
కరువు కనలేరా?
కరువు కాటకాలు మనకు కొత్త కాదు. రైతు ఆత్మహత్యలు దాదాపు ఇరవై సంవత్సరాలుగా నిత్యకృత్యమైనాయి..
త్రికాలమ్
కరువు కాటకాలు మనకు కొత్త కాదు. రైతు ఆత్మహత్యలు దాదాపు ఇరవై సంవత్సరాలుగా నిత్యకృత్యమైనాయి. అధికార రాజకీయ క్రీడలో గెలుపే లక్ష్యంగా పోరాడుతున్న రాజకీయ పార్టీలకు అనావృష్టి, కరువు కారణంగా అల మటిస్తున్న ప్రజల గోడు వినిపించడం లేదు. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు అంటీముట్టనట్టు ఉంటున్నాయి. కరువు లేనట్టూ, రైతుల ఆత్మహత్యలు జరగనట్టూ, గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టూ నటిస్తున్నాయి. పరస్పర నిందారోపణలతో, రాజకీయపుటెత్తుగడలతో రాజకీయరంగం, మీడియారంగం గమ్యం లేని పరుగులో పోటీపడుతున్నాయి. అన్నదాత ఆత్మహత్య చేసుకుంటు న్నప్పటికీ ఆ విషాదాన్ని గుర్తించకుండా వ్యవహరిస్తున్న ప్రధానమంత్రినీ, ముఖ్యమంత్రినీ ఎవరు మందలించాలి? కరువు విలయతాండవం చేస్తున్న ప్పటికీ కరువు ఉన్నట్టు ప్రకటించని ప్రభుత్వాలను ఎవరు నిలదీయాలి? అధికా రంలోకి రాగానే మానవత్వాన్ని విస్మరించే రాజకీయ నాయకులను ఏమి చేయాలి?
చలించిన న్యాయమూర్తులు
రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ న్యాయస్థానాలు హద్దుమీరుతున్నాయంటూ వ్యాఖ్యానించిన తరుణంలో సుప్రీంకోర్టు దేశంలో సగానికిపైగా జనాభా ఎదుర్కొంటున్న జటిలమైన సమస్యపై సుదీర్ఘ విచారణ జరపడం అభినందనీయం. జస్టిస్ మదన్ లోకుర్, జస్టిస్ ఎన్వీ రమణతో కూడిన న్యాయపీఠం స్వరాజ్ అభియాన్ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్పైన సుమారు నలభై గంటల విచారణ జరిపింది. కరువుపైన చర్చించడానికి పార్లమెంటు, రాష్ట్రాల శాసనసభలు అన్నీ కలిపి వినియో గించిన మొత్తం సమయం కంటే ఇది అధికం.
గ్రామీణ ప్రాంతాలలోని సమస్యలూ, రైతుల వెతలూ, కరువు కాటుకు సంబంధించిన అవగాహన కలిగిన న్యాయమూర్తులు కనుక వారు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదనలనూ, ప్రభుత్వ సంజాయిషీలనూ శ్రద్ధగా ఆలకించారు. అందుకు న్యాయమూర్తులను ప్రత్యేకంగా అభినందించాలి. వ్యవసాయరంగం పట్ల నిబద్ధతనూ, ప్రభుత్వాల నిర్వాకంపై వ్యాఖ్యానించే సమయంలో ప్రదర్శిం చిన నిజాయితీనీ, నిర్భీతినీ దేశ ప్రజలు గుర్తించాలి. ఎటువంటి దారుణమైన క్షేత్ర వాస్తవికత న్యాయమూర్తులను కదిలించిందో గమనించాలి.
మరాఠ్వాడాలో కరువు కరాళ నృత్యం చేస్తుంటే, తాగునీటికోసం ప్రజలు నానా యాతనా పడుతుంటే క్రికెట్ మైదానం తడిపేందుకు వేలాది గ్యాలన్ల నీరు వృథా చేయడాన్ని ప్రశ్నిస్తూ ముంబై హైకోర్టులో దాఖలైన పిటిషన్పైన వాద నలు జరిగినప్పుడే దేశంలో కరువు తాండవిస్తున్న వాస్తవాన్ని మీడియా కానీ, రాజకీయ పార్టీలు కానీ గుర్తించాయనడం అతిశయోక్తి కాదు. పాలగుమ్మి సాయి నాథ్, యోగేంద్ర యాదవ్ వంటి వ్యక్తులు జాతీయ స్థాయిలోనూ, కోదండరాం, రామాంజనేయులు, వడ్డే శోభనాద్రేశ్వరరావు, ఎర్నేని నాగేంద్రనాథ్ వంటి ఉద్యమకారులు రాష్ట్రాలలోనూ చేస్తున్న పర్యటనలు వృథాశ్రమగా, ప్రకటనలు అరణ్యరోదనంగా మిగిలిపోయాయి.
మనది సమాఖ్య వ్యవస్థ కనుక, వ్యవ సాయం రాష్ట్రాలకు సంబంధించిన అంశం కనుక రైతుల ఆత్మహత్యలపైన స్పందించవలసిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి లేదనే విధంగా వాదించడాన్ని న్యాయమూర్తులు ఆక్షేపించారు. అనావృష్టి పరిస్థితులను ఎదుర్కోవడానికి తాము చేయవలసినదంతా చేశామంటూ కేంద్ర ప్రభుత్వం తరఫు న్యాయ వాదులు చెప్పడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువుతో పోరాడవలసిన బాధ్యత రాష్ట్రాలదేనంటూ కేంద్రం తప్పుకోవడాన్ని తప్పుపట్టారు. రేషన్ దుకాణాలలో అదనపు పప్పుధాన్యాలు కానీ, నూనె కానీ, మధ్యాహ్న భోజ నంలో కోడిగుడ్డు కానీ ఇవ్వవలసిన బాధ్యత చట్ట ప్రకారం ప్రభుత్వానికి లేదని కేంద్ర ప్రభుత్వం వాదించడం న్యాయమూర్తులను నివ్వెరపరచి ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ సక్రమంగానే ఉన్నట్టు నటిస్తున్నాయి. ముఖ్యంగా గుజరాత్, హరియాణా, బిహార్ రాష్ట్రాలలోని ప్రభుత్వాలు కరువు విలయాన్ని గుర్తించ డానికి నిరాకరించడం దారుణం. ఇందులో బీజేపీ, జేడీయూ అన్న వ్యత్యాసం లేదు. నరేంద్రమోదీ, నితీశ్కుమార్ అన్న తేడా లేదు. రైతుల పట్ల అన్ని ప్రభు త్వాల వైఖరీ ఒక్కటే.
యూపీఏ హయాంలో చట్టాలు
మన్మోహన్సింగ్ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వంలో ఎన్ని లోపాలు ఉన్నప్పటికీ ప్రజలకు మేలు చేసే చట్టాలను చేయడంలో మాత్రం అది రికార్డు సృష్టించింది. సమాచారహక్కు చట్టం, విద్యాహక్కు చట్టం, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం వంటిదే డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ (2005). భారతీయ జనతా పార్టీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్రమోదీ ఎన్నికల ప్రచారంలో రైతుల సంక్షేమానికి పాటుపడతానంటూ వాగ్దానాలతో హోరెత్తించారు. ప్రధాని గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సైతం వ్యవసాయాన్ని గిట్టుబాటు వ్యాసంగం చేస్తాననీ, రైతుల బతుకులను బాగు చేస్తాననీ వివిధ సందర్భాలలో చెప్పారు.
కానీ మాటలకూ చేతలకూ పొంతన లేదు. కరువుపై యుద్ధం ప్రకటిం చకపోగా నరేగా (ఉపాధి హామీ పథకం) కింద కూలి సకాలంలో చెల్లించకపో వడం శోచనీయం. 2015-16 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యేనాటికి ఈ పద్దు కింద రూ. 12,000 కోట్లు బకాయి ఉండటం కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి లేమికి అద్దం పడుతోంది. పైగా ఈ పథకం కింద చెల్లిస్తున్న రోజు కూలి చట్టం నిర్దేశించిన కనీస కూలి కంటే తక్కువ. వాస్తవానికి అనావృష్టిని ఎదుర్కోవడంలో ఈ పథకం ప్రధాన సాధనం కావలసింది. నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (జాతీయ విపత్తు నివారణ సంస్థ) స్వయంగా ప్రధాని అధ్యక్షతన పని చేస్తున్నప్పటికీ కరువు రక్కసి కోరల్లో ఇరుక్కున్న ప్రజలను ఆదుకోవడానికి చేసింది తక్కువ. అనావృష్టి పరిస్థితులలో ఏ విధంగా వ్యవహరించాలో వివరిస్తూ 2009లో రూపొందించిన మాన్యువల్ను సైతం సక్రమంగా అమలు చేయడం లేదు. ఇవన్నీ సుప్రీంకోర్టు విచారణలో నిగ్గుతేలిన నిజాలు.
రాజ్యాంగం 21వ అధికరణ కింద ప్రసాదించిన జీవించే హక్కును వినియోగించి కరువు ప్రాంతాలలో డొక్కలు మాడుతున్నవారికీ, గొంతు ఎండిపోతున్నవారికీ కనీస సహాయక చర్యలు చేపట్టాలని స్వరాజ్ అభియాన్ తన పిటిషన్లో అత్యున్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. ఆహారధాన్యాలు అందరికీ అందుబాటులో ఉండాలనీ, తమిళనాడులో మాదిరి ప్రతి కుటుం బానికీ రెండు కిలోల పప్పు, ఒక కిలో వంటనూనె అదనంగా సరఫరా చేయా లనీ, విద్యార్థులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో రోజూ ఒక కోడిగుడ్డు కానీ ఒక గ్లాసెడు పాలు కానీ ఇవ్వాలనీ, వేసవి సెలవులలో కూడా మధ్నాహ్న భోజన పథకం ఆగిపోకుండా కొనసాగాలనీ అభియాన్ కోరింది. ఇవి ప్రభుత్వం తీసుకోవలసిన తక్షణ చర్యలు. ఇవి కాకుండా కొన్ని దీర్ఘకాలిక చర్యలను కూడా ఈ స్వచ్ఛంద సంస్థ సూచించింది.
కనువిప్పు కలిగేనా?
సుప్రీంకోర్టు బెంచ్ బుధవారంనాడు ఇచ్చిన తీర్పు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు కనువిప్పు కలిగించాలి. కరువు బారి నుంచి ప్రజలను కాపాడాలన్న రాజకీయ సంకల్పం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు లేదని న్యాయస్థానం ఉద్ఘాటించింది. సమాఖ్య తరహా వ్యవస్థ సాకు చూపించి పలాయనవాదానికి కేంద్ర ప్రభుత్వం ఒడిగట్టిందని ఆగ్రహించింది. ఇసుకలో తలబెట్టి బయటి ప్రపంచాన్ని చూడని ఉష్ట్రపక్షిలాగా వ్యవహరిస్తున్న రాష్ట్రాలు అనావృష్టి పీడిత ప్రాంతాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించకుండా అమానుషంగా వ్యవహరిస్తున్నాయంటూ అభిశంసించింది. మా రాష్ట్రంలో జీవనది గంగ ప్రవహిస్తున్నదంటూ బిహార్ సర్కార్ చేసిన వాదనను కొట్టివేసింది. నీటి లభ్యత ఒక్కటే కరువును నిరోధించజాలదనీ, నీటితో పాటు అనేక ఇతర సదుపాయాలూ అవసరమని గుర్తు చేసింది.
దేశంలో జలసంపద సమానంగా లేదు. గంగ- బ్రహ్మపుత్ర- మేఘన బేసిన్లోనూ, పశ్చిమకోస్తాలోనూ నీరు పుష్కలంగా లభిస్తుంది. తక్కిన ప్రాంతాలలో చాలా భాగం వర్షాధార వ్యవసాయమే. దేశ భూభాగంలో 64 శాతం జలవనరులలో 24శాతంతో సరిపెట్టుకోవాలి. అంటే దేశంలో సగభాగం వరుణదేవుడి కటాక్షంపైనే ఆధారపడాలి. భూగర్భ జలవనరులు వేగంగా అడుగంటుతున్నాయి. విచక్షణారహితంగా బోరుబావులు వేయడం ఇందుకు ప్రధాన కారణం. వాననీటిని పరిరక్షించే కార్యక్రమాలు విస్తృతంగా జరగక పోవడం మరో కారణం.
తెలంగాణలో అమలు జరుగుతున్న మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ కార్యక్రమాలు సక్రమంగా అమలు జరిగితే కరువు శాశ్వత నివారణకు దోహదం చేసే అవకాశం ఉంది.
భారీ ప్రాజెక్టుల వల్ల ప్రయోజనం వెంటనే ఉండదు. నదుల అనుసంధానం వంటి ప్రతిపాదనలు అమలుకు అలవికానివి. అంత కంటే స్థానిక పరిష్కారాలు అన్వేషించడం మేలు. నీటి తీరువాను జాతీయ స్థాయిలో స్థిరీకరించాలనీ, నీటిని వృథా చేయకుండా, భూగర్భ జలాలను మితిమీరి వినియోగించకుండా నివారించే జాతీయ చట్టం ఒకటి అవసరమనీ ప్రవీణుల అభిప్రాయం.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాకం పట్ల తీవ్ర అధిక్షేపణ ప్రకటిస్తూ సుప్రీంకోర్టు బెంచ్ కొన్ని నిర్దిష్టమైన నివారణ చర్యలను సత్వరం చేపట్ట వలసిందిగా ఆదేశించింది. విపత్తు పట్ల స్పందించేందుకు జాతీయ స్థాయిలో ఒక దళాన్ని నియమించాలనీ, విపత్తును అధిగమించేందుకు జాతీయ స్థాయిలో ఒక నిధిని ఏర్పాటు చేయాలనీ, విపత్తు నివారణకూ, సంక్షోభం నుంచి గట్టెక్కటానికీ తీసుకోవలసిన చర్యలను నిర్దేశించేవిధంగా జాతీయ విధానాన్ని రూపొందిం చాలనీ న్యాయమూర్తులు ఆదేశించారు. ముఖ్యమంత్రుల ఇష్టాయిష్టాలతో నిమిత్తం లేకుండా ఏ ప్రాంతంలోనైనా కరువు పరిస్థితులు కనిపిస్తే ఆ ప్రాంతాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించే విధంగా ఒక చట్టం తీసుకురావాలని కూడా న్యాయస్థానం కోరింది. రైతులు వ్యవసాయ సంక్షోభం కారణంగా ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఆ వాస్తవాన్ని ప్రభుత్వాలు దాచకుండా చర్యలు తీసుకోవాలి.
న్యాయవ్యవస్థపైన నిందలా?
స్వరాజ్ అభియాన్ పిటిషన్పైన సుప్రీం బెంచ్ తీర్పూ, ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన రద్దు చేయించిన తీర్పూ చూసిన తర్వాత న్యాయస్థానాల జోక్యం లేకపోతే ప్రజాస్వామ్యం కేవలం ప్రహసనంగా దిగజారుతుందేమోనన్న భయం కలుగుతోంది. న్యాయస్థానాలు హద్దు మీరుతున్నాయంటూ ఆక్షేపించిన రాష్ట్ర పతి ఉత్తరాఖండ్లో ప్రభుత్వాన్ని రద్దు చేస్తూ రాష్ట్రపతి పాలన విధించాలన్న కేంద్ర ప్రభుత్వ సిఫార్సుపైన ఆమోదముద్ర వేయకుండా వాపసు పంపించ వలసింది. మిత్రపక్షమైన తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్షానికి చెందిన శాసనసభ్యులను బాహాటంగా కొనుగోలు చేస్తున్నప్పుడు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ మందలించి ఉంటే న్యాయస్థానాలు పోషిస్తున్న పాత్ర పట్ల ఆయన అభిప్రాయాలకు విలువ ఉండేది. చట్టాన్ని తుంగలో తొక్కుతూ, నియ మాలను కాలరాస్తూ, విలువలకు తిలోదకాలు ఇచ్చేవారికి రాజ్యాంగం గురించి మాట్లాడే నైతిక హక్కు ఉంటుందా? శాసనసభ్యులను అంగడిలో సరుకులాగా కొనుగోలు చేస్తుంటే, పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని నీరుగార్చి పడేస్తుంటే ప్రశ్నించనివారికి న్యాయస్థానాలను తప్పుపట్టే అర్హత ఉంటుందా?
రైతులు బలవన్మరణం చెందుతున్న రాష్ట్రాలు కానీ దేశ పార్లమెంటు కానీ ఈ సమస్యపైన శ్రద్ధగా చర్చించిన పాపాన పోలేదు. వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్ కమిటీ చేసిన సిఫార్సుల దుమ్ము దులపాలి. అటువంటి ప్రయత్నమే లేదు. కేవలం వ్యవసాయ సంక్షోభంపైనే పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలి. పరిష్కారం సాధించేవరకూ పార్లమెంటు సమావేశాలను కొనసాగించాలి. మరే అంశమూ చర్చించకూడదు. అదే దీక్షను రాష్ట్రాలలో శాసనసభలూ పాటించాలి. అన్నదాతల ఆత్మహత్యలను జాతీయ సంక్షోభంగా గుర్తించి తక్షణ, దీర్ఘకాలిక నివారణోపాయాలను అమలు చేయకపోతే స్వాతంత్య్రానికీ, ప్రజాస్వామ్యానికీ, చట్టపాలనకూ అర్థం లేదు. రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కులూ, హామీలూ అమలు కానప్పుడు అది ప్రజాస్వామ్య వ్యవస్థ ఎట్లా అనిపించుకుంటుంది?
- కె.రామచంద్రమూర్తి