Stevenson
-
'ఆర్ఆర్ఆర్' నటుడు స్టీవెన్ సన్ మృతికి కారణమిదే!
రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలో మెయిన్ విలన్‌గా(స్కాట్ దొర) నటించిన హాలీవుడ్ నటుడు రే స్టీవెన్సన్ 58 ఏళ్ల వయసులో హఠాన్మరణం చెందారు. ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు వాళ్లకు సుపరిచతమైన ఆయన మరణంతో సినీ పరిశ్రమ షాక్‌కి గురైంది. స్టీవెన్ సన్ మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆర్ఆర్ఆర్ టీంతో పాటు పలువురు సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. స్టీవెన్సన్ మృతికి తీవ్రమైన అనారోగ్యం కారణమని ఇటాలియన్ వార్త పత్రిక రిపబ్లికా వెల్లడించింది. ఇటలీలో తన కొత్త చిత్రం ‘క్యాసినో’ షూటింగ్ చేస్తుండగానే ఆయన మిస్టరీ ఇల్నెస్కు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే స్థానిక ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో పరిస్థితి విషమించి ఆయన మరణించారు అంటూ సదరు వార్తాసంస్థ తెలిపింది. కాగా థోర్ సిరీస్‌తో పాపులర్ అయిన ఆయన కింగ్ ఆర్థర్, ది అదర్ గైస్,ది ట్రాన్స్పోర్టర్ వంటి పలు సినిమాల్లో నటించారు. చివరి సారిగా యాక్సిడెంట్ మ్యాన్ సినిమాలో కనిపించారు. ఆయన నటించిన మరో రెండు సినిమాలు, ఓ సిరీస్ రిలీజ్ కు రెడీగా ఉన్నాయి.స్టీవెన్ సన్ 1997లో బ్రిటిష్ నటి రుత్ గెమ్మెల్‌ను వివాహం చేసుకోగా 8ఏళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. -
అమ్మో.. బందరు ఎంఈవో పోస్టా..!
నియామక ఉత్తర్వులు అందుకోని హెచ్ఎం మాకొద్దంటూ నేతలు చుట్టూ ప్రదక్షిణలు మచిలీపట్నం : మండల విద్యాశాఖాధికారి పోస్టు తమకు కావాలంటే తమకు కావాలని పోటీపడడం సహజం. కానీ బందరు మండలంలో పరిస్థితి ఇందుకు భిన్నం. ఎంఈవో పోస్టులో తమను నియమించవద్దంటూ ప్రధానోపాధ్యాయు లు రాజకీయ నాయకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీంతో భర్తీ ప్రక్రియ రోజురోజుకు వివాదాస్పదమవుతోంది. మండలంలో తొమ్మిది ఉన్నత పాఠశాలలుండగా ఇక్కడి హెచ్ఎంలకు ఎంఈవో పోస్టు వచ్చే అవకాశం ఉందని తెలియగానే మెడికల్ లీవ్‌లు పెట్టి వెళ్లిపోతున్నారు. నాలుగు నెలలుగా ఖాళీ నాలుగు నెలలుగా ఎంఈవో పోస్టు ఖాళీగా ఉంటోంది. గతేడాది నవంబరులో ఇన్చార్జ్ ఎంఈవోగా స్టీవెన్సన్ను నియమించారు. తనకు ఆరోగ్యం బాగోలేదనే కారణం చూపి ఆయన మెడికల్ లీవ్ పెట్టారు. మిగిలిన ఎనిమిది ఉన్నత పాఠశాలల్లోని ప్రధానోపాధ్యాయులు తమను ఎంఈవోగా ఎక్కడ నియమిస్తారోనని మెడికల్ లీవ్ పెట్టి వెళ్లిపోయారు. ఉపాధ్యాయుల వేతనాలు ఇవ్వడంలో జాప్యం జరగడం తదితర అంశాల నేపథ్యంలో మండలంలోని తొమ్మిది ఉన్నత పాఠశాలల హెచ్ఎంలంతా మెడికల్ లీవ్‌లో వెళ్లడం అప్పట్లో వివాదాస్పదమైంది. వీరి లీవ్‌లు ఎంతవరకు సమంజసమని జిల్లా మెడికల్ బోర్డుకు డీఈవో రిఫర్ చేసినా ఎవరిపైనా చర్యలు తీసుకోలేదు. ఎంఈవో లేకపోవడంతో ఉపాధ్యాయులకు నవంబరు, డిసెంబర్ల వేతనాలు అందకపోవడంతో మచిలీపట్నం డీవైఈవో గిరికుమారికి ఎంఈవో గా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇటీవల విద్యాశాఖ ఆర్జేడీ కార్యాలయం నుంచి ఎంఈవోల నియామకానికి సంబంధించి సీనియర్ ఉపాధ్యాయుల జాబితాలను పంపాలని కోరారు. దీంతో డీఈవో చిట్టిపాలెం జెడ్పీ స్కూల్ హెచ్ఎం స్టీవెన్సన్ పేరును ప్రతిపాదించగా ఎంఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే జిల్లా ప్రధానోపాధ్యాయుల సంఘం అధ్యక్షుడిగా ఉన్న స్టీవెన్సన్ ఎంఈ వో బాధ్యతలు స్వీకరించడానికి తనకు ఆరోగ్యం బాగోలేదనే సాకు చూపుతూ ఉత్తర్వులు అందుకోకపోవడం చర్చనీయాంశమైంది. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ద్వారా స్టీవెన్సన్ తెరవెనుక మంత్రాంగం నడుపుతున్నట్లు ఉపాధ్యాయులు చెప్పుకుంటున్నారు. కాగా ఎంఈవో బాధ్యతల నుంచి తప్పించాలని గిరికుమారి ఎంపీని ఆశ్రయించి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ సమస్యను పరిష్కరించాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
బాబ్బాబు... కాస్త ఆగండి!
* ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చంద్రబాబు ఆదేశం * స్టీఫెన్సన్ వాంగ్మూలం ఆధారంగా నోటీసులిస్తారని భయం * అందుకే కౌంటర్ కేసుల్లో వేగం తగ్గించాలని ఆదేశాలు జారీ సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఏపీ సీఎం చంద్రబాబుకు ‘నీకు రూ.5 కోట్లు ఇస్తాం... నీ బాగోగులు చూసుకుంటాం’ అంటూ ఆయన తనకు హామీ ఇచ్చినట్లు తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ఇచ్చిన వాంగ్మూలం కొత్త భయాన్ని తెచ్చిపెట్టింది. ఇది తెలంగాణ ఏసీబీ అధికారులకు ఆయుధంగా మారి, తనకు నోటీసులు తీసుకువచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్న చంద్రబాబు ‘కౌంటర్’ కేసుల్లో తక్షణం ఎలాంటి తీవ్రమైన చర్యలకు ఉపక్రమించరాదని రాష్ట్ర పోలీసులను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో శుక్రవారంవరకు దూకుడుగా ముందుకెళ్ళిన అధికారులు శనివారం నుంచి నెమ్మదించారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి దర్యాప్తు బృందాలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. గత నెల 31న టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టు నాటినుంచి చంద్రబాబు మాటల దాడి ప్రారంభించారు. ఆయన స్టీఫెన్‌సన్‌తో ఫోనులో మాట్లాడినవిగా పేర్కొంటూ కొన్ని ఆడియో రికార్డింగ్స్ బయటకు రావడంతో ‘ట్యాపింగ్’ అంటూ ఎదురు దాడికి దిగారు. ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులతో కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు ఇప్పించి 88 కేసులు నమోదు చేయించారు. వీటికి తోడు ‘ఓటుకు కోట్లు’ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య ఫిర్యాదుతో విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసుస్టేషన్లో మరో కేసు నమోదైంది. వీటి ఆధారంగా కౌంటర్ ఎటాక్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 88 కేసుల దర్యాప్తుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడంతోపాటు సత్యనారాయణపురం కేసును సీఐడీకి బదిలీ చేశారు. ఈలోపు తెలంగాణ ఏసీబీ అధికారులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డిని విచారించడంతోపాటు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వీరయ్యకు నోటీసులు జారీ చేశారు. దీనికి కౌంటర్‌గా చంద్రబాబు శుక్రవారం విశాఖపట్నం పోలీసుల ద్వారా కేబుల్ టీవీ యాక్ట్ ప్రకారం న్యూస్ చానళ్లకు నోటీసులు జారీ చేయించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు చేరిన ఆడియో, వీడియో టేపుల విశ్లేషణ పూర్తయి, నివేదిక రావడానికి కొంత సమయం పడుతుందని చంద్రబాబు భావించారు. అది వస్తే తప్ప తెలంగాణ ఏసీబీ అధికారులు తన జోలికి రాలేరని, ఈ లోపు కౌంటర్ ఎటాక్ లక్ష్యం నెరవేరుతుందని వేగంగా పావులు కదిపారు. అయితే ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని (సీఆర్పీసీ 164 స్టేట్మెంట్) తెలంగాణ ఏసీబీ అధికారులు న్యాయస్థానం నుంచి శనివారం అధికారికంగా తీసుకున్న నేపథ్యంలో న్యాయ నిపుణుల్ని సంప్రదించిన చంద్రబాబుకు ఈ వాంగ్మూలంలోని అంశాల ఆధారంగానూ తెలంగాణ ఏసీబీ అధికారులు తనకు నోటీసు ఇచ్చే అవకాశం లేకపోలేదన్న అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా ఇబ్బందులు తలెత్తుతాయోనన్న అనుమానంతో వేగం తగ్గించాల్సిందిగా సిట్, సీఐడీలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది. -
నేడు స్టీఫెన్సన్ వాంగ్మూలం
-
నేడు స్టీఫెన్సన్ వాంగ్మూలం
- కీలక ఆధారాలను కోర్టుకు సమర్పించనున్న ఏసీబీ - ఆడియో, వీడియో రికార్డులపై నివేదికను కోర్టుకు సమర్పించనున్న ఎఫ్ఎస్ఎల్ - ఇక విచారణ మరింత వేగవంతం - నేడు స్టీఫెన్సన్ వాంగ్మూలం సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు నోటు’ కేసులో ఏసీబీ దర్యాప్తు కీలకదశకు చేరుకుంది. ఈ వ్యవహారంలో సోమవారం అత్యంత కీలక పరిణామాలు జరుగనున్నాయి. ఈ కేసులో ప్రధాన సాక్షి అయిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని మెజిస్ట్రేట్ ఎదుట నమోదు చేయనుండడంతో పాటు వీడియో, ఆడియో రికార్డులకు సంబంధించి ఫోరెన్సిక్ నివేదిక న్యాయస్థానానికి అందనుంది. చంద్రబాబు మాట్లాడిన ఆడియో టేపులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నేపథ్యంలో స్టీఫెన్సన్ వాంగ్మూలం కీలకం కానుంది. రూ.5 కోట్లు లంచం తీసుకుని టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి ఓటేయాలంటూ ఆ పార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారని ఫిర్యాదు చేసిన స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిందిగా ఏసీబీ ఇప్పటికే కోర్టు అనుమతి కోరింది. ఈ మేరకు సీఆర్పీసీ సెక్షన్ 164 కింద మెజిస్ట్రేట్ సోమవారం స్టీఫెన్సన్ వాంగ్మూలాన్ని నమోదు చేయనున్నారు. ‘ఓటుకు నోటు’ వ్యవహారంలో తనను ఎవరెవరు, ఏవిధంగా ప్రలోభపెట్టారు, ఎవరెవరు, ఏ హామీలిచ్చారన్న వివరాలను స్టీఫెన్సన్ తన వాంగ్మూలంలో వెల్లడించే అవకాశముంది. చంద్రబాబు తనతో ఎప్పుడు, ఎవరి ద్వారా ఫోన్లో మాట్లాడారో చెప్పనున్నారు. ఇక రేవంత్‌రెడ్డి, ఉదయ్ సింహ, సెబాస్టియన్లు ఉపయోగించిన ఫోన్ల కాల్ డేటా, స్టీఫెన్సన్ ఫోన్లో రికార్డయిన సంభాషణలు, రహస్య కెమెరాల వీడియో ఫుటేజీలను ఇప్పటికే కోర్టు ద్వారా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్)కి పంపించిన సంగతి తెలిసిందే. వాటికి సంబంధించి ఎఫ్ఎస్ఎల్ నుంచి ప్రాథమిక నివేదిక ఇప్పటికే ఏసీబీకి అందింది. పూర్తిస్థాయి నివేదికలను ఎఫ్ఎస్ఎల్ సోమవారం కోర్టుకు సమర్పిస్తుందని అధికారవర్గాలు చెప్పాయి. ఈ నివేదిక కోర్టుకు అందితే విచారణ మరింత వేగవంతం కానుంది. -
స్వయంకృతం
త్రికాలమ్ ఒక గీత చిన్నది కావాలంటే దాని పక్కనే పెద్ద గీత గీయాలి. తన సమస్యపై నుంచి ప్రజల దృష్టి మరల్చాలంటే ప్రత్యర్థులకు పెను సమస్య సృష్టించాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు చేస్తున్న ప్రయత్నం అదే. టేపూ, ట్రాపూ కాదు ట్యాపు అంటూ టాపు లేపాలన్నది ఎత్తుగడ. యువనాయ కుడు రేవంత్‌రెడ్డిని నామినేటెడ్ ఆంగ్లో-ఇండియన్ శాసనసభ్యుడు స్టీవెన్సన్, ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) కలసి ట్రాప్ చేసిన సంగతి వాస్తవం. స్టీవెన్సన్ స్మార్ట్ ఫోన్లో సంభాషణలను రికార్డు (టేపు) చేసిన మాట నిజం. చంద్రబాబు నాయుడు స్టీవెన్సన్తో మాట్లాడారనడానికి సాక్ష్యంగా నిలుస్తుందని భావించిన ఆడియోను టీవీ చానళ్ళు వినిపించాయి. చంద్రబాబునాయుడి స్వరం, మరొ కరి స్వరం ఎంఎల్ఏ స్టీవెన్సన్ ఫోన్లో రికార్డయినాయి. గొంతు తనది కాదన కుండా ట్యాప్ ఎట్లా చేస్తారంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళి పెద్దలం దరికీ ఫిర్యాదు చేసి వచ్చారు. ట్యాప్ చేశారనడం అబద్ధం. చంద్రబాబు నాయుడి ఫోన్ ట్యాప్ చేసి ఉంటే మాటల వరుస మరో విధంగా ఉండేది. ఏసీబీ డెరైక్టర్ జనరల్ ఖాన్ చెబుతున్నది అదే. ట్యాప్ చేయలేదనే ఆయన స్పష్టంగా చెప్పారు. టేపు కాకుండా ట్యాప్ గురించి గగ్గోలు పెట్టడం ద్వారా, హైదరా బాద్‌లో తమకు భద్రత లేదనీ, స్వేచ్ఛ లేదనీ ఢిల్లీలో మొరపెట్టుకోవడం ద్వారా ప్రజల దృష్టి ఎంఎల్ఏ ‘కొనుగోలు’ ఉదంతంపై నుంచి మరో వైపు మరల్చాల న్నది చంద్రబాబునాయుడు ఎత్తుగడ. పది రోజులుగా టీవీ న్యూస్ చానళ్ళలో మనం చూస్తున్న దృశ్యాలు రోగ లక్షణాలు మాత్రమే. డబ్బురాజకీయం అనే అసలు రోగం మూడు దశాబ్దాలుగా బాగా ముదిరింది. అధికారం హస్తగతం చేసుకునేందుకు ఏమైనా చేయవచ్చు, అధికారం చేజిక్కిన తర్వాత ఏమైనా చేయవచ్చుననేది తాజా అవకాశవాద రాజకీయ సిద్ధాంతం. ఇందులో విశ్వాసం ఉన్నవారికి రాజకీయ విలువలతో కానీ, నైతిక విలువలతో కానీ నిమిత్తం లేదు. లక్ష్య సాధనే ప్రధానం. నీతిమా లిన పనులు చేస్తూనే నీతులు బోధించడం, తప్పుడు పనులు చేస్తూనే నిప్పు లాంటివారమంటూ చెప్పుకోవడం వీరి నైజం. తప్పు చేశారంటూ నిందిస్తే మీరు తప్పు చేయలేదా అంటూ ఎదురుదాడికి దిగడం క్షీణించిన రాజకీయ సంస్కృతి లక్షణం. సమర్థనీయంకాని విషయాన్ని సమర్థించవలసి వచ్చిన ప్పుడు అనేక సమస్యలు ఎదురవుతాయి. రేవంత్‌రెడ్డి ఎంఎల్ఏతో బేరం చేస్తూ, నగదు అందజేస్తూ వీడియోలో పట్టుబడిన తర్వాత ఆ వ్యవహారంతో తెలుగుదేశం పార్టీకి సంబంధం లేదని ప్రకటిస్తారని అనుకుంటున్న దశలోనే స్టీవెన్సన్తో ముఖ్యమంత్రి కూడా మాట్లాడినట్టు ఆరోపణ వచ్చింది. ఇందుకు సాక్ష్యంగా చంద్రబాబునాయుడి స్వరం కలిగిన టేపును టీవీ చానళ్ళు వినిపించాయి. రేవంత్‌రెడ్డిని తప్పు పట్టకుండా, తన తప్పు ఒప్పుకోకుండా హైదరాబాద్‌లో శాంతిభద్రతలంటూ, విభజన చట్టంలో ఎనిమిదో సెక్షనంటూ దబాయించడం ద్వారా, సమాం తరంగా మరో పెద్ద సమస్యను తెరమీదికి తీసుకురావడం ద్వారా ఎంఎల్ఏ కొనగోలు అంశానికి ప్రాధాన్యం తగ్గించాలని వ్యూహం. రేవంత్‌రెడ్డిపైన చర్య తీసుకుంటే యువనాయకుడు అప్రూవర్‌గా మారే అవకాశం ఉంది. గుట్టు రట్టు చేసే ప్రమాదం ఉంది. అందుకే కుటుంబ సహితంగా, మంత్రివర్గ సభ్యులం దరితో కలసి రేవంత్ కుమార్తె నిశ్చితార్థం శుభకార్యానికి ముఖ్యమంత్రి హాజరై నారు. ఆత్మరక్షణకోసం పాటుపడటం కంటే ఎదురుదాడే మంచి వ్యూహమని నిర్ణయించుకొని ఉంటారు. అందుకే, ఎన్నికలలో 63 సీట్లు మాత్రమే గెలిచిన తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అయిదుగురు అభ్యర్థులను ఎందుకు పోటీకి పెట్టిందంటూ చంద్ర బాబునాయుడు ప్రశ్నించారు. టీ డీపీ, బీజేపీ సభ్యులు కలిసి 16 మంది మాత్రమే ఉన్నప్పుడు, గెలుపొందడానికి 17 మంది సభ్యులు అవసరమై నప్పుడు పోటీకి టీడీపీ అభ్యర్థిని నిలపడం ఎందుకనే ప్రశ్నకు ఆయన సమా ధానం చెప్పరు. అసెంబ్లీ ఎన్నికలలో గెలిచిన టీఆర్ఎస్ సభ్యుల సంఖ్య 63 మాత్రమే అయినప్పటికీ, బీఎస్పీ టిక్కెట్టుమీద గెలిచిన ఇద్దరూ, కాంగ్రెస్ సభ్యులు ఐదుగురూ, టీడీపీ సభ్యులు ఐదుగురూ, వైఎస్సార్సీపీ సభ్యులు ఇద్దరూ పార్టీలు ఫిరాయించడంతో మొత్తం సభ్యులు 77 మంది అయ్యారు. వీరుగాక వైఎస్సార్సీపీ సభ్యుడు ఒకరూ, ఎంఐఎం సభ్యులు ఏడుగురూ మద్దతు ఇచ్చారు. ఫలితంగా టీఆర్ఎస్ పక్షాన 85 మంది సభ్యులు నిలిచారు. అయిదుగురు అభ్యర్థులు గెలవగలిగారు. టీడీపీ చేస్తున్న మరో విమర్శ తమ పార్టీ ఎంఎల్ఏను టీఆర్ఎస్ మంత్రి వర్గంలో ఎట్లా చేర్చుకుంటారన్నది. ఇది ముమ్మాటికీ అనైతికమే. ఆక్షేపణీ యమే. పధ్నాలుగు మంది సభ్యులను ఇతర పార్టీల నుంచి ఆకర్షించడం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించడమే. రాజ్యాంగ స్ఫూర్తిని కాలరాయడమే. తలసాని శ్రీనివాసయాదవ్ టీఆర్ఎస్లో చేరే ముందు శాసన సభ్యత్వానికి రాజీనామా చేసి ఉండవలసింది. టీఆర్ఎస్ టిక్కెట్టు మీద ఉప ఎన్నికలో తిరిగి ఎన్నిక కావడం ఆయనకు కష్టం కాదు. టీడీపీ టిక్కెట్టు మీద గెలిచి టీఆర్ఎస్ మంత్రివర్గంలో చేరడం రాజ్యాంగవిరుద్ధం. నీతిబాహ్యం. ఇందుకు శాసనసభాపతి సమాధానం చెప్పవలసి ఉంటుంది. శ్రీనివాస యాదవ్ చేత ప్రమాణం చేయించిన గవర్నర్ సైతం నైతిక బాధ్యత వహించవలసి ఉంటుంది. ఎదురుదాడి బెడిసికొడుతుంది ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని టీఆర్ఎస్ ఉల్లంఘించింది కనుక అవినీతి నిరోధక చట్టాన్ని తాము ఉల్లంఘిస్తామనే వాదనలో పసలేదు. ఒకదానికి మరొకటి చెల్లు కాదు. ఇది రెండు పార్టీలకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. ఇది చట్టానికీ, నైతికతకీ సంబంధించింది. ఈ చిక్కు నుంచి బయట పడటం కోసం హైదరాబాద్‌లో శాంతిభద్రతలు లేవంటూ ప్రశాంతంగా జీవి స్తున్నవారిలో అభద్రతా భావం సృష్టించడం ధర్మం కాదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్‌లో గొడవలేమీ జరగ లేదు. అక్రమ నిర్మాణాలను కూల్చివేసే కార్యక్రమాన్ని టీఆర్ఎస్ సర్కార్ మూడు, నాలుగు రోజులపాటు కొనసాగించింది. ఈ నిర్మాణాల యజమాను లలో అన్ని ప్రాంతాలవారూ ఉన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం పనికట్టుకొని ఆం ధ్రప్రాంతానికి చెందినవారిపైన శత్రుభావం ప్రదర్శించిన సందర్భం లేకపోగా కార్పొరేషన్‌కు ఎన్నికలు జరగబోతున్న కారణంగానో, మరే కారణంగానో కేసీఆర్ అన్ని ప్రాంతాలవారినీ కలుపుకొనిపోయే ధోరణి ప్రదర్శిస్తున్నారు. కష్టాలు కూడబలుక్కొని వచ్చినట్టు రాజకీయ అపభ్రంశాలు సైతం వరుసగా జరుగుతాయి. ఢిల్లీ వెళ్ళి రాష్ట్రపతినీ, ప్రధానినీ, దేశీయాంగమంత్రినీ కలసి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో 8వ సెక్షన్ అమలు, ఫోన్ ట్యాపింగ్ వంటి అంశాలపైన ఫిర్యాదు చేసినంత మాత్రాన రేవంత్‌రెడ్డి సమస్య సమసిపోదు. గవర్నర్ నరసింహన్ ద్వారా మాత్రమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి అనేక రకాలుగా సమాచారం అందుతుంది. ఢిల్లీలో పెద్దలందరినీ కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్నప్పుడు చంద్రబాబునాయుడులో అసహనం కొట్టవచ్చినట్టు కనిపించింది. ఏసీబీ పకడ్బందీగా వలవేసి (ట్రాప్ చేసి) వీడియోలో రేవంత్‌రెడ్డి నిర్వాహకం దృశ్యాలను బంధించిన తర్వాత ప్రధాని సైతం చేయగలిగింది ఏమీ ఉండదు. అందరూ చేస్తున్న పనే కావచ్చు. కానీ వీడియోలో దొరికిన తర్వాత నేరం రుజువు కాక తప్పదు. తెహల్కా స్టింగ్ ఆపరేషన్‌లో లక్ష రూపాయల పార్టీ నిధి నగదు రూపంలో స్వీకరిస్తూ పట్టుబడిన బంగారు లక్ష్మణ్ పదవీచ్యుతుడై, జైలుపాలై భ్రష్టుపట్టారు. 50 లక్షల రూపా యల నగదు ఇస్తూ పట్టుబడిన రేవంత్ తప్పించుకోవడం కష్టం. రాజకీయాలలో చాలా వేగంగా పైకి వచ్చిన యువకుడు రేవంత్‌రెడ్డి. బెయిలుపైన వచ్చి కూతురి నిశ్చితార్థానికి హాజరు కావలసి రావడం నిజంగానే బాధాకరం. ఈ పరిణామాలకు నైతిక బాధ్యత ప్రధానంగా రాజకీయాలలో డబ్బు పాత్రను పెంచిపోషించినవారిదే. రాజకీయాలను జూదంగా పరిగణించి గెలుపే ప్రధానంగా వ్యవహరించడం వల్ల విలువలు లుప్తమవుతున్నాయి. ఎన్నికలలో పార్టీలూ, అభ్యర్థులూ పెడుతున్న ఖర్చు ఇతర రాష్ట్రాలలో కంటే తెలుగునాట చాలా రెట్లు ఎక్కువ. సార్వత్రిక ఎన్నికలు జరిగి, ఎన్నికైనట్టు సర్టిఫికెట్ చేతికి అందగానే ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే పార్టీ ఫిరాయించిన ఘటన కూడా ఆంధ్రప్రదేశ్‌లోనే జరిగింది. నిప్పులాంటి రాజకీ యం చేశాను అంటూ గొంతు చించుకొనే చంద్రబాబునాయుడే ఈ ఫిరాయిం పును ప్రోత్సహించారు. చంద్రబాబునాయుడు అయినా, చంద్రశేఖరరావు అయినా, మరే రాజ కీయ నాయకుడైనా ఏ విత్తనం విత్తితే ఆ పంటే పండుతుంది. అధినాయకులు ఆదర్శవంతంగా, పారదర్శకంగా రాజకీయం చేస్తే ఇతర నాయకులు అనుసరి స్తారు. ఎన్నికలలో కోట్లకు కోట్లు ఖర్చు పెడుతూ, ఎన్నికలు కాగానే పార్టీ ఫిరాయింపులకు తెగబడుతూ, అవసరమైతే ఎంఎల్‌ఏలనూ, జెడ్పీటీసీలనూ, ఎంపీటీసీలనూ ప్రలోభపెడుతూ అగ్రనాయకులు అవినీతికి పాల్పడుతుంటే వారి అనుచరులు సైతం అదే బాటలో నడుస్తారు. ఫలితంగా ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనమై, అవినీతిమయమై అరాచకానికి దారితీస్తుంది. ఘర్షణాత్మకవైఖరి వద్దు రాష్ట్ర విభజనకు పూర్వం ఉద్యమకాలంలో ఇరు ప్రాంతాల నాయకులూ ఒకరిపై ఒకరు నిప్పులు చెరిగారంటే అర్థం చేసుకోవచ్చు. వాస్తవానికి నాటి కపట నాటక రాజకీయమే నేటి అనర్థాలకు మూలం. విభజన చట్టంలో లొసుగులుం డటానికి కారణం పార్లమెంటులో చర్చకు సమైక్యవాదులు సహకరించకపో వడమే. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎవరి రాష్ట్రంలో వారు అభివృద్ధి కార్యక్ర మాలు అమలు చేయడంపైన దృష్టి సారించాలి కానీ ఒకరి కంటే ఒకరు అధికు లమని నిరూపించుకోవడానికి అప్రజాస్వామ్యంగా, ప్రజాప్రయోజనాలకు భంగకరంగా వ్యవహరించకూడదు. తెలంగాణలో కొన్ని మంచి పథకాల అమలు ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త రాజధాని నిర్మాణం, పట్టిసీమ ప్రాజెక్టుతో సహా అన్నీ వివాదాస్పదం అవుతున్నాయి. సంవత్సరం గడిచినా ప్రభుత్వం గాడిలో పడినట్టు కనిపించలేదు. ముఖ్యమంత్రి మళ్ళీ విదేశీ పర్య టనకు సమాయత్తం అవుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇంత పనిభారం ఉన్న ప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ ప్రభుత్వంతో ఘర్షణ ఎందుకు? ఎంఎల్సీ సీటు ఒకటి గెలవాలన్న తాపత్రయం ఎందుకు? రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమం త్రులూ, ఇతర మంత్రులూ, ఉన్నతాధికారులూ పరస్పరం గౌరవించుకుంటూ సహకరించుకోవాలి. ముఖ్యమంత్రిని మరో ముఖ్యమంత్రి ఘాటుగా విమర్శిం చడం, ఒక ముఖ్యమంత్రిని పొరుగు రాష్ట్రంలోని జూనియర్ మంత్రి శాస్తి చేస్తా నంటూ హెచ్చరించడం సంస్కార రాహిత్యానికి పరాకాష్ట. రెండు ప్రాంతాల రాజకీయ నాయకులనూ కట్టడి చేయడంలో గవర్నర్ నిర్ణాయక పాత్ర పోషించాలి. కేంద్రం సైతం ప్రేక్షక పాత్ర కాకుండా విభజన చట్టం అక్షరాలా అమలు జరిగే విధంగా మధ్యవర్తిత్వం నిర్వర్తించాలి. తెలుగువారు శాంతినే కోరుకుంటున్నారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో సైతం ఇరు వైపులా నాయకులు రెచ్చిపోయి దుమ్మెత్తిపోసుకున్నా ప్రజలు సంయమనం ప్రదర్శిం చారు. సంకుచిత రాజకీయ ప్రయోజనాలకోసం ప్రజల మధ్య చిచ్చుపెట్టడానికి ప్రయత్నించడం క్షమార్హం కాని నేరం. రేవంత్‌రెడ్డి ఉదంతంలో చట్టం పరిధిలో ఉంది. ఆ గీత అంత సులభంగా చెరగదు. దాని కంటే పెద్ద గీత గీయడానికి చేసే ప్రయత్నం బెడిసి కొట్టే ప్రమాదం ఉంది. చట్టప్రకారం నడుచుకోవడమే క్షేమదాయకం. అధికారం హస్తగతం చేసుకునేందుకు ఏమైనా చేయవచ్చు, అధికారం చేజిక్కిన తర్వాత ఏమైనా చేయవచ్చుననేది తాజా అవకాశవాద రాజకీయ సిద్ధాంతం. ఇందులో విశ్వాసం ఉన్నవారికి రాజకీయ విలువలతో కానీ, నైతిక విలువలతో కానీ నిమిత్తం లేదు. లక్ష్య సాధనే ప్రధానం. నీతిమాలిన పనులు చేస్తూనే నీతులు బోధించడం, తప్పుడు పనులు చేస్తూనే నిప్పులాంటివారమంటూ చెప్పుకోవడం వీరి నైజం. తప్పు చేశారంటూ నిందిస్తే మీరు తప్పు చేయలేదా అంటూ ఎదురుదాడికి దిగడం క్షీణించిన రాజకీయ సంస్కృతి లక్షణం. కె.రామచంద్రమూర్తి -
ఎంఈవో పోస్టా.. మాకొద్దు బాబోయ్..
35 పోస్టులు ఖాళీ! బాధ్యతలు తీసుకునేందుకు ఉపాధ్యాయుల వెనుకంజ అవసరమైతే సెలవు పెట్టేస్తున్న వైనం విద్యాశాఖ దృష్టిసారించేనా! మచిలీపట్నం : మండల విద్యాశాఖాధికారి పోస్టు అంటేనే ఉపాధ్యాయులు భయపడిపోతున్నారు. ఈ బాధ్యతలు తీసుకునేందుకు ఎవరికి వారు వెనుకంజ వేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎంఈవో బాధ్యతలు తీసుకోవాల్సి వస్తే సెలవు పెట్టి మరీ వెళ్లిపోతున్నారు. కొంతకాలంగా రాజకీయ నాయకుల ఒత్తిళ్లు పెరిగిపోవటంతో ఎంఈవో పోస్టును చేపట్టేందుకే ఉపాధ్యాయులు ముందూవెనుకా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది. జిల్లాలో 50 ఎంఈవో పోస్టులకు గాను 15 మంది మాత్రమే రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు. మిగిలిన 35 మండలాల్లో పూర్తి అదనపు బాధ్యతలతో ఎంఈవోలుగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కొన్ని మండలాల్లో ఈ బాధ్యతలు తమకు వద్దని, వేరెవరినైనా నియమించుకోవాలని ప్రతిపాదనలు ఎంఈవోల నుంచి వస్తుండటం గమనార్హం. మచిలీపట్నం ఎంఈవో విఠల్‌కుమారి తనకు ఈ బాధ్యతలు వద్దని, అనారోగ్య కారణాలు చూపి సెలవుపై వెళ్లిపోయారు. ఈ బాధ్యత తనకు ఎక్కడ అప్పగిస్తారోనని లేడియాంప్తిల్ పాఠశాల హెచ్ఎం సెలవు పెట్టినట్లు సమాచారం. వీరిద్దరి తరువాత ప్రాధాన్యత క్రమంలో బందరు మండలం చిట్టిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్ఎం స్టీవెన్సన్ను ఎంఈవోగా నియమించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆయన కూడా జనవరి మొదటి వారంలోనే బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం జరుగుతోంది. బందరు మండలానికి ఎంఈవో లేకపోవడంతో ఈ మండలంలో పనిచేసే 200 మంది ఉపాధ్యాయుల వేతనాలు జనవరి ఒకటిన అందే పరిస్థితి లేకుండాపోయింది. ఖాళీగా 35 పోస్టులు... జిల్లాలో 49 మండలాలతో పాటు విజయవాడ అర్బన్‌తో కలుపుకొని 50 ఎంఈవో పోస్టులు ఉన్నాయి. వీటిలో గుడివాడ, విజయవాడ అర్బన్, పెనమలూరు, పెదపారుపూడి, నాగాయలంక, ముసునూరు, బాపులపాడు, నూజివీడు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, చందర్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలుతో పాటు మరో మండలంలో రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు. మిగిలిన 35 మండలాల్లో పూర్తి అదనపు బాధ్యతలతో ఉపాధ్యాయులే ఎంఈవోలుగా పనిచేస్తున్నారు. ప్రభుత్వం ఎంఈవో పోస్టులను భర్తీ చేయకపోవడంతో మండలంలో ఆసక్తి ఉన్న ఉపాధ్యాయుడిని అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఎంఈవోగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. వాస్తవానికి ఎంఈవో పోస్టు ఖాళీగా ఉంటే ఆ మండలంలోని సీనియర్ ఉపాధ్యాయుడిని ఎంఈవోగా నియమించే అధికారం డీఈవోకు ఉన్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. సీనియర్ ఉపాధ్యాయుడు ఎంఈవో పోస్టు తీసుకునేందుకు నిరాకరిస్తే సంబంధిత ఉపాధ్యాయుడి ఎస్‌ఆర్‌లో ఈ విషయాన్ని నమోదు చేయాలనే నిబంధన ఉంది. ఇలా రాస్తే భవిష్యత్తులో ఈ ఉపాధ్యాయుడికి ఎలాంటి పదోన్నతులూ వచ్చే అవకాశం ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇలాంటి నిబంధనలు ఉన్నా జిల్లాలో 35 మండలాల్లో ఎంఈవోలుగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆయా మండలాల్లో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సీనియర్ హెచ్ఎంలు వెనుకంజ వేస్తున్నారు. డీఈవో తన సర్వాధికారాలను ఉపయోగించి ఎంఈవో పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నా ఆ పని కొంతకాలంగా జరగకపోవడంతో ఎంఈవో పోస్టుల్లో ఎవరో ఒక ఉపాధ్యాయుడినితాత్కాలికంగా నియమించి చేతులు దులిపేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అన్ని జిల్లాల్లో సీనియార్టీ జాబితాలు తయారు చేసి ఉన్నాయని, కృష్ణాజిల్లాలో సీనియార్టీ జాబితాలు తయారు కాకపోవడంతో ఆయా మండలాల్లో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులను ఎంఈవోలుగా నియమించేందుకు అవకాశం లేకుండా పోతోందనే వాదన ఉపాధ్యాయుల నుంచి వినబడుతోంది. విద్యాశాఖ అధికారులు ఎంఈవో పోస్టుల భర్తీపై దృష్టిసారిస్తే ఆయా మండలాల్లో విద్యాశాఖ గాడిన పడే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు.