
తాజ్ లేదా ఇతర గ్రూప్‌కు అప్పగించే ఆలోచన
దేశానికే రోల్ మోడల్‌గా ఉండాలని భావిస్తున్న ప్రభుత్వం
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించనున్న తెలంగాణ భవన్ నిర్మాణ బాధ్యతలను పేరు గాంచిన స్టార్ హోటల్‌కు అప్పగించే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నట్లు సమాచారం. నిర్మాణంతో పాటు నిర్వహణను సైతం స్టార్ హోటల్ యాజమాన్యమే చూసుకునేలా చర్చలు జరుగుతున్నట్లు తెలిసింది. వాస్తవానికి ఇటీవల మీడియాతో జరిపిన చిట్‌చాట్‌లోనే సీఎం ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు.
దాదాపు రూ.400 కోట్ల నుంచి రూ.500 కోట్ల బడ్జెట్‌తో నిర్మించే ఈ ఐకానిక్ భవనాన్ని దేశానికి రోల్‌మోడల్‌గా ఉండేలా నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే రెండు కంపెనీలు ఇచి్చన ప్రెజెంటేషన్‌ను రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరిశీలించారు. వీటిలో కొన్ని మార్పులు చేర్పులు చేసి మరో డిజైన్‌తో రావాలని సూచించారు. అయితే ఇప్పటికే డిజైన్‌లను ప్రెజెంట్ చేసింది ‘స్టార్ హోటల్’కు సంబంధించిన వారా? లేక ఇతర ప్రైవేటు సంస్థలా? అనేది తేలాల్సి ఉంది.
రెండుచోట్ల భవనాలు
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజన గత మార్చి నెలలో పూర్తి అయ్యింది. ఏపీ భవన్ మొత్తం 19.781 ఎకరాల విస్తీర్ణంలో ఉండగా ఏపీకి 11.536 ఎకరాలు, తెలంగాణకు 8.245 ఎకరాలను కేటాయిస్తూ మార్చి 15న కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ఏపీ భవన్ మొత్తం విలువ రూ.9,913.505 కోట్లు అని కేంద్ర హోంశాఖ ప్రకటించింది. తెలంగాణకు 8.245 ఎకరాలు కేటాయించగా.. ఇందులో 3 ఎకరాల విస్తీర్ణంలో శబరి బ్లాక్, 5.245 ఎకరాల విస్తీర్ణంలో పటౌడీ హౌస్ ఉన్నాయి.
శబరి బ్లాక్ ఏరియా అంతా హైదరాబాద్ హౌస్ పక్కకు ఉంటుంది. ఈ ఏరియాలోనే గవర్నర్ బ్లాక్, ముఖ్యమంత్రి బ్లాక్, రాష్ట్ర కేబినెట్ మంత్రుల బ్లాక్.. మూడూ కలిపి 5.245 ఎకరాల స్థలంలో ఒక భవనం నిర్మించనున్నారు. ఇక 3 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పటౌడీ హౌస్ స్థలంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఉండేందుకు సౌకర్యవంతమైన భవనాన్ని నిర్మించనున్నారు.
ప్రతిరోజూ 100 రూమ్‌లు తెలంగాణ వారికే..
దేశానికే రోల్ మోడల్‌గా నిలిచేలా తెలంగాణ భవన్‌ను తీర్చిదిద్దాలని భావిస్తున్న నేపథ్యంలోనే స్టార్ హోటల్‌కు నిర్మాణ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది. తాజ్ గ్రూప్ లేదా ఇతర స్టార్ హోటల్ గ్రూప్‌కు అప్పగించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు సమాచారం. ప్రతిరోజూ ఒక వంద రూమ్‌లు తెలంగాణ నుంచి వచి్చన వారికి కేటాయించేలా చర్యలు తీసుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment