రాత్రి 7.15 గంటలకు ప్రమాణ స్వీకారం..
మంత్రివర్గ కూర్పుపై కొనసాగుతున్న కసరత్తు
మిత్రపక్షాలతో అమిత్ షా, రాజ్‌నాథ్, నడ్డా మంతనాలు
టీడీపీ నుంచి రామ్మోహన్ నాయుడు
జేడీయూ నుంచి లలన్‌సింగ్, సంజయ్ ఝాలలో ఒకరు
మిత్రపక్షాలకు 5 నుంచి 8 బెర్తులు
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ 3.0 ఆదివారం నుంచి మొదలుకానుంది. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్‌లాల్ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎడ్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సొంతంగా మెజారిటీ లేని నేపథ్యంలో మంత్రిపదవులపై మిత్రుల డిమాండ్లను తీర్చడం బీజేపీకి కత్తిమీద సాములా మారింది.
శనివారం కూడా బీజేపీ సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మిత్రపక్షాలతో సంప్రదింపులు కొనసాగించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (16 సీట్లు), జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ (12 సీట్లు), శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే (7 సీట్లు)లతో మంత్రి పదవులపై చర్చలు జరిపారు. పెద్దశాఖలైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలతో పాటు సైద్ధాంతికంగా కీలకమైన విద్య, సాంస్కృతిక శాఖలను బీజేపీయే అట్టిపెట్టుకుంటుందని భావిస్తున్నారు. మొదటి విడతలో మిత్రపక్షాలకు ఐదు నుంచి ఎనిమిది మంత్రి పదవులు దక్కవచ్చని సమాచారం.
టీడీపీకి ఒక కేబినెట్, ఒక సహాయమంత్రి
టీడీపీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ పదవి దక్కనుంది. పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయమంత్రి పదవి లభిస్తుందని విశ్వసనీయవర్గాల సమాచారం. రెండు పారీ్టలు టీడీపీ, జేడీయూలకు ఒక్కో కేబినెట్, ఒక్కో సహాయమంత్రి పదవులు ఇవ్వనున్నారు. జేడీయూ నుంచి లలన్ సింగ్, సంజయ్ ఝాలలో ఒకరు కేబినెట్ మంత్రిగా, రామ్‌నాథ్ ఠాకూర్ సహాయమంత్రిగా ఆదివారం మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. లోక్ జనశక్తి (రాంవిలాస్) నుంచి ఆ పార్టీ ఆధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌కు కేబినెట్‌లో చోటు దక్కనుంది.
ఢిల్లీకి చేరుకున్న హసీనా
మోదీ ప్రమాణస్వీకారంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ శనివారమే ఢిల్లీ చేరుకున్నారు. నేపాల్ ప్రధాని ప్రచండ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్‌కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని తెర్సింగ్ టోబ్గేలు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మోదీ 3.0ను సెలబ్రేట్ చేసుకునేందుకు అమెరికాలోని 22 నగరాల్లో బీజేపీ మద్దతుదారులు ఏర్పాటు చేస్తున్నారు.
న్యూయార్క్, జెర్సీ సిటీ, వాషింగ్టన్ డీసీ, బోస్టన్, అట్లాంటా, హూస్టన్, డల్లాస్, షికాగో, లాస్‌ఏంజెలెస్, శాన్‌ఫ్రాన్సిస్కో తదితర నగరాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ– యూఎస్‌ఏ అధ్యక్షుడు అడపా ప్రసాద్ తెలిపారు. భారతీయ రైల్వేస్‌కు చెందిన పది మంది లోకో పైలట్లను ప్రమాణస్వీకారానికి ఆహా్వనించారు. ఇందులో భారత తొలి మహిళా లోకోపైలట్ సురేఖ యాదవ్ ఉన్నారు. రాష్ట్రపతి భవన్‌లో వీవీఐపీలకు, కాబోయే మంత్రులకు ప్రత్యేక ఎన్‌క్లోజర్లు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం ముగిశాక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అతిథులకు విందు ఇవ్వనున్నారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల నిషేధాజ్ఞలు విధించారు. ఆది, సోమవారాల్లో దేశ రాజధానిని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు.
మాకింకా ఆహ్వానం రాలేదు: కాంగ్రెస్
మోదీ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకా ఎలాంటి ఆహ్వానాలు అందలేదని పార్టీ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ శనివారం రాత్రి చెప్పారు. ఆహ్వానాలు వస్తే హాజరు కావడంపై ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment