స్వయంకృతం | Themselves of chandra babu | Sakshi
Sakshi News home page

స్వయంకృతం

Published Sat, Jun 13 2015 11:25 PM | Last Updated on Wed, Aug 15 2018 8:02 PM

స్వయంకృతం - Sakshi

స్వయంకృతం

త్రికాలమ్

ఒక గీత చిన్నది కావాలంటే దాని పక్కనే పెద్ద గీత గీయాలి. తన సమస్యపై నుంచి ప్రజల దృష్టి మరల్చాలంటే ప్రత్యర్థులకు పెను సమస్య సృష్టించాలి.  తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నం అదే. టేపూ, ట్రాపూ కాదు ట్యాపు అంటూ టాపు లేపాలన్నది ఎత్తుగడ. యువనాయ కుడు రేవంత్‌రెడ్డిని నామినేటెడ్ ఆంగ్లో-ఇండియన్ శాసనసభ్యుడు స్టీవెన్సన్, ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) కలసి ట్రాప్ చేసిన సంగతి వాస్తవం. స్టీవెన్సన్ స్మార్ట్ ఫోన్‌లో సంభాషణలను రికార్డు (టేపు) చేసిన మాట నిజం. చంద్రబాబు నాయుడు స్టీవెన్సన్‌తో మాట్లాడారనడానికి సాక్ష్యంగా నిలుస్తుందని భావించిన ఆడియోను టీవీ చానళ్ళు వినిపించాయి.
చంద్రబాబునాయుడి స్వరం, మరొ కరి స్వరం ఎంఎల్‌ఏ స్టీవెన్సన్ ఫోన్‌లో రికార్డయినాయి. గొంతు తనది కాదన కుండా ట్యాప్ ఎట్లా చేస్తారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి పెద్దలం దరికీ ఫిర్యాదు చేసి వచ్చారు. ట్యాప్ చేశారనడం అబద్ధం. చంద్రబాబు నాయుడి ఫోన్ ట్యాప్ చేసి ఉంటే మాటల వరుస మరో విధంగా ఉండేది. ఏసీబీ డెరైక్టర్ జనరల్ ఖాన్ చెబుతున్నది అదే. ట్యాప్ చేయలేదనే ఆయన స్పష్టంగా చెప్పారు. టేపు కాకుండా ట్యాప్ గురించి గగ్గోలు పెట్టడం ద్వారా, హైదరా బాద్‌లో తమకు భద్రత లేదనీ, స్వేచ్ఛ లేదనీ ఢిల్లీలో మొరపెట్టుకోవడం ద్వారా ప్రజల దృష్టి ఎంఎల్‌ఏ ‘కొనుగోలు’ ఉదంతంపై నుంచి మరో వైపు మరల్చాల న్నది చంద్రబాబునాయుడు ఎత్తుగడ.   

పది రోజులుగా టీవీ న్యూస్ చానళ్ళలో మనం చూస్తున్న దృశ్యాలు రోగ లక్షణాలు మాత్రమే. డబ్బురాజకీయం అనే అసలు రోగం మూడు దశాబ్దాలుగా బాగా ముదిరింది. అధికారం హస్తగతం చేసుకునేందుకు ఏమైనా చేయవచ్చు, అధికారం చేజిక్కిన తర్వాత ఏమైనా చేయవచ్చుననేది తాజా అవకాశవాద రాజకీయ సిద్ధాంతం. ఇందులో విశ్వాసం ఉన్నవారికి రాజకీయ విలువలతో కానీ, నైతిక విలువలతో కానీ నిమిత్తం లేదు. లక్ష్య సాధనే ప్రధానం. నీతిమా లిన పనులు చేస్తూనే నీతులు బోధించడం, తప్పుడు పనులు చేస్తూనే నిప్పు లాంటివారమంటూ చెప్పుకోవడం వీరి నైజం. తప్పు చేశారంటూ నిందిస్తే మీరు తప్పు చేయలేదా అంటూ ఎదురుదాడికి దిగడం క్షీణించిన రాజకీయ సంస్కృతి లక్షణం. సమర్థనీయంకాని విషయాన్ని సమర్థించవలసి వచ్చిన ప్పుడు అనేక సమస్యలు ఎదురవుతాయి.
 రేవంత్‌రెడ్డి ఎంఎల్‌ఏతో బేరం చేస్తూ, నగదు అందజేస్తూ వీడియోలో పట్టుబడిన తర్వాత ఆ వ్యవహారంతో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని ప్రకటిస్తారని అనుకుంటున్న దశలోనే స్టీవెన్సన్‌తో ముఖ్యమంత్రి కూడా మాట్లాడినట్టు ఆరోపణ వచ్చింది. ఇందుకు సాక్ష్యంగా చంద్రబాబునాయుడి స్వరం కలిగిన టేపును టీవీ చానళ్ళు వినిపించాయి. రేవంత్‌రెడ్డిని తప్పు పట్టకుండా, తన తప్పు ఒప్పుకోకుండా హైదరాబాద్‌లో శాంతిభద్రతలంటూ, విభజన చట్టంలో ఎనిమిదో సెక్షనంటూ దబాయించడం ద్వారా, సమాం తరంగా మరో పెద్ద సమస్యను తెరమీదికి తీసుకురావడం ద్వారా ఎంఎల్‌ఏ కొనగోలు అంశానికి ప్రాధాన్యం తగ్గించాలని వ్యూహం. రేవంత్‌రెడ్డిపైన చర్య తీసుకుంటే యువనాయకుడు అప్రూవర్‌గా మారే అవకాశం ఉంది. గుట్టు రట్టు చేసే ప్రమాదం ఉంది. అందుకే కుటుంబ సహితంగా, మంత్రివర్గ సభ్యులం దరితో కలసి రేవంత్ కుమార్తె నిశ్చితార్థం శుభకార్యానికి ముఖ్యమంత్రి హాజరై నారు. ఆత్మరక్షణకోసం పాటుపడటం కంటే ఎదురుదాడే మంచి వ్యూహమని నిర్ణయించుకొని ఉంటారు.

 అందుకే, ఎన్నికలలో 63 సీట్లు మాత్రమే గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) అయిదుగురు అభ్యర్థులను ఎందుకు పోటీకి పెట్టిందంటూ  చంద్ర బాబునాయుడు ప్రశ్నించారు. టీ డీపీ, బీజేపీ సభ్యులు కలిసి 16 మంది మాత్రమే ఉన్నప్పుడు, గెలుపొందడానికి 17 మంది సభ్యులు అవసరమై నప్పుడు పోటీకి టీడీపీ అభ్యర్థిని నిలపడం ఎందుకనే ప్రశ్నకు ఆయన సమా ధానం చెప్పరు. అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన టీఆర్‌ఎస్ సభ్యుల సంఖ్య 63 మాత్రమే అయినప్పటికీ, బీఎస్‌పీ టిక్కెట్టుమీద గెలిచిన ఇద్దరూ, కాంగ్రెస్ సభ్యులు ఐదుగురూ, టీడీపీ సభ్యులు ఐదుగురూ, వైఎస్సార్‌సీపీ సభ్యులు ఇద్దరూ పార్టీలు ఫిరాయించడంతో మొత్తం సభ్యులు 77 మంది అయ్యారు. వీరుగాక వైఎస్సార్‌సీపీ సభ్యుడు ఒకరూ, ఎంఐఎం సభ్యులు ఏడుగురూ మద్దతు ఇచ్చారు. ఫలితంగా టీఆర్‌ఎస్ పక్షాన 85 మంది సభ్యులు నిలిచారు. అయిదుగురు అభ్యర్థులు గెలవగలిగారు.
 టీడీపీ చేస్తున్న మరో విమర్శ తమ పార్టీ ఎంఎల్‌ఏను టీఆర్‌ఎస్ మంత్రి వర్గంలో ఎట్లా చేర్చుకుంటారన్నది. ఇది ముమ్మాటికీ అనైతికమే. ఆక్షేపణీ యమే.  పధ్నాలుగు మంది సభ్యులను ఇతర పార్టీల నుంచి ఆకర్షించడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించడమే. రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాయడమే. తలసాని శ్రీనివాసయాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరే ముందు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ఉండవలసింది. టీఆర్‌ఎస్ టిక్కెట్టు మీద ఉప ఎన్నికలో తిరిగి ఎన్నిక కావడం ఆయనకు కష్టం కాదు. టీడీపీ టిక్కెట్టు మీద గెలిచి టీఆర్‌ఎస్ మంత్రివర్గంలో చేరడం రాజ్యాంగవిరుద్ధం. నీతిబాహ్యం. ఇందుకు శాసనసభాపతి సమాధానం చెప్పవలసి ఉంటుంది. శ్రీనివాస యాదవ్ చేత ప్రమాణం చేయించిన గవర్నర్ సైతం నైతిక బాధ్యత వహించవలసి ఉంటుంది.

 ఎదురుదాడి బెడిసికొడుతుంది
 ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని టీఆర్‌ఎస్ ఉల్లంఘించింది కనుక అవినీతి నిరోధక చట్టాన్ని తాము ఉల్లంఘిస్తామనే వాదనలో పసలేదు. ఒకదానికి మరొకటి చెల్లు కాదు. ఇది రెండు పార్టీలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఇది చట్టానికీ, నైతికతకీ సంబంధించింది. ఈ చిక్కు నుంచి బయట పడటం కోసం హైదరాబాద్‌లో శాంతిభద్రతలు లేవంటూ ప్రశాంతంగా జీవి స్తున్నవారిలో అభద్రతా భావం సృష్టించడం ధర్మం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్‌ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో గొడవలేమీ జరగ లేదు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసే కార్యక్రమాన్ని టీఆర్‌ఎస్ సర్కార్ మూడు, నాలుగు రోజులపాటు కొనసాగించింది. ఈ నిర్మాణాల యజమాను లలో అన్ని ప్రాంతాలవారూ ఉన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనికట్టుకొని ఆం ధ్రప్రాంతానికి చెందినవారిపైన శత్రుభావం ప్రదర్శించిన సందర్భం లేకపోగా కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగబోతున్న కారణంగానో, మరే కారణంగానో కేసీఆర్ అన్ని ప్రాంతాలవారినీ కలుపుకొనిపోయే ధోరణి ప్రదర్శిస్తున్నారు.

 కష్టాలు కూడబలుక్కొని వచ్చినట్టు రాజకీయ అపభ్రంశాలు సైతం వరుసగా జరుగుతాయి. ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతినీ, ప్రధానినీ, దేశీయాంగమంత్రినీ కలసి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో 8వ సెక్షన్ అమలు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపైన ఫిర్యాదు చేసినంత మాత్రాన రేవంత్‌రెడ్డి సమస్య సమసిపోదు. గవర్నర్ నరసింహన్ ద్వారా మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి అనేక రకాలుగా సమాచారం అందుతుంది. ఢిల్లీలో పెద్దలందరినీ కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబునాయుడులో అసహనం కొట్టవచ్చినట్టు కనిపించింది. ఏసీబీ పకడ్బందీగా వలవేసి (ట్రాప్ చేసి) వీడియోలో రేవంత్‌రెడ్డి నిర్వాహకం దృశ్యాలను బంధించిన తర్వాత ప్రధాని సైతం చేయగలిగింది ఏమీ ఉండదు. అందరూ చేస్తున్న పనే కావచ్చు. కానీ వీడియోలో దొరికిన తర్వాత నేరం రుజువు కాక తప్పదు. తెహల్కా స్టింగ్ ఆపరేషన్‌లో లక్ష రూపాయల పార్టీ నిధి నగదు రూపంలో స్వీకరిస్తూ పట్టుబడిన బంగారు లక్ష్మణ్ పదవీచ్యుతుడై, జైలుపాలై భ్రష్టుపట్టారు. 50 లక్షల రూపా యల నగదు ఇస్తూ పట్టుబడిన రేవంత్ తప్పించుకోవడం కష్టం.

 రాజకీయాలలో చాలా వేగంగా పైకి వచ్చిన యువకుడు రేవంత్‌రెడ్డి.  బెయిలుపైన వచ్చి కూతురి నిశ్చితార్థానికి హాజరు కావలసి రావడం నిజంగానే బాధాకరం. ఈ పరిణామాలకు నైతిక బాధ్యత ప్రధానంగా రాజకీయాలలో డబ్బు పాత్రను పెంచిపోషించినవారిదే. రాజకీయాలను జూదంగా పరిగణించి గెలుపే ప్రధానంగా వ్యవహరించడం వల్ల విలువలు లుప్తమవుతున్నాయి. ఎన్నికలలో పార్టీలూ, అభ్యర్థులూ పెడుతున్న ఖర్చు ఇతర రాష్ట్రాలలో కంటే తెలుగునాట చాలా రెట్లు ఎక్కువ. సార్వత్రిక ఎన్నికలు జరిగి, ఎన్నికైనట్టు సర్టిఫికెట్ చేతికి అందగానే ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే పార్టీ ఫిరాయించిన ఘటన కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. నిప్పులాంటి రాజకీ యం చేశాను అంటూ గొంతు చించుకొనే చంద్రబాబునాయుడే ఈ ఫిరాయిం పును ప్రోత్సహించారు.

 చంద్రబాబునాయుడు అయినా, చంద్రశేఖరరావు అయినా, మరే రాజ కీయ నాయకుడైనా ఏ విత్తనం విత్తితే ఆ పంటే పండుతుంది. అధినాయకులు  ఆదర్శవంతంగా, పారదర్శకంగా రాజకీయం చేస్తే ఇతర నాయకులు అనుసరి స్తారు. ఎన్నికలలో కోట్లకు కోట్లు ఖర్చు పెడుతూ, ఎన్నికలు కాగానే పార్టీ ఫిరాయింపులకు తెగబడుతూ, అవసరమైతే ఎంఎల్‌ఏలనూ, జెడ్పీటీసీలనూ, ఎంపీటీసీలనూ ప్రలోభపెడుతూ అగ్రనాయకులు అవినీతికి పాల్పడుతుంటే వారి అనుచరులు సైతం అదే బాటలో నడుస్తారు. ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనమై, అవినీతిమయమై అరాచకానికి దారితీస్తుంది.

 ఘర్షణాత్మకవైఖరి వద్దు
 రాష్ట్ర విభజనకు పూర్వం ఉద్యమకాలంలో ఇరు ప్రాంతాల నాయకులూ ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారంటే అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి నాటి కపట నాటక  రాజకీయమే నేటి అనర్థాలకు మూలం. విభజన చట్టంలో లొసుగులుం డటానికి కారణం పార్లమెంటులో చర్చకు సమైక్యవాదులు సహకరించకపో వడమే. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరి రాష్ట్రంలో వారు అభివృద్ధి కార్యక్ర మాలు అమలు చేయడంపైన దృష్టి సారించాలి కానీ ఒకరి కంటే ఒకరు అధికు లమని నిరూపించుకోవడానికి అప్రజాస్వామ్యంగా, ప్రజాప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరించకూడదు. తెలంగాణలో కొన్ని మంచి పథకాల అమలు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని నిర్మాణం, పట్టిసీమ ప్రాజెక్టుతో సహా  అన్నీ వివాదాస్పదం అవుతున్నాయి. సంవత్సరం గడిచినా ప్రభుత్వం గాడిలో పడినట్టు కనిపించలేదు. ముఖ్యమంత్రి మళ్ళీ విదేశీ పర్య టనకు సమాయత్తం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంత పనిభారం ఉన్న ప్పుడు తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వంతో ఘర్షణ ఎందుకు? ఎంఎల్‌సీ సీటు ఒకటి గెలవాలన్న తాపత్రయం ఎందుకు?  రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమం త్రులూ, ఇతర మంత్రులూ, ఉన్నతాధికారులూ పరస్పరం గౌరవించుకుంటూ సహకరించుకోవాలి. ముఖ్యమంత్రిని మరో ముఖ్యమంత్రి ఘాటుగా విమర్శిం చడం, ఒక ముఖ్యమంత్రిని పొరుగు రాష్ట్రంలోని జూనియర్ మంత్రి శాస్తి చేస్తా నంటూ హెచ్చరించడం సంస్కార రాహిత్యానికి పరాకాష్ట. రెండు ప్రాంతాల రాజకీయ నాయకులనూ కట్టడి చేయడంలో గవర్నర్ నిర్ణాయక పాత్ర పోషించాలి. కేంద్రం సైతం ప్రేక్షక పాత్ర కాకుండా విభజన చట్టం అక్షరాలా అమలు జరిగే విధంగా మధ్యవర్తిత్వం నిర్వర్తించాలి. తెలుగువారు శాంతినే కోరుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ  ఉద్యమంలో సైతం ఇరు వైపులా నాయకులు రెచ్చిపోయి దుమ్మెత్తిపోసుకున్నా ప్రజలు సంయమనం ప్రదర్శిం చారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నించడం  క్షమార్హం కాని నేరం. రేవంత్‌రెడ్డి ఉదంతంలో చట్టం పరిధిలో ఉంది. ఆ గీత అంత సులభంగా  చెరగదు. దాని కంటే పెద్ద గీత గీయడానికి చేసే ప్రయత్నం బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. చట్టప్రకారం నడుచుకోవడమే క్షేమదాయకం.
 
అధికారం హస్తగతం చేసుకునేందుకు ఏమైనా చేయవచ్చు, అధికారం చేజిక్కిన తర్వాత ఏమైనా చేయవచ్చుననేది తాజా అవకాశవాద రాజకీయ సిద్ధాంతం. ఇందులో విశ్వాసం ఉన్నవారికి రాజకీయ విలువలతో కానీ, నైతిక విలువలతో కానీ నిమిత్తం లేదు. లక్ష్య సాధనే ప్రధానం. నీతిమాలిన పనులు చేస్తూనే నీతులు బోధించడం, తప్పుడు పనులు చేస్తూనే నిప్పులాంటివారమంటూ చెప్పుకోవడం వీరి నైజం. తప్పు చేశారంటూ నిందిస్తే మీరు తప్పు చేయలేదా అంటూ ఎదురుదాడికి దిగడం క్షీణించిన రాజకీయ సంస్కృతి లక్షణం.

కె.రామచంద్రమూర్తి

http://img.sakshi.net/images/cms/2015-06/81434219627_Unknown.jpg

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement