసి అధికారం హస్తగతం చేసుకున్నప్పటికీ ఉత్తరప్రదేశ్, బిహార్‌లలో చర్చించిన విధంగా తమిళనాడులో కులాలపైన చర్చించరు.  

విజయానికి దోహదం చేసిన 4 అంశాలు
శనివారం ఫలితాలు చూసి ఉత్తరప్రదేశ్‌లో ఘనవిజయం సాధించినందుకు మోదీనీ, షానీ అభినందించడం, వారికి బ్రహ్మరథం పట్టడం సహజమే. తరచి చూస్తే ఆవేశరహితమైన వ్యూహరచన, సమర్థమైన రీతిలో అమలు బీజేపీ విజయం వెనుక స్పష్టంగా  కనిపిస్తాయి. క్లుప్తంగా చెప్పుకోవాలంటే యూపీలో బీజేపీ ఘనవిజయానికి ప్రధాన కారణాలు నాలుగు: 1. ప్రధాని మోదీ వ్యక్తిత్వ ప్రభావం. ఆయన వాగ్ధాటి, దీక్షాదక్షత, ప్రచార శైలి, ప్రమాదపుటంచుల్లో విన్యా సాలు చేసే సాహసోపేతమైన ప్రవృత్తి, వీధి పోరాట శైలి 2. తమ విజయాలను అర్థం చేసుకోవడంలో మాయావతి, అఖిలేశ్‌ యాదవ్‌ల వైఫల్యం 3. ఎస్‌పీ, కాంగ్రెస్‌ల పొత్తు. కాంగ్రెస్‌ శక్తి వంచన లేకుండా పోరాడక పోవడం 4. యాదవ కుటుంబంలో ముసలం.

ఈ రోజున దేశంలో అత్యంత ప్రాబల్యం, ప్రజాదరణ కలిగిన అసాధారణ నాయకుడు మోదీ. ఎన్నికల రంగంలో చెలరేగే యోధుడుగా మోదీకి సాటి లేరు. ప్రగతి గురించి మాత్రమే మాట్లాడుతాను అంటూనే వ్యక్తిగత విమర్శనాస్త్రాలతో అఖిలేశ్‌నీ, మాయావతినీ వేధించారు. అఖిలేశ్‌ ప్రభుత్వం యాదవులకే ప్రాధాన్యం ఇచ్చిందంటూ నిశితంగా విమర్శించారు. మాయా వతిని సంపద కూడబెట్టిన నేతగా అభివర్ణించారు. మోదీ విమర్శలో కొంత వాస్తవం ఉన్నది కానీ అసత్యాలూ, అర్ధసత్యాలు సైతం ఉన్నాయి. రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్న పంజాబ్‌లో రైతు రుణాలు మాఫీ చేస్తామని ప్రధాని ప్రకటించలేదు.  పశ్చిమ యూపీలో వ్యవసాయదారులు నిర్ణేతలుగా ఉన్న ప్రాం తంలో మాత్రం  ఆ వాగ్దానం చేశారు. రుణాలు మాఫ్‌ చేయడం ఆర్థిక సంస్కర ణలకు విరుద్ధమనే అభిప్రాయం బలంగా కలిగిన ప్రధాని యూపీని గెలుచుకో వడం కోసం నియమాన్ని ఉల్లంఘించారనడానికి ఇదే నిదర్శనం. యూపీ విజయం మోదీకి అత్యవసరం. రాజ్యసభలో మెజారిటీ సాధించాలన్నా, ఆర్థిక సంస్కరణలను అమలు చేయాలన్నా, తనకు ఇష్టమైన వారిని రాష్ట్రపతిగా, ఉపరాష్ట్రపతిగా ఎన్నుకోవాలన్నా, 2019 నాటికి తిరుగులేని నాయకుడిగా నిల వాలన్నా యూపీలో గెలుపు  ముఖ్యం. అందుకు అవసరమైన అన్ని ఎత్తుగడలూ, వ్యూహాలూ మోదీ అనుసరించారు.

బీఎస్‌పీ అధినేత 2007లో ఏ వ్యూహం వల్ల అధికారంలోకి రాగలిగారో విస్మరించారు. 2012లో విజయం సాధించిన విధం ఏమిటో అఖిలేశ్‌ సైతం మరచిపోయారు. 2007లో మాయావతి అనుసరించిన వ్యూహాన్నే తు.చ. తప్ప కుండా 2017లో అమిత్‌షా అనుసరించారు. మాయావతికి దళితులూ, అఖిలేశ్‌కి యాదవులూ వెన్నుదన్నుగా ఉంటారని తెలిసిందే. కానీ ఎన్నికలలో గెలవాలంటే ఇతరులను సైతం  కలుపుకొనిపోవాలని గ్రహించిన మాయావతి 2007లో బ్రాహ్మణులకు పెద్దపీట వేశారు. యూపీ జనాభాలో పది శాతానికిపైగా ఉన్న బ్రాహ్మణులు సహకరించడంతో మాయావతి విజయం సాధించగలిగారు. బ్రాహ్మణ ఓటర్లలో 16 శాతం, యాదవులలో 7 శాతం, ఓబీసీలలో 30 శాతం, జాట్‌లలో 10 శాతం, జాతవ్‌ దళితులలో (మాయావతి కులం) 86 శాతం, జాతవేతర దళితులలో 58 శాతం, కుర్మీలలో 16 శాతం, ముస్లింలలో 17 శాతం మంది ఓటు వేసిన కారణంగా 2007లో బీఎస్‌పీ 202 స్థానాలు సాధించి మరే పార్టీ మద్దతు అవసరం లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాలు నడపగలిగింది. 2012లో ఎస్‌పీకి కూడా 10 శాతం బ్రాహ్మణులు, 19 శాతం రాజపుత్రులు, 8 శాతం జాట్‌లు, 15 శాతం జాతవ్‌లు, 18 శాతం జాతవేతర దళితులు, 35 శాతం కుర్మీలు, 39 శాతం ముస్లింలు, యాదవ్‌లలో అత్యధిక సంఖ్యాకులు ఓటు వేసి గెలిపించి ఐదేళ్ళు అధికారంలో కొనసాగించారు. అంద రినీ కలుపుకొని వెళ్ళడం వల్లనే గెలుపు సాధ్యమైనదనే వాస్తవాన్ని విస్మరించిన మాయావతి దళితులు, ముస్లింల సంఘటన అంటూ మొదటి నుంచీ పాట ఎత్తుకున్నారు. ఆమె లెక్క ఏమిటంటే యూపీ జనాభాలో 19 శాతం ముస్లింలూ, 21 శాతానికి పైగా దళితులూ ఉన్నారు. ఇద్దరివీ కలిపి 40 శాతం. వాటిలో నాలుగింట మూడువంతుల మంది తన పార్టీకి ఓటు వేసినా గెలిచి తీరుతామన్న ధీమాతో మాయావతి 97 మంది ముస్లింలకు టిక్కెట్లు ఇచ్చి  ముస్లింలు సంఘ టితం కావాలంటూ అదేపనిగా ఉపన్యాసాలు చెప్పారు. ఆమె ధోరణితో కినిసి బ్రాహ్మణులూ, ఇతర కులాలవారూ, ఓబీసీలూ బీజేపీ కౌగిలిలోకి వెళ్లిపోయారు.

కాంగ్రెస్‌తో పొత్తు తెచ్చిన తంటా
నేర స్వభావం కలిగిన నేతలు కలిగిన పార్టీగా, యాదవులకే ప్రాముఖ్యం ఇచ్చే ప్రభుత్వంగా పేరు మోసిన ఎస్‌పీనీ, ప్రభుత్వాన్నీ ప్రక్షాళన చేసేందుకు తండ్రి  ములాయంనీ, బాబాయి శివపాల్‌ సింగ్‌నీ ధిక్కరించి పోరాడి గెలిచిన అఖిలేశ్‌కి ప్రజానీకంలో మంచి పేరుంది. ఆధునిక భావాలు కలిగిన యువకుడిగా, ప్రగతి కాముకుడిగా, అవినీతి మచ్చలేని నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదిం చాడు. అన్ని కులాల యువతీయువకులలో అఖిలేశ్‌ అంటే అభిమానం ఉంది. కానీ కాంగ్రెస్‌ పొత్తుతో అఖిలేశ్‌ దెబ్బతిన్నాడు. కాంగ్రెస్‌కు 105 సీట్లు ఇవ్వడం కేవలం ముస్లింలు మాయావతివైపు పోకుండా తనవైపు తిప్పుకోవాలనే లక్ష్యం తోనే అన్న అభిప్రాయం సర్వత్రా వినిపించింది. అంటే కులాలకు అతీతంగా వ్యవహరిస్తున్నాడనుకొని తాము అభిమానిస్తున్న అఖిలేశ్‌ చివరికి యాదవ్‌– ముస్లిం ఓటర్ల మద్దతు కోసమే రాహుల్‌తో అవగాహన కుదుర్చుకున్నారని అర్థం చేసుకున్నారు. యూపీ సర్కార్‌ యాదవీకరణపై నరేంద్రమోదీ చెప్పిన మాటలు యాదవేతర ఓబీసీలు అనుమానం లేకుండా సంపూర్ణంగా విశ్వసించారు. వారంతా బీజేపీ వెనుక సంఘటితమైనారు. ఇతర (అగ్ర) కులాల మద్దతు నిల బెట్టుకుంటూనే ఓబీసీల, దళితుల ఓట్లు దండిగా సంపాదించి 325 స్థానాలు బీజేపీ సంపాదించగలిగిందంటే అందుకు మాయావతి, అఖిలేశ్‌ల అసంకల్పిత సహకారం ఉంది. అమిత్‌షా కులాలవారీ బలసమీకరణ సరేసరి. దాదాపు సంవ త్సర కాలంగా అమిత్‌షా దానిపైనే దృష్టి కేంద్రీకరించారు. అన్ని కులాల ప్రము ఖులతో రెండు వందల సమావేశాలు నిర్వహించారని భోగట్టా. ఓబీసీ నేత కేశవ్‌ ప్రసాద్‌ మౌర్యను బీజేపీ యూపీ శాఖకు అధ్యక్షుడిగా నియమించడంలోనూ కుల సమీకరణ వ్యూహం ఉంది. బహుశా అతనే ముఖ్యమంత్రి కూడా కావచ్చు. ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్త కావడం ఆయనకు అదనపు అర్హత.

ఎస్‌పీతో గట్టిగా బేరం చేసి 105 స్థానాలు సంపాదించిన కాంగ్రెస్‌ పూర్తి శక్తి వినియోగించి పోరాటం చేయలేదు. రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రచారసభలలో ప్రసంగించారు. అఖిలేశ్‌తో కలిసి సంయుక్త ర్యాలీలలో పాల్గొన్నారు. కానీ సోదరి ప్రియాంకను రంగంలో దింపలేదు. ఆమె, అఖిలేశ్‌ భార్య డింపుల్‌ కలిసి ఒకే వేదిక నుంచి ప్రచారం చేస్తే యువతులను ప్రభావితం చేస్తారనే ఊహాగానాలు మీడియాలో వచ్చాయి. కానీ ప్రియాంక ఒకే రోజు ప్రచారం చేశారు. సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గంలోని అసెంబ్లీ స్థానాలలో అత్యధికం బీజేపీకి వచ్చాయి. డింపుల్‌ చాలా సభలలో మాట్లాడి ప్రజ లను విశేషంగా ఆకట్టుకున్నారు. ప్రియాంక ప్రచారం చేసినా ఫలితాలు ఇదే విధంగా ఉండేవేమో కానీ కాంగ్రెస్‌ సర్వశక్తులూ వినియోగించలేదనే విమర్శ ఉండేది కాదు. పోరి ఓడితే ఎవ్వరూ తప్పు పట్టరు. మూడు మాసాల కిందట మీడియా అంతటా అఖిలేశ్‌ కనిపించాడు. ములాయం సింగ్‌ యాదవ్‌తో, శివపాల్‌ సింగ్‌ యాదవ్‌తో స్పర్థలూ, పార్టీలో చీలిక, అమర్‌సింగ్‌ను బహిష్కరిం చాలన్న పట్టుదల, ఎన్నికల సంఘం ఎదుట పంచాయతీ యాదవ కుటుంబంలో కలహాలను పతాకస్థాయికి తీసుకొని వెళ్ళాయి.

నిర్మాణాత్మకంగా అఖిలేశ్‌ ప్రచారం
అఖిలేశ్‌ యాదవ్‌ ఎన్నికల ప్రచారం యావత్తూ నిర్మాణాత్మకంగా జరిగింది. మోదీ ఎంత రెచ్చగొట్టినట్టు ఎన్నికల సభలలో మాట్లాడినా అఖిలేశ్, డింపుల్‌ మాత్రం ‘కామ్‌ బోల్తా హై’ (పనే చెబుతుంది) అన్న నినాదంపైనే ఆధారపడ్డారు. మోదీ దాడి ఎక్కువైన ఒకానొక  సందర్భంలో ‘గుజరాత్‌ అడవి గాడిదలకు ప్రచారం చేయవద్దని ఈ శతాబ్దపు అగ్రనటుడు అమితాబ్‌ బచ్చన్‌కు విన్నవించు కుంటున్నా’ అంటూ వ్యంగ్యాస్త్రం ప్రయోగించాడు. దాన్ని మరోసారి ఉపయో గించలేదు. మోదీ మాత్రం ప్రభుత్వంలో యాదవుల ఆధిక్యం గురించీ, ఉద్యోగా లన్నీ యాదవులకు ఇవ్వడం గురించీ ప్రతి సభలో నిందాత్మకంగా మాట్లాడారు. యాదవేతర ఓబీసీలలో అధికారపక్షం పట్ల అసంతృప్తి రగిలించడంలో విజయం సాధించారు. ప్రభంజనం ఏదీ పైకి కనిపించకపోయినా బీఎస్‌పీ, ఎస్‌పీ తర్వాత బీజేపీకి కూడా ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు సంకల్పించారని అనుకోవాలి.

ఇది దేనికి సంకేతం?
ఈ ఫలితాలు దేనికి సంకేతం? 2019లో మోదీకి ఎదురు ఉండబోదని చెప్పగ లమా? 2014 నాటి ఫలితాలనే 2019లో సైతం మోదీ నాయకత్వంలోని బీజేపీ సాధించగలదా? 2014లో కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ మోదీ సుడిగాలి పర్యటనలు చేసి, ఎన్నికల సభలలో మన్మోహన్‌ ప్రభుత్వాన్నీ, కాంగ్రెస్‌ పార్టీని నిర్దయగా తూర్పారబట్టారు. యూపీలో ఎస్‌పీ ప్రభుత్వం శాంతిభద్రతల పరి రక్షణలో, ప్రజాసంక్షేమ కార్యక్రమాల అమలులో ఘోరంగా విఫలమైనదంటూ ఎండగట్టారు. మోదీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు అనుకున్నారు. ఇచ్చారు. యూపీలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా రాష్ట్ర ప్రభుత్వంపైన నిప్పులు చెరిగారు.  ప్రజలు మోదీని నమ్మారు. బీజేపీకి పూర్తి మెజారిటీ ప్రసాదించారు. 2019లో దేశ వ్యాప్తంగా కానీ, యూపీ లాంటి ముఖ్యమైన పెద్ద రాష్ట్రంలోకానీ ప్రతికూల ప్రచారం చేసే అవకాశం మోదీకి ఉండదు. ఆ అవకాశం రాహుల్‌ గాంధీకీ, అఖిలేశ్‌ యాదవ్‌కీ, మాయావతికీ, ఇతర ప్రతిపక్ష నాయకులకూ ఉంటుంది.

ఇందిర హయాంలో కాంగ్రెస్‌ బలంగా ఉన్నప్పుడు కాంగ్రెసేతర పక్షా లన్నీ ఒకే తాటి మీదకు వచ్చినట్టు, 1967లో చౌధరీ చరణ్‌సింగ్‌ నాయకత్వంలో యూపీలో సంయుక్త విధాయక్‌ దళ్‌ పేరుతో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని సీపీఎం నుంచి భారతీయ జనసంఘ్‌ వరకూ అన్ని ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చి నిలబెట్టినట్టు ఉత్తరోత్తరా బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ సమష్టి కార్యాచరణ రూపొం దించుకునే అవకాశం ఉంది. అటువంటి సంఘటనకు కాంగ్రెస్‌ నాయకత్వం వహిస్తుందో లేదా మరో పార్టీ నాయకత్వం వహిస్తుందో ఇప్పుడే  చెప్పడం కష్టం. పంజాబ్‌ విజయంతో కాంగ్రెస్‌కు కొంత గౌరవం పెరిగింది.  కర్ణాటక, గుజరాత్‌ వంటి రాష్ట్రాలలో జరగబోయే ఎన్నికలలో కాంగ్రెస్‌ పుంజుకుంటే బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష  కూటమికి నాయకత్వం వహించే అవకాశం కాం గ్రెస్‌కు దక్కుతుంది. ప్రజలలో ఎన్నో ఆశలు రేకెత్తించి అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడిచిపోతున్నా మోదీ ప్రభుత్వం సాధించిన ఘన విజయం కానీ చేసిన గట్టి మేలు కానీ ఇంతవరకూ ఏదీ లేదు. కాంగ్రెస్‌ బలహీనతే బీజేపీ బలంగా భావించవలసి వస్తున్నది. తాను ఏమి చేసిందీ అయిదేళ్ళ తర్వాత 2019లో లెక్కలు చెబుతానంటూ మోదీ చాలా సభలలో ప్రకటించారు. ఇక ప్రతిపక్షాల ప్రశ్నలకూ, సాధారణ ప్రజల సందేహాలకూ సమాధానాలు చెప్పవలసిన బాధ్యత మోదీదే. కేంద్రంలో, ముఖ్యమైన అన్ని రాష్ట్రాలలో బీజేపీ ప్రభుత్వాలు కానీ మిత్రపక్షాల ప్రభుత్వాలు కానీ ఉంటాయి కనుక ప్రతిపక్షాలను నిందించి పబ్బం గడుపుకునే అవకాశం లేదు. ఇక వచ్చేది మోదీకి పరీక్ష కాలం.


- కె. రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement