పాలకులు నేర్వని పాఠం | a lesson that rulers never learn, k ramachandra murthy writes | Sakshi
Sakshi News home page

పాలకులు నేర్వని పాఠం

Published Sun, Jan 24 2016 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 4:10 PM

పాలకులు నేర్వని పాఠం

పాలకులు నేర్వని పాఠం

యూనిర్శిటీ ఆఫ్ హైదరాబాద్ దళిత విద్యార్థి రోహిత్ రాసిన ఆఖరి లేఖ చాలామందితో పాటు నన్నూ తీవ్రమైన ఆవేదనకూ, అశాంతికీ గురి చేసింది.

త్రికాలమ్

 

యూనిర్శిటీ ఆఫ్ హైదరాబాద్ దళిత విద్యార్థి రోహిత్ రాసిన ఆఖరి లేఖ చాలామందితో పాటు నన్నూ తీవ్రమైన ఆవేదనకూ, అశాంతికీ గురి చేసింది. కృష్ణాజిల్లా కంచిక చర్లలో అరికట్ల కోటేశును చెట్టుకు కట్టి సజీవదహనం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకూ దళితులపైన దాడులు జరిగిన అనేక సందర్భాలలో ధర్మాగ్రహం ప్రదర్శించాం. పైశాచికత్వాన్ని ఖండించాం. ఇంతవరకూ జరిగిన దారుణాలన్నిటి కంటే రోహిత్ మరణం మరింత బలంగా కదిలించింది.  ఆత్మహత్యకు ముందు రాసిన లేఖ ఇందుకు కారణం కావచ్చు.

 

నేను హైదరాబాద్‌లో విద్యార్థిగా ఉన్నప్పుడు అమెరికన్ సెంటర్‌లో చూసిన డాక్యుమెంటరీలలో, చదివిన పత్రికలలో కనిపించి చేయి పట్టుకొని ఆకాశవీధుల్లో తిప్పి విశ్వరహస్యాలు విప్పిచెప్పిన కార్ల్ సేగన్ కాలం చేసి రెండు దశాబ్దాలు గడిచాయి. ఈ తరం విద్యార్థిని సేగన్ అంత గాఢంగా ప్రభావితం చేయడం నాకు ఆశ్చర్యం కలిగించింది. 1980లలో పబ్లిక్ బ్రాడ్‌కాస్టింగ్ సిస్టమ్ (పీబీఎస్)లో 13 భాగాలుగా ప్రసారమైన కాస్మోస్ సీరీస్ తాలూకు సీడీలను ఖగోళశాస్త్రంపైన ఆసక్తి కలిగిన పీహెచ్‌డీ విద్యార్థి చూడటంలో ఆశ్చర్యం లేదు. సేగన్ రాసిన ‘పేల్ బూ లడాట్’ కూడా చదివే ఉంటాడు.  సృష్టి పట్లా, అందులో మనిషి ఉనికి పట్లా లోతైన అవగాహన లేకపోతే రోహిత్ ఆఖరి లేఖ గుండెలను అంతగా పిండేది కాదు. తన మిత్రులనూ, శత్రువులనూ సైతం వేధించవద్దంటూ ముక్తాయింపు చెప్ప డంతో మరణంలోనూ ఎదిగాడనిపించింది.

 

తాను ఒక వ్యక్తికి ఒక కోడి బాకీ ఉన్నాననీ, దాన్ని తిరిగి చెల్లించాలనీ సోక్రటీస్ విషం సేవించడానికి ముందు తన శిష్యులతో చెబుతాడు. దీన్ని ప్లేటో నమోదు చేశాడు. రోహిత్ సైతం తాను రామ్‌జీ అనే మిత్రుడికి నలభైవేల రూపాయలు బాకీ ఉన్నా ననీ, విశ్వవిద్యాలయం నుంచి రావలసిన రూ. 1.75 లక్షల ఉపకార వేతనం తాలూకు బకాయీలు వసూలు చేసి రామ్‌జీ బాకీ తీర్చి తక్కిన మొత్తం తన కుటుంబసభ్యులకు ఇవ్వాలని స్నేహితులను కోరాడు. ఎప్పుడూ రోహిత్ ఇంతే కవితాత్మకంగా, ఆలోచనాత్మకంగా, ఉదాత్తంగా మాట్లాడేవాడో, లేదో  తెలియదు. ఆత్మహత్య చేసుకోవాలన్న కఠోరమైన నిర్ణయం తీసుకున్న వ్యక్తి ఉరి వేసుకోవడానికి ముందు ఇంత ప్రశాంతంగా, ఇంత సంయమనంతో, ఇంతటి క్షమాగుణంతో ఆలోచించడం చూస్తే అతడు అసాధారణ వ్యక్తి అనిపిస్తుంది.

 

అంబేడ్కర్ నేర్పింది పోరాటం

హాస్టల్ ఖాళీ చేయమని విశ్వవిద్యాలయ యాజమాన్యం ఆదేశించినప్పుడు తన వస్తువులతో పాటు పెద్ద అంబేడ్కర్ ఫోటో పట్టుకొని రోహిత్ హాస్టల్ నుంచి బయటకు వస్తున్న చిత్రం పత్రికలో చూసినప్పుడు అంబేడ్కర్ నుంచి స్ఫూర్తి పొందిన విద్యార్థి నాయకుడు ఆత్మహత్యకు ఒడిగట్టడం విషాదం అనిపించింది. అంబేడ్కర్‌కు ఎదురైన అవమానాలతో పోల్చితే రోహిత్ కష్టాలు తక్కువే. వందేళ్ల కిందటి హిందూ సమాజం మరింత ఛాందసంగా, మరింత నిర్దయగా ఉండేది. ఎన్ని అవమానాలూ, అవరోధాలూ ఎదురైనా అన్నిటినీ అధిగమించాడు అంబేడ్కర్.

 

రాజ్యాంగం అనే ఒకానొక మహ త్తరమైన సాధనంతో దళితుల దాస్యశృంఖలాలను తెంచడానికీ, వారి అభ్యు న్నతికి బాటలు వేయడానికీ, అహింసాత్మకంగా సమాజంలో పెనుమార్పు సాధించడానికీ కృషి చేసి చరితార్థుడైనాడు. అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియే షన్ (ఏఎస్‌ఏ)కు నాయకత్వం వహించిన యువకుడు అంబేడ్కర్ స్ఫూర్తితో ప్రజాస్వామ్య పద్ధతులలో పోరాటం సాగించాలి. దళితులకు కానీ దళితేత రులకు కానీ సమస్యలను చూసి గుండె చెదిరి లేదా అవమానాలకు కుంగి పోయి చేతులారా ప్రాణాలు తీసుకునే హక్కు లేదు.

 

వాస్తవానికి ఇది కేవలం ఒక విద్యార్థి పరాజయం లేదా పలాయనం కాదు. సమాజం యావత్తూ సిగ్గుతో తలదించుకోవలసిన అమానుషం. మొదటితరం విద్యావంతుడైన రోహిత్ ఇంత ఎత్తుకు ఎదగ గలిగితే రెండో తరం, మూడో తరం విద్యావంతులైన దళితులు ఇతర కులాలవారితో దీటుగా రాణించగలుగుతారు. మరికొన్ని దశాబ్దాలు రిజర్వేషన్లు సవ్యంగా అమలు జరిగితే ఆ తర్వాత రిజర్వేషన్ల అవసరమే ఉండదు. దళితులకూ, ఆదివాసీ లకూ రిజర్వేషన్లూ, ఇతర సౌకర్యాలూ రాజ్యాంగంలో కల్పించకపోయినట్ల యితే దేశం ఏడు దశాబ్దాలుగా సమైక్యంగా ఉండేది కాదు. అంతర్యు ద్ధాలతో చిరిగిన విస్తరై విఫల రాజ్యమయ్యేది.

 

హిందూమతం శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని చూసినా తరతరాలు వస్తున్న వికారాలనూ, వివక్షలనూ వదిలించుకొని, కులాల పేరుతో కట్టుకున్న అడ్డుగోడలను కూల్చివేసుకొని సమైక్యభావన పెంపొందించుకోవాలి. ఈ భావన భావిపౌరులైన విద్యార్థులలో బలంగా నాటుకోవాలి. రాజకీయాల పేరుతో, కులాలపేరుతో, మతాల పేరుతో కుంపట్లు పెట్టి అగ్గి రాజేస్తూ పోయే కార్యక్రమానికి రాజకీయ పార్టీలు స్వస్తి చెప్పకపోతే, పిడివాదాన్ని పక్కనపెట్టకపోతే ఈ జాతికి నిష్కృతి ఉండదు. భారతీయతను అర్థం చేసుకు న్నవారికి భిన్నత్వంలో ఏకత్వం, అందులోని సౌదర్యం తెలిసి తీరుతుంది. భిన్న భావాలు సంఘర్షించుకోవాలి. అప్పుడే కొత్త ఆలోచనలకూ, ప్రగతికీ తలుపులు తెరుచుకుంటాయి.

 

యూనిర్శిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థి సంఘాలు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ), ఏఎస్‌ఏ మధ్య వివాదం దేనిపైన ? యూకూబ్ మెమెన్‌ను ఉరితీయడంపైనా, ముజఫర్‌నగర్ అల్లర్లపైనా రెండు విద్యార్థి సంఘాలకూ పూర్తిగా భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. ‘రా’ అనే భారత గూఢచర్య సంస్థ ఇచ్చిన హామీల కారణంగా లొంగిపోయి స్వదేశానికి తిరిగి వచ్చిన మెమెన్ ముంబయ్ అల్లర్లపైన పరిశోధనలో సహకరించాడు. కరాచీలో దావూద్ ఇబ్రాహీం నివాసం ఎక్కడో చెప్పాడు. తన అన్న టైగర్ మెమెన్ గుట్టుమట్టులు కూడా మన ఇంటెలిజెన్స్ సంస్థలకు వెల్లడించాడు. మెమెన్‌ను ఉరితీయడం సరికాదని నా బోటి జర్నలిస్టులూ, రాజకీయ నాయకులూ, మేధావులూ అనేకమంది వాదించారు. ఉరే సరి అంటూ వాదించినవారూ ఉన్నారు. అది అంతటితో ఆగాలి. ఏఎస్‌ఏ విద్యార్థులను గూండాలుగా అభివర్ణిస్తూ ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్ ఫేస్‌బుక్‌లో రాయడం, చినికి చినికి గాలివాన అయినట్టు రోహిత్ సహా అయిదుగురు దళిత విద్యార్థులను విశ్వవిద్యాలయం నుంచీ, హాస్టల్ నుంచీ బహిష్కరించడం వరకూ వెళ్లింది. తక్కిన విషయాలు వారం రోజులుగా నలుగుతున్నవే. ఇక్కడ చెప్పడం చర్విత చర్వణం అవుతుంది.

 

హెచ్‌సీయూలో ఏఎస్‌ఏని స్థాపించి రెండు దశాబ్దాలవుతోంది. ఈ మధ్య చెప్పుడు మాటలు చెవికి ఎక్కించుకొని చెన్నై ఐఐటీలో అంబేడ్కర్ పెరియార్ స్టడీ సర్కిల్‌పైన స్మృతి ఇరానీ నిషేధం విధించిన తర్వాత దేశ వ్యాప్తంగా విశ్వవిద్యాలయాలలో అంబేడ్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ యూనిట్లు వెలి శాయి. బొంబాయి ఐఐటీలో అంబేడ్కర్, పెరియార్, ఫూలే సర్కిల్ ఏర్పాటు చేసుకున్నారు. అణచివేత పెరిగినకొద్దీ పోరాటం ఉధృతం అవుతుంది, విస్తరిస్తుంది. కత్తులు ఒరలో పెట్టి కరచాలనం చేయించే ప్రక్రియ ఇప్పుడు కావాలి. ఈ ప్రక్రియ అమలు చేసేవారికి నిజాయితీ అత్యవసరం.

 

మోదీదే భారం

ఇరవై మాసాల కిందట ఎన్నికల ప్రభంజనం సృష్టించిన ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారంనాడు లక్నోలో అంబేడ్కర్ యూనివర్శిటీలో రోహిత్ ప్రస్తావన తెచ్చి ‘దేశం ఒక బిడ్డను కోల్పొయింది. ఆ తల్లి బాధను అర్థం చేసుకోగలను’ అంటూ కళ్లు వొత్తుకున్నా ఎందుకో వెలితిగానే ఉంది. ఎక్కడో ఏదో లోపం. అది ఏమిటో తెలిసినా ప్రధాని దృష్టికి తెచ్చే సాహసం ఎవరికీ ఉన్నట్టు లేదు. ఆర్థిక వ్యవస్థకు అవరమైన గుడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్‌టీ) బిల్లు ఆమోదం కోసం ప్రతిపక్షంతో సయోధ్య సాధించేందుకు ప్రయత్నించవలసిన ప్రధాని ఆ  పని చేయడం లేదు. పైగా ఎన్నికల ప్రచా రంలో ప్రదర్శించిన విస్ఫోటక ధోరణినే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు.

 

71 సంవత్సరాల నాటి నేతాజీ రహస్య పత్రాలను విడుదల చేయ డంలో కాంగ్రెస్‌ను బదనాం చేయడంతో పాటు తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతాబెనర్జీ అమ్ములపొదిలోని ఒక అస్త్రాన్ని నిర్వీర్యం చేయడం కూడా మోదీ లక్ష్యం. ఈ రాజకీయ  క్రీడల వల్ల ప్రతిపక్షాలకు నష్టం వాటిల్ల వచ్చునేమో కానీ అధికార పక్షానికి ప్రయోజనం ఉండదు. కీలకమైన బిల్లు లకు రాజ్యసభలో ఆమోదం పొంది, రెండవ తరం ఆర్థిక సంస్కరణలను వేగంగా అమలు చేయాలని మోదీని రెండేళ్లుగా భుజాలపైన మోస్తున్న కార్పొరేట్‌రంగం అధిపతులు ఎదురు చూస్తున్నారు. ఆర్థిక సంస్కరణలు అమలు జరగాలన్నా, అభివృద్ధి సాధించాలన్నా సమాజంలో శాంతిసుస్థి  రతలు ఉండాలి. ఇంతకాలం భారతీయ జనతా పార్టీ శ్రేణులలో, ఆ పార్టీ అనుబంధ సంస్థల సభ్యులలో పేరుకొని ఉన్న భావజాలాన్ని నవీకరించ వలసిన అవసరం ఉన్నదని మోదీకి తెలుసు. కానీ ఆయన ఆ పని చేయలేక పోతున్నారు. తన ఎజెండాను మార్చుకొని, కాంగ్రెస్‌పైన గురిపెట్టిన అస్త్రా లను సమస్యలపైనా, వివాదాలపైనా సంధిస్తే ప్రభుత్వం పట్లా, ప్రధాని పట్లా ప్రజలలో విశ్వాసం పెరుగుతుంది.

 

అంబేడ్కర్ 125 జయంతి ఉత్సవాలను ఎంత ఘనంగా జరిపినా, అంబేడ్కర్ స్మారక భవనం ఎంత అందంగా నిర్మించినా, అంబేడ్కర్ నామస్మరణ నిత్యం చేసినా అంబేడ్కర్ ఎవరినైతే ఉద్ధరించడానికి జీవితాన్ని అంకితం చేశారో వారికి ఆత్మహత్య వినా మరో మార్గం కనిపించని పరిస్థితులు కల్పిస్తే ప్రయోజనం ఏమిటి? అంబేడ్కర్ విగ్రహ పరిష్వంగం కాదు కావలసింది. అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని ఆత్మగతం చేసుకోవడం. త్రికరణశుద్ధిగా అమలు చేయడం. ఇందుకు పార్టీనీ, పార్టీ అనుబంధ సంస్థలనూ, ప్రభుత్వ యంత్రాంగాన్నీ సంసిద్ధం చేయడం. అప్పుడే దళితులకు హిందూమతం పట్ల వ్యతిరేక భావం తగ్గుతుంది. సమైక్యభావన బలపడుతుంది. ఈ సంగతి తెలిసిన ప్రముఖులు కొందరు ఆర్‌ఎస్‌ఎస్‌లోనూ, బీజేపీలోనూ ఉన్నారు. కానీ అందరినీ శాసించే స్థాయిలో కానీ ఒప్పించే స్థితిలో కానీ వారు లేరు. దళితులనూ, ఆదివాసీలనూ అక్కున చేర్చుకుంటేనే హిందూమతానికి కానీ, దేశానికి కానీ మనుగడ సాధ్యం అనే వాస్తవాన్ని గ్రహించినవారి సంఖ్య పెరిగేంత వరకూ రోహిత్ వంటి దళిత యువకులకు రక్షణ లేదు. బీజేపీ పట్ల ప్రజల విశ్వాసం కొనసాగుతుందన్న భరోసా లేదు.

 

- కె.రామచంద్రమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement