భారత దేశంలో సంభవించిన అహింసాత్మకమైన విప్లవాలలో అత్యంత ప్రధానమైనది ద్రవిడ ఉద్యమం. ఆ సంస్కరణ ఉద్యమానికి సుదీర్ఘకాలం నాయకత్వం వహించిన అసాధారణ వ్యక్తి ఇటీవల అస్తమించిన కళైంజ్ఞార్ కరుణానిధి. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించక మునుపే 1910 దశకంలోనే మద్రాసు ప్రెసిడెన్సీలో బ్రాహ్మణేతర ప్రముఖులు స్థాపించిన సౌత్ ఇండియన్ లిబరల్ అసోసియేషన్ లక్ష్యాలలో ప్రధానమైనవి బ్రాహ్మణభావజాల ఆధిక్యాన్ని అంతం చేయడం, సమసమాజం నిర్మించడం, సామాజికన్యాయం సాధించడం. ఆ అసోసియేషన్ జస్టిస్ పార్టీగా ప్రాచుర్యం పొందింది. కులమతాలకు వ్యతిరేకంగా పోరాడుతూ స్వాతంత్య్ర సమరం చేయడం అసాధ్యమనే గాంధీజీ వైఖరితో తీవ్రంగా విభేదించిన రామస్వామినాయకర్ కాంగ్రెస్ నుంచి నిష్క్రమించి జస్టిస్‌పార్టీలో చేరారు. ఆయన చేరికతో నాయకత్వంలో సమూలమైన మార్పు వచ్చింది.
జస్టిస్ పార్టీ ఎజెండా కంటే భిన్నమైన విస్తృతమైన కార్యాచరణ అవసరమని భావించిన పెరియార్ (పెద్దాయన) రామస్వామి నాయకర్ ఆ పార్టీని రద్దు చేసి ‘ద్రవిడ కళగం’(ద్రవిడ సమాఖ్య)–డికె– నెలకొల్పారు. నాటి విద్యార్థి ఉద్యమ నాయకుడూ, అద్భుతమైన వక్త సీఎన్ అన్నాదురై పెరియార్‌కు ప్రథమ అనుచరుడిగా కుదురుకున్నారు. డికె ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు. రాజీలేని హేతువాదం ప్రాతిపదికగా ఉద్యమం విస్తృతంగా నిర్వహించడం సాధ్యం కాదని అయిదేళ్ళు తిరగకుండానే అన్నాదురై గ్రహించారు. హేతువాదం, సామాజికన్యాయం, నిరీశ్వరవాదం ప్రాతిపదికగా సామాజిక ఉద్యమం ఉధృతంగా కొనసాగించాలని పెరియార్ అభిప్రాయం. రాజకీయాల పొడ ఆయనకు గిట్టదు. రాజకీయ పార్టీ పెట్టి, గెలిచి అధికారంలోకి వచ్చి పెరియార్ చెబుతున్న లక్ష్యాలనే సాధించాలన్నది అన్నాదురై వాదన.
డిఎంకె ఆవిర్భావం
అన్నాదురై నాయకత్వంలో చెన్నైలో 1948 సెప్టెంబర్ 17న ద్రవిడ మున్నేట్ర కళగం (డిఎంకె) ఆవిర్భవించింది. అప్పటికే కరుణానిధికి 25 ఏళ్ళు. జస్టిస్ పార్టీ కార్యక్రమాలలో, హిందీ వ్యతిరేక ఉద్యమంలో 14వ ఏట నుంచే చురుకుగా పాల్గొన్నారు. చక్రవర్తి రాజగోపాలాచారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ మిత్రులతో కలసి ప్రదర్శనలు చేశారు. తిరుచిరాపల్లిలో దాల్మియాపురం పేరును తిరిగి కళ్ళెగుడిగా మార్చే ఉద్యమంలో సాహసోపేతంగా వ్యవహరించి అందరి దృష్టినీ ఆకర్షించారు. ప్రతిభావంతమైన వక్తగా, సినిమా స్క్రిప్టు ద్వారా ద్రవిడ ఉద్యమ భావజాల వ్యాప్తికి అసాధారణ స్థాయిలో దోహదం చేసే రచయితగా, కార్యకర్తలను సమీకరించి ముందుకు నడిపించే సేనానిగా బహుముఖంగా రాణిస్తూ తమిళుల జీవితంతో పెనవేసుకుపోయారు. తమిళ సాహిత్యాన్నీ, సంస్కృతినీ వివిధ రూపాలలో వినియోగించుకొని ‘ద్రవిడనాడు’ ఉద్యమస్ఫూర్తిని పతాకస్థాయికి తీసుకొని వెళ్ళడంలో ప్రధాన పాత్ర కరుణానిధిదే. సమాఖ్యస్ఫూర్తి, రాష్ట్రాల స్వయంనిర్ణయాధికారం, సకలభాషల సమానత్వం, లౌకికవాదం డిఎంకె భావజాలంలో ప్రధానమైనవి. ద్రవిడ సిద్ధాంతాలను ప్రచారం చేసేందుకు కరుణానిధి పిన్నవయస్సులోనే స్వదస్తూరితో రాసిన వార్తాపత్రికను తయారు చేసి స్నేహితుల ద్వారా పంపిణీ చేయించేవారు. డిఎంకె అధికార పత్రిక ‘మురసొలి’ (ఢంకా) కి అదే బీజం.
‘మురసొలి’లో కరుణానిధి పార్టీ కార్యకర్తలకోసం రాసిన లేఖలు వారికి పార్టీ విధానాలనూ, కార్యకారణ సంబంధాలనూ విశదీకరించడానికి ఉద్దేశించినవి. పార్టీ నాయకులతో, కార్యకర్తలతో సంభాషణకు ఆయన ‘మురసొలి’ని సమర్థంగా ఉపయోగించుకున్నారు. ద్రవిడ ఉద్యమ సారథి పెరియార్ సైతం ‘కుడియారసు’ (రిపబ్లిక్–గణతంత్ర వ్యవస్థ) అనే పత్రిక ద్వారా తన ఆలోచనలను కార్యకర్తలతో పంచుకునేవారు. కరుణానిధి ప్రతిభావంతుడైన వక్త. ఛలోక్తులతో, వ్యంగ్యాస్త్రాలతో ప్రత్యర్థులను ఉడికిస్తూ, సభను రక్తికట్టించే శక్తి అయన సొంతం. ఆయన ప్రసంగాల కేసెట్లు తమిళ సినిమా పాటల కేసెట్లకంటే బాగా అమ్ముడుపోయేవి. రాజకీయాలలో ఎంత సామర్థ్యం ఉన్నదో సాహిత్యంలోనూ అంతటి అధికారం ఉన్నది. సంగీతం అంటే ప్రాణం. ఇంతటి బహుముఖ ప్రజ్ఞ కలిగిన రాజకీయ నాయకులు దేశంలోనే అరుదు. పురాణాలలోని, ఇతిహాసాలలోని పాత్రల ద్వారా పార్టీ భావజాలాన్ని ప్రచారం చేయడం, పోస్టర్లూ, బ్యానర్లూ, కట్‌అవుట్‌లూ వంటి హంగులు ఉపయోగించుకోవడం భారత రాజకీయాలకు తమిళ రాజకీయం అందించిన కొత్తవిద్య. ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌టి రామారావు పసుపు రంగుతోసహా డిఎంకె ప్రచార ప్రక్రియలన్నిటినీ అనుకరించారు. కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బిహార్ వంటి అనేక రాష్ట్రాలకూ కటౌట్ల సంస్కృతి పాకింది. టీవీ చానళ్ళూ, వీడియో టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎన్నికల ప్రచారం విస్తృతి, వైవిధ్యం అనూహ్యంగా పెరిగిపోయాయి. 2014 ఎన్నికలలో మోదీ విశ్వరూపం ప్రదర్శించడానికి వీడియో టెక్నాలజీ దోహదం చేసింది.
కరుణానిధి ప్రస్థానం
పార్టీలో అత్యంత ప్రభావశీలిగా ఎదిగిన కరుణానిధి 1957లో మొదటిసారి మద్రాసు శాసనసభకు ఎన్నికైన సమయంలో కూడా డిఎంకె లక్ష్యాలలో స్వతంత్ర ద్రవిడనాడు ప్రధానమైనది. ఈ వేర్పాటువాదం డిఎంకె ఎజెండాలో చాలాకాలం ఉంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత జాతీయ రాజకీయాలతో మమేకమై, సంకీర్ణ ప్రభుత్వాలలో భాగస్వాములైన తర్వాత వేర్పాటువాదం పూర్వపక్షమైపోయింది. 1967 ఎన్నికలలో కాంగ్రెస్‌ను మట్టికరిపించి అధికారంలోకి వచ్చిన డిఎంకె అన్నాదురై నాయకత్వంలో తమిళనాడులో తొలి కాంగ్రెసేతర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అన్నాదురై మంత్రివర్గంలో పబ్లిక్‌వర్క్స్ మంత్రి కరుణానిధి. రెండేళ్ళ తర్వాత కేన్సర్ కారణంగా అన్నాదురై మరణించారు. వారసత్వ పోరులో అప్పటి ఆప్తమిత్రుడు ఎంజి రామచంద్రన్ సహకారంతో నెడుంజళియన్ వంటి సీనియర్లను తోసిరాజని ముఖ్యమంత్రి పదవిని కరుణానిధి కైవసం చేసుకున్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే మురికివాడల నిర్మూలన, మనుషులు లాగే రిక్షాల నిషేధం, విద్యుదీకరణ పనులు ముమ్మరంగా చేశారు. దారిద్య్ర రేఖ దిగువన ఉన్న ప్రతి కుటుంబానికీ రూపాయికి కిలో చొప్పున పాతిక కిలోలు బియ్యం ఇవ్వడం, ప్రభుత్వం పంపిణీ వ్యవస్థను నెలకొల్పడం, రేషన్ షాపులను నడపడం, రైతులకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేయడం, పంట రుణాలు మంజూరు చేయడం, పంట పండకపోతే రుణాలు మాఫ్ చేయడం వంటి అనేక సంక్షేమకార్యక్రమాలు కరుణానిధి, ఎంజీఆర్‌ల హయాంలోనే ఆరంభమైనాయి. అమ్మ క్యాంటీన్ వంటివి జయలలిత సృష్టి. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసిన మొదటి రాష్ట్రంగా తమిళనాడు దేశ చరిత్రలో నిలిచిపోతుంది. కడచిన మూడు దశాబ్దాలలో తమిళనాడు పారిశ్రామికంగా, ఆర్థికంగా అభివృద్ధి చెందింది. రఘురామరాజన్ రిజర్వు బ్యాంక్ గవర్నర్‌గా ఉండగా 2013లో చేసిన అధ్యయనంలో దేశంలోని ప్రవృద్ధ రాష్ట్రాలలో తమిళనాడు మూడవ స్థానంలో (గుజరాత్, మహారాష్ట్ర తర్వాత) నిలిచింది. సాహిత్య, సాంస్కృతిక రంగాలకు కరుణానిధి పెద్దపీట వేశారు. తిరువళ్ళువార్ పేరిట వళ్ళువార్‌కొట్టాం నిర్మించారు. మూడు సాగరాలు– బంగాళాఖాతం, హిందూమహాసముద్రం, అరేబియా సముద్రం ఏకమయ్యేచోట కన్యాకుమారిలో 133 అడుగుల ఎత్తు తిరువళ్ళువార్ విగ్రహం ప్రతిష్ఠించారు.
ఎంజీఆర్‌తో విభేదాలు
కరుణానిధి అధికారంలోకి వచ్చిన కొద్ది మాసాలకే ఆయనకూ, ఎంజీఆర్‌కీ మధ్య దూరం పెరిగింది. అధికారం కరుణానిధి తలకెక్కిందని ఎంజీఆర్ భావించారు. ఎంజీఆర్‌లో ఈర్షా్యద్వేషాలు పెరిగాయని కరుణానిధి తలపోశారు. సినిమాలలో ఎంజిఆర్‌కి పోటీగా పెద్దకొడుకు ముత్తును కరుణానిధి ప్రవేశపెట్టారు. కరుణానిధిపై ఎంజిఆర్ అవినీతి ఆరోపణలు చేశారు. 1972లో డిఎంకె చీలిపోయింది. ఎంజీఆర్ ఏఐఏడిఎంకె స్థాపించి 1977 ఎన్నికలలో ఘనవిజయం సాధించారు. తన ఆరోపణల ఆధారంగా కరుణానిధి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసిన ఇందిరాగాంధీనీ, ఆమె ఉపకారాన్నీ విస్మరించి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలన్న ప్రతిపాదనను ఎంజిఆర్ తిరస్కరించారు. 1980లో ఎంజిఆర్ ప్రభుత్వాన్ని రద్దు చేసి రాష్ట్రపతి పాలన విధించారు. తర్వాత జరిగిన ఎన్నికలలోనూ, 1984లోనూ ఎంజీఆర్ విజయం సాధించడంతో కరుణానిధి పుష్కరకాలం ప్రతిపక్ష నాయకుడిగానే ఉండవలసి వచ్చింది. 1989లో కరుణానిధి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అప్పుడే నేషనల్ ఫ్రంట్ తరఫున విపి సింగ్‌ను ప్రధాని చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. మండల్ కమిషన్ సిఫార్సుల ప్రకారం ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేశారు. అత్యధికశాతం రిజర్వేషన్లు అమలు జరుగుతున్న రాష్ట్రం తమిళనాడు. తమిళ టైగర్లను సమర్థిస్తున్నారనే ఆరోపణపైన కరుణానిధి ప్రభుత్వాన్ని 1991లో నాటి ప్రధాని చంద్రశేఖర్ రద్దు చేశారు. 2006లో చివరిసారిగా, ఐదోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. 2011లో జయలలిత ముఖ్యమంత్రి పదవీ బాధ్యతలు మూడోసారి స్వీకరించారు. 2016లోనూ ఆమే గెలిచారు.
ద్రవిడ పార్టీలు జాతీయ రాజకీయాలను గణనీయంగా ప్రభావితం చేశాయి. 1967–69లో ఇందిరాగాంధీకీ, నిజలింగప్ప, మొరార్జీదేశాయ్, అతుల్యఘోష్ ఇత్యాది సీనియర్ నాయకులకూ మధ్య విభేదాలు చెలరేగి చీలిక దిశగా కాంగ్రెస్ ప్రయాణం సాగినప్పుడు కరుణానిధి ఇందిరాగాంధీకి మద్దతు ఇచ్చారు. రాష్ట్రపతి పదవికి జరిగిన పోటీలో వి.వి. గిరిని గెలిపించడానికీ, నీలం సంజీవరెడ్డిని ఓడించడానికీ కరుణానిధి చట్టసభల సభ్యులను సమీకరించారు. 1975లో ఆత్యయిక పరిస్థితి ప్రకటించడాన్ని కరుణానిధి తీవ్రంగా విమర్శించారు. జార్జి ఫెర్నాండెస్, సుబ్రహ్మణ్యస్వామి వంటి ఇందిర విరోధులకు తమిళనాడులో ఆశ్రయం ఇచ్చారు. దాంతో ఆగ్రహించిన ఇందిరాగాంధీ కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ను అరెస్టు చేయించారు. పోలీసు కస్టడీలో స్టాలిన్‌ను హింసించినట్టు వార్తలు వచ్చాయి. కరుణానిధిపైన కేసులు పెట్టడమే కాకుండా ఆయన ప్రభుత్వాన్ని 1976లో బర్తరఫ్ చేశారు.
విప్లవ సంస్కరణల వెనకంజ
ఈ దశలో ద్రవిడ భావజాలం పలచపడింది. అవినీతి, బంధుప్రీతి పెరిగాయి. వ్యక్తి ఆరాధన పతాకస్థాయికి చేరింది. ఈ విషయాలలో ద్రవిడ పార్టీలకీ, దేశంలోని ఇతర ప్రాంతీయ పార్టీలకీ పెద్దగా వ్యత్యాసం లేకుండా పోయింది. ఇతర ప్రాంతీయ పార్టీల తరహాలోనే డిఎంకె సైతం కేవలం కరుణానిధి కుటుంబ సభ్యుల చేతిలో ఉంది. జయలలితకు కుటుంబం లేదు కనుక ఆమె మరణించగానే ఏఐఏడిఎంకె చీలిపోయింది. డిఎంకె స్టాలిన్ సారధ్యంలో పదిలంగా ఉంది. ద్రవిడ భావజాలానికి విరుద్ధమైన బీజేపీ, కాంగ్రెస్‌లతో నిస్సంకోచంగా పొత్తు పెట్టుకొని ఎన్‌డీఏ, యూపీఏ కూటములలో డిఎంకె, ఏఐఏడిఎంకెలు భాగస్వాములుగా ఉన్నాయి. ఎన్నికల అక్రమాలలో తమిళనాడేమీ తక్కువ తినలేదు. సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఎన్నికలకు ముందు కలర్ టీవీ సెట్లు ఉచితంగా ఓటర్లకు పంపిణీ చేసే కార్యక్రమం కరుణానిధి హయాంలోనే అమలు జరిగింది. జయలలిత వారసుడుగా చెప్పుకుంటున్న దినకరన్ ఆర్‌కె పురం ఉపఎన్నికలో ఖర్చు చేసిన మొత్తం నంద్యాల ఉపఎన్నికలో చంద్రబాబునాయుడు ఖర్చుకు సమానం.
ద్రవిడ పార్టీల పాలన యాభై సంవత్సరాలకు పైగా కొనసాగుతున్న తమిళనాడు ఇతర రాష్ట్రాలతో సమానంగా అన్ని రకాలా దిగజారినప్పటికీ అభివృద్ధిలో మాత్రం ముందంజలో ఉంది. కరుణానిధి, ఎంజీఆర్, జయలలితలు రాజకీయంగా ఎంతగా కీచులాడుకున్నా అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఒకే విధానం అమలు చేసేవారు. ముగ్గురూ కేంద్రం నుంచి తమిళనాడుకు రావలసిన నిధులనూ, పరిశ్రమలనూ, ఇతర వనరులనూ దబాయించో, బతిమిలాడో సంపాదించేవారు. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మాత్రం రాజీపడేవారు కాదు. ద్రవిడ పార్టీలలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదు. ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన పార్టీలో అధినేతకు పడిపడి పాదాభివందనం చేసే సంస్కృతి స్థిరపడింది. కుల నిర్మూలన కోసం పోరాడాలనే సంకల్పం సడలింది. తమిళనాడులో దళితుల పరిస్థితి ఇతర రాష్ట్రాలలో కంటే మెరుగ్గా లేదు. పెరియార్ ఆశించిన విప్లవాత్మక సంస్కరణలు ఆయన వారసుల అధికార రాజకీయ రంధిలో గల్లంతైనాయి. ఇందుకు కరుణానిధి మాత్రమే బాధ్యులు కారు. ఎంజీఆర్, జయలలిత కూడా ద్రవిడ ఉద్యమ స్ఫూర్తికి యధాశక్తి విఘాతం కలిగించారు.
కె. రామచంద్రమూర్తి
Comments
Please login to add a commentAdd a comment