అమరుల త్యాగాలతో పోలిస్తే నాది పెద్ద ఇబ్బంది కాదు
కేసీఆర్ తయారు చేసిన సైనికుడిని.. అక్రమ కేసు లెక్కేం కాదు
తెలంగాణభవన్‌లో బీఆర్‌ఎస్ డైరీ ఆవిష్కరణలో కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఫార్ములా–ఈ రేస్ అంశంలో తనపై పెట్టిన కేసు లొట్టపీసు (డొల్ల) అని, రేవంత్‌రెడ్డి ఒక లొట్టపీసు ముఖ్యమంత్రి అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చావు నోట్లో తలపెట్టి తెలంగాణ సాధించిన కేసీఆర్ తయారుచేసిన సైనికుడిని అని వ్యాఖ్యానించారు. కేసీఆర్ రక్తం పంచుకొని పుట్టిన తాను రేవంత్ సర్కారు పెట్టిన అక్రమ కేసులకు భయపడేది లేదని స్పష్టం చేశారు.
పార్టీ ఆవిర్భావ సమయం నాటి పరిస్థితులు, తెలంగాణ ఉద్యమకారులు పడిన ఇబ్బందులు, అమరుల త్యాగాలతో పోలిస్తే తాను పడుతున్నది పెద్ద ఇబ్బందేమీ కాదన్నారు. తెలంగాణభవన్‌లో బుధవారం జరిగిన బీఆర్‌ఎస్ పార్టీ 2025 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
‘నాపై పెట్టిన కేసును రేవంత్ తీర్చుకుంటున్న ప్రతీకారమని ప్రజలు అనుకుంటున్నారు. తమ భూముల కోసం లగచర్ల గిరిజనులు 40 రోజులపాటు జైలులో గడిపిన దానితో పోలిస్తే నేను పడుతున్నది పెద్ద ఇబ్బందేమీ కాదు. అక్రమ కేసులపై చట్ట ప్రకారం పోరాడుతా. కేసుల గురించి ఆలోచించకుండా రైతులు, మహిళలకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ మోసగిస్తున్న తీరును ప్రజల్లో ఎండగట్టాలి.
కొత్త సంవత్సరంలో తెలంగాణ కోసం కలిసి నడుస్తూ ప్రభుత్వంపై పోరాటం చేద్దాం. ఏడాది కాలంలో పార్టీకి కొత్త కమిటీలు, సభ్యత్వ నమోదు, పార్టీ అధ్యక్షుడి ఎన్నిక వంటి అనేక కార్యక్రమాలు ఉంటాయి’అని కేటీఆర్ వెల్లడించారు.
కేటీఆర్‌కు ఆపద వస్తే అండగా నిలుస్తాం: మాజీమంత్రి హరీశ్‌రావు
ప్రశ్నించే గొంతుక కేటీఆర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ప్రజల్లో రోజురోజుకూ రేవంత్ ప్రభుత్వ ప్రతిష్ట దిగజారుతుండటంతో అక్రమ కేసులతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారన్నారు. ఆపద సమయంలో కార్యకర్తలు, నాయకులకు అండగా నిలిచిన తరహాలో కేటీఆర్‌కు ఆపద వస్తే పార్టీ మొత్తం అండగా నిలుస్తుందని చెప్పారు.
రేవంత్ ఏడాది పాలన కోతలు, ఎగవేతలు, కేసులు అన్నట్టుగా తయారైందన్నారు. రేవంత్ ప్రభుత్వం హామీలు ఎగవేస్తున్న తీరును ప్రశ్నించిన తనపై మానకొండూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టారన్నారు. లగచర్ల, అల్లు అర్జున్, టీఎస్ నుంచి టీజీగా మార్పు, తెలంగాణ రాజముద్ర మార్పు వంటి దృష్టి మళ్లింపు కార్యక్రమాలు మినహా ప్రభుత్వం ఏడాదిలో చేసిందేమీ లేదని తెలిపారు.
ప్రభుత్వ పథకాల అమలుకు డబ్బు లు లేవని చెబుతున్న సీఎం రేవంత్ తన కుటుంబ సభ్యుల భూముల కోసం కల్వకుర్తి వరకు ఆరు లేన్ల రహదారిని వేసుకుంటున్నాడని హరీశ్‌రావు విమర్శించారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో స్వర్ణయుగం రాగా, కాంగ్రెస్ పాలనలో కారుచీకట్లు కమ్ముకున్నాయని శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఎస్.మధుసూదనాచారి విమర్శించారు. మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, సబితా ఇంద్రారెడ్డి, వేముల ప్రశాంత్‌రెడ్డి, సత్యవతి రాథోడ్ ప్రసంగించారు.
Comments
Please login to add a commentAdd a comment