బాబ్బాబు... కాస్త ఆగండి!
* ఆంధ్రప్రదేశ్ పోలీసులకు చంద్రబాబు ఆదేశం
* స్టీఫెన్‌సన్ వాంగ్మూలం ఆధారంగా నోటీసులిస్తారని భయం
* అందుకే కౌంటర్ కేసుల్లో వేగం తగ్గించాలని ఆదేశాలు జారీ
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ కేసులో పీకల్లోతు కూరుకుపోయిన ఏపీ సీఎం చంద్రబాబుకు ‘నీకు రూ.5 కోట్లు ఇస్తాం... నీ బాగోగులు చూసుకుంటాం’ అంటూ ఆయన తనకు హామీ ఇచ్చినట్లు తెలంగాణ నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ ఇచ్చిన వాంగ్మూలం కొత్త భయాన్ని తెచ్చిపెట్టింది. ఇది తెలంగాణ ఏసీబీ అధికారులకు ఆయుధంగా మారి, తనకు నోటీసులు తీసుకువచ్చే ప్రమాదం ఉందని భావిస్తున్న చంద్రబాబు ‘కౌంటర్’ కేసుల్లో తక్షణం ఎలాంటి తీవ్రమైన చర్యలకు ఉపక్రమించరాదని రాష్ట్ర పోలీసులను ఆదేశించినట్టు తెలిసింది. దీంతో శుక్రవారంవరకు దూకుడుగా ముందుకెళ్ళిన అధికారులు శనివారం నుంచి నెమ్మదించారు. ఈ మేరకు ఉన్నతాధికారుల నుంచి దర్యాప్తు బృందాలకు స్పష్టమైన ఆదేశాలు అందాయి. గత నెల 31న టీ-టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి అరెస్టు నాటినుంచి చంద్రబాబు మాటల దాడి ప్రారంభించారు. ఆయన స్టీఫెన్‌సన్‌తో ఫోనులో మాట్లాడినవిగా పేర్కొంటూ కొన్ని ఆడియో రికార్డింగ్స్ బయటకు రావడంతో ‘ట్యాపింగ్’ అంటూ ఎదురు దాడికి దిగారు.
ఇందులో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నేతలు, శ్రేణులతో కుప్పలుతెప్పలుగా ఫిర్యాదులు ఇప్పించి 88 కేసులు నమోదు చేయించారు. వీటికి తోడు ‘ఓటుకు కోట్లు’ కేసులో నాలుగో నిందితుడిగా ఉన్న జెరూసలేం మత్తయ్య ఫిర్యాదుతో విజయవాడలోని సత్యనారాయణపురం పోలీసుస్టేషన్‌లో మరో కేసు నమోదైంది. వీటి ఆధారంగా కౌంటర్ ఎటాక్ ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు 88 కేసుల దర్యాప్తుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేయడంతోపాటు సత్యనారాయణపురం కేసును సీఐడీకి బదిలీ చేశారు. ఈలోపు తెలంగాణ ఏసీబీ అధికారులు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డిని విచారించడంతోపాటు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వీరయ్యకు నోటీసులు జారీ చేశారు. దీనికి కౌంటర్‌గా చంద్రబాబు శుక్రవారం విశాఖపట్నం పోలీసుల ద్వారా కేబుల్ టీవీ యాక్ట్ ప్రకారం న్యూస్ చానళ్లకు నోటీసులు జారీ చేయించారు. ‘ఓటుకు కోట్లు’ కేసులో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు చేరిన ఆడియో, వీడియో టేపుల విశ్లేషణ పూర్తయి, నివేదిక రావడానికి కొంత సమయం పడుతుందని చంద్రబాబు భావించారు. అది వస్తే తప్ప తెలంగాణ ఏసీబీ అధికారులు తన జోలికి రాలేరని, ఈ లోపు కౌంటర్ ఎటాక్ లక్ష్యం నెరవేరుతుందని వేగంగా పావులు కదిపారు.
అయితే ఈ కేసులో ఫిర్యాదుదారుడిగా ఉన్న స్టీఫెన్‌సన్ వాంగ్మూలాన్ని (సీఆర్పీసీ 164 స్టేట్‌మెంట్) తెలంగాణ ఏసీబీ అధికారులు న్యాయస్థానం నుంచి శనివారం అధికారికంగా తీసుకున్న నేపథ్యంలో న్యాయ నిపుణుల్ని సంప్రదించిన చంద్రబాబుకు ఈ వాంగ్మూలంలోని అంశాల ఆధారంగానూ తెలంగాణ ఏసీబీ అధికారులు తనకు నోటీసు ఇచ్చే అవకాశం లేకపోలేదన్న అంచనాకు వచ్చినట్టు తెలిసింది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి చర్యలకు ఉపక్రమించినా ఇబ్బందులు తలెత్తుతాయోనన్న అనుమానంతో వేగం తగ్గించాల్సిందిగా సిట్, సీఐడీలకు ఆదేశాలు జారీ చేసినట్టు తెలిసింది.