ఎంఈవో పోస్టా.. మాకొద్దు బాబోయ్.. | Makoddu WonderGeneration posting emivo .. .. | Sakshi
Sakshi News home page

ఎంఈవో పోస్టా.. మాకొద్దు బాబోయ్..

Published Thu, Jan 1 2015 5:56 AM | Last Updated on Sat, Sep 2 2017 7:04 PM

Makoddu WonderGeneration posting emivo .. ..

  • 35 పోస్టులు ఖాళీ!
  •  బాధ్యతలు తీసుకునేందుకు ఉపాధ్యాయుల వెనుకంజ
  •  అవసరమైతే సెలవు పెట్టేస్తున్న వైనం
  •  విద్యాశాఖ దృష్టిసారించేనా!
  • మచిలీపట్నం : మండల విద్యాశాఖాధికారి పోస్టు అంటేనే ఉపాధ్యాయులు భయపడిపోతున్నారు. ఈ బాధ్యతలు తీసుకునేందుకు ఎవరికి వారు వెనుకంజ వేస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎంఈవో బాధ్యతలు తీసుకోవాల్సి వస్తే సెలవు పెట్టి మరీ వెళ్లిపోతున్నారు. కొంతకాలంగా రాజకీయ నాయకుల ఒత్తిళ్లు పెరిగిపోవటంతో ఎంఈవో పోస్టును చేపట్టేందుకే ఉపాధ్యాయులు ముందూవెనుకా ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.

    జిల్లాలో 50 ఎంఈవో పోస్టులకు గాను 15 మంది మాత్రమే రెగ్యులర్‌గా పనిచేస్తున్నారు. మిగిలిన 35 మండలాల్లో పూర్తి అదనపు బాధ్యతలతో ఎంఈవోలుగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. కొన్ని మండలాల్లో ఈ బాధ్యతలు తమకు వద్దని, వేరెవరినైనా నియమించుకోవాలని ప్రతిపాదనలు ఎంఈవోల నుంచి వస్తుండటం గమనార్హం. మచిలీపట్నం ఎంఈవో విఠల్‌కుమారి తనకు ఈ బాధ్యతలు వద్దని, అనారోగ్య కారణాలు చూపి సెలవుపై వెళ్లిపోయారు.

    ఈ బాధ్యత తనకు ఎక్కడ అప్పగిస్తారోనని లేడియాంప్తిల్ పాఠశాల హెచ్‌ఎం సెలవు పెట్టినట్లు సమాచారం. వీరిద్దరి తరువాత ప్రాధాన్యత క్రమంలో బందరు మండలం చిట్టిపాలెం జెడ్పీ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం స్టీవెన్‌సన్‌ను ఎంఈవోగా నియమించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఆయన కూడా జనవరి మొదటి వారంలోనే బాధ్యతలు స్వీకరిస్తారనే ప్రచారం జరుగుతోంది. బందరు మండలానికి ఎంఈవో లేకపోవడంతో ఈ మండలంలో పనిచేసే 200 మంది ఉపాధ్యాయుల వేతనాలు జనవరి ఒకటిన అందే పరిస్థితి లేకుండాపోయింది.
     
    ఖాళీగా 35 పోస్టులు...

    జిల్లాలో 49 మండలాలతో పాటు విజయవాడ అర్బన్‌తో కలుపుకొని 50 ఎంఈవో పోస్టులు ఉన్నాయి. వీటిలో గుడివాడ, విజయవాడ అర్బన్, పెనమలూరు, పెదపారుపూడి, నాగాయలంక, ముసునూరు, బాపులపాడు, నూజివీడు, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల, చందర్లపాడు, జగ్గయ్యపేట, వత్సవాయి, పెనుగంచిప్రోలుతో పాటు మరో మండలంలో రెగ్యులర్ ఎంఈవోలు ఉన్నారు. మిగిలిన 35 మండలాల్లో పూర్తి అదనపు బాధ్యతలతో ఉపాధ్యాయులే ఎంఈవోలుగా పనిచేస్తున్నారు.

    ప్రభుత్వం ఎంఈవో పోస్టులను భర్తీ చేయకపోవడంతో మండలంలో ఆసక్తి ఉన్న ఉపాధ్యాయుడిని అక్కడ పరిస్థితులకు అనుగుణంగా ఎంఈవోగా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. వాస్తవానికి ఎంఈవో పోస్టు ఖాళీగా ఉంటే ఆ మండలంలోని సీనియర్ ఉపాధ్యాయుడిని ఎంఈవోగా నియమించే అధికారం డీఈవోకు ఉన్నట్లు ఉపాధ్యాయులు చెబుతున్నారు. సీనియర్ ఉపాధ్యాయుడు ఎంఈవో పోస్టు తీసుకునేందుకు నిరాకరిస్తే సంబంధిత ఉపాధ్యాయుడి ఎస్‌ఆర్‌లో ఈ విషయాన్ని నమోదు చేయాలనే నిబంధన ఉంది. ఇలా రాస్తే భవిష్యత్తులో ఈ ఉపాధ్యాయుడికి ఎలాంటి పదోన్నతులూ వచ్చే అవకాశం ఉండదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.

    ఇలాంటి నిబంధనలు ఉన్నా జిల్లాలో 35 మండలాల్లో ఎంఈవోలుగా బాధ్యతలు స్వీకరించేందుకు ఆయా మండలాల్లో ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న సీనియర్ హెచ్‌ఎంలు వెనుకంజ వేస్తున్నారు. డీఈవో తన సర్వాధికారాలను ఉపయోగించి ఎంఈవో పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉన్నా ఆ పని కొంతకాలంగా జరగకపోవడంతో ఎంఈవో పోస్టుల్లో ఎవరో ఒక ఉపాధ్యాయుడినితాత్కాలికంగా నియమించి చేతులు దులిపేసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

    అన్ని జిల్లాల్లో సీనియార్టీ జాబితాలు తయారు చేసి ఉన్నాయని, కృష్ణాజిల్లాలో సీనియార్టీ జాబితాలు తయారు కాకపోవడంతో ఆయా మండలాల్లో ఉన్న సీనియర్ ఉపాధ్యాయులను ఎంఈవోలుగా నియమించేందుకు అవకాశం లేకుండా పోతోందనే వాదన ఉపాధ్యాయుల నుంచి వినబడుతోంది. విద్యాశాఖ అధికారులు ఎంఈవో పోస్టుల భర్తీపై దృష్టిసారిస్తే ఆయా మండలాల్లో విద్యాశాఖ గాడిన పడే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులు వ్యాఖ్యానిస్తున్నారు.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement