ఎజెండా వందనం? | Narendra modi leading NDA government | Sakshi
Sakshi News home page

ఎజెండా వందనం?

Published Sun, Feb 21 2016 12:59 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM

ఎజెండా వందనం? - Sakshi

ఎజెండా వందనం?

ఇటీవల నేషనల్ డెమొక్రాటిక్ అలయెన్స్ (ఎన్‌డీఏ) సమావేశం జరిగినప్పుడు భాగస్వామ్య పక్షాల నాయకులు ప్రధాని నరేంద్రమోదీని ఒకే కోరిక కోరారు. తమను వాజపేయి గౌరవించిన రీతిలో గౌరవించమని అడిగారు. ఈ రోజున దేశ ప్రజలు కూడా మోదీకి మౌనంగా అదే ప్రార్థన చేస్తున్నారు. వాజపేయిలాగా పరిపాలించమంటూ వేడుకుంటున్నారు.
 

 నరేంద్రమోదీ గొప్ప చాణక్యుడనీ, అభివృద్ధి ఎజెండాగా ఈ దేశాన్ని ప్రగతి పథంలో శరవేగంగా పరుగులు తీయిస్తారనీ విశ్వసించి 2014లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ)కి ఓటు వేసినవారిలో కొంతమంది ఇప్పుడు పశ్చాత్తాప పడుతున్నారు. బీజేపీని కానీ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్)ను కానీ చూసి ప్రజలు మోదీకి ఓటు వేయలేదు. యూపీఏ అవినీతి కుంభకోణాలతో విసిగిపోయిన ప్రజలు మోదీని ఆపద్బాంధవుడుగా పరిగణించి ఓట్లు వేసి గెలిపించారు. వాజపేయి నాయకత్వంలోని ఎన్‌డీఏ ప్రభుత్వంలాగానే మోదీ నేతృత్వంలోని సర్కార్ అన్ని వర్గాలనూ కలుపుకొని పోతుందనీ, సొంత ఎజెండాను పక్కన పెడుతుందనీ ఆశించినవారికి భంగపాటు కలుగుతోంది.
 

 ఏమి సాధించాం?
 

 జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్శిటీ (జెఎన్‌యూ)లో సంభవించిన పరిణామాలు, వాటి ప్రభావంతో పటియాలా హౌస్ కోర్టులోనూ, ఢిల్లీ వీధులలోనూ కనిపించిన వికృత దృశ్యాలూ దేశ ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరిగిన ఒక ఘటనపైన కేంద్ర హోంమంత్రి, హెచ్‌ఆర్‌డీ మంత్రి, పోలీసు బలగం జోక్యం చేసుకొని గోటితో పోయే విషయాన్ని గొడ్డలి దాకా తెచ్చిన ఫలితం ఏమిటి? ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయం మనకి ఒక్కటి కూడా లేదే అని అనుకుంటున్న సమయంలో ఆసియా ఖండంలో చెప్పుకోదగిన మంచి యూనివర్శిటీగా ఎదిగిన జెన్‌యూనూ, దేశంలోని విశ్వవిద్యాలయాలలో కెల్లా అత్యుత్తమ విశ్వవిద్యాల యంగా అవార్డు పొందిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీని వివిదాల లోకి లాగి వాటి ప్రతిష్ఠను దిగజార్చాం. ఈ పరిణామాలపైన దేశీయాంగ మంత్రి, హెచ్‌ఆర్‌డీ మంత్రి, దాదాపు అన్ని రాజకీయ పార్టీల నాయకులూ మాట్లాడారు. అమెరికాలో నివసిస్తున్న మేధావి నోమ్ చామ్‌స్కీ సైతం వ్యాఖ్యా నించాడు. ప్రపంచంలోని అన్ని పత్రికలూ సంపాదకీయాలు రాశాయి. కానీ మన ప్రధాని మాత్రం నోరు మెదపలేదు. ఆయన మన్మోహన్‌సింగ్ వలె మౌనీబాబా కాదు. సకల విషయాలపైనా అనర్గళంగా ఉపన్యసిస్తున్నారు. కానీ జెఎన్‌యూ విద్యార్థి సంఘం నాయకుడు కన్హయ్యా కుమార్‌ని అన్యాయంగా అరెస్టు చేసినా, కోర్టులో అతనిపైన న్యాయవాదులు అన్యాయంగా దాడి చేసినా, దేశం అంతా జెఎన్‌యూ వివాదంతో అట్టుడికిపోతున్నా ప్రధాని నోరు మెదపక పోవడం వెనుక మతలబు ఏమిటి? తప్పుడు ట్వీట్‌ను పట్టుకొని జెఎన్‌యూ విద్యార్థులకు లష్కరేతొయ్యబా నాయకుడు హఫీజ్ సయీద్‌తో సంబంధాలు ఉన్నాయంటూ స్వయంగా హోంమంత్రి మాట తూలడం ఏమిటి? దీని వెనుక ఏమైనా ప్రణాళిక ఉన్నదా?
 

 దైవభక్తికి దేశభక్తిని జోడించి ప్రాబల్యం పెంచుకోవాలన్నది బీజేపీ తాజా ప్రయత్నమా? అందుకేనా ఇంత రాద్ధాంతం?  ఈ ఎత్తుగడ ఫలిస్తుందో లేదో తెలియదు. కానీ ఈ తంత్రాన్ని అమలు చేసే క్రమంలో జరిగే అనర్థాలు ఏమిటో అర్థం  కావడం లేదా? ఇరుగుపొరుగు దేశాల అధినేతలను తన పదవీ స్వీకార మహోత్సవానికి ఆహ్వానించిన మోదీ ఒక రాజనీతిజ్ఞుడుగా ఎదిగే అవకాశం ఉన్న రాజకీయవాదిగా కనిపించారు. అఫ్ఘానిస్తాన్ నుంచి ఢిల్లీకి తిరిగి వస్తూ లాహోర్‌లో పాకిస్తాన్ ప్రధాని షరీఫ్‌ను కలుసుకొని సమాలోచనలు జరిపి శభాష్ అనిపించుకున్నారు. కశ్మీర్ విషయంలోనూ వాజపేయి మార్గం అనుసరించ డాన్నీ, పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ (పీడీపీ) అధినేత ముఫ్తీ మహమ్మద్  సయీద్‌తో భుజం కలిపి ప్రభుత్వం ఏర్పాటు చేయడాన్నీ మేలి మలుపుగా భావించి దేశ ప్రజలు హృదయపూర్వకంగా స్వాగతించారు. కానీ ముఫ్తీ మరణం తర్వాత ఆరు వారాలు దాటినా ఆయన కుమార్తె మెహబూబా ముఫ్తీ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయడానికి అంగీకరిస్తారా లేదా అన్నది అనుమానమే. బీజేపీ ప్రధాన కార్యదర్శి రామ్‌మాధవ్ చర్చలు జరిపినా, ఆమె వెలిబుచ్చిన సందేహాలను నివృత్తి చేసినా జెఎన్‌యూ పరిణామాల ప్రభావం కశ్మీర్ రాజకీయాలపైనా, మెహబూబా నిర్ణయంపైనా ఉండితీరుతుంది. పాకిస్తాన్‌తో సంబంధాలపైనా జెఎన్‌యూ దెబ్బ పడుతుంది.
 

 గోటితో పోయేదానికి...
 

 జెఎన్‌యూ క్యాంటీన్ దగ్గర ఇండియాకి వ్యతిరేకంగా, పాకిస్తాన్‌కి అనుకూలంగా నినాదాలు చేసినవారిని విడియోల సహాయంతో గుర్తించి పట్టుకొని కోర్టులో ప్రవేశపెట్టి చట్టప్రకారం శిక్షిస్తే ఎవ్వరూ అభ్యంతరం చెప్పేవారు కాదు.  పాత ఆడియోను కొత్త వీడియోపైకి ఎక్కించి కన్హయ్యా కుమార్‌ను రాజద్రోహిగా చిత్రించడం వల్ల ప్రయోజనం ఏమిటి? జాధవ్‌పూర్ విశ్వవిద్యాలయం విద్యార్థులు కూడా దేశ వ్యతిరేక నినాదాలు చేశారు. ఆ వివాదాన్ని ఆ విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్ పరిష్కరించారు. పశ్చిమబెంగాల్ ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ జోక్యం చేసుకోలేదు. అది అంతటితో సమసిపోయింది. అదే విధంగా జెఎన్‌యూ ఘటనపైన చర్య తీసుకునే స్యేచ్ఛ కొత్తగా నియుక్తుడైన వైస్‌చాన్సలర్‌కి ఇచ్చి ఉంటే ఆయనే పరిష్కరించేవాడు. చేతకాకపోతే హెచ్‌ఆర్‌డి మంత్రిత్వశాఖను సంప్రదించేవాడు. భావప్రకటన స్వేచ్ఛను వినియోగించుకొని ప్రశ్నించడం, తర్కించడం, శోధించడం అభ్యాసం చేస్తున్న విద్యార్థులపైన దేశద్రోహులుగా,  రాజద్రోహులుగా ముద్ర వేయడం వల్ల ఫలితం ఏమిటి? అఫ్జల్‌గురుని ఉరి తీసిన తర్వాత ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 9 వ తేదీన అతని స్మారక సభ జరుపుకోవడం, ఉరి తీయడం సరి కాదనే అభిప్రాయం కొందరు వెలిబుచ్చడం కొత్త కాదు. ఈ సంవత్సరం ఇది శ్రుతిమించి ఉండవచ్చు. ఇందుకు బాధ్యులను గుర్తించి వారిపైన కఠినమైన చర్య తీసుకోవచ్చు. ఎవరు అభ్యంతరం చెబుతారు? ప్రభుత్వం ఏ పని చేసినా చట్టబద్ధంగా, హేతుబద్ధంగా, ధర్మబద్ధంగా ఉన్నట్టు కనిపించాలి. జెఎన్‌యూ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం కానీ పోలీసు అధికారులు కానీ వ్యవహరించిన తీరు దేశానికే కాదు బీజేపీకి సైతం నష్టదాయకం. విక్రమ్‌సింహ్ చౌహాన్ అనే లాయరు పోట్ల గిత్తలాగా జర్నలిస్టులపైనా, జెఎన్‌యూ విద్యార్థులపైనా న్యాయ స్థానంలోనే దాడి చేస్తుంటే చోద్యం చూసిన పోలీసులది అసమర్థత అనుకోవాలా లేక ఉద్దేశపూర్వకంగానే ప్రేక్షకపాత్ర వహించారని అనుకోవాలా లేదా పైనుంచి వచ్చిన ఆదేశాల మేరకు నిష్క్రియాపరత్వాన్ని అభినయించారని అనుకోవాలా?
 

 ‘దేశభక్తుల’ స్వైరవిహారం
 

 ‘దేశభక్తులు’ జర్నలిస్టులపైనా, విద్యార్థులపైనా దాడి చేయడాన్ని అనుమతించిన ప్రభుత్వం ఎటువంటి సంకేతాలు పంపుతున్నది? అఫ్జల్ గురు ఉరిని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ సమర్థిస్తున్నారా? లేదు. ఆమెను కశ్మీర్‌కు ముఖ్య మంత్రిగా చేసి ఆమె మంత్రివర్గంలో బీజేపీ చేరడానికి సిద్ధంగా ఉన్నప్పుడు జెఎన్‌యూలో కొంతమంది విద్యార్థులు ఉరిని వ్యతిరేకిస్తూ నినాదాలు చేయడాన్ని రాద్ధాంతం ఎందుకు చేయడం? ఈ విధంగా విశ్లేషించినవారినీ, వాదించినవారినీ రాజద్రోహులంటూ, దేశద్రోహులంటూ నిందించడం ఎందుకు? కశ్మీర్ లోయలో నివసిస్తున్న ప్రజలలో ఎంత శాతం మంది భారత్‌కు అనుకూలంగా మాట్లాడుతున్నారు? ఎన్ని సార్లు అక్కడ పాకిస్తాన్ పతాకాలను ఎగురవేయలేదు? ఎన్ని దఫాలు అక్కడ పాకిస్తాన్ అనుకూల నినాదాలు వినిపించలేదు? వారందరిపైనా రాజద్రోహం కేసు పెడతామా? భిన్నత్వంలో ఏకత్వాన్ని గౌరవించడమే భారత్ గొప్పదనం అంటూ ‘మై ఐడియా ఆఫ్ ఇండియా ఈజ్...’ అంటూ నరేంద్రమోదీ పార్లమెంటులో ఆవేశపూరితంగా చెప్పిన మాటలు ఏమైనాయి? పాకిస్తాన్ పట్ల భారత ప్రజలలో వ్యతిరేకతను పెంచడం ద్వారా ఏమి సాధిస్తారు? ఏ హిందూత్వ ఎజెండానైతే వాజపేయి అటకమీద పెట్టి దేశాన్ని సమర్థంగా పరిపాలించి అరుదైనా రాజనీతిజ్ఞుడని పేరు తెచ్చుకున్నారో అదే ఎజెండాను నెత్తికెత్తుకుంటే, అటకదించితే మోదీ పెద్ద పొరపాటు చేసినట్టు అవుతుంది.

దేశంలోని 40 కేంద్రీయ విశ్వవిద్యాలయాలలో మువ్వన్నెల జెండా ఎగురవేయడమని వైస్‌చాన్సలర్లకు హెచ్‌ఆర్‌డీ మంత్రి స్మృతి ఇరానీ చెప్పడం వల్ల నష్టం లేదు. కార్ల ముందు జెండా కట్టుకున్న మంత్రులూ, చట్టసభల సభ్యులు ఎంత నీతిగా, ఎంత నిజాయితీగా వ్యవహరిస్తున్నారో ప్రజ లకు తెలుసు. అయినా సరే, అన్ని విశ్వవిద్యాలయాలలోనూ మూడు రంగుల జెండా ఎగరవచ్చు. ఈ జెండా వల్ల ప్రమోదమే కానీ ప్రమాదం లేదు. కానీ దేశ ప్రజలపై ఒకే భావజాలాన్ని రుద్దాలని ప్రయత్నించినా, తాము మాత్రమే దేశ భక్తులమనీ, తక్కినవారంతా దేశద్రోహులనీ అడ్డంగా వాదించినా ఈ దేశ ప్రజలు సహించరు. ఒకే భావజాలాన్ని అందరూ అంగీకరించాలనీ, తమ అభి మాతాన్నే అందరూ శిరసావహించాలని భావించేవారికి భారత సమాజం అర్థం కాలేదని అనుకోవాలి.  ఇండియా భిన్నమైన అనేక జాతుల, సంస్కృతుల, వార సత్వాల సమాహారం. భిన్నత్వాన్ని ఆమోదించి దేశ ప్రజలందరినీ ఒకే తాటిపైన నడిపిం చేందుకు కృషి చేయాలి కానీ గత రెండు వారాలుగా కనిపిస్తున్న వికృ తమైన, అప్రజాస్వామికమైన, దౌర్జన్యపూరితమైన, నిరంకు శమైన ధోరణులను ప్రోత్స హించకూడదు. ఈ వాతావరణం కారణంగా పార్లమెంటు సమావేశా లలో చర్చ జరగకుండా రచ్చ జరగడమే కాకుండా నిరసన ప్రదర్శనలు ముమ్మ రమై అస్థిరతకూ, అశాంతికీ దారితీస్తాయి. హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాల యంలో రోహిత్ వేముల ఆత్మహత్య చర్చకు రాకుండా అంతకంటే పెద్ద వివా దంగా జెఎన్‌యూ ఘటనను రగిలించినా ప్రయోజనం లేదు. రోహిత్ ఉదంతం దేశం అంతటా చర్చనీయాంశం అయింది. ఉత్తరప్రదేశ్‌లో  2014 నాటి ఎన్ని కలలో నరేంద్రమోదీకి ఓటు చేసిన దళితులలో చాలా మంది వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీకి ఓటు వేయకపోవచ్చు.

రెండేళ్ళ కిందట మోదీకి బ్రహ్మరథం పట్టిన యువత మరోసారి అంత ఉత్సాహంగా ముందుకు రాకపోవచ్చు. సోషల్ మీడియాలో పోస్టింగులను చూసీ, పూనకం వచ్చినట్టు ఊగిపోతున్న అర్ణబ్ గోస్వామి వంటి జర్నలిస్టులను చూసీ అదే సకల జనాభిప్రాయం అని భావిస్తే పొరబాటు. పోయిన ఎన్నికలలో ఎటువంటి రాజకీయ, సామాజిక భావ జాలం లేని యువత  అసంఖ్యాకంగా ఓటు చేయబట్టే బీజేపీ కనీవినీ ఎరుగని రీతిలో లోక్‌సభలో 282 స్థానాలు గెలుచుకోగలిగింది. హైదరాబాద్ కేంద్రీయ విశ్వ విద్యాలయం, జెఎన్‌యూ పరిణామాలు బీజేపీకి మేలు చేయవు. కశ్మీర్ ప్రజలలో దేశభక్తిని పాదుకొల్పడానికీ దోహదం చేయవు. పాకిస్తాన్‌తో సత్సం బంధాలు పెంచుకోవడానికి సైతం ఉపయోగపడవు. మోదీని గొప్ప రాజనీతి జ్ఞుడుగా చరిత్రలో నిలబెట్టవు. ఇప్పటికైనా ఎజెండాను పక్కన పెట్టి వాజపేయి వేసిన బాటలో నడుచుకోవడం మోదీకీ, బీజేపీ, దేశానికీ శ్రేయస్కరం. ఇండియా వంటి సువిశాలమైన, వైవిధ్యభరితమైన, చైతన్యవంతమైన దేశాన్ని పరిపా లించాలంటే నెహ్రూ, వాజపేయి వేసిన బాటలే శరణ్యం. ఇందుకు భిన్నంగా ఎవరు ఎటువంటి ప్రయత్నం చేసినా దేశ సమగ్రతకూ, సమైక్యతకూ ముప్పు వాటిల్లుతుంది. ఇప్పటికైనా మించి పోయింది లేదు. ‘దేవుడా  నా మిత్రుల నుంచి నన్ను  కాపాడు. నా శత్రువుల నుంచి నన్ను నేను రక్షించుకోగలను’ అంటూ లోగడ ఎవరో ప్రార్థించినట్టు మోదీ కాంగ్రెస్‌నూ, కమ్యూనిస్టు పార్టీలనూ కాచుకోగలరు.  పరివారంతోనే ప్రమాదం.

 త్రికాలమ్: కె.రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement