swearing in cermony
-
నేడు మోదీ మూడోసారి
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ 3.0 ఆదివారం నుంచి మొదలుకానుంది. రాష్ట్రపతి భవన్లో ఆదివారం రాత్రి 7.15 గంటలకు ప్రధానిగా నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మూడుసార్లు ప్రధానిగా చేసిన జవహర్లాల్ నెహ్రూ రికార్డును సమం చేయనున్నారు. బీజేపీకి సొంతంగా 240 సీట్లు మాత్రమే రాగా... మిత్రపక్షాలతో కలిపి ఎడ్డీయే 293 సీట్లతో మెజారిటీ సాధించింది. సొంతంగా మెజారిటీ లేని నేపథ్యంలో మంత్రిపదవులపై మిత్రుల డిమాండ్లను తీర్చడం బీజేపీకి కత్తిమీద సాములా మారింది. శనివారం కూడా బీజేపీ సీనియర్ నేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా మిత్రపక్షాలతో సంప్రదింపులు కొనసాగించారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు (16 సీట్లు), జేడీయూ అధ్యక్షుడు నితీశ్ కుమార్ (12 సీట్లు), శివసేన అధ్యక్షుడు, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే (7 సీట్లు)లతో మంత్రి పదవులపై చర్చలు జరిపారు. పెద్దశాఖలైన హోం, ఆర్థిక, రక్షణ, విదేశీ వ్యవహారాలతో పాటు సైద్ధాంతికంగా కీలకమైన విద్య, సాంస్కృతిక శాఖలను బీజేపీయే అట్టిపెట్టుకుంటుందని భావిస్తున్నారు. మొదటి విడతలో మిత్రపక్షాలకు ఐదు నుంచి ఎనిమిది మంత్రి పదవులు దక్కవచ్చని సమాచారం. టీడీపీకి ఒక కేబినెట్, ఒక సహాయమంత్రి టీడీపీ నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడుకు కేబినెట్ పదవి దక్కనుంది. పెమ్మసాని చంద్రశేఖర్‌కు సహాయమంత్రి పదవి లభిస్తుందని విశ్వసనీయవర్గాల సమాచారం. రెండు పారీ్టలు టీడీపీ, జేడీయూలకు ఒక్కో కేబినెట్, ఒక్కో సహాయమంత్రి పదవులు ఇవ్వనున్నారు. జేడీయూ నుంచి లలన్ సింగ్, సంజయ్ ఝాలలో ఒకరు కేబినెట్ మంత్రిగా, రామ్‌నాథ్ ఠాకూర్ సహాయమంత్రిగా ఆదివారం మోదీతో పాటు ప్రమాణ స్వీకారం చేస్తారని సమాచారం. లోక్ జనశక్తి (రాంవిలాస్) నుంచి ఆ పార్టీ ఆధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్‌కు కేబినెట్లో చోటు దక్కనుంది. ఢిల్లీకి చేరుకున్న హసీనా మోదీ ప్రమాణస్వీకారంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్ ప్రధానమంత్రి షేక్ హసీనా, సీషెల్స్ ఉపాధ్యక్షుడు అహ్మద్ అఫీఫ్ శనివారమే ఢిల్లీ చేరుకున్నారు. నేపాల్ ప్రధాని ప్రచండ, శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘే, మారిషస్ ప్రధాని ప్రవింద్‌కుమార్ జుగ్నాథ్, భూటాన్ ప్రధాని తెర్సింగ్ టోబ్గేలు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరుకానున్నట్లు విదేశాంగ శాఖ వెల్లడించింది. మోదీ 3.0ను సెలబ్రేట్ చేసుకునేందుకు అమెరికాలోని 22 నగరాల్లో బీజేపీ మద్దతుదారులు ఏర్పాటు చేస్తున్నారు. న్యూయార్క్, జెర్సీ సిటీ, వాషింగ్టన్ డీసీ, బోస్టన్, అట్లాంటా, హూస్టన్, డల్లాస్, షికాగో, లాస్ఏంజెలెస్, శాన్ఫ్రాన్సిస్కో తదితర నగరాల్లో విజయోత్సవ ర్యాలీలు నిర్వహించనున్నట్లు ఓవర్సీస్ ఫ్రెండ్స్ ఆఫ్ బీజేపీ– యూఎస్ఏ అధ్యక్షుడు అడపా ప్రసాద్ తెలిపారు. భారతీయ రైల్వేస్‌కు చెందిన పది మంది లోకో పైలట్లను ప్రమాణస్వీకారానికి ఆహా్వనించారు. ఇందులో భారత తొలి మహిళా లోకోపైలట్ సురేఖ యాదవ్ ఉన్నారు. రాష్ట్రపతి భవన్లో వీవీఐపీలకు, కాబోయే మంత్రులకు ప్రత్యేక ఎన్క్లోజర్లు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం ముగిశాక రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అతిథులకు విందు ఇవ్వనున్నారు. పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. పలు చోట్ల నిషేధాజ్ఞలు విధించారు. ఆది, సోమవారాల్లో దేశ రాజధానిని నో ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించారు. మాకింకా ఆహ్వానం రాలేదు: కాంగ్రెస్ మోదీ ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇంకా ఎలాంటి ఆహ్వానాలు అందలేదని పార్టీ ప్రధాన కార్యదర్శులు జైరాం రమేష్, కేసీ వేణుగోపాల్ శనివారం రాత్రి చెప్పారు. ఆహ్వానాలు వస్తే హాజరు కావడంపై ఇండియా కూటమి నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. -
నేపాల్ పీఎంగా మళ్లీ ఓలి
కఠ్మాండూ: నేపాల్ ప్రధానమంత్రిగా కేపీ శర్మ ఓలి శుక్రవారం మరోసారి ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్లో మెజారిటీ కోల్పోయి, విశ్వాసపరీక్షలో విఫలమవడంతో నాలుగు రోజుల కిందటే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. అయితే, విపక్ష పార్టీలు మెజారిటీ సాధించే విషయంలో విఫలం కావడంతో గురువారం రాష్ట్రపతి విద్యాదేవి భండారీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కేపీ శర్మ ఓలీని కోరారు. దాంతో, రాష్ట్రపతి భవనంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఓలి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. నెల రోజుల్లోగా ఆయన మెజారిటీని నిరూపించుకోవాల్సి ఉంటుంది. లేనట్లయితే, రాష్ట్రపతి పాలన విధించి, 6 నెలల్లోగా ఎన్నిక లు నిర్వహించే అవకాశముంటుంది. ఓలి గత మంత్రి వర్గాన్నే కొనసాగించనున్నారు. ప్రచండ యూ టర్న్: సీపీఎన్–మావోయిస్ట్ సెంటర్ చైర్మన్ పుష్పకమల్ దహల్ అలియాస్ ప్రచండ మద్దతుతో మెజారిటీ సాధించి ప్రధాని పదవి చేపడ్తానన్న ఆశతో గురువారం వరకు నేపాలి కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూ దేవ్బా ఉన్నారు. అయితే, చివరి నిమిషంలో ప్రచండ కేపీ శర్మ ఓలీతో సమావేశమై దేవ్‌బాకు మద్దతిచ్చే విషయంలో యూ టర్న్ తీసుకున్నారు. 271 మంది సభ్యుల ప్రతినిధుల సభలో ఓలి పార్టీ సీపీఎన్–యూఎంఎల్‌కు 121 మంది సభ్యులున్నారు. మెజారిటీకి 136 మంది సభ్యుల మద్దతు అవసరం. -
బైడెన్ బృందంలో 20 మంది ఇండో అమెరికన్లు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా మరో రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించబోతున్న జో బైడెన్ బృందంలో భారతీయ అమెరికన్లు కీలక పాత్ర పోషించనున్నారు. ముఖ్యమైన పదవుల్లో బైడెన్ ఇప్పటికే కనీసం 20 మంది ఇండో అమెరికన్లను నియమించారు. వారిలో 13 మంది మహిళలే కావడం విశేషం. అలాగే, వైట్‌హౌజ్ నుంచి బాధ్యతలు నిర్వహించే శక్తిమంతమైన బైడెన్ పాలన బృందంలో 17 మంది భారతీయ అమెరికన్లు కీలకంగా వ్యవహరించనున్నారు. వారిలో మేనేజ్మెంట్ అండ్ బడ్జెట్ డైరెక్టర్‌గా నామినేట్ అయిన నీరా టాండన్ ఒకరు. బైడెన్ డిప్యూటీగా ఉపాధ్యక్ష పదవికి ఆఫ్రో–ఇండియన్ మూలాలున్న కమలా హ్యారిస్ ఎన్నికైన విషయం తెలిసిందే. జనవరి 20న దేశాధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమల ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బైడెన్ యంత్రాంగంలో కీలక బాధ్యతలు పోషించబోతున్న ఇండో అమెరికన్లలో.. యూఎస్ సర్జన్ జనరల్‌గా ఎంపికైన వివేక్ మూర్తి, న్యాయ విభాగంలో అసోసియేట్ అటార్నీ జనరల్‌గా ఎంపికైన వనిత గుప్తా, సివిలియన్ సెక్యూరిటీ, డెమొక్రసీ, హ్యూమన్‌రైట్స్‌కు అండర్ సెక్రటరీ ఆఫ్ స్టేట్‌గా ఎంపికైన ఉజ్రా జెయా, బైడెన్ భార్య, కాబోయే ఫస్ట్ లేడీ డాక్టర్ జిల్ బైడెన్‌కు పాలసీ డైరెక్టర్‌గా ఎంపికైన మాలా అడిగ, జిల్ బైడెన్ డిజిటల్ డైరెక్టర్‌గా ఎంపికైన గరీమా వర్మ, వైట్ హౌజ్ డెప్యూటీ ప్రెస్ సెక్రటరీగా ఎంపికైన సబ్రీనా సింగ్, వైట్‌హౌజ్ నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికైన భరత్ రామమూర్తి, వైట్‌హౌజ్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ డిప్యూటీ డైరెక్టర్‌గా ఎంపికైన గౌతమ్ రాఘవన్ తదితరులున్నారు. కశ్మీరీ మూలాలున్న అయిషా షా వైట్‌హౌజ్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటెజీలో పార్ట్నర్షిప్ మేనేజర్‌గా, సమీరా ఫజిలి వైట్‌హౌజ్‌లోని యూఎస్ నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్లో డెప్యూటీ డైరెక్టర్‌గా ఎంపిక కావడం విశేషం. మరోవైపు, జో బైడెన్ సన్నిహిత బృందంలో ఒకరైన వినయ్ రెడ్డి డైరెక్టర్, స్పీచ్ రైటింగ్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అసిస్టెంట్ ప్రెస్ సెక్రటరీ టు ద ప్రెసిడెంట్‌గా యువకుడైన వేదాంత్ పటేల్‌ను ఎంపిక చేశారు. నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్లో టెక్నాలజీ అండ్ నేషనల్ సెక్యూరిటీ సీనియర్ డైరెక్టర్‌గా తరుణ్ ఛాబ్రా, సీనియర్ డైరెక్టర్ ఫర్ సౌత్ ఏసియాగా సుమొన గుహ, కోఆర్డినేటర్ ఫర్ డెమొక్రసీ అండ్ హ్యూమన్ రైట్స్‌గా శాంతి కళాతిల్లను బైడెన్ ఎంపిక చేశారు. క్లైమేట్ పాలసీ అండ్ ఇన్నోవేషన్‌లో సీనియర్ అడ్వైజర్‌గా సోనియా అగర్వాల్, వైట్‌హౌజ్ కోవిడ్–19 రెస్పాన్స్ టీమ్‌కి పాలసీ అడ్వైజర్ ఫర్ టెస్టింగ్‌గా విదుర్ శర్మ కూడా కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. వైట్‌హౌజ్ న్యాయవిభాగంలో అసోసియేట్ కౌన్సెల్‌గా నేహ గుప్తా, డిప్యూటీ అసోసియేట్ కౌన్సెల్‌గా రీమా షా ఇండో అమెరికన్ మహిళల శక్తిసామర్థ్యాలను చూపనున్నారు. కోలం ముగ్గులు అమెరికా అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా బైడెన్, కమల ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రారంభ సూచికగా శనివారం జరిగిన వర్చువల్ కార్యక్రమంలో భారత్‌లోని తమిళనాడుకు చెందిన సంప్రదాయ కోలం ముగ్గులు ఆకట్టుకున్నాయి. బైడెన్, కమలలను ఆహ్వానిస్తూ వేలాది కోలం డ్రాయింగ్స్‌తో ఒక వీడియోను రూపొందించారు. ఈ కార్యక్రమంలో యూఎస్, ఇండియా నుంచి 1,800 మంది ఔత్సాహికులు పాల్గొన్నారు. ఆరోగ్యం, సౌభాగ్యాలను ఆహ్వానిస్తూ తమిళనాడులోని గృహిణులు తమ ఇళ్లల్లో, ఇళ్ల ముందు వీటిని వేస్తారు. కమల తల్లి శ్యామల తల్లి స్వస్థలం తమిళనాడేనన్న విషయం తెలిసిందే. తొలి రోజు సుమారు డజను నిర్ణయాలు అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలిరోజు బైడెన్ సుమారు డజను అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్నారు. వాటిలో అమెరికా ఎదుర్కొంటున్న నాలుగు ప్రధాన సంక్షోభాలు.. కోవిడ్, ఆర్థిక రంగ మందగమనం, వాతావరణ మార్పు, జాత్యహంకారం.. వీటి నివారణలపై చర్యలు చేపట్టేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటారని వైట్‌హౌజ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న రాన్ క్లెయిన్ వెల్లడించారు. అమెరికన్ విద్యార్థుల రుణాల చెల్లింపుల గడువు పొడిగింపు, పారిస్ ఒప్పందంలో మళ్లీ చేరడం, ముస్లింలపై నిషేధాన్ని తొలగించడం.. తదితర అంశాలపై తొలి పది రోజుల్లో నిర్ణయాలుంటాయన్నారు. అమెరికాలో అక్రమంగా ఉంటున్న 1.1 కోట్ల వలసదారులకు లీగల్ స్టేటస్ కల్పించే విషయానికి బైడెన్ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈ విషయంలో ప్రధాన పార్టీలైన డెమొక్రటిక్, రిపబ్లికన్ సభ్యుల్లోనూ అంతర్గతంగా విభేదాలున్న విషయం తెలిసిందే. ఈ విభేదాల నేపథ్యంలో.. ఎప్పుడు బైడెన్ దీన్ని అమలు చేస్తారనే విషయంలో ఆసక్తి నెలకొంది. అయితే, అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన తొలి రోజే బైడెన్ సంబంధిత ఇమిగ్రేషన్ బిల్లును కాంగ్రెస్‌కు పంపిస్తారని రాన్ క్లెయిన్ స్పష్టం చేశారు. కమలా హ్యారిస్ ప్రమాణం తొలి మహిళా ఉపాధ్యక్షురాలు, తొలి దక్షిణాసియా మూలాలున్న ఉపాధ్యక్షురాలు, తొలి బ్లాక్ ఉపాధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించనున్న కమలా హ్యారిస్‌తో జనవరి 20న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సోనియా సొటొమేయర్ ప్రమాణ స్వీకారం చేయించ నున్నారు. జస్టిస్ సోనియా కూడా యూఎస్ సుప్రీంకోర్టులో తొలి హిస్పానిక్ న్యాయమూర్తి, మూడో మహిళా న్యాయమూర్తి కావడం గమనార్హం. గతంలో జస్టిస్ సోనియా న్యూయార్క్‌లో, కమలా హ్యారిస్ కాలిఫోర్నియాలో ప్రాసిక్యూటర్లుగా పనిచేశారు. ప్రమాణ స్వీకారం సమయంలో కమల రెండు బైబిల్స్‌ను చేతిలో పట్టుకుని ప్రమాణం చేస్తారు. ఆ రెండు బైబిల్స్లో.. ఒకటి తన తల్లిలాంటి రెజీనా షెల్టన్‌ది కాగా, మరొకటి అమెరికా మానవ హక్కుల నేత, సుప్రీంకోర్టు తొలి ఆఫ్రో అమెరికన్ న్యాయమూర్తి తర్గుడ్ మార్షల్‌ది కావడం విశేషం. పాఠశాలలో చదువుకునే రోజుల్లో స్కూల్ ముగియగానే.. కమల తన సోదరి మాయతో కలిసి తమ ఇంటికి రెండు ఇళ్ల దూరంలో ఉన్న రెజీనా ఇంటికే వెళ్లేవారు. గతంలో కాలిఫోర్నియా అటార్నీ జనరల్‌గా, తరువాత సెనెటర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో రెజీనా షెల్టన్ బైబిల్నే కమలా హ్యారిస్ తీసుకువెళ్లారు. వినయ్ రెడ్డి, వనితా గుప్తా, సబ్రినా సింగ్, భరత్ రామ్మూర్తి, సమీరా ఫజిలి వివేక్‌మూర్తి, మాలా అడిగ, నీరా టాండన్, గౌతమ్ రాఘవన్, వేదాంత్ పటేల్ -
రేపు 11 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం
-
రేపు 11 గంటలకు సీఎంగా ప్రమాణస్వీకారం
తమిళనాడు ముఖ్యమంత్రిగా అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. దాదాపు 8 నెలల తర్వాత తొలిసారిగా ప్రజలకు దర్శనమిచ్చిన 'అమ్మ'.. రాష్ట్ర గవర్నర్ కొణిజేటి రోశయ్యను కలిసి, తన మంత్రివర్గంలో ఉండబోయే మంత్రుల జాబితాను ఆయనకు సమర్పించారు. సుదీర్ఘ కాలం తర్వాత పోయెస్ గార్డెన్స్ నుంచి బయటకు వచ్చిన ఆమె.. ముందుగా ఎంజీ రామచంద్రన్ విగ్రహం వద్ద నివాళులర్పించి.. ఆ తర్వాత గవర్నర్ నివాసమైన రాజ్‌భవన్‌కు వెళ్లారు. అక్కడ గవర్నర్ రోశయ్యను కలిసి తన జాబితాను ఆయనకు సమర్పించారు. శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నట్లు రోశయ్యకు తెలిపారు. ఈ సందర్భంగా జయలలిత బయటకు రాగానే ఒక్కసారిగా అభిమానులంతా.. 'అమ్మ తిరిగొచ్చింది' అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. -
మోడీ ప్రమాణస్వీకారానికి ఎనిమిది దేశాల అధినేతలు
పాకిస్థాన్ సహా.. ఎనిమిది దేశాల అధినేతలు నరేంద్రమోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరు కాబోతున్నారు. ఈ విషయాన్ని ఆయా దేశాల ప్రతినిధులు ఖరారు చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ శనివారం తెలిపింది. పాక్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి హాజరవుతున్నట్లుగా తమకు సందేశం అందిందని విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్ తెలిపారు. ఇలా మొత్తం ఎనిమిది దేశాల ప్రతినిధులు తాము వస్తున్నట్లు నిర్ధారించారని ఆయన చెప్పారు. అఫ్ఘానిస్థాన్ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్, మాల్దీవుల అధ్యక్షుడు అబ్దుల్లా యమీన్, శ్రీలంక అధ్యక్షుడు మహీంద రాజపక్స, భూటాన్ ప్రధాని షెరింగ్ టాబ్గే, నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా, బంగ్లాదేశ్ పార్లమెంటు స్పీకర్ శిరిన్ షర్మీన్ చౌధురి వస్తున్నారు. వీళ్లంతా సార్క్ దేశాల ప్రతినిధులు కావడం గమనార్హం. ఇంకా, మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రామ్‌గులామ్ కూడా వస్తున్నారు.