
ఉరి సరి కాదు
నిజంగా మరణదండనలో రాజకీయం లేదా? ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నదా? బీజేపీ చేయడం లేదా?
దూకుడుమీద ఉన్న మీడియా ప్రభావం కావచ్చు. సమీపిస్తున్న బిహార్ ఎన్ని కలలో భారతీయ జనతా పార్టీ ఎత్తుగడల ఫలితం కావచ్చు. ప్రబలిన ప్రజా స్వామ్య స్ఫూర్తి కావచ్చు. ఉగ్రవాది యాకూబ్ మెమన్ ఉరిపైన చర్చ దేశ వ్యాపి తంగా, ఆవేశపూరితంగా, అర్థవంతంగా జరిగింది. వారంరోజుల పాటు ఇదే ప్రధాన చర్చనీయాంశమై దేశ ప్రజల దృష్టిని ఆకట్టుకున్నది. చర్చ జరగడం సం తోషం. మెమన్ ఉరితో చర్చ ఆగిపోకూడదు. మరణశిక్ష రద్దు అవసరమా, కాదా అనే విషయంపై వాదోపవాదాలు కొనసాగాలి. అనవసరమంటూ సమాజం అంగీకరించేవరకూ తర్జనభర్జన జరగాలి. ప్రజాస్వామ్య వ్యవస్థపైనా, చట్టపాలనపైనా, వివక్షలేని పరిపాలనపైనా అపారమైన విశ్వాసం ఉన్నప్పుడే మరణ దండన అవసరం తగ్గిపోతుంది. అప్పుడే భారత్ ఒక నాగరిక సమాజంగా తల ఎత్తుకొని నిలబడగలుగుతుంది.
మెమన్ ఉరిని కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేస్తున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ ఆరోపించారు. నిజంగా మరణదండనలో రాజకీయం లేదా? ఒక్క కాంగ్రెస్ మాత్రమే ఈ అంశాన్ని రాజకీయం చేస్తున్నదా? బీజేపీ చేయడం లేదా? అసలు రాజకీయ ప్రమేయం లేని విషయం అంటూ ఏదైనా ఉన్నదా? కీలకమైన పదవులలో ఉన్న వ్యక్తుల ఇష్టాయిష్టాలకు అతీతమైనదంటూ ఏమైనా ఉన్నదా? నిజంగానే న్యాయవ్యవస్థ తన పని తాను చేసుకుంటూ సజావుగా సాగిపోతున్నదా? సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు తీర్పును విమర్శిం చడం నేరమా? ఇద్దరు జడ్టిల బెంచ్‌లోని న్యాయమూర్తులు పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలను వ్యక్తం చేసినప్పుడు ఎవరి వాదన రాజ్యాంగబద్ధమైనది? ఎవరు తప్పు? ఎవరు ఒప్పు? మెమన్ వివాదం లేవనెత్తిన ఇటువంటి అనేక ప్రశ్నలకు సమంజసమైన, సంతృప్తికరమైన సమాధానాలు లభించవు. మెమన్ సమాధి అయినప్పటికీ ఈ ప్రశ్నలు సమాజాన్ని వేధిస్తూనే ఉంటాయి.
నిందితుడు ఎంతటి నేరం చేసినా మరణశిక్ష విధించరాదనే వాదనను ఆమోదించిన దేశాలు ప్రపంచంలో 130కి పైగా ఉన్నాయి. ఐరోపా దేశాలలో మరణశాసనం లేదు. మనిషి ప్రాణాలు తీయరాదనీ, మరణశిక్ష అమలు జరిగిన తర్వాత న్యాయస్థానం పొరపాటుగా తీర్పు ఇచ్చిందని వెల్లడైతే? పోయిన ప్రాణాలు తిరిగి తీసుకురాగలమా? మరణదండన వల్ల నేరాలు తగ్గిన సూచ నలు లేవనీ, మరణశిక్ష అమలు జరపడం కక్ష తీర్చుకోవడమేననీ వాదించేవారికి ఆ దేశాలలో సంఖ్యాధిక్యం ఉంది. న్యాయమూర్తులూ మానవ మాత్రులే. వారికీ సొంత అభిప్రాయాలుంటాయి. వాటి ప్రభావం తీర్పులపై ఉండి తీరుతుంది.
నేరాలు తగ్గలేదు
మరణశిక్ష వల్ల నేరాలు తగ్గలేదని నిరూపించేందుకు కేంద్రమాజీ మంత్రి శశి థరూర్ ఉటంకించిన గణాంకాలు చూద్దాం. 1980 నుంచి 1990 వరకూ పది మంది హంతకులకు భారత శిక్షాస్మృతి 302 సెక్షన్ కింద మరణశిక్ష అమలు చేశారు. ఆ దశకంలో హత్యలు 22,149 నుంచి 35,045కు పెరిగాయి. అదే విధంగా 1990-2000 దశకంలో ఎనిమిది మందిని ఉరి తీసినప్పటికీ హత్యల సంఖ్య 35,045 నుంచి 37,399కి పెరిగింది. 2000 నుంచి 2010 వరకూ ఒకే ఒక కామాంధుడైన హంతకుడిని మాత్రమే ఉరి తీశారు. ఆ దశకంలో దేశంలో హత్యల సంఖ్య 37,399 నుంచి 33,335కి తగ్గింది. సారాంశం ఏమిటి? మరణ శిక్ష నిష్ర్పయోజనమనేగా?
సుప్రీంకోర్టు మరణశిక్ష విధించిన తర్వాత క్షమాభిక్ష కోరుతూ దోషులు పెట్టుకున్న అర్జీలపైన నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రపతులకు రాజ్యాంగం 72వ అధికరణ దఖలు పరచింది. మరణదండనను రద్దు చేయవచ్చు. దాన్ని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చవచ్చు. ఇక్కడ యావజ్జీవం అంటే 14 సంవ త్సరాలు కాదు. దోషి శేష జీవితం అంతా జైలులోనే ఉండాలి. రాష్ట్రపతులం దరిలోనూ ఆర్. వెంకటరామన్ అత్యధిక క్షమాభిక్ష పిటిషన్లను తిరస్కరించారు. రాష్ట్రపతిగా పనిచేసిన 1987-92 కాలంలో ఆయన 44 అర్జీలను బుట్టదాఖలు చేశారు. కె.ఆర్.నారాయణన్ ఒక్క క్షమాభిక్ష వినతిని కూడా తిరస్కరించలేదు. రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఒకే ఒక మహిళ ప్రతిభాపాటిల్ కూడా అంతే. ఆమె 30 మంది హంతకులకు క్షమాభిక్ష ప్రసాదించారు. అబ్దుల్ కలాం దాదాపు పాతిక పిటిషన్లను పరిష్కరించకుండానే పదవీ విరమణ చేశారు. రెండు పిటి షన్లపైనే కలాం నిర్ణయం తీసుకున్నారు. ప్రణబ్ ముఖర్జీ వెంకటరామన్ అడుగు జాడలలో నడుస్తున్నారు. ఇంతవరకూ 24 పిటిషన్లకు ‘నో’ అన్నారు. ఎవరి ప్రాపంచిక దృక్పథం వారిది. ఎవరి అవగాహన వారిది.
మరణదండనను సమర్థించేవారి వాదనను సైతం తేలికగా కొట్టిపారవేయ డం సాధ్యంకాదు. అమాయకులనూ, అపరిచితులనూ విచక్షణారహితంగా, రాక్షసంగా చంపివేసే కరడుకట్టిన ఉగ్రవాది పట్ల కనికరం చూపించడం సమా జానికి హానికరమని నిరూపించిన ఉదంతాలూ ఉన్నాయి. బోకో హరమ్, అల్ ఖాయిదా, లష్కరే తయ్యబా, ఇండియన్ ముజాహిదీన్, అల్‌షహీద్, ఐఎస్‌ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు తమ సభ్యులను జైళ్ల నుంచి విడిపించ డానికి ఎంతటి నేరానికైనా, ఘోరానికైనా వెనకాడవు. భద్రతాదళాలకు దొరికిన మౌలానా మసూద్ అజహర్, షేక్ ఒమర్‌లను హతమార్చకుండా జైలులో ఉంచి నందుకు భారత ప్రభుత్వం పెద్ద మూల్యమే చెల్లించవలసి వచ్చింది. ఉగ్రవా దులు భారత విమానాన్ని హైజాక్ చేసి అఫ్ఘానిస్తాన్‌లోని కందహార్‌కు తీసుకొని వెళ్లారు.
నాటి విదేశాంగ మంత్రి జస్వంత్‌సింగ్ అజహర్‌నూ, ఇతర ఉగ్రవాద ఖైదీలను వెంటపెట్టుకొని వెళ్లి హైజాకర్లకు అప్పగించి ప్రయాణికులను రక్షిం చారు. ఇటువంటి ఘటనలు నరహంతకులకు మరణదండన విధించడం సమం జసమేన న్న వాదనకు ఊతం ఇస్తాయి. కృష్ణయ్యర్ వంటి మానవతావాది సైతం మరణదండనను పూర్తిగా నిషేధించకుండా అత్యంత అరుదుగా మాత్రమే విధించాలంటూ తీర్పు ఇచ్చారు.
యాకూబ్ మెమన్ ఉరిశిక్షను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించిన రాజకీయవాదిగా హైదరాబాద్ పార్లమెంటు సభ్యుడు సయ్యద్ అసదుద్దీన్ ఒవైసీ పేరు తెచ్చుకున్నారు. మతం ప్రాతిపదికన మరణదండన అమలు చేయరాదంటూ వివాదం రగిలించారు. ఈ వాదనను సహజంగానే బీజేపీ ఖండించింది. మెమన్‌కు ఉరిశిక్ష విధించాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. శశి థరూర్, దిగ్విజయ్ సింగ్ వంటి కాంగ్రెస్ నాయకులు పార్టీ విధానంతో విభేదించారు. శత్రుఘ్న సిన్హా, రాంజెత్మలానీ వంటి బీజేపీ పార్లమెంటు సభ్యులు సైతం మెమన్ ఉరి అనాగరికమంటూ ఆక్షేపించారు.
అఫ్జల్ ఉరి అన్యాయం?
యూపీఏ ప్రభుత్వం కశ్మీర్‌కి చెందిన ప్రొఫెసర్ అఫ్జల్‌గురుని ఉరితీసినప్పుడు వ్యవహరించిన తీరు కంటే భిన్నంగా ఎన్‌డీఏ ప్రభుత్వం వ్యవహరించింది. అఫ్జల్ గురు ఉరికి ప్రచారం ఇవ్వడం యూపీఏ ప్రభుత్వానికి ఇష్టం లేదు. ఎన్‌డీఏకి మెమన్ ఉరి గురించి ప్రచారం బహుశా బిహార్ ఎన్నికల దృష్ట్యా అవసరం. కుటుంబానికి సమాచారం అందించకుండా (ఒక రోజు ముందు టెలిగ్రాం పంపించామంటూ జైలు అధికారులు బుకాయించారు)అఫ్జల్‌గురుని ఉరితీయడం, శవాన్ని బంధువులకు అప్పగించకుండా తీహార్ జైలు ప్రాంగణం లోనే ఖననం చేయడం అత్యంత జుగుప్సాకరం. మెమన్ నేరం చేసినట్టు నిర్ధారించేవారు కూడా అఫ్జల్‌గురు నిరపరాధి అంటున్నారు.
మెమన్‌కు మరణదండన 2007లో ఖరారైనప్పటికీ సుప్రీంకోర్టుకు విన్న వించుకోవడానికీ, రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరడానికీ, వాదప్రతివాదాలకూ ఎని మిదేళ్ళ వ్యవధి లభించింది. క్షమాభిక్ష కోసం పెట్టుకున్న రెండో పిటిషన్‌ను రాష్ట్ర పతి తిరస్కరించిన తర్వాత కూడా ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ చొర వతో సుప్రీంకోర్టు న్యాయమూర్తులు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ వాదనలు విన్నారు. జూలై 30వ తేదీ ఉదయం 5 గంటల ప్రాంతంలోవారు పిటి షన్ కొట్టివేయడంతో ఉరిశిక్ష అరున్నర గంటల ప్రాంతంలో నాగపూర్ జైలులో అమలు జరిగింది. సర్వోన్నత న్యాయం స్థానం రాజ్యాంగంలో సమకూర్చిన అన్ని అవకాశాలనూ మెమెన్‌కు ఇచ్చిందని చెప్పుకోవచ్చు.
సుప్రీంకోర్టు తీర్పు ను కానీ రాష్ట్రపతి నిర్ణయాన్ని కానీ ప్రశ్నించకుండా ఆమోదించాలంటే నిర్ణ యాలు నిష్పాక్షికంగా జరగడమే కాదు. అట్లా జరిగినట్టు కనిపించాలి. రాజీవ్ హంతకులకు మరణదండన విధించవద్దంటూ తమిళనాడు శాసనసభ, బియాం త్‌సింగ్ హంతకుడి శిక్ష యావజ్జీవ ఖైదుకే పరిమితం చేయాలంటూ పంజాబ్ అసెంబ్లీ చేసిన తీర్మానాలను కేంద్ర ప్రభుత్వం ఆమోదించినప్పుడు మెమన్‌కు రాజకీయ పార్టీ అండ లేని కారణంగానే ఉరిశిక్ష విధించారంటూ వాదించడం నిర్హేతుకం కానీ కోర్టు ధిక్కారం కానీ దేశద్రోహం కానీ ఎట్లా అవుతుంది? ముం బయ్ బాంబు పేలుళ్లకు ప్రేరణ ఏమిటి? ముంబయ్ అల్లర్లు. వాటికి ప్రేరణ బాబరీ మసీదు విధ్వంసం.
1992 డిసెంబర్ 7 నుంచి 27 వరకూ, 1993 జన వరి 7 నుంచి 25 వరకూ రెండు దఫాలుగా జరిగిన అల్లర్లలో మొత్తం 900 మం ది దాకా చనిపోయారు. ఈ అల్లర్లపైన జస్టిస్ శ్రీకృష్ణ కమిషన్ 15,000 పేజీల నివేదిక సమర్పించింది. అనుమానపు ముల్లు ఎటు చూపిస్తున్నదో (నీడిల్ ఆఫ్ సస్పిషన్) కమిషన్ సూచించింది. శివసేన నాయకుడు బాల్‌ఠాక్రే ప్రమేయం బహిరంగ రహస్యం. కొండను తవ్వి ఎలుకని పట్టినట్టు శివసేన పార్లమెంటు సభ్యుడు మధుకర్ సర్పోట్‌దార్‌కు ముంబయ్ కోర్టు 2008లో ఏడాది కఠిన శిక్ష విధించింది. వెనువెంటనే ఆయనకు బెయిల్ లభించింది. శిక్ష అనుభవించకుం డానే మధుకర్ 2010లో చనిపోయాడు. పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ నిఖిల్ కాప్సేను కూడా శ్రీకృష్ణ కమిషన్ దోషిగా గుర్తించింది. కానీ ప్రభుత్వం చర్య తీసుకోలేదు.
బాంబు పేలుళ్ల కేసులో 185 మందిని అరెస్టు చేసి నిందితులుగా పేర్కొంటూ అంతకు ముందు జరిగిన అల్లర్లకు సంబంధించి శ్రీకృష్ణ కమిషన్ నివేదికను తుంగలో తొక్కడం ఎటువంటి సంకేతాలు పంపుతుంది? అల్లర్ల వెనుక తాత్కా లిక ఆవేశం ఉంటుందనీ, బాంబు పేలుళ్ల వెనుక కుట్ర ఉంటుందనీ రాంజె త్మలానీ చెప్పిన భాష్యంలో కొంత వాస్తవికత లేకపోలేదు. కానీ న్యాయస్థానం, ప్రాసిక్యూషన్ నిందితులందరినీ సమానంగా చూడాలి. ఒక కేసులో సాక్ష్యా ధారాలు సేకరించకుండా అభియోగాలను నీరు కార్చుతూ మరో కేసులో లోతుగా పరిశోధన చేసి, అరెస్టులు చేసి, శిక్షలు పడేవరకూ విచారణ కొన సాగించినప్పుడూ ప్రజాస్వామ్య వ్యవస్థపైన విశ్వాసం సన్నగిల్లుతుంది.
మరణదండన రద్దు చేయాలి
మరణదండన రద్దు చేయాలంటూ ఉద్యమం సాగిస్తూనే మరణదండన విధించే పద్ధతిలో, న్యాయస్థానాలూ, ప్రభుత్వాలూ వ్యవహరించే విధానంలో పారదర్శ కత, హేతుబద్ధత, సమన్యాయం స్పష్టంగా కనిపించాలి. మరణదండన రద్దు కోరడం ఉగ్రవాదాన్ని సమర్థించడంగా, దేశద్రోహంగా చిత్రించడం సంకుచిత మనస్తత్వం. మన సమాజం ఎంతగా చీలిపోయిందో, ఎటువంటి అతుకుల బొంతగా తయారయిందో అర్థం చేసుకుంటే భయం కలుగుతుంది. ఢిల్లీలో సిక్కుల ఊచకోతను విమర్శించేవారు గుజరాత్‌లో ముస్లింల హత్యాకాండను ప్రస్తావించరు. ముంబయ్ పేలుళ్ల కారకులపై మరణశిక్షను సమర్థించేవారు ముంబయ్ అల్లర్లనూ, శ్రీకృష్ణ కమిషన్ నివేదికనూ విస్మరిస్తారు.
పార్లమెంటు సమావేశాలకు అడ్డుతగులుతున్నందుకు కాంగ్రెస్ పార్టీనీ, ఇతర ప్రతిపక్షాలనూ దుయ్యబడుతున్నవారు గత పార్లమెంటులో తాము అదే పని చేసిన సంగతి మరచిపోతారు. మరణదండన వద్దంటే ఉగ్రవాదాన్ని సమర్థించడం అంటారు. ఎన్‌కౌంటర్లను వ్యతిరేకిస్తే మావోయిస్టులకు కొమ్ముకాస్తున్నారంటారు. మైనా రిటీల ప్రాథమిక హక్కుల అమలు గురించి ప్రశ్నిస్తే హిందూ వ్యతిరేకి అం టారు. ఇది అన్యాయమైన ధోరణి. నీతీ, నిజాయితీ రవ్వంతైనా లేకుండా, సమాజంలో సామరస్యం సాధించే ప్రయత్నం ఏమాత్రం చేయకుండా, సంకు చిత భావాలకూ, స్వార్థప్రయోజనాలకూ, కపట వ్యూహాలకూ, దబాయింపు రాజకీయాలకూ ప్రాధాన్యం ఇచ్చినంత కాలం ఈ దేశ సార్వభౌమత్వానికీ, సమై క్యానికీ, సమగ్రతకూ భద్రత ఉండదు. ప్రజాస్వామ్యం మేడిపండు అవుతుంది.